close

తాజా వార్తలు

అందుకే ఆమె గుర్తుగా లాకెట్‌ వేసుకుంటా

బాలకృష్ణ అభిమాని ఫోన్‌ చేసి పెళ్లిచేసుకుంటానన్నారు

వాసుకి.. అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ‘అసెంబ్లీ రౌడీ’ చూసిన వారెవరైనా ‘పాకీజా’ని మర్చిపోరు. ఆ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో ఈ జోడీ ఎన్నో నవ్వులు పంచింది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హాస్యనటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాసుకీ ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. 

వాసుకీ ఎలా ఉన్నారు?
వాసుకీ: బాగున్నాను. మనం(ఆలీ) కలిసి చాలా రోజులైంది. ‘సీతారత్నంగారి అబ్బాయి’కి కలిసి పనిచేశాం. ఆ తర్వాత మళ్లీ అవకాశం రాలేదు. అప్పుడు మీరు చిన్నకుర్రాడు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఇప్పటికీ నేనూ కుర్రాడినే.. నవ్వులు)

మెడలో జయలలిత లాకెట్‌ ఉంది? కారణం ఏదైనా ఉందా?
వాసుకీ: నేను అన్నాడీఎంకే అధికార ప్రతినిధిని. జయలలిత బతికి ఉండగా, నన్ను పార్టీలోకి తీసుకుని, నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చి, స్టార్‌ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటారు. అందుకే ఆమెకు గుర్తుగా లాకెట్‌ వేసుకుంటా. 

మీ సొంత అమ్మకన్నా, జయలలిత ఎక్కువా?
వాసుకీ: అవును! మా అమ్మ నాకు కేవలం జన్మ మాత్రమే ఇచ్చింది. నాకు చదువు చెప్పడం, భోజనం పెట్టడం అన్నీ జయలలిత గారే. 

వాసుకి అనే పేరు ఎంజీఆర్‌ పెట్టారట!
వాసుకీ: మా నాన్న ఎంజీఆర్‌ దగ్గర పనిచేసేవారు. అప్పుడే నేను పుట్టాను. ఆయన దగ్గరకు తీసుకెళ్తే, ‘వాసుకి’ అని పేరు పెట్టారు. 

‘అసెంబ్లీ రౌడీ’కన్నా ముందు ఏదైనా సినిమాలో నటించారా?
వాసుకీ: ‘అసెంబ్లీ రౌడీ’లో నేను పాకీజాగా చేసిన పాత్రను తమిళంలో ప్రముఖ హాస్యనటుడు గౌండమణితో చేశా.
అందులో సత్యరాజ్‌గారు హీరో. అదే సినిమాను మోహన్‌బాబు చేశారు.  తమిళంలోనే నేను చేసిన పాత్రను తెలుగులోనూ నాతోనే వేయించారు. 

ఆ సినిమా తర్వాత మీరు పాపులర్‌ అయ్యారు కదా!
వాసుకీ: పాకీజా అనే పేరు స్థిరపడిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నటుల దగ్గరి నుంచి అందరూ ‘పాకీజా.. పాకీజా’ అంటూ పిలవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ నన్ను పాకీజాగానే గుర్తుపడతారు. ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్తే, ‘పాకీజా వచ్చింది.. పాకీజా వచ్చింది’ అంటూ గోలగోల చేశారు. నేను ఈ కార్యక్రమానికి వస్తుంటే కూడా కొందరు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారా? అంటూ అడిగారు. 

మీ అమ్మగారు ఇంకా ఉన్నారా?
వాసుకీ: ఇప్పుడు లేరు. క్యాన్సర్‌తో చనిపోయారు. మా అమ్మ వైద్యానికి మీరు(ఆలీ), మోహన్‌బాబుగారు, బ్రహ్మానందంగారు తలో కొంత సాయం చేశారు. ఇంటికి నేనే పెద్ద. నాకు అన్నదమ్ములెవరూ లేరు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను తమిళనాడులో పుట్టినా, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు అంటేనే ఎంతో ఇష్టం. 

తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు?
వాసుకీ: 52 సినిమాలు చేశా. ‘అసెంబ్లీరౌడీ’తో మొదలు పెట్టి చాలా హిట్‌ సినిమాల్లో నటించా. రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో ‘అన్నమయ్య’లో నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. అందులో నేను తనికెళ్ల భరణిగారి పక్కన నటించా. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాల్లో నాకంటూ ఒక పాత్ర ఉండేది. 

జయలలిత చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?
వాసుకీ: జయలలిత నాకు మాత్రమే కాదు.. మొత్తం తమిళనాడుకే అమ్మ. రోజూ అన్నం తింటున్నామంటే, మంచి బట్టలు వేసుకుంటున్నామంటే ఆమె దయే. దేవుడిని పూజించినట్లే ఇప్పటికీ అమ్మను పూజిస్తాం. అమ్మని గుర్తు చేసుకోని రోజంటూ లేదు. 

వాసుకి ఆర్థికంగా బాగానే ఉన్నారా?
వాసుకీ: అమ్మ దయతో ఆర్థికంగా ఫర్వాలేదు. ఉండటానికీ, తినడానికీ ఎలాంటి ఇబ్బంది లేదు. 

మీరు వివాహం చేసుకున్నారా?
వాసుకీ: లేదు. అమ్మకు క్యాన్సర్‌ రావడంతో ఆమెను చూసుకోవడంపైనే నా దృష్టంతా ఉండేది. వచ్చిన సంపాదన  వైద్య ఖర్చులకే అయ్యేది. ఆ తర్వాత చెల్లి పెళ్లి చేశాను. కుటుంబ బరువు, బాధ్యతలు నాపై పడ్డాయి. నన్ను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదన చూసి చేసుకుంటే కష్టం కదా! అందుకే చేసుకోలేదు. 

డబ్బును చూసి పెళ్లి చేసుకున్న వారిని ఎవరైనా చూశారా?
వాసుకీ: మా బంధువుల విషయంలోనే అలా జరిగింది. అది చూసే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నా. ఇప్పుడు నేను హాయిగా ఉన్నా. పెళ్లి చేసుకోలేదు కాబట్టి, నేను మహారాణిలా ఉన్నా. నేను ఇక్కడ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ‘ఐ లవ్యూ పాకీజా’ అంటూ నాకు ఫోన్‌లు చేసేవారు. బాలకృష్ణ అభిమాని ఒకరు ఫోన్‌చేసి  ‘మా బాస్‌ బాలయ్యబాబు మనకు అండగా ఉంటారు. మనం పెళ్లి చేసుకుందాం’ అన్నారు. కానీ, చేసుకోలేదు.(నవ్వులు) 

భవిష్యత్‌లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు?
వాసుకీ: మా చెల్లెలి పిల్లలకి చదువు చెప్పించి, కన్నబిడ్డల్లా చూసుకున్నా. వారే నన్ను చూసుకుంటారని నమ్మకం. ఏది ఏమైనా దేవుడు అనే వాడు ఉన్నాడు. వాడే మనల్ని ఆదుకుంటాడు. 

స్కూల్లో ఉండగా, టీచర్ల చేతిలో బాగా దెబ్బలు తినేవారట!
వాసుకీ: స్కూల్‌కి వెళ్లమంటే వెళ్లేదాన్ని కాదు. పైగా అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్‌. మా నాన్నగారు నాకిచ్చే 50పైసలు పెట్టి చాకెట్లు బిస్కెట్లు కొనుక్కొని, అందరికీ పంచేదాన్ని. స్కూల్‌ ఎగొట్టి తిరిగేదానిని. టీచర్‌కు దొరికిపోతే చేతులు వాచేలా కొట్టేవారు. నేను పదో తరగతి వరకూ చదివా.

‘అసెంబ్లీ రౌడీ’ చేస్తుండగా, బ్రహ్మానందంకు మీకూ యాక్సిడెంట్‌ అయ్యిందట!
వాసుకీ: ఆ సినిమా షూటింగ్‌ కోసమని చిత్తూరు వెళ్లాం. అక్కడ మోహన్‌బాబుగారి స్నేహితుడి ఇంట్లో ఉండేవాళ్లం. నాతో టాయ్‌లెట్లు కడిగే సీన్‌ తీసిన తర్వాత బ్రహ్మనందంగారు మద్రాసు వెళ్లాలని మోహన్‌బాబుగారితో చెప్పడంతో, నన్ను కూడా అదే కారులో తీసుకెళ్లమన్నారు. రాత్రి 9గంటలకు బయలు దేరాం. కారు ఎక్కగానే డ్రైవర్‌కు అన్ని జాగ్రత్తలు చెప్పారు బ్రహ్మానందంగారు. అంతా బాగానే ఉందని చెప్పాడతను. బ్రహ్మానందంగారు అలసిపోయి ఉండటంతో వెనుక సీటులో నిద్రపోతానని చెప్పారు. నేను ముందు సీటులో కూర్చున్నా. మధ్యమధ్యలో నేనూ కునికిపాట్లు పడుతున్నా. కొంచెం దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌పై అనుమానం వచ్చింది. కారు సరిగా నడపడం లేదని అర్థమైంది. ఈ విషయాన్ని బ్రహ్మానందంగారికి చెబుదామంటే ఆయన మంచి నిద్రలో ఉన్నారు. ఇంతలోనే లారీ వచ్చి మా కారును ఢీకొట్టింది. నేను చనిపోయానని అనుకున్నా. బ్రహ్మానందంగారు ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి, డ్రైవర్‌ రెండు చెంపలూ వాయించేశారు. అప్పటి నుంచి బ్రహ్మానందంగారు కారులో లాంగ్‌ జర్నీ మానేశారు. నేను కూడా రాత్రి సమయాల్లో కారు ప్రయాణం అస్సలు చేయను. మరో ఘటన వల్ల కూడా చాలా భయపడిపోయా. మోహన్‌బాబుగారి ‘శ్రీరాములయ్య’ సినిమాలో నాకు పాత్ర లేదు. అయినా, కూడా ఆయన రమ్మంటే వచ్చా. షూటింగ్‌ ప్రారంభం రోజునే బాంబు పేలింది. భయంతో వణికిపోయా. 

తెలుగులో 52 సినిమాలు చేశారు కదా! ఎందుకు గ్యాప్‌ వచ్చింది? 
వాసుకీ: అమ్మ(జయలలిత)తో కలిసి నేనూ రాజకీయాల్లోకి వచ్చాను కదా! అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. చాలా మంది దర్శకులు నాకు మంచి పాత్రలు ఇచ్చారు.  

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మీకు ఏది ఇష్టం.
వాసుకీ: తెలుగు చిత్ర పరిశ్రమ అంటేనే ఇష్టం. గతంలోనూ నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఇప్పటివరకూ నాకు ఆపద వస్తే, ఎవరో ఒకరు సాయం చేశారు. ఇక నుంచి నా కాళ్లపై నేను బతకాలి. అందుకు మళ్లీ నటించాలని అనుకుంటున్నా. 

ఏదో ఒక సినిమా షూటింగ్‌కు వెళ్తుంటే, ‘పాకీజా బయటకు రావాలి’ అంటూ నినాదాలు చేశారట!
వాసుకీ: అప్పుడు ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నారు. నేను ‘బ్రహ్మ’ సినిమా షూటింగ్‌ కోసమని వస్తున్నా. విజయవాడలో రైలు ఆగింది. ‘పాకీజా బయటకు రావాలి.. పాకీజా బయటకు రావాలి’ అంటూ తెగ తలుపులు కొట్టారు. అదే రైలులో ఎన్టీఆర్‌ కూడా ఉన్నారు. అరుపులు విని, ‘ఏంటీ బయట అరుపులు వినిపిస్తున్నాయి’ అని అడిగారట. ‘పాకీజాను చూడాలి’ అని అభిమానులు గోల చేస్తున్నారని చెప్పారట. ‘పాకీజా ఎవరు’ అని అడిగారట. అంతకుముందే ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’ సినిమాలకు ఆయన చేతుల మీదుగానే షీల్డ్‌ తీసుకున్నా. ఆ విషయం ఆయనకు గుర్తులేదు. నేను నేరుగా వెళ్లి, ఆయన కాళ్లకు నమస్కారం చేశా. చాలా బాగా మాట్లాడారు. ఆయనను కలవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.

ఒకానొక సందర్భంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు?
వాసుకీ: నేను మొదటి నుంచి కామెడీ యాక్టర్‌ను కావడంతో నాకు అన్నీ కష్టాలే. చాలా సందర్భాల్లో అమ్మ సహాయం చేశారు. కానీ, తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడే నేను ఆర్థికంగా నిలదొక్కుకున్నా.  అయితే, ఆ తర్వాత అమ్మకు క్యాన్సర్‌ అని తెలియడంతో కాస్త కష్టాలు పడ్డాను. నడిగర్‌ సంఘం నుంచి కూడా నాకు పెద్దగా  సహాయం అందలేదు. అమ్మ(జయలలిత) దగ్గరకు కూడా ఒకటి రెండు సార్లు వెళ్లాం. కానీ, ప్రతిసారి వెళ్లి అడగాలంటే బాగుండదు కదా! ఉన్న విలువ పోతుంది. ఈ కష్టాలన్నీ భరించడం ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అయితే, దేవుడు ఇచ్చిన జన్మను ఆత్మహత్యతో ముగించడం తప్పని అనుకున్నా. హైదరాబాద్‌కు వచ్చి, ఆలీ, బ్రహ్మానందం, మోహన్‌బాబుగారు, బాలకృష్ణగారు ఇలా ఎవరి కాళ్లు పట్టుకున్నా అవకాశం ఇస్తారు కదా అనిపించింది. 

బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట!
వాసుకీ: సెట్‌లో ఆడవాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు. అక్కా, చెల్లితో ఏవిధంగా ఉంటారో అంతే మర్యాదగా ఉంటారు. ఒకసారి ఆర్టిస్టులందరూ ఉన్న విమానం ప్రమాదానికి గురైంది కదా! అప్పుడు ఆయన పరిచయం అయ్యారు. చాలా బాగా మాట్లాడారు.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
వాసుకి: ఎంజీఆర్‌గారు పెట్టిన పేరు. ఎప్పటికీ మర్చిపోలేను.
పాకీజా: మోహన్‌బాబుగారు ఇచ్చిన అవకాశంతో వచ్చిన పేరది.
జయలలిత: అమ్మకంటే ఎక్కువ.
మోహన్‌బాబు: నా గురువుగారు.
బ్రహ్మానందం: ఆయనంటే చాలా ఇష్టం. ఆయనతో 18 సినిమాల్లో నటించా.

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.