close

తాజా వార్తలు

‘నిన్ను సినిమాలో పెట్టుకోవడం నా ఖర్మ’ అనేవారు

ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా? అనిపించింది!

హిమ క్రీములు అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే చిత్రం ‘యమలీల’. యముడిగా కైకాల సత్యనారాయణతో పాటు కలిసి అలరించిన నటి లతాశ్రీ. అందంతోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకున్నారామె. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులకు చెల్లెలిగా ఆమె చేసిన పాత్రలు అందరినీ అలరించాయి. ‘పోలీస్ భార్య’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘జంబలకిడి పంబ’, ‘నెంబర్‌వన్‌’, ‘అత్తిలి సత్తిబాబు’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించి మెప్పించారు లతాశ్రీ. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారిలా..!

మీ అసలు పేరు లతాశ్రీనేనా?
లతాశ్రీ: అసలు పేరు పద్మ లత. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు శ్రీలత అని పెట్టుకున్నా. ఒక సిద్ధాంతి సూచన మేరకు పేరు మొదట్లో ఉన్న శ్రీని చివర్లో పెట్టా. అప్పటి నుంచి వరుస అవకాశాలు వచ్చాయని నమ్ముతా.

మీ సొంత ఊరు ఏది?
లతాశ్రీ: విజయవాడ. పదో తరగతిలోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చినా, ఆ తర్వాత అక్కడే ఇంటర్‌ కూడా చదివా.

మొదటి అవకాశం ఎలా వచ్చింది?
లతాశ్రీ: నూతన నటీనటులు కావాలని తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటన ఇచ్చారు. పైగా నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. చుట్టుపక్కల పిల్లల్ని మా ఇంటికి రప్పించి ఒకటే డ్యాన్స్‌లు చేసేదాన్ని. దీంతో నటనపై ఆసక్తి పెరిగింది. ఆ ప్రకటన చూసి, ఎవరికీ తెలియకుండా నా ఫొటో పంపా. ఆడిషన్‌కు రమ్మని సమాధానం కూడా వచ్చింది. ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. ఏదైనా కళలో ఉండటం అమ్మకు కూడా ఇష్టం. దాంతో ఆమె ఒప్పుకొన్నారు. మా తాతగారు సూరపనేని ప్రభాకరరావుగారు డ్రామా ఆర్టిస్ట్‌. అక్కినేని నాగేశ్వరరావుగారి ట్రూప్‌లో నాటకాలు వేసేవాళ్లు. నాకు కళ అనేది అలా వచ్చింది. 

ఇక విజయవాడ నుంచి ఆడిషన్‌కు వెళ్లి, నలుగురు హీరోయిన్లలో ఒకదానిగా సెలక్ట్‌ అయ్యా. సినిమా కూడా చేసేశా. ఆ తర్వాత పీబీ సిద్ధార్థలో ఇంటర్‌ చేరా. సినిమాలో నటించడంతో అందరిలో నేనంటే క్రేజ్‌ ఉండేది. ప్రిన్స్‌పల్‌ కూడా పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేవారు. దీంతో సినిమా ఫీల్డ్‌కు ఇంత క్రేజ్‌ ఉందా? అనిపించింది. దాంతో ఇటువైపు వచ్చేశా. నా రెండో సినిమా కాట్రగడ్డ ప్రసాద్‌గారి ‘పోలీస్‌ భార్య’. మొదట రేలంగి నరసింహారావుగారు ఒప్పుకోలేదట. ఎందుకంటే అందులో పాత్ర చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అయితే, కాట్రగడ్డగారు, ఓంకార్‌గారు ఆయనను ఒప్పించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి, ‘చాలా బాగా చేశావ్‌’ అని రేలంగి నరసింహారావుగారు మెచ్చుకున్నారు.

మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?
లతాశ్రీ: తెలుగుతో పాటు కన్నడలోనూ హీరోయిన్‌గా చేశా. దాదాపు 60కు పైగా సినిమాల్లో నటించా. ఆ తర్వాత పెళ్లయిపోయింది.

ఏ సంవత్సరంలో మీకు వివాహం అయింది?
లతాశ్రీ: 1999లో నాకు పెళ్లైంది. మాది ప్రేమ వివాహం. ఆయన జాబ్‌ చేస్తారు. అంతేకాకుండా ఫిట్‌నెస్‌ ఫీల్డ్‌లో కూడా ఉన్నారు.

మీకు ఎలా పరిచయం ఏర్పడింది?
లతాశ్రీ: నేను జిమ్‌కు వెళ్తుండేదాన్ని. ఆ పక్కనే ఆయన ఏరోబిక్స్‌ చెబుతుండేవారు. ఒకరోజు నేను కూడా ఏరోబిక్స్‌లో చేరా. అప్పుడు పరిచయం అయ్యారు. మొదట ఆయనకు నేను నటినన్న విషయం తెలియదు. అక్కడికి వచ్చేవారి ద్వారా తెలిసింది. ఆయనకు హిందీ, ఇంగ్లీష్‌ మాత్రమే వచ్చేది. మొదట ఇద్దరం ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. క్లాస్‌లో నేనంటే కాస్త కేరింగ్‌ ఎక్కువ ఉండేది. దీంతో అందరూ మా మధ్య ఏదో ఉందని అనుకునేవారు. ఒకరోజు ‘యస్‌ ఐ లైక్ హర్‌.. ఐ లవ్‌ హర్‌’ అని చెప్పేశారు. నేను షాకయ్యా. 

తొమ్మిదో తరగతిలో ఎవరో మిమ్మల్ని ఫాలో అయ్యేవారట!
లతాశ్రీ: మీకెలా తెలుసు? నేను సీతారాంపురం ప్రగతి నికేతన్‌ స్కూల్లో చదివా. నా ఫ్రెండ్‌ నేనూ, స్కూల్‌కు వెళ్తుంటే ఒకతను నన్ను ఫాలో అయ్యేవాడు. మా అమ్మగారు అక్కడ అందరికీ తెలుసు. అందుకే నా వెనుక ఎవరూ వచ్చేవారు కాదు. మొదటిసారి ఓ కుర్రాడు ఫాలో అవుతున్నాడంటే ‘వీడికి చాలా గట్స్‌ ఉన్నాయి’ అనుకున్నా. ఒక నాలుగైదు రోజులు చూశా. ఆ తర్వాత అతని దగ్గరకు వెళ్లి ‘నా వెంట పడుతున్నావ్‌ ఏంటి?’ అని అడిగితే, ‘మేడమ్‌ నేను తిరిగింది మీకోసం కాదు.. మీ ఫ్రెండ్‌ కోసం’ అన్నాడు. (నవ్వులు)..

‘నెంబర్‌వన్‌’లో కృష్ణ సోదరిగా చేశారు కదా! అందులో శివాజీరాజా వచ్చి ‘తాజ్‌మహల్‌కు దారెటు’అని అడుగుతారు. నిజ జీవితంలో అలా ఎవరైనా అడిగారా?
లతాశ్రీ: చాలా మంది అడిగారు. ‘పోలీస్‌ భార్య’ విడుదలైన తర్వాత కూడా బయటకు వెళ్తే ‘గురూ.. గురూ..’అనేవారు. ప్రతి సినిమాలో నాకో మేనరిజం ఉండేది. ‘యమలీల’కు కూడా ‘హిమ క్రీములు’ అనేవారు.

పెళ్లి తర్వాత నటించవద్దని మీ భర్త చెప్పారా?
లతాశ్రీ: ఆయన చేయొద్దని చెప్పలేదు. నేను చేస్తానని చెప్పలేదు. చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చేశా కదా! అందుకే రిలాక్స్‌ అవుదామని అనుకున్నా. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ఒకరు ఇంజినీరింగ్‌.. మరొకరు ఇంటర్‌ చదువుతున్నారు. మా చిన్నబ్బాయికి సినిమాలంటే చాలా ఇష్టం.(నవ్వులు)

ఇండస్ట్రీలో ఎంతమంది అగ్రహీరోలకు చెల్లెలిగా చేశారు?
లతాశ్రీ: చాలామంది స్టార్‌లకు చెల్లెలిగా చేశా. బాలకృష్ణగారికి మాత్రం మరదలు, ఫ్రెండ్‌గా నటించా. 

పెళ్లి తర్వాత ఏమైనా సినిమాలు చేశారా?
లతాశ్రీ: ఈవీవీ సత్యనారాయణగారి దర్శకత్వంలో అల్లరి నరేష్‌ నటించిన ‘అత్తిలి సత్తిబాబు’ చేశా. ఒక రోజు కేబీఆర్‌ పార్క్‌కు వాకింగ్‌ వెళ్తే, ఈవీవీగారు కలిసి ‘నరేష్‌ సినిమాలో చేస్తావా’ అని అడిగారు. ఇంటికి వచ్చిన నా భర్తకు విషయం చెప్పా. ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. అలా ఆ సినిమా చేశా. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ చేద్దామన్న ఆలోచన మాత్రం ఉంది. 

ఏయన్నార్‌ మిమ్మల్ని అంజలీదేవి అని పిలిచేవారట!
లతాశ్రీ: ‘యమలీల’లో నేను ఒక పాట చేశా. అందులో పైన చంద్రుడు ఉంటే, నేను మెట్లు దిగుతూ వచ్చే సన్నివేశం ఉంది. అలాంటి సీన్‌ ‘సువర్ణ సుందరి’లో కూడా ఉంది. దాన్ని చూసి నన్ను అంజలీదేవి అని పిలిచేవారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌. 

మీకు దెయ్యాలు కనిపిస్తాయట!
లతాశ్రీ: ఒక కన్నడ సినిమా షూటింగ్‌కు వెళ్లాం. ఆస్పత్రిలో సీన్‌ జరుగుతోంది. అప్పుడు రాత్రి 12.30గంటలైంది. అప్పటికే నా కాలికి దెబ్బ తగలడంతో కాస్త నడిస్తే రిలాక్స్‌డ్‌గా ఉంటుందనిపించి ఆస్పత్రి పైకి వెళ్లా. దూరంగా తెల్లచీర కట్టుకొని జడ విరబోసుకుని ఒకామె కూర్చొని ఉంది. సర్లే ఎవరో కూర్చున్నారు కదా అనుకున్నా. మరోసారి తిరిగి చూస్తే కనిపించలేదు. అంతే అక్కడ మొదలు పెట్టిన పరుగు కింద షూటింగ్‌ స్పాట్‌ వరకూ వచ్చేదాకా ఆపలేదు. ఆ తర్వాత తెలిసింది అది మార్చురీ రూమ్‌ అని.(నవ్వులు)

కైకాల సత్యనారాయణ మిమ్మల్ని ‘మా హీరోయిన్‌’ అంటారట. ఈ మధ్య ఎప్పుడైనా కలిశారా?
లతాశ్రీ: ఏడాది కిందట కలిశా. ఎప్పుడు కలిసినా ‘మా హీరోయిన్‌’ అంటారు. నేను ‘నెంబర్‌వన్‌’ చేస్తున్నప్పుడు కృష్ణారెడ్డిగారు, ‘మన తర్వాతి చిత్రంలో ఒక పాత్ర ఉంది. కొంచెం లావు అవ్వు’ అన్నారు. దీంతో బాగా తిని లావుగా తయారయ్యా. ‘ఆలీతో సినిమా చేస్తున్నా. అందులో మీది మంచి పాత్ర’ అని ఆ తర్వాత చెప్పారు. మొదట మీ (ఆలీ) పక్కన సాంగ్‌లో అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది. కైకాల సత్యనారాయణగారి పక్కన అని.

ఆయనతో చేయడం ఎలా అనిపించింది?
లతాశ్రీ: చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే ఇతర హీరోలతో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ, ఆయనతో నటించే అవకాశం మళ్లీ రాదు కదా! 

‘నమస్తే అన్న’లో మనం(ఆలీ-లతాశ్రీ) కలిసి చేశాం కదా!
లతాశ్రీ: అవును! అందులో ‘గరం గరం పోరి’ అనే పాట కూడా ఉంది. (మధ్యలో ఆలీ అందుకుని, సుద్దాల అశోక్‌తేజ రాసిన తొలి పాట అది) 

మీ దగ్గరకు వచ్చి, మీరు చేయలేకపోయిన పాత్రలు ఏవైనా ఉన్నాయా?
లతాశ్రీ: చాలా మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ముఖ్యంగా ‘పెదరాయుడు’లో శుభ శ్రీ చేసిన పాత్ర నేను చేయాల్సింది. మోహన్‌బాబుగారు పిలిచి మరీ అడిగారు. ‘నువ్వు చేస్తే మనిద్దరికీ మంచి డ్యూయట్‌ కూడా ఉంటుంది’ అని చెప్పారు. కానీ, అప్పటికే ఒప్పుకొన్న సినిమాలు ఉండటంతో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోయా. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ కూడా అలాగే మిస్‌ అయ్యా. 

‘పోలీస్‌ భార్య’ 100 రోజుల ఫంక్షన్‌లో ఎవరినో కొట్టారట!
లతాశ్రీ: అప్పట్లో ఆర్టిస్ట్‌లు ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు కదా! ఆ ఫంక్షన్‌కు వెళ్తే, చాలా మంది జనం వచ్చారు. అప్పుడు అందరం వేదికపైకి వస్తున్నాం. ఒకడు వెనక నుంచి వచ్చి నా నడుం గిల్లేశాడు. నాకు బాగా కోపం వచ్చింది. రెండోసారి మళ్లీ ముట్టుకోవడానికి వస్తుంటే చేయిపట్టుకుని తిప్పేసి, చెంప పగలగొట్టా. దీంతో అతను వాళ్ల గ్యాంగ్‌ను తీసుకొచ్చాడు. వెంటనే అక్కడే ఉన్న నరేశ్‌గారు నిజంగా హీరోలా మారిపోయారు. వాళ్లను కొట్టి, పోలీసులకు అప్పగించారు. 

శ్రీహరి మిమ్మల్ని కొట్టారట ఎందుకు?
లతాశ్రీ: శోభన్‌బాబుగారి ‘దొరబాబు’ షూటింగ్‌ అరకు వాటర్‌ఫాల్స్‌ వద్ద జరిగింది‌. అక్కడ నేను స్నానం చేసే సన్నివేశం ఒకటి ఉంది. అందులో శ్రీహరిగారు విలన్‌. నన్ను పట్టుకోవడానికి వస్తారు. పై నుంచి నేను కనిపించే సీన్లు తీశారు. ఇక కిందకు వచ్చిన తర్వాత, కెమెరామెన్‌ షాట్‌ పెట్టుకుని ‘వెనక్కి వెళ్లు.. వెనక్కి వెళ్లు’ అంటున్నారు. నేను ఏమీ పట్టించుకోకుండా నీళ్లలో వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడ చాలా లోతుగా ఉంది. కాలుజారి అందులో పడ్డా. వెంటనే శ్రీహరిగారు పైనుంచి దూకి నా జట్టు పట్టుకుని, పైకిలాకొచ్చారు. బయటకు రాగానే లాగి చెంపమీద ఒక్కటి కొట్టారు. సెట్‌లో అందరూ షాక్‌. ‘అసలు చూసుకోవా. కొంచెం ఉంటే కొట్టుకుని వెళ్లిపోయేదానివి’ అని తిట్టారు. అప్పుడు అర్థమైంది నేను చేసిన పని. కొట్టిన తర్వాత కొన్ని రోజులు ఆయనపై అలిగాను. ఆ తర్వాత నిజమే కదా! ఆయన కాపాడకపోతే, చనిపోయి ఉండేదాన్ని అనిపించింది. 

ఇండస్ట్రీలో ఒకరిని ‘అన్నయ్యా’ అంటే పెద్ద ఇష్యూ అయిందట!
లతాశ్రీ: (నవ్వులు) పేరు చెప్పనులెండీ. మా వాళ్లని, పెద్దమ్మ కొడుకులను తప్ప ఎవరినీ అన్నయ్యా అని పిలవను. ఒకసారి నేను అవుట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లినప్పుడు నా ఆరోగ్యం సరిగాలేక ఇబ్బంది పడ్డా. దాంతో తను నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చాలా జాగ్రతగా చూసుకున్నారు. నాకు బ్రదర్‌ ఫీలింగ్‌ కలిగి, ఒకరోజు ‘అన్నయ్యా’ అని పిలిచా. అది తప్పని నాకు తెలియదు. ‘నువ్వు నన్ను అన్నయ్యా అని ఎలా పిలుస్తావు. ఎదుటివాళ్లకు ఫీలింగ్స్‌ ఉండవా’ అని పెద్ద క్లాస్‌ పీకాడు. నేను చాలా సెన్సిటివ్‌. నాకేమో ఏడుపు వచ్చేసింది. ఆ తర్వాత అమ్మ ఆయనకు క్లాస్‌ పీకింది.

మీకు అంతా అమ్మే కదా! ఆమె వల్ల ఏం పొందారు? ఏం పోగొట్టుకున్నారు?
లతాశ్రీ: చిన్న వయసులో ఇండస్ట్రీకి రావడంతో అన్ని విషయాలూ ఆమే చూసుకునేది. దీంతో నాకు బయట ప్రపంచం గురించి తెలియదు. ఎవరితోనూ తను మాట్లాడనిచ్చేది కాదు. దానివల్ల ఎవరు మంచివాళ్లు. ఎవరు చెడ్డవాళ్లని తెలిసేది కాదు. అందుకే ఎవరితోనూ నాకు గొడవలు కూడా వచ్చేవి కావు. గతేడాది ఆమె చనిపోయారు. నాకు ఒక్కసారిగా ప్రపంచం తల్లకిందులైనట్లు అనిపించింది. అయితే, మా అమ్మ మీద పూర్తిగా ఆధారపడటం కూడా తప్పనిపించింది. అన్ని విషయాలు నన్ను నేర్చుకోమన్నా, ‘నువ్వు ఉన్నావ్‌ కదా’  అనేదాన్ని. ఆమె చనిపోయిన తర్వాత చాలా మందిని నమ్మి, వాళ్లు ఏమడిగితే అది ఇచ్చేసేదాన్ని. అలా ఏడాదిలో చాలా నష్టపోయా. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. 

తల్లి పాత్రలు చేయడం ఇష్టమేనా?
లతాశ్రీ: తప్పకుండా చేస్తా! మరీ పెద్ద హీరోలకు అంటే చేయలేను. (వెంటనే ఆలీ అందుకుని, పెద్ద హీరోలంటే ఎవరు? నాగేశ్వరరావుగారు, రామారావుగారా?) ఆడియన్స్‌ చూస్తారంటే తప్పకుండా చేస్తా. 

ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని ఎప్పుడైనా అనిపించిందా?
లతాశ్రీ: ఎప్పుడూ అనిపించలేదు కానీ, ఒక మలయాళ చిత్రానికి మాత్రం అలా అనిపించింది. ఆ సినిమా చేయలేదు. చేయనని చెప్పి వచ్చేశా. అందులో మమ్ముట్టి హీరో. వెళ్లిన రెండు మూడు రోజులు బాగుంది. ఆ తర్వాత నేను ఏది చేసినా, డైరెక్టర్‌ ఓకే అనేవాడు కాదు. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. ఐదారు రోజులు షూటింగ్‌ అయిన తర్వాత వచ్చేశా. ఆ తర్వాత ఆ పాత్రను దివ్యవాణి చేశారు. అయితే, పీసీరెడ్డిగారు తన సినిమాల్లో అవకాశం ఇస్తూనే, ‘నిన్ను సినిమాలో పెట్టుకోవడం నా ఖర్మ’ అని అని తిట్టుకుంటూ ఉండేవారు(నవ్వులు). మళ్లీ పిలిచి ఇంకో సినిమా ఆఫర్‌ ఇచ్చేవారు. చాలా మంచి దర్శకుడు. ఆయనతో హిందీలో ‘గౌతమ బుద్ధ’ చేశా. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానం
దెయ్యం: భయం
అమ్మ: ప్రాణం
ప్రేమ: మనిషికి కావాలి
జీవితం: చాలా నేర్పింది
రేలంగి నరసింహరావు:
నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌కు కారణం 
ఎస్వీ కృష్ణారెడ్డి: నేను పైమెట్లు ఎక్కడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి.
ఈవీవీ: దేవుడు
చెల్లి పాత్ర: ఆత్మ సంతృప్తి
సూపర్‌స్టార్‌ కృష్ణ: మా అన్న
కైకాల సత్యనారాయణ : అందరికీ యముడు. నేను మాత్రం ఆయనకు ప్రేమికురాలిని
తాజ్‌మహల్‌: ఇప్పటివరకూ దారి తెలియదు. 

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.