close

తాజా వార్తలు

‘ఫిల్మ్‌యాక్టరా నీ ముఖం చూసుకున్నావా?’

తెరపై హీరోను అడ్డుకునే విలన్లను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది. కానీ, ఈ విలన్‌ పర్ఫామెన్స్‌కు మాత్రం చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఈయన హీరోలకు నచ్చే విలన్‌. ప్రేక్షకులు మెచ్చే విలన్‌. స్క్రీన్‌పై నటించే ప్రతి ఒక ఘటన ఆయన ‘ప్రతిఘటన’. సినిమా కోసం ఆయన చేసే ప్రతి కృషి ఒక స్వయం కృషి. ఆయనే చరణ్‌ రాజ్‌. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారిలా..

మీ అసలు పేరేంటి?
చరణ్‌ రాజ్‌: బ్రహ్మానంద 

మీ స్వస్థలం ఏది?
చరణ్‌ రాజ్‌: కర్ణాటకలోని బెళగావి. నేను నటించిన ‘ప్రతిఘటన’ సినిమాను అన్నయ్య ఎన్టీఆర్‌ రెండుసార్లు చూశారు. ఉత్తమ విలన్‌గా నేను నంది అవార్డు ఆయన చేతుల మీదుగానే అందుకున్నా. నాది పెద్ద వయసనుకున్నారు. నేను క్లీన్‌ షేవ్‌తో వైట్‌ అండ్‌ వైట్‌ వేసుకుని కార్యక్రమానికి వచ్చా. స్టేజ్‌పైకి వస్తుంటే అన్నగారు నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ‘సినిమాలో నటించిన వ్యక్తి ఇతనేనా’ అని పక్కనున్న వ్యక్తిని అడిగారు. నేను దగ్గరకు వెళ్లగానే, ‘చరణ్‌రాజ్‌ అంటే మధ్య వయస్కుడు అనుకున్నా. నువ్వు చూస్తే కాలేజ్‌ కుర్రాడిలా ఉన్నావ్‌. తొలిసారి నా కళ్లు నన్ను మోసం చేశాయి’ అంటూ నన్ను హత్తుకుని ‘నిన్ను చూసి చరణ్‌రాజ్‌ కొడుకేమో అనుకున్నా. చాలా బాగా చేశారు బ్రదర్‌‌’ అని మెచ్చుకున్నారు. ఆయనను చూస్తే చాలు అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది ఆయన నేను నటించిన సినిమా రెండు సార్లు చూసి మెచ్చుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఆయన నటించిన చివరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో చిన్న వేషం, కనీసం కానిస్టేబుల్‌ పాత్ర అయినా, ఇవ్వమని ఎన్నోసార్లు అడిగా. ‘తప్పకుండా బ్రదర్‌’ అన్నారు. అయితే, నేను కూడా వేర్వేరు భాషల్లో నటిస్తుండటంతో సరిగ్గా ఫాలోఅప్‌ చేయలేకపోయా. అలా మిస్‌ అయిపోయింది. తెలుగులో ఎన్టీఆర్‌, కన్నడలో రాజ్‌కుమార్‌లాంటి గొప్ప నటులతో చేసే అవకాశం నాకు రాలేదు. మిగిలిన అందరి నటులతో చేశా. కానీ, వెండితెరపై ఎన్టీఆర్‌తో కలిసి నటించి ఉంటే ఆ ఫీలింగ్‌ మరోలా ఉండేది. 

ఫ్రెండ్స్‌తో ఛాలెంజ్‌ చేసి పందెం కట్టి నటుడు అయ్యారట!

చరణ్‌ రాజ్‌: సినిమా నటుడిని కావాలన్న కోరిక నాకు అస్సల్లేదు. మా తండ్రి కలప వ్యాపారం చేస్తుండేవారు. ఆయన దివ్యాంగుడు. నేను బాగా చదువుకుని ఆ వ్యాపారంలో ఆయనకు సహాయంగా ఉంటానని అనుకున్నారు. పదో తరగతిలో ఉండగా ఫేర్‌వెల్‌ పార్టీ జరిగింది. అందులో నేను డ్యాన్స్‌, డ్రామా చేస్తే మూడు ప్రైజ్‌లు నాకే వచ్చాయి. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఫ్రెండ్స్‌ అందరం కలిసి క్రికెట్‌ ఆడి గ్రౌండ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నాం. నా ఫ్రెండ్స్‌లో గురురాజ్‌భట్‌ అని ఒకడు షమ్మీకపూర్‌లా చాలా బాగుండేవాడు. అప్పుడు మా ఫ్రెండ్స్‌లో ఒకడు ‘బ్రహ్మానంద నువ్వు బాగుంటావు కదా! ఎందుకు సినిమాల్లో నటించకూడదు’ అని అడిగాడు. ‘మా ఫ్యామిలీ పరిస్థితి తెలుసు కదా! నాన్నకు సహాయంగా ఉండాలి. కుదరదు’ అనిచెప్పా. అప్పుడు గురురాజ్‌ ‘ఒరేయ్‌.. ముఖం చూసుకోరా ఎలా ఉందో. వీడు ఫిల్మ్‌ యాక్టర్‌ అవుతాడా?’అని నా ఫ్రెండ్స్‌ను ఉద్దేశిస్తూ అన్నాడు. ‘గురురాజ్‌ అలా మాట్లాడవద్దు. మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు. ఈరోజు ఛాలెంజ్‌ చేస్తున్నా. నేను సినిమా నటుడిని అవుతా’ అని ఛాలెంజ్‌ చేశా. అంతే ఏడెనిమిదేళ్లలో నటుడిని అయ్యా. నా తొలి సినిమా 100 రోజులు ఆడింది. వరుసగా ఏడు సినిమాలు హిట్‌. నేను బెళగావి అబ్బాయినని తెలిసి, అక్కడ సన్మానం చేద్దామని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 15వేలమంది వచ్చారు. నేను ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో ఆడిటోరియంకు వస్తుంటే, ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతూ.. ‘ఏయ్‌.. బమ్మూ.. బమ్మూ.. ’ అనుకుంటూ వచ్చాడు. అతడే నా ఫ్రెండ్‌ గురురాజ్‌ భట్‌. 

మరి చరణ్‌రాజ్‌ గొప్పవాడా.. గురురాజ్‌ గొప్పవాడా..?

చరణ్‌ రాజ్‌: కచ్చితంగా గురురాజే గొప్పవాడు. ఎందుకంటే వాడు ఆ రోజు ఛాలెంజ్‌ విసరకపోతే నేను నటుడిని అయ్యేవాడిని కాదు. ఆ రోజు స్టేజ్‌పైకి వాడిని పిలిచిన ‘చరణ్‌రాజ్‌ అనే ఐదు అక్షరాలు మీ అందరికీ తెలిశాయంటే అందుకు వీడే కారణం’ అని అందరికీ చెప్పా. 

‘ప్రతిఘటన’లో చరణ్‌రాజ్‌కు ఎలా అవకాశం వచ్చింది?

చరణ్‌ రాజ్‌: టి.కృష్ణగారు కన్నడలో ఒక చిత్రం చేశారు. అందులో రెండో పాత్ర కోసం నన్ను అడిగారు. నాకు డేట్స్‌ ఇవ్వడం కుదరలేదు. నేను చేసిన ఏడు సినిమాల్లో నాలుగు సినిమాలకు సుమలతగారు హీరోయిన్‌. ‘చరణ్‌ రాజ్‌గారు మీరు ఒకే అంటే, తెలుగులో రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఇప్పిస్తా’ అనేవారు. నేను ‘వద్దమ్మా.. అక్కడికి వెళ్తే, విలన్‌ పాత్రలు ఇస్తారు. నేను చేయలేను’ అని అనేవాడిని. అప్పుడే ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి ‘ప్రతిఘటన’లో విలన్‌గా చేయమని ఆఫర్‌ వచ్చింది. ‘నేను చేయలేను సర్‌. ఇక్కడ హీరోగా బిజీగా ఉన్నా’ అని చెప్పా. దీంతో కన్నడ నిర్మాత కేసీఎన్‌ మూవీస్‌ కె.చంద్రన్‌గారితో నాకు చెప్పించారు. అలా నన్ను సినిమాకు ఒప్పించారు. ఒకరోజు నేను వేరే సినిమా షూటింగ్‌లో ఉంటే, టి.కృష్ణగారు, హరినాథరావుగారు, సుత్తివేలు బాబాయ్‌ నా దగ్గరకు వచ్చారు. అప్పట్లో నాకు మీసాలు కూడా ఉండేవి కావు. క్లీన్‌ షేవ్‌తో ఉండేవాడిని. నాతో టి.కృష్ణగారు మాట్లాడారు. ఆ తర్వాత హరినాథరావుగారు సుత్తివేలు బాబాయ్‌తో మాట్లాడుతూ.. ‘మీసాల్లేవు. తేడాగాడిలా ఉన్నాడు. వీడు ‘ప్రతిఘటన’లో కాళీ పాత్ర చేస్తాడా’ అని టి.కృష్ణగారితో అన్నారట. ‘సెట్స్‌ పైకి వెళ్లిన తర్వాత చూడండి. ఈ పాత్రకు తను ఎలా సరిపోతాడో’ అని ఆయన సర్దిచెప్పారట. నేను సినిమా చేయడానికి ఒప్పుకొన్నాక ఫస్ట్‌ డే వైజాగ్‌లో షూటింగ్‌. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడి నుంచి వైజాగ్‌ బయలుదేరా. నాతో పాటు చంద్రమోహన్‌గారు కూడా వచ్చారు. సినిమా ఎలాగైనా క్యాన్సిల్‌ అవ్వాలని నేను మనసులో కోరుకున్నా. ఏ నటుడూ కూడా ఇలా అనుకోడు. ఎందుకంటే అప్పటికే నేను పది సినిమాల్లో హీరోగా చేశా. ఒకవేళ విలన్‌గా చేస్తే నా ఇమేజ్‌ మారిపోతుందేమోనని భయపడ్డా.  అప్పటికి నాకు అస్సలు తెలుగు రాదు. హరినాథరావుగారికి, సుత్తివేలు బాబాయ్‌కు సెట్‌లో పనిలేకపోయినా, ‘ఈ తేడాగాడు ఏం చేస్తాడో చూద్దాం’ అని వచ్చారు. నేను జీప్‌లో నుంచి రోడ్డుపైకి వచ్చే సీన్‌. ‘యాక్షన్‌’ అనగానే.. నా స్టైల్‌లో నేను చేసుకుంటూ వెళ్లిపోయా. అందరూ చప్పట్లు కొట్టారు. సింగిల్‌ టేక్‌లో ఒకే అయింది. ఆ వెంటనే సుత్తివేలు బాబాయ్‌, హరినాథరావుగారు వెళ్లి టి.కృష్ణ కాళ్లపై పడ్డారు. ‘మీ ఇమాజినేషన్‌ సూపర్‌’ అని ఆయనను మెచ్చుకున్నారు. అప్పుడు వాళ్లకు అసలైన కాళీ కనపడ్డాడు. 

ఈ సినిమా విడుదలయ్యాక ‘అమ్మో చరణ్‌రాజ్‌ వస్తున్నాడు’ అని అమ్మాయిలు భయపడేవారట!

చరణ్‌ రాజ్‌: ‘ఈ చరణ్‌ రాజ్‌గాడిని మా కాలనీకి పంపండి. బట్టలూడదీసి కొడతాం’ అని అనేకమంది లెటర్లు రాశారట. అంతే, అప్పట్లో నేను వైజాగ్‌ వెళ్లాలంటే తెగ భయపడిపోయేవాడిని. 

మీకు ఏ భాషలో నటించడం సౌకర్యవంతంగా అనిపించింది?

చరణ్‌ రాజ్‌: ఏ భాషలో ప్రొడ్యూసర్‌ డబ్బులు కరెక్ట్‌గా ఇస్తాడో ఆ లాంగ్వేజ్‌ సౌకర్యవంతంగా ఉంటుంది(నవ్వులు) అయితే, ఎవ్వరూ నాకు డబ్బులు ఎగ్గొట్టలేదు. కొన్నిసార్లు జరుగుతాయి. అలాంటి వారిని ఏమీ చేయలేను. నేను డబ్బులు అడిగితే పైగా నన్ను చెడ్డవ్యక్తిలా చూపించేవారు. ‘ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తాడు. ఇవ్వకపోతే రాడు’ అని లేనిపోనివి చెప్పేవారు. నేను నటించిన దానికే కదా అడిగేది. డబ్బులు ఇవ్వకపోతే నాకు లూజ్‌ మోషన్స్‌ అవుతాయి. జ్వరం వచ్చేస్తుంది. ఏదోదే అవుతుంది. ఇక షూటింగ్‌కి రాలేను.(నవ్వులు)

ప్రతిఘటన సమయంలో విజయశాంతి మిమ్మల్ని బాగా ఏడిపించేవారట!

చరణ్‌ రాజ్‌: అప్పట్లో నాకు తెలుగు సరిగా రాదు. పైగా డైలాగ్‌లు ఎలా చెబుతానోనని భయం. పక్కన కూర్చొని బట్టీ పట్టేవాడిని. నా పక్కనే ఈతరం బాబూరావుగారు ఉండేవాళ్లు. ఆయన ప్రాంప్టింగ్‌ చెప్పేవారు. నేను సరిగా డైలాగ్‌లు చెప్పడం లేదని విజయశాంతి ఆట పట్టించేవారు.

టి.కృష్ణ ఫొటో లేకుండా ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పేవారట!

చరణ్‌ రాజ్‌: సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏడెనిమిది ఏళ్లు ఫుడ్‌ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డా. నా తల్లిదండ్రులు, తొలి సినిమా దర్శకుడు సిద్ధ లింగయ్యగారు, టి.కృష్ణగారు వీళ్లు నా దేవుళ్లతో సమానం. వారి ఫొటోలకు పూజ చేసిన తర్వాతే దేవుడికి పూజ చేస్తా. నేను కొత్త కారుకొన్నా అందులో దేవుడి ఫొటోలకు బదులు వీళ్ల ఫొటోలే ఉంటాయి. నేను చేసిన మొదటి సినిమా ‘పరాజిత’ శుక్రవారం విడుదలైతే ఆ రోజున ఆ సినిమా చూడటానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. నా ఫ్రెండ్‌ ఒకడు నా దగ్గరకు వచ్చి బీర్‌ సీసా ఇచ్చి.. ‘నీ సినిమా సూపర్‌ హిట్‌’ అని చెప్పాడు. అంతే సోమవారం నాటికి నా చేతిలో లక్షా 20 వేల రూపాయలతో పాటు ఐదు సినిమాలకు అడ్వాన్స్‌ నా చేతిలో ఉంది. ఎంత అడిగితే అంత ఇచ్చారు.  టి.కృష్ణగారి వల్లే ‘ప్రతిఘటన’ చేశా. అది చేయకపోతే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు..

ఎంతో బిజీగా ఉన్న చరణ్‌రాజ్‌ సడెన్‌గా సైలెంట్‌ అయిపోయారంటే?

చరణ్‌ రాజ్‌: ఒకే తరహా పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ‘యథార్థ ప్రేమ కథ’ అనే సినిమాకు డైరెక్ట్‌ చేయడం మొదలు పెట్టా. అందులో ‘అనితా.. ఓ అనితా..’ పాట సూపర్‌హిట్‌. (మధ్యలో ఆలీ అందుకుని.. ఈ సినిమాలో ఒక పాత్ర చేయమని అడగటానికి నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను ‘బాడీగార్డ్‌’ షూటింగ్‌లో ఉన్నా. నాకోసం వచ్చారని నేను అనుకోలేదు.. మీరు వెళ్లిపోయిన తర్వాత మా మేనేజర్‌ ద్వారా తెలిసింది. అప్పుడున్న ఒత్తిడి వల్ల మళ్లీ మాట్లాడలేకపోయా. క్షమించండి) పర్వాలేదు. ఆరోజు మీకోసమే వచ్చా. అయితే మీరు వేరే మూడ్‌లో ఉండటంతో వెళ్లిపోయా. మీ పాత్రను వేరొక నటుడితో చేయించా.

దర్శకత్వం చేయాలని ఎందుకు అనిపించింది?

చరణ్‌ రాజ్‌: అలా జరిగిపోయింది. ఇప్పుడొక తమిళ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నా. మా అబ్బాయి తేజ్‌ చరణ్‌రాజ్‌ కూడా హీరోగా చేస్తున్నాడు. తమిళంలో తను నటించిన ‘90ఎంఎల్‌’ బాగా హిట్టయింది. కేవలం తనని హీరోగా నిలబెట్టడం కోసమే నేను దాదాపు 50 సినిమాలు వదులుకున్నా. చిన్నప్పటి నుంచి మా అబ్బాయి రజనీకాంత్‌కు పెద్ద ఫ్యాన్‌. ‘నా మొదటి సినిమా ఆడియో విడుదల వేడుకకు రజనీ సర్‌ రావాలి’ అన్నాడు. ‘ఆయన ఎక్కడ వస్తాడురా..చాలా కష్టం’ అని చెప్పా. అయినా వాడు ఒప్పుకోలేదు. దీంతో రజనీకాంత్‌గారితో ఫోన్‌లో మాట్లాడి విషయం చెబితే, ‘చరణ్‌రాజ్‌ నేను బయట ఫంక్షన్స్‌కు రావడం లేదు కదా’ అన్నారు. ‘అన్నయ్యా.. నేనూ నా కొడుకు ఇద్దరం మాత్రమే వస్తాం. మీరు క్యాసెట్‌ పట్టుకుని నిలబడండి.. ఆ ఫొటో పేపర్‌లో వేసుకుంటాం’ అని చెప్పా. ఆయన ‘సరే’ అన్నారు. వెళ్లిన వెంటనే ‘చరణ్‌రాజ్‌.. ఏంటి సినిమాలు చేయడం లేదు. రిటైర్‌ అయిపోయావా’ అన్నారు. ‘లేదు అన్నయ్యా..’ అని చెప్పా. ‘మంచి ఆర్టిస్ట్‌లు అవకాశాలు వదులుకోకూడదు. మీ అబ్బాయికి టైమ్‌ వస్తే వాడే, గొప్ప హీరో అవుతాడు. ఇక సినిమాలు చెయ్‌’ అని సలహా ఇచ్చారు. 

పెద్ద హీరోల కాంబినేషన్‌లో సినిమా చేయడానికి సిద్ధమేనా?

చరణ్‌ రాజ్‌: తప్పకుండా చేస్తా. తెలుగులో హిట్టయిన ‘ఆర్‌ఎక్స్‌ 100’లో రాంకీ చేసిన పాత్రను కన్నడలో నేను చేస్తున్నా. హీరోయిన్‌ రక్షిత భర్త ప్రేమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. ఇక నుంచి తెలుగులో ఎలాంటి మంచి పాత్ర వచ్చినా చేస్తా. 

‘జెంటిల్‌మెన్‌’లో నిజంగా గుండు కొట్టించుకున్నారా?

చరణ్‌ రాజ్‌: అవును. అందులో పోలీస్‌ పాత్ర కోసం గుండు చేయించుకున్నా. ఆ తర్వాత నుంచే అందులో ఒక్కో సీన్‌ చేయడం మొదలు పెట్టారు. 

ఐదు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి గన్‌ లైసెన్స్‌ తీసుకున్నారట!

చరణ్‌ రాజ్‌: కర్ణాటకలో హరళంగర్‌ అని కమిషనర్‌ ఉండేవారు. అప్పట్లో నేను అన్ని భాషల సినిమాల్లో నటిస్తుండేవాడిని. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని గన్‌ తీసుకున్నా. సాధారణంగా ఎవరికీ ఆలిండియా పర్మిషన్‌ ఉండదు. నాకు ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా గన్‌ తీసుకుని కాణిపాకం గణపతి ఆలయానికి వెళ్లా. కారులో పెట్టి గుడిలోకి వెళ్లడం మర్చిపోయా. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆలయంలో కూర్చొని ఉంటే నేను గన్‌ పెట్టుకోవడం ఎవరో చూసి ఫొటో తీసి బయటకు పంపారు. దీంతో విపరీతంగా ప్రచారం చేశారు. బెంగళూరులో నాకు భూములు ఉన్నాయి. కొన్నిసార్లు ఒంటరిగా వెళ్తుంటా. కేవలం ఆత్మ రక్షణకోసమే గన్‌. నాకెవరూ శత్రువులు లేరు.

‘పల్నాటి పౌరుషం’ చేస్తుండగా మీకు, రాధికకు.. కృష్ణంరాజు 125 రకాల వంటకాలు పెట్టారట!

చరణ్‌ రాజ్‌: ఏం లేవని అడగటం మంచిదేమో. ఎందుకంటే నేనూ రాధిక షూటింగ్‌కు వెళ్లే ముందు స్లిమ్‌గానే ఉన్నాం. 15రోజుల్లో దాదాపు 10కేజీల వరకూ పెరిగిపోయాం. ఆ రేంజ్‌లో వంటకాలు వండి పెట్టేవారు. షూటింగ్‌ సమయంలో ఫుల్‌ ఎంజాయ్‌ చేశాం.

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? అని వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు?

చరణ్‌ రాజ్‌: రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, పవన్‌కల్యాణ్‌ ఇలా సినీ నటులు అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారు? అని అన్నప్పుడు ఆ అవసరం లేదేమో అని అన్నా. ఎందుకంటే ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లు తోటి నటులను ఎంతో చక్కగా చూసుకున్నారు. సీఎంలు అయిన తర్వాత ప్రజలను కూడా అలాగే చూశారు. ఆ తరం అయిపోయింది. కానీ, ఇప్పుడున్న నటుల్లో ఎవరైనా సీఎం, లేదా పీఎం అయితే, అతడి అంత అదృష్టవంతుడు మరొకడు లేడు. అయితే, ఒక నటుడు సీఎం కావడం ప్రస్తుతం చాలా కష్టం. ఆ ఉద్దేశంతో అన్నాను తప్ప.. వేరే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 

సైకిల్‌ చైన్‌కు బ్లేడ్‌లు పెట్టుకుని వెళ్లారట!

చరణ్‌ రాజ్‌: పీయూసీ చదువుతుండగా నా క్లాస్‌మేట్‌ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఏడిపించేవారు. ఒకరోజు మేం క్లాస్‌లో కూర్చొని ఉంటే వాళ్లు ఏడిపిస్తున్నారని ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. దీంతో నేనూ, నా ఫ్రెండ్స్‌ సైకిల్‌ చైన్‌కు బ్లేడు పెట్టుకుని గొడవకు వెళ్లాం.. చైన్‌ తీసి కొడుతుంటే వాళ్ల కాళ్ల నుంచి రక్తాలు కారాయి. అంతే పారిపోయారు. ఆ తర్వాత వారం రోజులు మేం కాలేజ్‌కి వెళ్లలేదు. వాళ్లు పెద్ద వాళ్లను తీసుకొచ్చారు. ‘అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్నారట’ అని మేము చెప్పడంతో అసలు విషయం తెలిసి ఆ నలుగురు అబ్బాయిలనే తిట్టారు. 

ఇప్పుడు మీకు సడెన్‌గా ఒక పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే, కథకు ప్రాధాన్యం ఇస్తారా? డబ్బులకు ప్రాధాన్యం ఇస్తారా?

చరణ్‌ రాజ్‌: కచ్చితంగా సినిమాకే నా ప్రాధాన్యం. నాకు కావాల్సినంత డబ్బులు దేవుడు ఇచ్చాడు. మంచి పాత్ర వస్తే నాకు రెమ్యూనరేషన్‌ కూడా వద్దు.

తెలుగు సినిమాల్లో ఏ సినిమా రీమేక్‌ చేస్తారు?

చరణ్‌ రాజ్‌: ప్రతిఘటన చేస్తా. 

టి.కృష్ణ గురించి చెప్పమంటే..

చరణ్‌ రాజ్‌: చాలా గొప్ప మనిషి. తన పని తాను చేసుకుని వెళ్లేవారు. పని తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. ఆయన ఇంకా బతికి ఉంటే బాగుండేది. గోపీచంద్‌ సక్సెస్‌లను ఆయన చూసేవారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.