close

తాజా వార్తలు

రివ్యూ: ఆర్‌.డి.ఎక్స్‌ ల‌వ్‌

చిత్రం: ఆర్‌.డి.ఎక్స్‌ లవ్‌
తారాగ‌ణం: పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మేనన్‌, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు.
సంగీతం: రధన్
ఛాయాగ్ర‌హ‌ణం: సి.రాంప్రసాద్
కూర్పు: ప్రవీణ్ పూడి
సంభాష‌ణ‌లు: పరుశురాం
నిర్మాత: సి.కల్యాణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
సంస్థ‌: హ్యాపీ మూవీస్‌
విడుద‌ల‌ తేదీ: 11-10-2019

తొలిచిత్రం ‘ఆర్‌.ఎక్స్‌.100’తోనే పాయ‌ల్ రాజ్‌పుత్ ప్రయాణం ర‌య్ ర‌య్ అంటూ దూసుకెళ్లింది. ముఖ్యంగా ఆమె అందం కుర్రకారును బాగా ఆక‌ట్టుకుంది. అవే అంద చందాలు ‘ఆర్‌.డి.ఎక్స్‌.ల‌వ్‌’ పోస్టర్‌పైనా కనిపించాయి. అప్పట్నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మ‌రి తొలి చిత్రం త‌ర‌హాలోనే పాయ‌ల్‌కి విజ‌యం ద‌క్కిందా? ఆమె అందం ప్రేక్షకుల్ని ఏ మేర‌కు మురిపించింది? 

క‌థేంటంటే: అంద‌మైన అమ్మాయి అలివేలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) త‌న తోటి అమ్మాయిలతో క‌లిసి ప్రభుత్వ ప‌థ‌కాల గురించి ప్రచారం చేస్తుంటుంది. హెచ్‌ఐవీ నిర్మూల‌న‌, మ‌ద్యపానం, గుట్కా నిషేధం కోసం పాటుపడుతుంటుంది. ఆ క్రమంలో ఎన్ని స‌మ‌స్యలు ఎదురైనా వెన‌క్కి త‌గ్గదు. తాము చేస్తున్న మంచి ప‌నులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాల‌నేదే ఆమె కోరిక‌. ముఖ్యమంత్రిని క‌లిశాక తన సొంత గ్రామ‌మైన చంద్రన్నపేట స‌మ‌స్య గురించి వివ‌రించాల‌నేది అలివేలు ఆలోచ‌న‌. ఇంత‌లోనే ఆమె జీవితంలోకి సిద్ధు (తేజ‌స్ కంచ‌ర్ల) వ‌స్తాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డ‌తాడు. అది అలివేలు ప్రాణాల‌కే ముప్పు తెచ్చిపెడుతుంది. ఇంత‌కీ సిద్ధు ఎవ‌రు? మ‌రి అలివేలు అత‌డిని ప్రేమించిందా లేదా? చంద్రన్నపేట స‌మ‌స్యేంటి? ఆ స‌మ‌స్య కోసం అలివేలు కుటుంబం ఏం చేసింది? అలివేలు అనుకొన్న ల‌క్ష్యం ఎలా నెర‌వేరింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: త‌రాలుగా ప‌రిష్కారం కాని ఆ ఊరి స‌మ‌స్య కోసం ఒక అమ్మాయి న‌డుం బిగించాక ఏం జ‌రిగింద‌నే అంశం చుట్టూ ఈ క‌థ తిరుగుతుంది. ఊరు, స‌మ‌స్య, పోరాటం అనే కాన్సెప్ట్‌లో ఏమాత్రం కొత్తద‌నం లేదు. ఇదివ‌ర‌కటి సినిమాల్లో చూసేసిన స‌మ‌స్యే అది. క‌థానాయిక రంగంలోకి దిగి పోరాటం చేయ‌డంలోనైనా కొత్తద‌నం తొంగి చూసిందా అంటే.. అది కూడా లేదు. హెచ్‌ఐవీపై ఓ అమ్మాయి ధైర్యంగా బ‌య‌టికొచ్చి ప్రచారం చేయ‌డం కాస్త ఆస‌క్తిని రేకెత్తించినా, ఆ తర్వాత వ‌చ్చే స‌న్నివేశాల్లో బ‌లం లేదు. హెచ్‌ఐవీ గురించి అవ‌గాహ‌న క‌ల్పించింది క‌దాని, త‌న‌కి కండోమ్స్ కావాలంటూ ఓ అబ్బాయి ఆ అమ్మాయిని వెదుక్కుంటూ వెళ్లడం, అత‌ని స‌మ‌స్య విని ఆమె అర్ధరాత్రి బ‌య‌టికొచ్చి కండోమ్స్ ఇప్పించ‌డం వంటి స‌న్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి. ప్రథ‌మార్ధం అంతా కూడా అత‌క‌ని స‌న్నివేశాల‌తోనే సాగుతుంది త‌ప్ప ఎక్కడా క‌థ చెప్పే ప్రయ‌త్నం చేయ‌లేదు.

ముఖ్యమంత్రికి స‌మ‌స్యని వివ‌రించ‌డానికి క‌థానాయిక ఇన్ని పాట్లు ప‌డాలా? నేరుగా తన స‌మ‌స్యని భుజాన వేసుకొని పోరాటం చేయ‌లేదా? అనే ప్రశ్నలు సినిమా చూస్తున్నంత‌సేపూ రాక‌మాన‌వు. ఆరంభ స‌న్నివేశాల‌తోనే దాదాపుగా క‌థ చెప్పేశాడు ద‌ర్శకుడు. డ్రామా, ఎమోష‌న్స్‌పై దృష్టిపెట్టాల్సిన ద‌ర్శకుడు ఆ దిశ‌గా చేసిన ప్రయ‌త్నాలు ఫ‌లితాన్నివ్వలేదు. క‌థానాయ‌కుడు ఎవ‌రు?అత‌ని తండ్రి రంగంలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందనే విష‌యాలు త‌ప్ప ద్వితీయార్ధంలో కూడా ఆస‌క్తిని రేకెత్తించే అంశాలేమీ లేవు. వ‌స్తాదుల‌తో అమ్మాయిలు క‌బ‌డ్డీ ఆడ‌టం, క‌థానాయిక‌ని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించే పోలీసుగా ముమైత్‌ఖాన్ న‌ట‌న ఏమాత్రం మెప్పించేలా లేవు. పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న మార్క్ రొమాంటిక్ కోణం చూపించినప్పటికీ ఆ స‌న్నివేశాల్లోనూ ఏమాత్రం బ‌లం లేదు.

ఎవ‌రెలా చేశారంటే: పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర సినిమాకి కీల‌కం. సామాజిక కార్యక‌ర్తగా ఆమె త‌న ప‌రిధి మేర‌కు న‌టించింది. ఆమె తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌.100’ త‌ర‌హాలోనే గ్లామ‌ర్ కోణాన్ని తెర‌పై ఆవిష్కరించింది. ఆమెని ఎంచుకొన్న ఉద్దేశం ఇందుకే అన్నట్టుగా ద‌ర్శకుడు పాయ‌ల్ రాజ్‌పుత్‌ని తెర‌పై చూపించారు. క‌థానాయ‌కుడి పాత్ర ఏమాత్రం ఆక‌ట్టుకోదు. హీరోయిన్ చుట్టూ తిర‌గ‌డం, ఆమెతో ఆడిపాడ‌టం త‌ప్ప ఆ పాత్రకి మ‌రో ల‌క్ష్యం లేద‌న్నట్టుగా చూపించారు. తేజ‌స్ కూడా ఏమాత్రం ప్రభావం చూపించ‌లేక‌పోయారు. వి.కె.న‌రేష్‌, తుల‌సి, నాగినీడు, ఆదిత్య మేన‌న్‌, ఆమ‌ని పాత్రలు ప‌ర్వాలేద‌నిపిస్తాయంతే. సాంకేతికంగా సినిమా ఒకే. ర‌థ‌న్ సంగీతం బాగుంది. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, అక్కడ‌క్కడా ప‌ర‌శురామ్ సంభాష‌ణ‌లు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగానే ఉన్నాయి. ద‌ర్శకుడి ప‌నిత‌నం ఏమాత్రం మెప్పించ‌దు. ఎంచుకొన్న క‌థ ఎంత పేల‌వంగా ఉంది. దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం కూడా కొత్తగా అనిపించదు.
బలాలు
పాయ‌ల్ రాజ్‌పుత్ గ్లామ‌ర్‌

బ‌ల‌హీన‌త‌లు
క‌థ‌, క‌థ‌నం
- సాగ‌దీతగా స‌న్నివేశాలు
హాస్యం.. భావోద్వేగాలు 

చివ‌రిగా: పేల‌ని ఆర్‌.డి.ఎక్స్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.