close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/09/2019 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీరైతే ఏం చేస్తారు?

పిల్లలు ఫోనుచూసే అలవాటును మాన్పించడంలో తల్లిదండ్రులుగా మీరేం చేస్తారు... అనే ప్రశ్నకు విశేషమైన స్పందన వచ్చింది. కొందరి అభిప్రాయాలను ఇక్కడ ప్రచురిస్తున్నాం. ●

●* నాకు ఇద్దరు పిల్లలు. అన్నం తినిపించాలన్నా, స్నానం చేయించాలన్నా... ఇద్దరికీ ఫోను ఇవ్వాల్సిందే. వద్దంటే ఏడ్చేవారు. దీనికి పరిష్కారంగా అరగంట అలారం పెట్టి పిల్లలకు ఫోను ఇవ్వడం మొదలుపెట్టా. అలారం మోగగానే నిర్మొహమాటంగా తీసేసుకుంటా. ఒకవేళ పేచీ పెడితే మరోసారి ఇవ్వను. టీవీ చూడటంలోనూ ఇదే సూత్రం అనుసరిస్తా. వారికి ఇష్టమైన ఛానళ్లనే మేమూ చూస్తాం.

- స్నేహ, హైదరాబాద్‌

●* మా పెద్దబ్బాయి ఇంజినీరింగ్‌, చిన్నబ్బాయి పదో తరగతి. చదువుకోవడానికని చిన్నవాడు కొన్నిసార్లు ఫోను అడుగుతాడు. వాడికి నిజంగా ఆ అవసరం ఉందని నిర్ధారించుకున్నాకే ఇస్తా. ఏం చూస్తున్నాడనేదీ గమనిస్తా. నెలకోసారి పాఠశాలకు వెళ్లి వాడెలా ఉన్నాడో తెలుసుకుంటాం.

- అనిత, హైదరాబాద్‌

●* మా అబ్బాయి రెండో తరగతే కానీ... ఫోను ఇవ్వకపోతే ఏ పనీ చేసేవాడు కాదు. దీన్నుంచి దృష్టి మరల్చడానికి బంకమట్టి, పాత అట్టముక్కలు, పేపర్లు వంటివి ఇచ్చి రకరకాల బొమ్మల తయారీ నేర్పించా. క్రమంగా వీటిపై ఆసక్తి పెంచుకున్నాడు. ఫోను వాడకం తగ్గిపోయింది.

- నాగమణి కూచిపూడి, మాల్‌ రంగారెడ్డి జిల్లా

●* మా పాప టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోయేది. వాటి నుంచి దృష్టి మళ్లించడానికి రోజూ సాయంత్రం బయటకు తీసుకెళ్తున్నా. తోటపనిలో భాగం చేశా. మొక్కలు పెంచడంపై ఆసక్తి పెంచుకుంది. పడుకునే ముందు నాకు పుస్తకాలు చదవడం అలవాటు. పాపకూ చిన్నపిల్లల పుస్తకాలు ఇస్తూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచా. బాలవినోదిని, బాలభారతం వంటివి చదివిస్తా. పజిల్స్‌ పూర్తి చేయడం నేర్పించా.

- మంతెన రాజ్యలక్ష్మి, విజయవాడ

●* మా పిల్లలిద్దరూ చిన్నవాళ్లే. చాలామంది తల్లిదండ్రుల్లానే మా వాళ్లు మారాం చేసినప్పుడల్లా ఫోను ఇచ్చేదాన్ని. వాళ్లకు అదే అలవాటైపోయింది. చివరకు మేం ఓ నిర్ణయానికి వచ్చి స్మార్ట్‌ ఫోన్‌ పూర్తిగా నిషేధించాం. అవసరమైతే వాళ్లు నిద్రపోయాకే ఫోను బయటకు తీస్తాం. పిల్లల ముందు మేము ఫోను వాడకం మానేశాక వారిలోనూ మార్పు కనిపించింది. ఇప్పుడు చిన్న చిన్న కథలు, ఆటపాటలపై దృష్టిపెడుతున్నారు.

- అల్లూరు జయలక్ష్మి, ముల్కలచెరువు, చిత్తూరు

●* ఫోను నుంచి మా పిల్లల దృష్టి మళ్లించడానికి వారికి వేరే వ్యాపకం అలవాటు చేయాలనుకున్నా. నేను యోగా నేర్చుకొని, పిల్లలతో సులువుగా ఉండే ఆసనాలు వేయించడం మొదలుపెట్టా. స్కూల్‌నుంచి రాగానే ఇంటి పనుల్లో సాయం చేయమని అడిగేదాన్ని. కుటుంబమంతా కలిసి టీవీ చూడటం మొదలు పెట్టాం. అదీ నిర్దిష్ట సమయంలోనే. చిన్నచిన్న వస్తువుల తయారీ నేర్పించా.

- మాధవి ముల్లంగి, అట్లాంటా, అమెరికా

●* మా పిల్లలిద్దరూ మొదటి నుంచీ ఫోనులో రకరకాల ఆటలు ఆడేవారు. పబ్జీ గేమ్‌కు అలవాటై చదువును నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆటకు బానిసై ఆత్మహత్య చేసుకున్న, ఇంట్లో వాళ్లని హత్య చేసిన విద్యార్థులు, యువకుల గురించి వార్తలు రావడంతో భయపడ్ఢా ఈ విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్ఫా ఎదుగుతున్న పిల్లలు ఇలాంటి వాటి బారిన పడి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో వివరించా. ఇతర వ్యాపకాలు అలవాటు చేశా. క్రమంగా వారికి ఫోన్‌ ఇచ్చే సమయాన్ని తగ్గిస్తూ వచ్ఛా.

- రుక్మిణి, హైదరాబాద్‌

●* మా అబ్బాయికి నాలుగేళ్లు. వాడు ఎక్కువ సమయం ఫోనుతోనే ఆడతాడు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన పుస్తకాలు కొనిచ్ఛా ఇప్పుడు ఖండాలు, దేశాలు, మహాసముద్రాలు, ప్రకృతి విపత్తుల గురించి ఏది అడిగినా చెప్తాడు. టీవీ చూసే సమయాన్నీ తగ్గించి, పుస్తకాలపై ఆసక్తి పెంచా. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఆటలు ఆడిస్తాం.

- శిరీష కూళ్ల, టొరంటో కెనడా

●* మా పిల్లలు ఫోను వాడటం మానేయాలంటే, వారి దృష్టి వేరే విషయాలపైకి మళ్లించాలనుకున్నాం. టీవీలో స్పోర్ట్స్‌ ఛానళ్లు ఎక్కువగా చూసేవారు. దీంతో ఆటల్లో తర్ఫీదు ఇప్పించడానికి స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేర్పించాం ఖాళీ సమయంలో షటిల్‌ ఆడతారు. ఆదివారం వస్తే బొమ్మలు వేయడం, పెయింటింగ్‌, డ్యాన్సు చేయడం నేర్పిస్తున్నాం. దీంతో ఫోను వాడకం దాదాపుగా తగ్గిపోయింది.

- కృష్ణప్రియ సిలివేరు, చెన్నై

●* మాకు పదేళ్ల పాప ఉంది. ఏడాది క్రితం వరకు ఎక్కువ సమయం ఫోనుతోనే గడిపేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఓ దశలో కళ్లు పొడిబారి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యసనం నుంచి బయటపడేయాలని నిర్ణయించుకున్నాం. వీలు కుదిరినప్పుడల్లా బయటకు తీసుకెళ్లి ఆటలు ఆడించడంపై ఆసక్తి కల్పించాం. ఆటలపైనే దృష్టిపెట్టేలా ప్రోత్సహించాం. డ్యాన్సు స్కూల్లోనూ చేర్పించాం. రోజంతా కష్టపడటంతో రాత్రి అలసిపోయి త్వరగా నిద్రపోయేది. ఫోనుతో గడపడం తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడంతో చురుకుదనం పెరిగింది. ఈ మార్పుకోసం చాలా సమయం పట్టింది.

- శ్రీలేఖ, తిరుపతి

●* మా బాబుకు చిన్నప్పటి నుంచే స్మార్ట్‌ ఫోన్‌ వాడటం అలవాటైంది. వాడు ఎక్కువ సమయంలో టీవీ చూస్తూనో, ఫోన్‌లో ఆటలు ఆడుతూనో ఉండేవాడు. ఈ అలవాటు మాన్పించడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓసారి వాడిని బయటకు తీసుకెళ్లినప్పుడు కుందేళ్లను చూశాడు. వాటితో ఎక్కువ సమయం ఆడుతుండటం గమనించా. ఇంటికి రెండు కుందేళు పిల్లలను తీసుకొచ్చి, వాటి సంరక్షణ బాధ్యలతను వాడికే అప్పగించా. అప్పటి నుంచి వాడు అడగట్లేదు. చిన్నారుల ఆసక్తులను గమనించి, వాటిపై శ్రద్ధ చూపేలా ప్రోత్సహిస్తే ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ వంటి వాటికి పరిమితులు విధించవచ్చు. 

- గీత, హైదరాబాద్‌
 

●* పిల్లలు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే పరిసరాలను చూసి, అర్థం చేసుకుని ఏది గ్రహిస్తే అది చేస్తూ నేర్చుకుంటారు. ఇది తల్లిదండ్రులు గ్రహించాలి. ఏడ్చినా, తినకపోయినా, చెప్పిన మాట వినాలన్నా వారికి ముందుగా పెద్దవాళ్లే ఫోన్‌ ఇచ్చి గారాబం చేస్తారు. ఇదే సమస్యలకు కారణం. చిన్నప్పటి నంచీ పిల్లలకు కష్టం విలువ తెలిసేలా పెంచాలి. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తరువాత వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. ఇంటి పనుల్లో వారినీ భాగం చేయాలి. సరకులు, కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్లినప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. బయటి ప్రపంచం గురించి తెలిసేలా పెంచాలి తప్ప ఫోన్‌ ఇచ్చి ఓ మూలన కూర్చోబెట్టకూడదు.

- పోలెపల్లి రాకేష్‌రెడ్డి, వరంగల్‌

ఈ తరం పిల్లలను సాంకేతికతకు దూరంగా పెంచడం అసాధ్యం. వారికి ఫోన్‌ ఇస్తూనే, వాడకాన్ని నిరోధించాలి. దాన్ని అతిగా వాడితే వచ్చే దుష్ప్రభావాల గురించి అర్థమయ్యేట్లు వివరించాలి. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడపాలి. పిల్లలతో కలిసి ఆటలు ఆడాలి. ఇలా చేస్తే తల్లిదండ్రులతో మానసిక బంధం దృఢమవుతుంది. చెప్పిన మాట వింటారు. ఖాళీ సమయంలో చిన్నారులను బయటకు తీసుకెళ్లాలి. చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకోమని ప్రోత్సహించాలి. సమాజం గురించి తెలిసేలా పెంచాలి. ఏదో ఒక కళపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలి.

- ఓ సోదరి

మా పాప ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడిపేది. ఎంత చెప్పినా ఫోన్‌ వాడకం మాత్రం వదిలేయలేదు. ఏం చేయాలో అర్థం కాక... ఓరోజు నా వాట్సప్‌ నెంబరుకు ఒక మెస్సేజి వచ్చింది. దాంట్లో పిల్లలు ఎక్కువ సమయం ఫోన్‌ చూస్తూ ఉంటే కళ్లు భయంకరంగా మారతాయని ఉంది. చూడటానికి ఎబ్బెట్టుగా ఉండే ఫోటోనూ దాంతో పాటు షేర్‌ చేశారు. మా పాపకు ఆ ఫోటో చూపిస్తే భయపడింది. నీ కళ్లూ ఇలానే తయరవుతాయని చెప్పినప్పటి నుంచీ ఫోన్‌ను ముట్టుకోలేదు. అప్పటి నుంచి బొమ్మలు గీయడం వంటివి నేర్పిస్తున్నా.

- పైళ్ల భాగ్యలక్ష్మి, ఉప్పల్‌

పిల్లల సైకాలజీ ప్రకారం.. మనం చెప్పిన పని చేయడం కంటే అనుకరణ ఎక్కువ చేస్తారు అని తల్లిదండ్రులు గుర్తించాలి. అవసరం మేరకే సెల్‌ఫోన్‌ను ఉపయోగించాలి. పిల్లల ముందు వాడకపోవడమే ఉత్తమం. అతిగా ఫోన్‌ వాడితే కలిగే దుష్ప్రభావాల గురించి టీవీల్లో చూపించే ‌ప్రయత్నం చేసి, వారికి అర్థమయ్యేలా వివరించాలి. ప్లేస్టోర్‌, యూట్యూబ్‌ వంటి వాటితో పాటు అవసరం లేని యాప్‌లను ఫోన్‌లో బ్లాక్‌ చేసి పిల్లలకు ఇవ్వాలి. డేటా లిమిట్‌ను సెట్‌ చేసి, నిర్ణీత సమయం వరకు పిల్లలకు ఫోన్‌ ఇవ్వొచ్చు.

- కొల్లు శ్రీనివాస్‌, జూనియర్‌ లెక్చరర్‌, నడిగూడెం, సూర్యాపేట

మా బాబుకు రోజు అరగంట మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ ఇస్తాను. మిగతా సమయంలో వాడితో కలిసి అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడతాను. దీంతో ఇద్దరికీ శారీరక శ్రమతో పాటు వ్యాయామం అందుతుంది. దీంతో పాటు వృథా వస్తువులతో కళాకృతులు ఎలా చేయొచ్చో నేర్పించాను. క్రమంగా వాటిపై ఆసక్తి పెంచుకున్నాడు. మంచి వస్తువు తయారు చేసిన ప్రతిసారీ ఒక బహుమతి ఇస్తున్నా. ఫోన్‌ వాడకం పరిమితంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం

- రజిని
 

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని పెద్దవాళ్లు పరిమితం చేసుకోవాలి. మా ఇంట్లో ఫోన్లకు పెద్ద పెద్ద రింగ్‌టోన్లు పెట్టం. వాళ్ల ముందు ఫోన్‌ ఎక్కువగా వాడం. ఫోన్‌ వాడితే అనారోగ్యాలు వస్తాయని చెప్తూ, దానికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. దీనికి బదులు పజిల్‌ గేమ్స్‌ వంటి వాటి గురించి వివరిస్తున్నా. బొమ్మల పుస్తకాలు, బొమ్మలు కొనిచ్చి, వాటితో ఆడటం నేర్పిస్తున్నా. వీటితో పాటు ఖాళీ సమయమంతా వారితో ఆడుతూ, పాడుతూ గడుపుతా. ఇలా వాళ్లను ఫోన్‌కు దూరంగా ఉంచుతున్నా.

- పరిడాల రమేశ్‌, శ్రీకాకుళం.

 

మా ఇంట్లో పిల్లలే స్మార్ట్‌ఫోను వాడుతున్నారు. ఫోను ఇవ్వకుంటే ఏడుస్తున్నారు. అదేపనిగా వీడియోలు చూస్తూ, ఆటలు ఆడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వివరించినా వినలేదు. చేసేది లేక స్మార్ట్‌ఫోనుకు బదులు మామూలు ఫీచర్‌ పోను వాడటం మొదలుపెట్టాం. మొదట్లో పెద్ద ఫోను కావాలని గొడవ చేసినా, ఇప్పుడు దాన్ని వాడకపోవడంతో వారూ మర్చిపోయారు. క్రమంగా కథల పుస్తకాలు వంటివి చదువుతున్నారు. ఖాళీ సమయంలో బయటకెళ్లి చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. మొదటి నుంచే పిల్లలకు ఫోను అలవాటు చేయకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

- సిహెచ్‌ ప్రసన్న, గుంటూరు

మా పిల్లలతో ఫోను వాడకం తగ్గించాలనుకున్నప్పుడు మొదట మేం వాటిని వాడటం తగ్గించాం. క్రమంగా వారికి ఇవ్వడం తగ్గించాం. ఎక్కువ సమయం కుటుంబసభ్యులతో గడపడం, కలిసి తినడం, అందరం బయటకు వెళ్లడం అలవాటు చేయడంతో ఆ ధ్యాస నుంచి బయట పడ్డారు. అవసరం కొద్దీ ఫోను ఇచ్చినా కొంత సమయం తరువాత తీసుకుంటున్నాం. దాన్ని మంచికి ఎలా వాడాలో నేర్పిస్తున్నాం. సృజనాత్మకను పెంచే వీడియోలు చూస్తూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు వారిలో కనిపిస్తుంది.

- ధనలక్ష్మి, తణుకు

మాకు పదేళ్ల పాప ఉంది. ఏడాది క్రితం వరకు ఎక్కువ సమయం ఫోనుతోనే గడిపేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఓ దశలో కళ్లు పొడిబారి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యసనం నుంచి బయటపడేయాలని నిర్ణయించుకున్నాం. వీలు కుదిరినప్పుడల్లా మైదానాలకు తీసుకెళ్లి కొత్త ఆటలపై ఆసక్తి కల్పించాం. ఎక్కువ సమయం ఆటలపైనే దృష్టిపెట్టేలా ప్రోత్సహించాం. నృత్యం పట్ల ఉన్న ఆసక్తితో డ్యాన్సు స్కూల్లో చేర్పించాం. ఆ అలుపుతో రాత్రి తొందరగా నిద్రపోయేది. ఫోనుతో గడపడం తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడంతో చురుకుదనం పెరిగింది. ఈ మార్పుకోసం చాలా సమయం పట్టింది.

- శ్రీలేఖ, తిరుపతి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.