close

తాజా వార్తలు

వంటింట్లో ప్రమాదం.. కుటుంబంలో విషాదం

 లీకైన గ్యాస్‌ సిలిండర్‌
  చికిత్స పొందుతూ దంపతులు మృతి
  రెండేళ్ల పాప పరిస్థితి విషమం

దుండిగల్‌, న్యూస్‌టుడే: చిన్న కుటుంబం.. చిన్న గదిలోనే నివాసం.. రెండేళ్ల కుమార్తెతో దంపతులు ఆ ఒక్క గదిలోనే ఆనందంగా జీవిస్తున్న వేళ విధి వక్రీకరించింది. సిలిండర్‌ లీకై సంభవించిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు దంపతులు ఒకరి తర్వాత ఒకరు గంటల వ్యవధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారి రెండు సంవత్సరాల పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కొత్తగూడెం మధిరకు చెందిన షేక్‌ సుభాన్‌, షర్మిల దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సూరారం హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప హైదర్‌ఫిర్దూష్‌ ఉంది. సుభాన్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో సిలిండర్‌ అయిపోవడంతో గ్యాస్‌స్టౌకు మరో కొత్త సిలిండర్‌ను అమర్చారు. అయితే ఆ సిలిండర్‌ లీకవుతున్న విషయాన్ని ఆ దంపతులు పసిగట్టలేకపోయారు. ఆ సాయంత్రం ఆదే గ్యాస్‌స్టౌపై భార్య వంటచేసింది. భోజనం అనంతరం వారు నిద్రించగా గది మొత్తం గ్యాస్‌ వ్యాపించింది. 6న ఉదయం 5.30 గంటల సమయంలో సుభాన్‌ నిద్రలేచి సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు స్విచ్‌ ఆన్‌ చేయగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే దంపతులతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు పెద్దాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం భర్త మృతి చెందిన కొన్ని గంటలకే భార్య సైతం మృతి చెందింది. పాప పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే గది, ఒకటే తలుపు ఉండడంతో పెరిగిన తీవ్రత..
సూరారం హనుమాన్‌నగర్‌లోని ఓ చిన్నగదిలో వీరు నివాసముంటున్నారు. ఆ ఒక్క గదిలోనే కొంత ముందు భాగాన్ని వంట గదిగా మార్చుకున్నారు. ఇంటికి ఒకే ఒక తలుపు ఉండగా.. వంట గదిలో మాత్రం పొగబయటకు పోయేందుకు చిన్న రంధ్రాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. కిటికీలు అసలు లేవు. వీరి ఇంటికి అనుకుని చెరువు ఉండటంతో దోమలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దోమలు రాకుండా వంటగదిలో ఉన్న చిన్న పాటి రంధ్రాన్ని సైతం మూసేశారు. ఈ నేపథ్యంలోనే సిలిండర్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించడం.. ఇంటి పైకప్పు సిమెంట్‌ రేకులు కావడంతో ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. కాలిన గాయాలతో పాటు చిన్నచిన్న సిమెంట్‌ రేకులు వారి శరీర భాగాల్లో చొచ్చుకుపోవడంతో వారు మృతి చెందారు.

సిలిండర్‌ లీకైనట్లు నిర్ధరణ..
అగ్నిప్రమాదం ఏవిధంగా సంభవించిందో ఏ ఒక్కరికీ మొదట అంతుచిక్కలేదు. ప్రమాదం జరిగిన రోజే పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించినా వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. క్లూస్‌టీంకు సైతం అంతుచిక్కలేదు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం గదిలో అనువనువునా పరిశీలించి చివరకు సిలిండర్‌ లీకై ప్రమాదం సంభవించినట్లు నిర్ధారించింది. అనంతరం చికిత్స పొందుతున్న దంపతులను పోలీసులు విచారించగా ప్రమాదానికి ముందు రోజే సిలిండర్‌ మార్చినట్లు పేర్కొన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.