close

తాజా వార్తలు

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు!

‘భైరవద్వీపం’లో ప్రభుదేవా డ్యాన్స్‌ పెట్టమన్నారు!

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం.. శిఖరమంత ఖ్యాతి.. అయినా ఆయన ఆడంబరాలు లేని ఆకాశం. ఆయనొక బంగారు కొండ... తనవాళ్లకు ఆయనే అండా దండ. సహాయ దర్శకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు రావి కొండలరావు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే, ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి, ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ సంగతులేంటో మీరూ చదివేయండి.

రావి కొండలరావు..? అర్థం ఏంటి..?
రావి ఇంటి పేరు. కొండలరావు నాపేరు.. కొండల అంటే వెంకటేశ్వరస్వామి.. కొండ అంటే శివుడు. (అలీ: ఏడు కొండలైతే వెంకటేశ్వరస్వామి. ఒక కొండ అయితే శివుడు. మరి ఇప్పుడు మీరు ఏ కొండ). నేను ఆరు కొండలు. 

ఇండస్ట్రీకి యాక్టర్‌గా వచ్చారా.. రైటర్‌గా వచ్చారా.. డాక్టర్‌గా వచ్చారా..?
రావి కొండలరావు: ఏమో తెలీదు...! ఏదో వచ్చేశా.. ఏదో చేద్దామని వచ్చానంతే.. ఏమొస్తే అది చేద్దామని వచ్చా. నాటకాలు రాశా, నాటికలు రాశా, కథలు రాశాను.. ఏదో ఒక రైటర్‌ దగ్గర అసిస్టెంట్‌గానో.. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌గానో.. ఇవన్నీ లేకపోతే దొరికితే వేషం..లేకపోతే డబ్బింగ్‌.. నాకు డోలక్‌ వాయించడం వచ్చు. ఇలా ఏదో ఒకటి దొరికితే అందులో చేద్దామని వచ్చా. 

మీ సొంతూరు ఏది? 
రావి కొండలరావు: మాది శ్రీకాకుళం.. ఐదు నుంచి పదకొండో తరగతి వరకూ శ్రీకాకుళంలో చదివాను. మా నాన్నగారు రిటైర్‌ అయినందువల్ల అక్కడే సెటిల్‌ అయ్యాం. అప్పుడు నాకు పదేళ్లు. ఐదో తరగతిలో చేరాను. తర్వాత కాలేజీకి వెళ్లాలనుకునే సమయంలో నాకు ఉద్యోగం వచ్చి మద్రాస్ వెళ్లాను. ఆనందవాణి అనే పత్రికలో సబ్‌ఎడిటర్‌ ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్లాను. మద్రాసులో ముళ్లపూడి రమణగారు, బాపుగారు నన్ను యాక్టింగ్‌ ట్రై చెయ్యమని సలహాలు ఇచ్చేవారు. నేను కమలాకర కామేశ్వరరావు, బీఎన్‌ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో నాకు యాక్టింగ్‌ పై ఆసక్తి ఎక్కువ ఉండేది. కానీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టింగ్‌ కోసం నా దగ్గరకు వచ్చిన వారికి ‘ఏమీ లేవు బాబూ.. తర్వాత వచ్చి కనబడు’ అంటాము కదా.. అలాగే నన్నూ అంటారు. అందుకనే పెద్దగా ట్రై చెయ్యలేదు. ‘మీరు అందులో అయితే బాగా రాణిస్తారని నా ఉద్దేశం’ అని ముళ్లపూడి రమణగారు అన్నారు. ‘‘నేను మొదటిసారిగా ‘దాగుడుమూతలు’ అనే సినిమా రాస్తున్నా.. మీకు అందులో వేషం రాస్తా. ఆ సినిమాకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు’’ అని చెప్పారు. అలా అవకాశం ఇచ్చారు. 

మీదేంటి డ్రామా వివాహం అట? అంటే ఏంటి..?
రావి కొండలరావు: అప్పట్లో డ్రామాలు వేసే వాళ్లం. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. ఎందుకంటే అప్పుడు నా జీతం రూ.150. (వెంటనే అలీ అందుకుని... అప్పట్లో రూ.150 ఎక్కువ కదా బాబాయ్‌) ఎక్కువేం కాదు. 70రూపాయలు ఇంటి అద్దె కట్టేవాడిని. మిగిలిన డబ్బుతో నేనూ నా భార్య ఎలా బతుకుతాం? కొంచెం జీతం ఎక్కువొస్తే చేసుకుందామనుకున్నా.. ఈ లోపు నా తమ్ముడే చేసేసుకున్నాడు. ఆ తర్వాత  మేము నాటకాలు వేసేవాళ్లం కదా. సోమయాజులు, రమణమూర్తి వాళ్లకు ఓ ట్రూప్‌ ఉండేది. ఆ ట్రూప్‌లో రాధాకుమారి అని ఒకావిడ తరచూ వేషం వేసేది. అప్పుడు రాధాకుమారి పరిచమైంది. ఆమెది విజయనగరం. ఆమెకు సినిమాపై ఆసక్తి ఎక్కువ. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను కావడంతో ఆమె నా దగ్గరకు వచ్చి ‘మీరు ఎలాగైనా ప్రయత్నించి సినిమాలో నాకు వేషం ఇప్పించండి’ అని అడిగేది. అప్పుడు నేను ‘నాకంత పలుకుబడి లేదమ్మా. అయినా కొత్తవాళ్లను రానివ్వరు కదా ఏదో చిన్నచిన్న వేషాలు ఇస్తారు’ అంటూ ఏదో చెప్పాను. అప్పుడు ఓ తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేస్తున్నారు. అందులో సెకండ్‌ హీరోయిన్‌ వేషం ఉంది. డబ్బింగ్‌ చెప్పడానికి రమ్మని ఆమెను పిలిపించాను. ఆమెకు ముందే శిక్షణ ఇచ్చి అక్కడ డబ్బింగ్‌ చెప్పమన్నా.. బాగానే చెప్పింది. ఈ క్రమంలో డబ్బింగ్‌ ఎక్కడవుతుంటే అక్కడికి ఆమెను తీసుకెళ్లేవాడిని. ఇది రమణగారు రెండు మూడు సార్లు చూసి, ‘ఇలా అమ్మాయినేసుకుని తిరిగితే చూసేవాళ్లకు బాగోదు. మీకు ఇష్టమైతే ఇద్దరూ పెళ్లి చేసుకోండి’ అన్నారు. ఈ ఐడియా బాగానే ఉందనుకున్నా (ఇంతలో నవ్వులు). రాధాకుమారి రాకముందు నాటికలు వేసేవాళ్లం. మహిళలకు వేషం అంటే కష్టం. వారికి రూ.25 ఇవ్వాలి, ఆటో డబ్బులు, టిఫిన్‌ పెట్టాలి. ఇదంతా కష్టమయ్యేది. డబ్బులు ఉండేవి కావు. అందుకనే రాధాకుమారిని పెళ్లి చేసుకుంటే నేను రాసే నాటికల్లో స్త్రీ పాత్రలు ఈమె వేస్తుందనే ఉద్దేశంతో 1960లో తిరుపతిలో పెళ్లి చేసుకున్నాను. మొదట్లో వాళ్ల ఇంట్లో వాళ్లు నసిగారు. ఆ తర్వాత ఒప్పుకొన్నారు. అలా నాటికలు, నాటకాల్లో ఇద్దరం కలిసి నటించాము. 

‘దాగుడుమూతలు’ మీ మొదటి చిత్రమా?
రావి కొండలరావు: అవును. అంతకు ముందు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ‘శోభ’ 1958లో విడుదలైంది. గతేడాది(2018)కి సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

ఎన్టీఆర్‌కు మీరంటే చాలా ఇష్టమా..!
రావి కొండలరావు: ‘శోభ’ సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్‌గారు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఓ డాక్టర్‌ వేషం ఉంది. అది నేను వెయ్యాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నన్ను ఆయనకు పరిచయం చేశారు.

ఎన్టీఆర్‌ ఒక పాట వినమని చెబితే, ‘ఎవరండీ ఈ పాట రాసింది’ అన్నారట!
రావి కొండలరావు: అప్పట్లో మేము మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షూటింగ్‌కు వస్తున్నాం. ఆయన ఇంకో షూటింగ్‌ కోసమని వెళ్తున్నారు. ఇద్దరం ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. అప్పుడు ఎన్టీఆర్‌ ‘దాన వీర శూర కర్ణ’ తీస్తున్నారు.  నాతో పాటు ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, గిరిబాబు ఇలా చాలామంది ఉన్నారు. మా అందరినీ పక్కన కూర్చోబెట్టుకుని, ‘దుర్యోధనుడికి ఎవరైనా పాట పెడతారా బ్రదర్‌’ అన్నారు. ‘దుర్యోధనుడికి పాట ఎందుకండీ.. చెత్త ఐడియా’ అని నేను నోరు జారా. ‘మనం పెడుతున్నాం బ్రదర్‌’ అని అనగానే, నాకు గుండె ఝల్లుమంది. ఒంట్లో వణుకు వచ్చేసింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి ‘ఎందుకయ్యా.. అలా అన్నావు’ అని అడిగారు. ‘ఏం చేస్తామయ్యా.. గ్రహచారం బాగోలేదు’ అని సమాధానం ఇచ్చా. అయితే, అప్పుడు జరిగిన విషయాన్ని ఎన్టీఆర్‌ ఏమీ మనసులో పెట్టుకోలేదు. ‘దాన వీర శూర కర్ణ’లో నేను వేషం వెయ్యాల్సింది. ‘బ్రదర్‌.. మన సినిమాలో ఏ వేషం వేస్తారు. సెల్యుడిగా వేస్తారా’ అని అడిగారు. చివరకు ఆ వేషం ముక్కామల వేశారు. అప్పుడు ఆయన పరిస్థితి బాగోలేదట. అందుకే ముక్కామలకు ఇచ్చారని తెలిసింది. 

రాజబాబు అంత పాపులర్‌ అవ్వడానికి రావికొండలరావే కారణం అని నేను విన్నాను.. ఇది నిజమేనా?
రావి కొండలరావు: ‘కథ కంచికి’ అనే నాటకం రాశాను. అందులో ఆఫీసు బాయ్‌ వేషం ఉంది. కామెడీగా చెయ్యాలి. ‘ఈ వేషం అదరగొట్టాలి’ అని పొట్టి ప్రసాద్‌ని అడిగాను. అప్పుడు ఆయన ‘రాజబాబు అని ఒకడున్నాడు. అతన్ని తీసుకొస్తాను’ అని చెప్పాడు. చాలా వినయ విధేయలతో ‘నేను వేస్తానండి’ అని చెప్పాడు.  టాప్‌ లేపాడు. అది దర్శకుడు కేవీరెడ్డి చూసి ‘హరిశ్చంద్ర’ సినిమా మొదలుపెట్టి అందులో ఓ వేషం ఇచ్చారు.

రాధాకుమారి నుంచి మీకు ఎలాంటి సపోర్టు ఉండేది?
రావి కొండలరావు: దాదాపు 600 సినిమాలు చేసింది.. నేను 600లకు పైనే చేశా. ఇద్దరం నటులమే అయినా.. నాకంటే ఆమెకే షూటింగ్‌లు ఎక్కువ ఉండేవి. ‘మీకేంటండి ఇద్దరూ నటులే’ అని అందరూ అనేవాళ్లు. కానీ మేము పడిన కష్టాలు బయటి వారికి తెలియవుకదా.. ఉదయాన్నే లేచి పనులు చేసుకుని వెళ్లి మళ్లీ సాయంత్రం వచ్చేవాళ్లం. ఆమె చనిపోయే కొద్ది రోజుల ముందు ఇద్దరికీ సన్మానం చేస్తామని వచ్చారు. ‘సన్మానం ఎందుకండీ చక్కగా నాటకం పెట్టండి వేస్తాము’ అని అన్నది. ఆరోజు రాత్రే ఆమె చనిపోయింది. అంత ఆసక్తి ఆమెకు నాటకాలంటే. 

మీ భార్య ఎలా చనిపోయారు.. ఏమైనా అనారోగ్యమా..?
రావి కొండలరావు: ఆమెకు గుండె సంబంధ సమస్య ఉంది. ఆస్పత్రి అంటే భయం. అలా మందులు వాడకుండా అనారోగ్యం పెంచుకుంది. సడెన్‌గా హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. నేను ఆ రోజు పని నిమిత్తం అమెరికాకు ఉదయం 3గంటలకు బయలుదేరా. అదే సమయంలో నా భార్య చనిపోయింది. కానీ నేను దుబాయ్‌కి చేరుకున్నాక ఆ విషయం తెలిసి వెనక్కి వచ్చేశా.

రాధాకుమారి చనిపోయే ముందు ఏ సినిమాలో చివరిగా నటించారు?
రావి కొండలరావు: ఆమె చనిపోయే సమయానికి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మరి అవి ఏమి చేశారో నాకు తెలీదు. ఒక సినిమా అయితే పూర్తయింది. ‘మా అబ్బాయి ఇంజినీర్‌’ అనే సినిమా మాత్రం విడుదలైంది. అప్పుడు ఆ సినిమాని ఆమెకు అంకితం చేశారు.

మీరు ఏయే సినిమాలకు కథలు రాశారు?
రావి కొండలరావు: ‘పెళ్లి పుస్తకం’, ‘బృందావనం’, ‘భైరవద్వీపం’తో పాటు, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ అనే పౌరాణిక కథ రాశాను. చాలా చిత్రాలకు కథ, సంభాషణల్లో సహకారం అందించడం తప్ప, నా పేరుతో వచ్చినవి ఏవీ లేవు.

మరి ఇంత మంచి కథలు అందించారు కదా! మీకు ఎందుకు గుర్తింపు రాలేదు?
రావి కొండలరావు: విజయా వాళ్ల సంస్థలో పనిచేస్తుండగా వేషాలు వేయలేదు. నిర్వహణ అంతా నేనే చూసుకునేవాడిని. ‘సినిమా మీ చేతుల్లో పెడుతున్నాం. మీదే బాధ్యత. మీరు చేయలేనంటే సినిమా ఆపేస్తాం’ అనేవాళ్లు. నాపై అంత నమ్మకం ఉండేది. మన సినిమా అయితే, మనం కథలో ఏవైనా రాయొచ్చు. పేరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులకు రాయాలంటే వాళ్లను ఒప్పించాలి. చాలా మంది దర్శకులకు అనుమానాలు ఎక్కువ. బాపు, రమణగార్లకు కథ చెప్పడం వేరు. వాళ్ల టేస్ట్‌ని బట్టి వెళ్తాం. అలాంటి వాళ్లు ఎవరూ నన్ను అడగలేదు. ఇప్పటికీ నా దగ్గర కథలు ఉన్నాయి.

ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా కథలున్నాయా?
రావి కొండలరావు: ఉన్నాయి. అప్పట్లో రాసుకున్న కథలున్నాయి.. ఎవరి దగ్గరికైనా వెళ్లి ‘నా దగ్గర ఓ కథ ఉంది.. వింటారా’ అని అడిగే అలవాటు లేదు. అందుకనే వదిలేశాను.

మీ దగ్గర ఉన్న హాస్య కథ నాకు ఇస్తారా? నేను సినిమా తీస్తా!
రావి కొండలరావు: తప్పకుండా ఇస్తా. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది. వీలు కుదిరినప్పుడు నేను చెబుతా. మొత్తం హస్యమే.

మీరు నటించిన 600 సినిమాల్లో.. ‘ఈ పాత్ర రావి కొండలరావుకి మాత్రమే ఇవ్వాలి’ అనుకున్న దర్శకులు ఎవరైనా ఉన్నారా..?
రావి కొండలరావు: పుల్లయ్య తీసిన సినిమా ‘ప్రేమించి చూడు’. అప్పటివరకూ నేను వేషాల కోసం దర్శక-నిర్మాతల చుట్టూ తిరిగేవాడిని. ఆ సినిమా చేసిన తర్వాత వెంటనే సినిమాలు చేతికొచ్చాయి. అందులో నాది అక్కినేని నాగేశ్వరరావుగారి తండ్రి వేషం. అసలు విషయం ఏంటంటే, వయసులో ఆయన నాకంటే పదేళ్లు పెద్ద. ఆ వేషం గురించి ముళ్లపూడి రమణగారు నాకు చెప్పి, పుల్లయ్యగారిని కలవమన్నారు. అప్పట్లో నేను తెల్లచొక్కా.. తెల్ల ప్యాంట్‌ వేసుకుని టక్‌ చేసుకునేవాడిని. జుట్టు కూడా బాగా ఉండేది. నేను వెళ్లి ఆయనను కలిసి నమస్కారం పెట్టా. ‘సర్‌.. నాపేరు రావి కొండలరావు అండీ..! ముళ్లపూడి రమణగారు పంపారు. మీ సినిమాలో తెలుగు మాస్టారి వేషం ఉందట కదా’ అన్నా. ‘ఆఁ అయితే’ అన్నారు. ‘అదేనండీ.. నాగేశ్వరరావుగారి తండ్రి వేషమట’ అని చెప్పా. ‘ఫస్ట్‌ గెట్‌ అవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌’ అన్నారు. నాకు భయం వేసింది. ‘ఇంత చిన్నవాడికి తండ్రి వేషం ఇవ్వడానికి నాకు బుద్ధిలేదా? రాసిన ముళ్లపూడి రమణకు బుద్ధిలేదా? వేస్తానంటూ వచ్చిన నీకు బుద్ధిలేదా?’ అని కసిరారు. వేషం పోయిందనుకున్నా. ఆ తర్వాత రమణగారు, ఇతర నటులు ఆయనకు చెప్పి ఒప్పించారు. అయితే, నేను చేసేవరకూ ఆయనకు నాపై నమ్మకంలేదు. ఆ వేషం నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది.  

మీరూ రాధాకుమారి కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు?
రావి కొండలరావు: చాలా సినిమాల్లో నటించాం. కానీ ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. ఆస్ట్రేలియాలో ఉండే ఒక మిత్రుడు మేమిద్దరం కలిసి నటించిన సినిమాలను క్రోడీకరించి పుస్తకం వేశాడు. మొత్తం మేమిద్దరం భార్యభర్తలుగా కలిసి నటించిన సినిమాలు 112. నిజ జీవితంలో భార్య భర్తలై ఉండి, వెండితెరపైనా అలా కలిసి నటించిన వాళ్లలో మేమే ఎక్కువ.(వెంటనే ఆలీ అందుకుని, నేను రీసెర్చ్‌ చేసిన దాని ప్రకారం.. 127 సినిమాలు)

ఎస్వీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉండేది?
రావి కొండలరావు: ‘నర్తనశాల’కు నేను సహాయ దర్శకుడిగా పనిచేశా. అందులో ఆయన కీచకుడు. డైలాగ్‌లు ఇంటికి పంపేవాళ్లం. ఆయన చదవుతారో లేదో తెలియదు. సెట్‌కు రాగానే, ‘పంతులు.. సీన్‌ చదువు’ అనేవారు. ఒకటి రెండు సార్లు చదవగానే ఆయనకు అంతా జ్ఞాపకం ఉండేది. ఒక సినిమాలో ఆయనకు స్నేహితుడి పాత్ర వెయ్యాల్సి వచ్చింది. ‘ఒరేయ్‌’ అని పిలవాలి. నా గుండె దడదడలాడిపోయింది. ‘ఎవడు వీడు.. నన్ను ఒరేయ్‌ అంటున్నాడు. తీసి అవతల పారేయండి’ అంటారేమోనని నా భయం. ఈ విషయం దర్శకుడు సాంబశివరావు.. ఎస్వీఆర్‌కు చెప్పారు. ‘ఏం భయం లేదు.. ఒరేయ్‌ అనండి’ అన్నారు. అప్పుడు కానీ, నా మనసు కుదటపడలేదు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి కొన్ని చిత్రాల్లో నటించాం. నన్ను ఆయన బాగా ఇష్టపడేవారు. 

ఎవరో డిస్ట్రిబ్యూటర్‌ ‘భైరవ ద్వీపం’లో ప్రభుదేవా డ్యాన్స్‌ పెట్టమన్నారట!
రావి కొండలరావు: (నవ్వులు) అప్పుడు ‘జెంటిల్‌మెన్‌’లో ప్రభుదేవా ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట బాగా పాపులర్‌ అయింది. ‘మీరు భైరవద్వీపంలో ప్రభుదేవా పాట పెట్టండి. నేను సినిమా కొంటా. నేను కొంటే మిగిలిన వాళ్లూ కొంటారు’ అని అన్నాడు. ఆ సినిమాకు ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టార్‌ నృత్యాలు సమకూర్చారు. ఆయనతో పాటు ప్రభుదేవా కూడా వచ్చేవారు. ‘ప్రభుదేవా నృత్య దర్శకత్వం చేస్తే పేరు వేస్తాం కానీ, సినిమాలో ప్రభుదేవా డ్యాన్స్‌ ఎలా పెడతామండీ’ అన్నా. వాళ్ల కోరికలు అలా ఉంటాయి. అది ఉంటే సినిమా ఆడేస్తుందని వాళ్ల నమ్మకం.  కథ ప్రకారం అసలు ఎలా పెడతామనుకున్నాడో అతను. 

కాలేజీ చదువుకునే రోజుల్లో చాలామంది లవర్స్‌ ఉండేవారట!
రావి కొండలరావు: అబ్బబ్బే.. అలాంటిది ఏమీ లేదు. నన్ను ఎవరు ప్రేమిస్తారు. (మధ్యలో ఆలీ అందుకుని. ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు) నాకు ఖాళీలేదు. కాలేజీలో చేరదామనుకునేలోపే ఉద్యోగం వచ్చింది. 

మీకు 55ఏళ్లు ఉంటాయా?
రావి కొండలరావు: 55ఏళ్లా..! పొరపాటు.. ప్రస్తుతం 88నడుస్తోంది. కానీ, నేను నడవలేకపోతున్నా.  భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా!

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.