close

తాజా వార్తలు

పెళ్లి చూపులైన 14వ రోజే...

‘ఒక లవ్‌ లెటర్‌ రూ.250.. నాలుగు కవితలు రూ.150’

అతను అక్షరాలకు లక్షణాలు నేర్పాడు. పదాలకు పద్ధతులు నేర్పాడు. అర్థాలకు శుద్ధమైన శబ్దాలు నేర్పాడు. వాటన్నింటిలో ప్రతి ఒక్కరి మనసు కొస వరకూ చేరాడు. తన అక్షర జ్ఞానానికి తెలుగు పదాలు ఉత్సవాలు జరుపుకొంటాయి. ఎందుకంటే అందమైన రూపం ఆ శ్రీరాముడిది.. అందమైన అక్షర రూపం ఈ అనంత శ్రీరాముడిది. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే, ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి, ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ సంగతులేంటో చదివేద్దామా మరి.. 

ఆలీ: ఏ ఊరు మీది?
అనంత శ్రీరామ్‌: మాది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు దగ్గరలో ఉన్న దొడ్డిపట్ల అనే గ్రామం.

ఆలీ: అంత టెన్షన్‌గా ఉన్నారేంటి?
అనంత శ్రీరామ్‌: నేనా.. లేదే.. నేను టెన్షన్‌గా లేనని నిరూపించుకోడానికి నేనెలా కూర్చోవాలో చెప్తే.. టెన్షన్‌ పడట్లేదండి.. టెన్షన్‌కు నాకు పడదు. (అలీ: ఎవరితో పడుతుంది మీకు) రహస్యం.. (అలీ అందుకుని ఏంటి ఆ రహస్యం..) ఎవరితో పడుతుందో చెప్తే నా వృత్తి రహస్యం తెలుసుకుని చాలా మంది కుర్రాళ్లు నాతో పోటీకి వస్తారు.

ఆలీ: ఇదేంటి ఆ కటింగ్‌ పేరేంటి..?
అనంత శ్రీరామ్‌: మామూలుగా... తలకు పై భాగాన వెంట్రుకలు ఉంటే ఎంగ్‌గా ఉన్నట్లు.. అదే పై భాగాన వెంట్రుకలు లేకుండా చుట్టూ ఉంటే ఏజ్‌ అయిపోయినట్లు... (ఇంతలో ఆలీ అందుకుని అందుకే నేను ఎక్కడా పోకుండా అంతా పెంచా.. నవ్వులు). అది ఏజ్‌ ఉన్నవారికి కాదు..  రేంజ్‌ ఉన్నవారికి.

ఆలీ: మీ వయసు ఎంత?
అనంత శ్రీరామ్‌: మళ్లీ.... సరేలెండి..34..

ఆలీ: ఎన్ని నెలల క్రితం?
అనంత శ్రీరామ్‌: ఒక ఐదు నెలల క్రితం.. 34 నిండినాయి.. (ఆలీ.. నమ్మొచ్చా).. హా నమ్మొచ్చు.. కానీ ఇది నా పాస్‌పోర్ట్‌ ప్రకారం.. ఆధార్‌ ప్రకారం.. పదవ తరగతి మార్క్‌ లిస్ట్‌ ప్రకారం.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రకారం... 1985 నా డేట్‌ ఆఫ్‌ బర్త్‌.

ఆలీ: ఏ ఏజ్‌లో మొదటి పాట రాశారు..?
అనంత శ్రీరామ్‌: 11 సంవత్సరాల వయస్సులో (ఆరవ తరగతి) రాశాను.

ఆలీ: ఏ పాట రాశారు..?
అనంత శ్రీరామ్‌: సాయిబాబా పాట రాశాను.. ‘సామినామమే.. నా గానము సాయి ధ్యానమే నా ప్రాణమూ......సాయినామమే...’ ఇది నా మొదటి పాట

ఆలీ: ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్‌ స్క్రీన్‌ పైన అనంత శ్రీరామ్‌ అని టైటిల్‌ కనిపించిన చిత్రం ఏది?
అనంత శ్రీరామ్‌: నా మొదటి సినిమా ‘కాదంటె అవుననిలే’ ఈ సినిమాలో అన్ని పాటలూ నేనే రాశా.. మొదట ఆడియో రిలీజ్‌ అయిన సినిమా కూడా అదే... కానీ, మొదటి సారి పాటలు అని ఇద్దరు ముగ్గురు పేర్ల తర్వాత అనంత శ్రీరామ్‌ అని ఒక స్క్రీన్‌పైన నాపేరు చూసుకుంది మాత్రం ‘అందరివాడు’ చిరంజీవి గారి సినిమాలో.

ఆలీ: మెగాస్టార్‌ గారితో జర్నీ మొదలైందన్నమాట.. ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం‌?
అనంత శ్రీరామ్‌: జర్నీ మొదలైంది మాత్రం ‘కాదంటె అవుననిలే’ చిత్రంతో.. ఈ చిత్రానికి పాటలు రాస్తుండగా ఆ సినిమా నిర్మాత కోగంట రామకృష్ణ ఇంటి దగ్గర ‘అందరివాడు’కు సంబంధించిన ఓ షాట్‌ జరుగుతోంది. ఆ షూటింగ్‌ నిమిత్తం చిరంజీవిగారు అక్కడికి వచ్చారు. అప్పుడు మా నిర్మాత గారు ‘ఈ అబ్బాయిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నానండీ.. అబ్బాయి బాగా రాస్తున్నాడు.. మీరు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది’ అని చిరంజీవిగారికి నన్ను పరిచయం చేశారు. ఆ సినిమా పాటల సీడీ ఆయనముందుంచారు.. అప్పుడు ఆయన ‘ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పి ఆ షాట్‌ పూర్తైన వెంటనే రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది ఆయనకి. అందుకని ఆయన ఈ సీడీ కచ్చితంగా వినాల్సి వచ్చింది.. ఒక సారి వినగానే ఎందుకో రెండో సారి వినాలనిపించి.. అలా రెండు.. మూడు సార్లు విని ఈ లిరిక్స్‌ చాలా బాగున్నాయి. ఈ పాటల్లో విషయం ఉందనిపించి వెంటనే గీతా ఆర్ట్స్‌ దగ్గర నుంచి సాయంత్రం నాకు ఫోన్‌ చేయించారు. ఆ మరుసటిరోజు తెల్లవారుజామునే నేను గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్తే వారు నన్ను  ఫిల్మ్‌సిటీకి తీసుకెళ్లారు. అక్కడ చిరంజీవి గారు చెప్పిన మాటేంటంటే.. ‘నీ లిరిక్స్‌ అన్నీ కూడా నాకు నచ్చాయి.. ఓ ప్రయత్నం చేస్తాను.. ఒక వేళ ఈ పాట కుదరకపోతే కనుక నీ మీద ఉన్న నా నమ్మకం పోయిందని అనుకోకు ఎప్పుడో ఒకసారి కలిసి పనిచెయ్యెచ్చు.. ఎన్నో అవకాశాలు నీకు రావచ్చు ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఒక ట్యూన్‌ సీడీ ఇచ్చారు. తర్వాత ఆయన షూటింగ్‌కి వెళ్లి పోయారు. మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌కి వచ్చి ఏమైనా ఐడియా వచ్చిందా అని అడిగారు.. పాట అయిపోయింది సార్‌ అన్నా.. పాట అయిపోయిందా..! అని చెప్పి షాట్‌ను వాయిదా వేసుకుని పాట విన్నారు.

ఆలీ: ఆ పాట ఏంటి?
అనంత శ్రీరామ్‌: ‘ఓ పడుచు బంగారమా... పలకవే సరిగమా.. చిలిపి శృంగారమా.. చిలకవే మధురిమ.. మదిలోని సరదాని...’ ఈ పాట.

ఆలీ: ఇండస్ట్రీకి ఏ ఇయర్‌లో ఎంట్రీ ఇచ్చారు? ఇప్పటి వరకూ ఎన్ని పాటలు రాశారు..?
అనంత శ్రీరామ్‌: 2005.. 14ఏళ్ల క్రితం.. ఇప్పటిదాకా 990పాటలు రాశాను.. (అలీ.. ఇంక పది పాటలు రాస్తే 1000పాటలవుతాయి) అవ్వొచ్చు.

ఆలీ: రీసెంట్‌గా గుణ 365లో ‘బుజ్జి బంగారం..’ మీ ఇంట్లో మీ ఆవిడను పిలిచే మాటనా?
అనంత శ్రీరామ్‌: మా ఆవిడని నేనెలా పిలిస్తే బాగుంటుంది అనుకునే మాట.. నేను పిలిచే మాట కాదు.

ఆలీ: మీది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన వివాహమా?
అనంత శ్రీరామ్‌: మాది పక్కాగా పెద్దలు కుదుర్చిన వివాహం.. ఆమెది హనుమాన్‌ జంక్షన్‌.. పెళ్లి చూపులైన 14వ రోజే మా పెళ్లి చేశారు. అప్పుడు మా అక్క యూఎస్‌ నుంచి వచ్చింది. మళ్లీ తను నెలలో యూఎస్‌ వెళ్లిపోవాలి అందుకని త్వరగా చేసేశారు.

ఆలీ: మీ ఫ్యామిలీలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా?
అనంత శ్రీరామ్‌: ఎవరూ లేరండీ.. మా తాతయ్య గారు హరిరామ జోగయ్య గారు రాజకీయాల్లో చాలా యాక్టివ్‌.. అప్పుడప్పుడు సినిమాలు చేసేవారు.. ఆయన చివరిగా ‘దేవుళ్లు’ సినిమా చేశారు.. ఆయన రెకమండేషన్‌ మీద రాలేదు నేను.. అందుకని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చినట్టే మీరు నన్ను అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.

ఆలీ: ఏ డైరెక్టర్‌ ప్రేరణతో వచ్చారు ఇండస్ట్రీకి?
అనంత శ్రీరామ్‌: రైటర్స్‌ విషయంలో నేను ఒక్కొక్క దశలో ఒక్కోరిని ప్రేరణగా తీసుకుంటూ ఉండేవాడిని. పాటలని ఇష్టపడే రోజుల్లో సీతారామశాస్త్రిగారి పాటలు బాగా నచ్చుతుండేవి. తర్వాత పాటలు రాయడం మొదలు పెట్టే సమయంలో వేటూరి గారి పాటలు కొన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుండేవి. ఆయన ఆఖరి రోజుల్లో రాసిన పాట ‘వయస్సు నామి’ ఆ ప్రయోగం ఎవరికీ తట్టదు.. ఎందుకంటే ‘వయస్సు’ వేరు ‘సునామి’ వేరు వయస్సు సునామి బాగోదేమో అనిపించి రెండింటినీ కలపలేము. కానీ ఈయన పదాలకు పీటముడి వేయగలరు. ఇలాంటివి ప్రయోగించడంలో వేటూరిగారు దిట్ట. సినిమాకు పాటలు రాయడం అన్న ప్రక్రియ మొదలైనప్పుడు చంద్రబోస్‌గారిని ప్రేరణగా తీసుకున్నా. ఎందుకంటే.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన రహస్యం ఏంటంటే? పాట కష్టంగా ఉంది అనిపించుకోవడం సులువు.. అదే పాట సులువుగా ఉంది అనిపించుకోవడం కష్టం.. అలా పాటను చాలా సులువుగా ఉంది అనిపించేలా చంద్రబోస్‌ గారు రాయగలరు. ఈ ముగ్గురి ప్రేరణతో.. ఆ ముగ్గురి శైలి కాకుండా ఇంకో శైలిలో ప్రయాణించాలని అనుకున్నా.

ఆలీ: ఇండస్ట్రీలో ఈయన నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు.. ఈయన ఏసినిమా చేసినా కూడా నేను కంటిన్యూ అవ్వాలి అనిపించే డైరెక్టర్‌ ఎవరు?
అనంత శ్రీరామ్‌: నాకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చిన డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌గారు. ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఏ మాయ చేశావే’ రెండు సినిమాలకు పాటలు నేనే రాశా.. ప్రతి సినిమాకు గంటన్నర నరేషన్‌ చెప్పేవారు. ‘పాట రాసి రెహమాన్‌గారు లేకపోతే ఇళయరాజగారి దగ్గరకు వెళ్లి రికార్డు చేయించుకుని నా దగ్గరకు తీసుకొస్తే నేను పాటను షూట్‌ చేస్తా’ అనేవారు. అంతే ఒక్క పదం కూడా కరెక్షన్‌ చెప్పేవారు కాదు.. కానీ షూటింగ్‌ చేసేటప్పుడు పదానికి అర్థం అడిగేవారు అంతే.

ఆలీ: స్వరాభిషేకంలో బాలు గారు ఓ పాట గురించి చాలా వర్ణించారు. విన్నారా.?
అనంత శ్రీరామ్‌: స్వరాభిషేకంలో నా పాటలతో ఒక  ఎపిసోడ్‌ చేశారు. అందులో ‘నేనూ..’ అని సాగే పాటను హేమచంద్రగారు పాడారు. అప్పుడు బాలూగారు ఉద్వేగానికి లోనయ్యారు. ఎందుకు ఈ పాట నేను పాడలేకపోయాను అని బాధపడ్డారు. ‘70ఏళ్ల తర్వాత కూడా నేను చెప్పకపోతే ఫూల్‌నే అవుతా.. ఈ పాట నేను పాడుంటే ఇంకా బాగా ఉండేది’ అని చెప్పారు.

ఆలీ: తెలుగు భాష మీద ఇంత పట్టు ఉంది.. ఇంతకు మీరు ఏమి చదువుకున్నారు?
అనంత శ్రీరామ్‌: పదో తరగతి వరకూ తెలుగమీడియం చదువుకున్నా అదే పట్టు. ఇది సరదాగా చెప్పింది కాదు. పదోతరగతి వరకూ తెలుగుమీడియంలో మన స్టేట్‌ సిలబస్‌ను ఓ రచయిత ఎంతో గొప్పగా ఇచ్చారు. టెన్త్‌ తర్వాత టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌కు వెళ్లిపోయినా కూడా తనలో ఉన్న రచన అనేది ఏమాత్రం తగ్గకుండా ఉండేలా అంత పునాది వేసే భాష మనకిచ్చారు. అదికాక, మా నాన్న గారు కాలేజీ ప్రిన్సిపల్‌గా చేస్తుండేవారు. ఆయన ఇప్పుడు రిటైర్‌ అయ్యారు. మా నాన్నగారి సబ్జెక్ట్‌ ఎకనామిక్స్‌ అయినా కూడా తెలుగుమీద చాలా ఆసక్తి ఉండేది. దాని వల్ల తెలుగు పండితులు, అవధానులు, సంచాలకులు, సాహితీవేత్తలు వీరంతా ఆయనకు స్నేహితులుగా ఉండేవారు. వారు ఏ సాహితీ కార్యక్రమం జరిపినా మా నాన్నగారే నిర్వహించేవారు. ఆ కార్యక్రమాలకు నన్ను కూడా తీసుకెళ్లేవారు. అలా వాళ్లు వేదికలపై చేసిన ప్రసంగాల్లోంచి, పద్యాల్లోంచి పురాణాలమీద ఇచ్చిన ఉపన్యాసాల్లోంచి పదాలను పోగు చేసుకుని ఈ గూడు ఇలా కట్టుకోగలిగా. ఇదంతా వారిచ్చిన దయ. టెన్త్‌ తర్వాత ఇంటర్‌, బీటెక్‌ 3ఏళ్లు చదివి నా దారి ఇదికాదు అని చెప్పి వెనక్కొచ్చేశా.

ఆలీ: పదాలు చెప్తే ఎంత సేపట్లో రాస్తారు పాట..
అనంత శ్రీరామ్‌: ఒక పాటకు నేను 20నిమిషాలు తీసుకుంటా..

ఆలీ: ఒక టాస్క్‌ ఇస్తా.. నేను చెప్పిన పదాలతో ఐదు నిమిషాల్లో పాట రాయగలరా?
అనంత శ్రీరామ్‌: కచ్చితంగా రాయగలను.. పల్లవి వరకూ రాయగలను.. పదాలు చెప్పండి. (అలీ: చీకటి, ప్రేమ, ప్రాణం, ఇష్టం, యవ్వనం, దేవుడు, మతిమరుపు)వీటితో ఓ పల్లవి రావాలి.. ఇది మీ తర్వాతి సినిమాలో డ్యూయట్‌ అవ్వాలి అంతే కద.. తప్పకుండా రాస్తా.
‘మధురమైన మతిమరపూ.. చీకటి చీల్చే మెరుపూ.. ఇష్టమైన మైమరపు.. ప్రాణం తెరిచే తలుపు.. యవ్వన సీమను చూద్దామ్‌ రమ్మని ప్రేమగా అందిన పిలుపూ... ఇది దేవునికైనా అందని గెలుపు.. తొలి వలపూ.. తొలి వలపూ.. తొలి వలపూ... తొలి వలపూ...’ ఇది పాట.

ఆలీ: చిన్నప్పుడు లవ్‌ లెటర్స్‌ రాయడం లాంటివి చేశారా?
అనంత శ్రీరామ్‌: చాలా రాశాను.. నాకోసం కాదు.. నా ఫ్రెండ్స్‌ కోసం వాళ్ల లవర్స్‌కు రాశా. నేను రాసుకోలేదు.. వాళ్లకోసమే రాశా.. ఒక పేజి లవ్‌ లెటర్‌ రాస్తే రూ.250ఇచ్చేవారు. నాలుగు కవితలు రాయాలంటేనేమో రూ.125 తీసుకునేవాడిని. బెస్ట్‌ ఫ్రెండ్స్‌కైతే 30% డిస్కౌంట్‌. క్లోజ్‌ ఫ్రెండ్స్‌కైతే 20%.

ఆలీ: చిన్నప్పుడేంటి లవర్స్‌ మధ్యలోకి వెళ్లి  నాకు కాస్త చోటివ్వండి అని కూర్చునేవారంట?
అనంత శ్రీరామ్‌: లేందడీ..! నేను నా కోటలో ఉంటే  వాళ్లు వాళ్ల తోటలోకి లాక్కెళ్లేవారు. (అలీ అందుకుని ఆహా..ఏ కోట మనది) నేను హాయిగా ఏదో రాసుకుంటూ ఉంటే వాళ్లకేవో చిన్నచిన్న గొడవలవుతుంటాయి.. ఒక పదకొండు, పన్నెండు ప్రేమ జంటలకు మధ్యలో నేనున్నాను. అందులో ఒక్కరు జంటయ్యారు. వాళ్లు అమెరికాలో ఉన్నారు. ఆ ప్రేమ తాలూకు విజయాలు కానీ, వైఫల్యాలు కానీ నాదగ్గర లేకపోయినా.. ఇలా ప్రేమకు దగ్గరగా ఉండటం వల్ల ప్రేమ పాటలకు ఎక్కువగా రాయగలిగే అవకాశం వచ్చింది.

ఆలీ: లవ్‌లెటర్స్‌ రాస్తే వచ్చే డబ్బులతోనే కాలేజీ ఫీజులే కట్టేవారా..?
అనంత శ్రీరామ్‌: లేదండీ.. కాలేజీ ఫీజు మా నాన్న గారే కట్టేవారు. ఆ డబ్బుతో సినిమాలు చూసేవాణ్ని.

ఆలీ: ఒక పాట రాయడానికి 10రోజులు తీసుకుంటా అన్నారు కద.. మరి బాహుబలి చిత్రంలోని ‘పచ్చబొట్టేసినా..’ పాటను 73రోజులు తీసుకున్నారు. ఎందుకని?
అనంత శ్రీరామ్‌: అక్కడ పాత్రల్లో ఉన్న సంక్లిష్టత వల్ల అన్నిరోజులు పట్టింది. తమన్నా క్యారెక్టర్‌ నక్సలైట్‌ పోలికలున్న క్యారెక్టర్‌.. ప్రభాస్‌ గారి శివుడి క్యారెక్టర్‌ గిరిజనుల మధ్య పెరిగిన మంచి బాలుడి క్యారెక్టర్‌.. ఇద్దరి నేపథ్యం వేరు.. వీరిద్దరినీ కలపాలంటే ఏ భాష ఎంచుకోవాలి అని ఆలోచించడానికే 20రోజులు పట్టింది. అప్పుడు రాజమౌళిగారు కూడా ఏంటి పాట లేటవుతోంది అని ఒత్తిడి చేయలేదు.

ఆలీ: మీరు రాసిన పదాలను కీరవాణిగారు కానీ, రాజమౌళి గారు కానీ చూసి ఎందుకు ఈ పదం వాడారు అని అడగడం జరిగిందా..?
అనంత శ్రీరామ్‌: లేదండీ, అంటే రాజమౌళిగారు పాట విషయానికొచ్చేటప్పటికీ చిత్రీకరణ మొత్తం ప్రతి అణువూ వర్ణిస్తుంటారు. వర్ణించడమే కాకుండా  ఈ చిత్రీకరణ వచ్చినప్పుడు అక్కడ సరిపడే లైన్‌ను రాసుకోమనేవారు.

ఆలీ: చిన్నప్పుడు మీ నాన్న గారి దగ్గరకెళ్లి నన్ను కొట్టండి అనేవారంట.. ఎందుకు?
అనంత శ్రీరామ్‌: రివర్స్‌ స్టాటజీ అది..8వ తరగతిలో ఉన్నప్పుడు స్కూటర్‌ నేర్చుకున్నాను అప్పుడు.. నాకు కాళ్లు అందేవి కాదు అప్పుడు ఎవరైనా స్టాండ్‌ తీసి స్టార్ట్‌ చేసిస్తే అప్పుడు గేర్‌ వేసుకుని ముందుకెళ్లేవాడిని... మరీ స్కూటర్‌ను ఆపాలంటే అక్కడ ఎవరో ఒకరిని రెడీగా ఉండమనేవాడిని. అది పరిస్థితి.. డ్రైవింగ్‌ మాత్రం వచ్చింది.. ఈ సారి ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పి స్టాండ్‌ వేసి గేర్‌ వేశా అంతే శివాజి గుర్రంలా ఎగిరి ముందున్న గోడను గుద్దేశా. దీంతో స్కూటర్‌ ముందు భాగం మొత్తం పాడైపోయింది.. అప్పటికే మా నాన్న గారు వద్దు అలా చెయ్యెద్దని చెప్పినా వినకుండా చేశా.. ఇంక నాన్నగారు కొట్టేస్తారేమో అని ముందుగానే నాన్నగారు కొట్టండి.. కొట్టండి నాదే తప్పు అని పది సార్లు అనేసరికి ఫాట్‌ మని ఒకటి లాగి వెళ్లిపోయారు. అదే నేను పొగరుగా వెళ్లింటే పది పడేవి.. (నవ్వులు)

ఆలీ: మీ భార్య హౌస్‌వైఫా..?
అనంత శ్రీరామ్‌: హోమ్‌ మేకర్.. హౌస్‌వైఫ్‌.. హోమ్‌ మేకర్‌కి తేడా ఏంటంటే... హౌస్‌ అనేది ఇటుకలతో, గోడలతో నిర్మించింది.. వైఫ్‌ అంటే ఆ హౌస్‌కు యజమానురాలు. హోమ్‌ అనేది ఇసుక, ఇటుక, గోడ అందులో మనుషులుంటారు. వారి మధ్య అనుబంధాలుంటాయి.. వాటిని ఎప్పటికప్పుడు మొయిన్‌టెయిన్‌ చెస్తుండాలి అది భార్య బాధ్యత. వారి మధ్య బంధాలను మొయిన్‌టెయిన్‌ చేయాలంటే ఒక ఇరుసులాగా కష్టపడాలి అది చాలా కష్టమైన పని.

ఆలీ: మీకు ఎంతమంది తోబుట్టువులు?
అనంత శ్రీరామ్‌: నేను, మా అక్క.. మా అక్క అమెరికాలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తోంది.

ఆలీ: నేను తప్ప ఇది ఎవరూ రాయలేరు అనే సమయంలో.. ఇది బాలేదు శ్రీరామ్‌ దీన్ని తీసేయాలి అని ఎవరైనా అన్నారా?
అనంత శ్రీరామ్‌: ఉన్నారు సార్‌.. రాయకపోవడం వల్ల ఇది బాలేదు అని చెప్తే నేను ఖచ్చితంగా నన్ను నేను బాగు చేసుకుని ఇంకొంచె సామర్థం పెంచుకుని రాస్తా. కానీ ఒక సంఘటన జరిగింది.. ఒక చిత్రానికి గాను దర్శకుడు సినిమా స్టోరీ వినిపించి.. నాకు ఈ ఎసెన్స్‌వచ్చేలా పాట కావాలి.. ఆ పాట కోసం సంగీత దర్శకుడి దగ్గర ఐదు, ఆరు ట్యూన్‌లు తీసుకున్నాను కానీ నప్పడం లేదు.. మీరు లిరిక్‌ రాసిస్తే దానికి ట్యూన్‌ చేస్తా అప్పుడు కుదురుతుంది అన్నారు. సరే అని 20రోజులు కష్టపడి పాట రాసి డైరెక్టర్‌ గారి దగ్గరకు వెళ్లి పాట వినిపించా. అది విని వెంటనే మనం సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్దాం ఈ పాట వెంటనే రికార్డు చేయించాలి అని అక్కడికెళ్తే.. ‘లిరిక్‌కు ట్యూన్‌ చేయడం నాకు ఇష్టం లేదు’ అన్న మాట చెప్పకుండా... ‘ఈ పాటలో ఓ దేవుడి పేరు వచ్చింది రిలీజియస్‌ అవుతుంది కాబట్టి నేను చేయను’ అని చెప్పారు. కేవలం హిందూ దేవుడి పేరు ఉన్నందున ఆ పాట చేయను అని ఓ సంగీత దర్శకుడు అనడం వృత్తికి అవమానం అనిపించింది.. అలా వృత్తికి గౌరవం ఇవ్వని వ్యక్తితో పనిచేయనని చెప్పి ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయలేదు.

ఆలీ: ఆ సంగీత దర్శకుడు ఎవరు?
అనంత శ్రీరామ్‌: ఆ సంగీత దర్శకుడి పేరు చెప్తే వృత్తి పరమైన దెబ్బ తగులుతుంది. అలా జరగకూడదు కాబట్టి నేను ఆయన పేరు చెప్పను.

ఆలీ: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఈ హోటల్‌లో ఉండు అని చెప్పి బిల్లు కట్టకుండా వెళ్లిపోయారంట.. ఏంటి కథ? ఎలా బయటకు వచ్చారు?
అనంత శ్రీరామ్‌: ఓ సినిమా రికార్డింగ్‌ నిమిత్తం మద్రాస్‌ వెళ్లా.. ఆ పని పూర్తవుతున్న సమయంలో అక్కడే మద్రాసులో ఉన్న మరో పెద్ద నిర్మాత  నాకు అర్జెంట్‌గా పాట కావాలి అన్నారు.. అప్పుడు నేను ‘వేరు వాళ్ల పనిమీద వచ్చాను పర్లేదా’ అంటే.. ‘నేను చూసుకుంటాను’ అన్నాడు. సరే ఇతను ఇక్కడ కంటిన్యూ అవుతున్నాడు కద అని చిన్న నిర్మాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.  అప్పుడు హోటల్‌ వాళ్లు వచ్చి మీ రూమ్‌ మార్చామండి 504(ఏసీ రూమ్‌) నుంచి 302కి రావాలి అన్నారు. ఎందుకు మార్చారు అనుకున్నా.. 302నాన్‌ఏసీ. అప్పుడు అక్కడి సిబ్బంది ఒకరు చెప్పారు. మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే చేర్పించారో వాళ్లు బిల్లు కట్టలేదు. ఒకరోజు ఫుడ్‌ బిల్లు, మూడు రోజులు హోటల్‌ బిల్లు పెండింగ్‌ ఉంది. దాని బాధ్యత ఎవ్వరూ తీసుకోలేదు. మీరు ఈ బిల్లు మొత్తం కడితే తప్పితే ఈ హోటల్‌ నుంచి వెళ్లలేరు అని చెప్పారు. అప్పుడు పెద్ద నిర్మాతకు ఫోన్‌ చేస్తే అందుబాటులో లేరు. ఏమీ చెయ్యాలో తెలీక చిన్న నిర్మాత మేనేజర్‌కు ఫోన్‌ చేసి గట్టిగా అరిచే సరికి అయన వచ్చి బిల్లు కట్టి.. ట్రైన్‌ టికెట్‌ ఇప్పించి హైదరాబాద్‌ పంపించారు.

ఆలీ: ఇప్పటిదాకా అందరి హీరోలకూ రాశారా పాటలు?
అనంత శ్రీరామ్‌: రామ్‌ చరణ్‌ గారికి రాయలేదు. అవకాశం వస్తే రాస్తా.

చివరిగా:

ఆలీ: మనిషి జంతువు నుంచి వచ్చారంటారు కద.. నిన్ను ఒక జంతువుతో పోల్చుకోమంటే ఏ జంతువుతో పోల్చుకుంటావు.. 
అనంత శ్రీరామ్‌: మర్కటం(కోతి).. నేను స్వతహాగా ఆంజనేయస్వామి భక్తున్ని

ఆలీ: అనుష్కకు ఒక సీక్రెట్‌ మెసేజ్‌ పెట్టమంటే ఏమని పెడతావు..
అనంత శ్రీరామ్‌: క్రష్‌

ఆలీ: తెలుగు అక్షరాల్లో ఒక అక్షరం తీసేయమంటే ఏది తీసేస్తారు?
అనంత శ్రీరామ్‌: ఛీ..

ఆలీ: అమ్మాయిగా పుట్టుంటే సెలబ్రిటీస్‌లో ఎవర్ని పెళ్లి చేసుకునేవారు.
అనంత శ్రీరామ్‌: అబ్దుల్‌ కలాం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.