
తాజా వార్తలు
హైదరాబాద్: కథానాయకుడు వరుణ్‌తేజ్, నటుడు మాధవన్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో మాధవన్ వరుణ్‌కు తండ్రిగా కనిపించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే చిత్రంలో మాధవన్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నట్లు రాశారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని మాధవన్ తేల్చి చెప్పారు. ‘ఆ ప్రచారంలో నిజం లేదు.. నేనింకా చిన్న పిల్లాడినే (సరదాగా)..’ అని ట్వీట్ చేశారు. ఆయన వార్తను ఖండించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మాధవన్ ఈ మధ్య జోరు పెంచారు. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తున్నారు. అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. మరోపక్క మాధవన్ పలు తమిళ, హిందీ సినిమాలకు సంతకం చేశారు.