close

తాజా వార్తలు

ఒక్క ఆఫర్‌ ఇవ్వమని ఎన్నోసార్లు ఏడ్చా!

ముఖంపైనే చెప్పేవారు.. ఆరేళ్లు బాధపడ్డా: పాయల్‌ రాజ్‌పుత్‌

హైదరాబాద్‌: ‘ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతల్ని బ్రతిమలాడే వ్యక్తిత్వం కాదు నాది’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో కెరీర్‌ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఆమె. ఈ చిత్రం విజయంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. తేజూస్‌ కంచర్ల కథానాయకుడు. శంకర్‌ భాను దర్శకత్వం వహించారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా పాయల్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలివి..

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత కొంచెం గ్యాప్‌ వచ్చింది?
పాయల్: ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఓ రాణిలా చూశారు. ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ నా రెండో సినిమా. దాదాపు ఏడాది విరామం తర్వాత నా సినిమా రాబోతోంది. నిజంగా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా కథ బలంగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మీరు టీజర్‌లో చూసిన రొమాంటిక్‌ సీన్లు, ముద్దులు కేవలం కథలో భాగం మాత్రమే. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. లవ్‌, యాక్షన్‌.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం కోసం తొలిసారి యాక్షన్‌ సీన్‌లో చేశా. నాకు గాయం కూడా అయ్యింది. ఇంకా ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఇందులో నేను అలివేలు అనే సామాజిక కార్యకర్త పాత్రలో నటించా. ఈ సినిమా కోసం పాపికొండల్లో 40 రోజులు ఉన్నాను.

* మీరు నగరం నుంచి వచ్చారు. ఈ చిత్రం కోసం ఓ పల్లెటూరిలో ఉన్నారు. ఆ అనుభూతి ఎలా అనిపించింది?
పాయల్‌: నేను దిల్లీలో పుట్టా, ముంబయిలో ఉంటున్నా. అన్నీ సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పెరిగా. కానీ పాపికొండల్లో ఉన్న 40 రోజులు చాలా కష్టపడ్డా. హోటల్‌లో ఏసీ పెట్టారు, గదిలోనే కప్పలు తిరిగేవి (నవ్వుతూ), చాలా భయపడ్డా. ఈ 40 రోజులు తక్కువ ఫుడ్‌ తీసుకున్నా. రోజూ రాత్రి అర్ధ లీటరు పాలు తాగేదాన్ని. ఓ విధంగా కష్టంగా ఉన్నా.. మరో విధంగా ఎంజాయ్‌ చేశా.

* మీ కుటుంబ నేపథ్యం ఏంటి?
పాయల్‌: నేను పుట్టి పెరిగింది దిల్లీలోనే. అక్కడే నా చదువులు పూర్తయ్యాయి. మాది పెద్ద కుటుంబం. నా తల్లిదండ్రులు టీచర్లు. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. గత మూడేళ్లుగా అతడు కనిపించడంలేదు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం, అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏదీ వర్క్‌ కాలేదు. అతడు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం.

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ఏడాది విరామం వచ్చింది? ఎందుకు?
పాయల్‌: ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం సెప్టెంబరులో సంతకం చేశా. ఆపై జనవరిలో షూటింగ్‌ మొదలైంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు నేను ఐదు సినిమాల్లో నటిస్తున్నా. ‘వెంకీమామా’, ‘డిస్కోరాజా’తోపాటు ఓ సినిమాలో పోలీసు అధికారిణిగా నటిస్తున్నా. మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నా.

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయ్యరు. మీరు దాన్ని ఎలా స్వీకరించారు?
పాయల్‌: కాలేజీ తర్వాత సీరియల్స్‌తో నటిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. నేను మూడు చక్కటి సీరియల్స్‌లో నటించా. దాని తర్వాత ఓ పంజాబీ చిత్రంలో చేశా. మరాఠీ హిట్‌ ‘సైరాట్‌’కు పంజాబీ రీమేక్‌ అది. దీనికి నాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ఆపై దక్షిణాదిలో అవకాశాల కోసం ఆరేళ్లపాటు చాలా ఆడిషన్స్‌ ఇచ్చా. తెలుగు, తమిళం.. తదితర భాషా చిత్రాల కోసం ముంబయిలో ఆడిషన్స్‌ ఇచ్చా. అందరూ నన్ను తిరస్కరించారు. ‘సారీ.. మీరు సరిపోరు’ అని ముఖంపైనే చెప్పేవారు. కాబట్టి రాత్రికి రాత్రే వచ్చిన స్టార్‌డమ్‌ కాదిది. ఆరేళ్ల కష్టం.

* తొలి సినిమాతో ఫేం వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తున్నారు?
పాయల్‌: నేను తెలుగులో కేవలం ఒక సినిమాలోనే నటించా. ఇప్పటికీ నన్ను ‘ఇందు’ అని పిలుస్తున్నారు (ఆర్‌ఎక్స్‌ 100లోని పాత్ర). ఎప్పటికీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటా.

* ఆరేళ్లు కష్టపడ్డారు? ఇప్పుడు జనాలు మీతో సెల్ఫీల దిగడానికి వస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
పాయల్‌: ఆరేళ్లు ముంబయిలో ఉంటూ సీరియల్స్‌ చేశా. నా తొలి సినిమాతోనే ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇంత ప్రేమను నేను ఎప్పుడూ చూడలేదు. దక్షిణాదిలో స్టార్స్‌ను ఫ్యాన్స్‌ నిజాయతీగా ప్రేమిస్తారు. వారి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్‌కు వెళ్లడం కన్నా ఇక్కడ ఉండటానికే  ప్రాధాన్యం ఇస్తా. నాకు దక్షిణాదిలోనే సౌకర్యంగా అనిపిస్తోంది.

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత అలాంటి పాత్రలే వచ్చాయా?
పాయల్‌: అవును.. కానీ నేను ఆ కథల్ని ఒప్పుకోలేదు. ఇప్పట్లో మళ్లీ అలాంటి పాత్రలో నటించడం నాకు ఇష్టం లేదు. విభిన్నంగా ప్రయత్నించాలని ఉంది. ఇప్పుడు ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’లో నా పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తన పల్లెటూరి కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడే అమ్మాయి కథ ఇది. ఇకపై కూడా సాధారణ పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒక ఆఫర్‌ వచ్చింది కదా, చాలు అనుకుని సంతకం చేయను. నచ్చితేనే ఓకే చేస్తా. సినిమా చేసి, డబ్బులు తీసుకుని వెళ్లే నటిని కాదు నేను. ఏదైనా పాత్ర చేస్తే కిక్ ఉండాలి.

* ఏ దర్శకుడి సినిమాలో నటించాలని ఉంది?
పాయల్‌: బాలీవుడ్‌లో మధుర్‌ భండార్కర్‌, ఇంతియాజ్‌ అలీకి నేను అభిమానిని. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ అన్నింటికన్నా అగ్ర స్థానంలో ఉంది. నేను పంజాబీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చా. అక్కడ అభిమానులు నాకు సోషల్‌మీడియాలో మెసేజ్‌లు చేస్తున్నారు. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం అంటున్నారు. వచ్చే ఏడాది పంజాబీ సినిమా చేస్తా.

* మీకు ఇష్టమైన నటి?
పాయల్‌: నాకు బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ అంటే ఇష్టం. నేను కెరీర్‌ ఆరంభించినప్పుడు ఆమెను ఇమిటేట్‌ చేసేదాన్ని.

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీ రీమేక్‌లో నటిస్తారా?
పాయల్‌: ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా ఇటీవల నన్ను ఆఫీసుకు పిలిచారు. నా నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. కానీ నటించమని అడగలేదు. పని కోసం ఇతరుల్ని బ్రతిమలాడే వ్యక్తిని కాదు నేను. ఆఫర్‌ ఇస్తే నటిస్తా.. లేదా.. లేదు.. ఆ రీమేక్‌ కోసం నటి తారా సుతారియాను తీసుకున్నామని అన్నారు. అక్కడ వారికి వ్యక్తిగత అనుబంధాలు, స్నేహాలు ఉంటాయి. అలా నటీనటుల్ని తీసుకుంటారు. విధి దాన్ని నా దగ్గరకు తీసుకొస్తే.. అప్పుడు పరిస్థితి చెప్పలేం.

* కెరీర్ పట్ల మీ అభిప్రాయం, అంచనాలు?
పాయల్‌: దేవుడి దయ వల్ల నా కెరీర్‌ మంచిగానే ఉంది. ‘ఓ ఆఫర్‌ ఇవ్వ’మని ప్రార్థిస్తూ ఎన్నో రోజులు ఏడ్చాను. చివరికి సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పటి ఈ ఫేం పట్ల అదృష్టవంతురాలిగా ఫీల్‌ అవుతున్నా. నేను నా సినిమా స్క్రిప్టును మా అమ్మకు చెబుతుంటా. ఆమె నీకు సౌకర్యంగా ఉంటే.. సంతకం చెయ్యి అంటుంటారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా షూట్‌ సమయంలోనూ మా అమ్మ నా పక్కనే ఉన్నారు. నేను కెమెరా ముందు రొమాంటిక్‌ సీన్లు చేస్తుంటూ ఆమె అసౌకర్యంగా ఫీల్‌ అయ్యారు. కానీ సినిమా విడుదలై హిట్‌ అందుకున్న తర్వాత నాకు వచ్చిన ఫాలోయింగ్‌ చూసి అమ్మ ఆశ్చర్యపోయారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.