నాన్నకు అమ్మయింది!
close

తాజా వార్తలు

Updated : 21/04/2019 00:28 IST

నాన్నకు అమ్మయింది!

నాన్న ప్రేమ పంచుతాడు. ఆస్తిని పంచుతాడు  రక్తం పంచిన అమ్మ కన్నా తానే ఎక్కువని నిరూపించుకోవాలని అనుకుంటాడు. బిడ్డల ఆనందాన్ని పంచుకుంటే చాలనుకుంటాడు! అలాంటి నాన్న చావుబతుకుల మధ్య ఉంటే... ఈ ఆడబిడ్డ కాలేయాన్ని పంచింది. తన ఆయుష్షును ధారపోసి నాన్నకు పునర్జన్మనిచ్చి అమ్మగా నిలిచింది. ఆమే 19 ఏళ్ల రాఖీదత్తా.

మాది కోల్‌కతా. నాన్న సుదీప్‌దత్తాకు బియ్యం వ్యాపారం ఉంది. అమ్మ గృహిణి. నేను, అక్క, తమ్ముడు. ఇదీ మా కుటుంబం. చిన్నప్పటి నుంచీ నాకు నాన్నతో అనుంబంధం ఎక్కువ.  ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా... ప్రతిదీ ఆయనకే చెప్పేదాన్ని. అయితే నాన్నకు కాలేయం దానం చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నాన్నకు కిందటి సంవత్సరం నవంబరులో హెపటైటిస్‌ బి పాజిటివ్‌ అని తెలిసింది. వెంటనే మా దగ్గర్లోని నారాయణి ఆసుపత్రిలో చేర్పించాం. ఇరవైరోజులు అయ్యాక కాలేయం తొంభైశాతం పాడైపోయిందని, తామేం చేయలేమని చేతులెత్తేశారు వైద్యులు. చాలా బాధేసింది. ఏం చేయాలో అర్థంకాలేదు. నాన్నకు ఏమైనా అయితే... వ్యాపారం ఎవరు చూస్తారు... మా పరిస్థితి ఏంటని భయపడ్డాం. చివరకు నేను, అక్క ఎంత కష్టమైనా సరే నాన్నని ద]క్కించుకోవాలనుకున్నాం. ఎంతోమందితో మాట్లాడాం. అంతర్జాలంలో వెతికాం. అలా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ గురించి తెలిసింది. ఈ ఏడాది జనవరిలో ఇక్కడకు వచ్చాం. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి నాన్నకు అవసరమైన పరీక్షలన్నీ చేసి... కుటుంబంలో ఎవరైనా కాలేయం దానం చేస్తే ఏ సమస్యా ఉండదని అన్నారు. సిద్ధమయ్యాం. చివరకు నాది మ్యాచ్‌ అయినట్లు తెలిసింది. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అన్నా.  ఇంట్లోవాళ్లు ఇది తెలిసి మొదట కంగారు పడ్డారు కానీ.. ఒక ఆడపిల్లగా నాకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని డాక్టర్‌ చెప్పడంతో ఒప్పుకున్నారు. కుటుంబ    సభ్యులే కాదు... స్నేహితులు కూడా మంచి పనిచేస్తున్నావంటూ అభినందించారు. ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. అయితే...
ఒప్పించాల్సి వచ్చింది...
నాన్న మాత్రం ఒప్పుకోలేదు. వద్దంటే వద్దన్నారు. తొంభైశాతం కాలేయం పాడైపోయింది కాబట్టి... వైద్యులు ఎంతవరకూ చికిత్స చేస్తే అంతవరకూ చేయించుకుంటాని, మందులతో నెట్టుకొస్తానని అన్నారు. నయం అయినా కాకపోయినా ఫరవాలేదనీ.. ఊరు వెళ్లిపోదామనీ చెప్పారు. ‘ఆడపిల్లవు. పెళ్లికావాల్సినదానివి. నీకు భవిష్యత్తులో ఏదయినా సమస్య రావొచ్చు. నా గురించి ఆలోచిస్తే ఎలా...’ అని అన్నారు. నేను కూడా దానం చేసిన కాలేయం భాగం మూడునెలల్లో పెరుగుతుందని వైద్యులు చెప్పారని, ఏ ఇబ్బందీ రాదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... ఆయన వినలేదు. కొన్నాళ్లపాటు ఆయన్ని ఒప్పించడమే మా పని అయ్యింది. చివరకు నెలరోజుల తరువాత సరే అన్నారు. అప్పుడు శస్త్రచికిత్సకు ముందు ప్రక్రియ మొదలైంది. చివరకు ఫిబ్రవరీ 27న శస్త్రచికిత్స చేశారు. దాదాపు పదిహేను గంటలు పట్టింది. రెండుమూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండి... కోల్‌కతా వచ్చేశాం. కాలుష్యం ప్రభావం పడకూడదని వైద్యులు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నా.  నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఒక కూతురిగా తండ్రి రుణం తీర్చుకున్నానని ఆనందంగా ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి.

ప్రస్తుతం నేను డిగ్రీ రెండో సంవత్సరం జర్నలిజం చేస్తున్నా. జూన్‌లో పరీక్షలు ఉన్నాయి. నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో కాలేజీకి సరిగ్గా వెళ్లలేదు. నెలరోజులుగా అయితే కాలేజీ ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి... రాబోయే పరీక్షలకు సిద్ధం అవుతున్నా. అయితే నాన్నను దక్కించుకున్నాం. అది చాలు నాకు.

రాఖీదత్తా కథను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయాంకా ట్వీట్‌ చేశారు. ‘నొప్పి, కత్తిగాట్లు భవిష్యత్తులో ప్రమాదాలు ఆలోచించకుండా రాఖీదత్తా తన కాలేయాన్ని తండ్రికి పంచి ఇచ్చింది. తండ్రిపట్ల కూతురు చూపించే ప్రేమ ప్రత్యేకం. కూతుళ్లు ఎందుకూ పనికిరారు అని అనుకునేవారికి ఈమె సరైన సమాధానం...’ అనేది ఆ ట్వీట్‌ సారాంశం. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. తండ్రి కోసం రాఖీ చేసిన త్యాగాన్ని నెటిజన్లు అభినందిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది.

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని