
తాజా వార్తలు
ముంబయి: తన దత్త పుత్రిక అలీషా తనను భావోద్వేగానికి గురి చేసిందని బాలీవుడ్ తార సుస్మితా సేన్ పేర్కొన్నారు. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో పదేళ్ల అలీషా స్కూల్ వర్క్‌లో భాగంగా తన తల్లిని ఉద్దేశిస్తూ మనసులోని మాటలు రాసింది. ‘దత్తత’ అనే అంశంపై పాప వ్యాసం రాసింది. దీన్ని చూసిన సుస్మిత భావోద్వేగానికి గురయ్యారట. పాప తను రాసిన వ్యాసం చదువుతుండగా తీసిన వీడియోను సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
‘‘ఒక చిన్నారిని కాపాడి, జీవితం ఇచ్చావు’ అని అలీషా రాసింది. తను నన్ను ఏడిపించేసింది. ప్రేమ, సంరక్షణ, స్వీకరణ, భద్రత, స్వచ్ఛత, నిజాయతీలోని శక్తి ఇది. పాపలోని నమ్మకం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్నారి తన మనసు విప్పి చెప్పిన మాటలు మీరూ వినండి. దత్తత తీసుకోవడం అంటే.. హృదయం నుంచి జన్మనివ్వడం’ అని సుస్మిత పోస్ట్ చేశారు. ఆమె 24 ఏళ్ల వయసులో రీనా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత అలీషాను దత్తత తీసుకుని పెంచుతున్నారు. పలు సందర్భాల్లో సుస్మిత వారిపై తనకున్న ప్రేమను తెలిపారు.