close

తాజా వార్తలు

 ఏ భార్య-భర్త కూడా అలా పాడుకోరు!

‘ముసుగు వేయొద్దు మనసు మీద..’ అంటూ ఆమె పాడితే కుర్రకారు ఊగిపోయారు.. ‘ధీవరా.. దరికి రారా’ అంటూ ఈమె పాడితే ‘బాహుబలి’ సైతం కొండలు.. కోనలు దాటుకుంటూ వచ్చేశాడు. ఒకరిది శతకోటి మధురమైన కంఠాల శబ్దాల అలంకరణ అయితే.. మరొకరిది మధురమైన శబ్దాల సప్త స్వరాలుగా మలిచే రమ్యమైన ఆవిష్కరణ. వారే గాయనిలు కల్పన, రమ్య బెహర. అందుకే వారు సంగీతంలో సంపూర్ణ గాత్రమయ్యారు. ప్రతి గీతంలో సంగీతంలా సాగిపోయారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి ఒకరు పల్లవిలా. మరొకరు చరణంలా మారి.. వినసొంపైన పాటలు.. మాటలతో అలరించారు..

మీలో చాలా టాలెంట్‌లు ఉన్నాయని విన్నాం!
కల్పన: చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా. పాటలు పాడతా, యాంకరింగ్‌ చేస్తా, కీబోర్డ్‌, గిటార్‌ వాయించడం తెలుసు. (నవ్వులు)

సునీత మీకు ఏమవుతారు?
రమ్య బెహర: దేవుడు ఇచ్చిన అమ్మ. మా ఇద్దరికి దగ్గర పోలికలు ఉంటాయని బాల సుబ్రహ్మణ్యంగారు అలా చెప్తారు. (మధ్యలో అలీ అందుకుని.. సునీత.. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు. మంచి అబ్బాయిని చూసి చేసేయండి) ఎందుకు సార్‌.. హ్యాపీగా ఉండనివ్వండి. 

ఇటీవల ఏ సినిమాకు పాడారు?
కల్పన: ఒక తమిళ సినిమాకు పాడా. నాకు సినిమాల్లో పాడే అవకాశం ఎక్కువ రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘స్వరాభిషేకం’ మంచి వేదికలా దొరికింది. రికార్డింగ్స్‌లో ఎవరైనా పాడతారు. లైవ్‌లో పాడితేనే ఒక సింగర్‌ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఏ భాషలోనూ అలా జరగలేదు. ఒక్క తెలుగు, అదీ ఈటీవీలో జరిగింది. 

ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?
కల్పన: హైదరాబాద్‌కు మారిపోయి ఏడాది దాటిపోయింది. ఇక్కడ ఉండటం నాకేమీ కొత్తగా లేదు. త్వరగా అలవాటైపోయింది. చాలా సంతోషంగా ఉన్నా.

బాల సుబ్రహ్మణ్యంను మీరు డాడీ అని పిలుస్తారట!
కల్పన: మా నాన్నగారి పేరు పీఎస్‌ రాఘవేంద్ర. మా నాన్నకు పెళ్లికాకముందు నుంచే బాలుగారు ఫ్రెండ్. వాళ్లిద్దరూ కాలేజ్‌మేట్స్‌. కాలేజ్‌ కాంపిటీషన్స్‌, ఇతర షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. మా నాన్నగారి ట్రూప్‌లో కూడా బాలుగారు పాడారు. మా నాన్నగారిది తిరువయ్యూరు. నేను చెన్నైలో పుట్టా. 

మరి ఆర్టిస్ట్‌ ఎలా అయ్యారు?
కల్పన: మా అమ్మమ్మకు నటన అంటే చాలా ఇష్టం. నాకు మూడేళ్ల వయసు ఉండగానే డ్యాన్స్‌ నేర్పించారు. అప్పట్లో మలయాళంలో ‘ఈనాడు’ అనే సినిమా తీశారు. దానికి మా అమ్మమ్మ నన్ను ఆడిషన్స్‌కు తీసుకెళ్లారు. మొత్తం 28మంది పిల్లలను ఆడిషన్‌ చేస్తే నేను సెలక్ట్‌ అయ్యా. అయితే, మొదట నేను చేసిన సీన్లు ఏవీ నాకు ఇప్పుడు గుర్తులేవు. దాదాపు ఒక పాతిక సినిమాల్లో నటించి ఉంటానేమో. 

పెద్దయ్యాక సినిమా అవకాశాలు రాలేదా?
కల్పన: వచ్చాయి. కానీ దృష్టి పెట్టలేకపోయా. చదువుతో పాటు గిటార్‌, వీణ, మ్యూజిక్‌ ఇలా వరుస క్లాస్‌లకు వెళ్లేదాన్ని. అన్నీ మేనేజ్‌ చేయలేకపోయా. పైగా, ఒక సన్నివేశం కోసం గంటల తరబడి ఎండలో ఉండాల్సి వచ్చేది. పెద్ద పెద్ద నటులకు గొడుగులు పట్టుకుని, టచప్‌ చేసే వాళ్లు ఉంటారు. కానీ, నాలాంటి ఎదుగుతున్న నటులకు సహాయకులు ఉండరు కదా! అందుకే నటించకూడదని అనుకున్నా. కొన్ని చారిత్రక సినిమాలు చేసే సమయంలో ఐరన్‌ బెల్ట్‌లు పెట్టి లాక్‌ చేసేవారు. టాయ్‌లెట్‌కు వెళ్లడానికి కూడా ఉండేది కాదు. దాంతో విరక్తి వచ్చేసింది. 

కల్పన అనగానే ఫైర్‌ బ్రాండ్‌ అంటారేంటి?
కల్పన: నేను పుట్టిన తంజావూరు పక్కనే శివకాశి ఉంది. బహుశా అందుకే అంటారేమో. (నవ్వులు)

రమ్య బెహర అంటే నార్త్‌ ఇండియన్‌ అనుకుంటారు? అసలు మీ సొంత ఊరు ఏది?
రమ్య బెహర: మా తాతముత్తాలు ఎప్పుడో 100 సంవత్సరాల కిందటే ఒడిశా నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేటకు వచ్చేశారట. నేను అక్కడ పుట్టాను. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. 

పైకి సాఫ్ట్‌గా కనిపించే రమ్య బెహర లోపల సూర్యకాంతం ఉందని అంటారు!
రమ్య బెహర: నేను ‘రేసు గుర్రం’లో శ్రుతిహాసన్‌ టైపు. లోపల ఎమోషన్స్‌ ఉంటాయి కానీ, బయటకు రానీయను. నన్ను ఎవరైనా ఏదైనా అంటే  లోపల కోపం రగలిపోతుంటుంది(నవ్వులు). సూర్యకాంతం కాదు కానీ, నేను కాస్త రెబల్‌.. లేడీ రెబల్‌ అన్నమాట. 

మీకు ఏ సినిమాకు మంచి పేరు వచ్చింది?
కల్పన: తమిళంలో ఇళయరాజాగారి సంగీత దర్శకత్వంలో చేసిన ‘పోడా పోడా..’ పాటకు మంచి పేరు వచ్చింది. అంతకుముందు నేను ఏడెనిమిది పాటలు పాడి ఉంటాను. శంకర్‌గణేష్‌ సర్‌ నన్ను గాయకురాలిగా పరిచయం చేశారు. తెలుగు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని పాటలు పాడాను. అవి అంతగా హిట్‌ కాలేదు. 1999 మణిశర్మగారి దగ్గర ఆయన టీమ్‌లో చేరా. అప్పుడు జగపతిబాబుగారు నటించిన ‘మనోహరం’లో వేటూరి సాహిత్యం అందించిన ‘మంగళగౌరికి మనసున్న’  పాటను ఆలపించా. ఆ తర్వాత మహేశ్‌ నటించిన ‘వంశీ’లో ‘సరిగమపదనిసరి..’ అంటూ సాగే పాటను బాలూగారితో కలిసి పాడా. అప్పుడు దేవిశ్రీ అన్న అక్కడకు వచ్చి, ‘ఆనందం’ సినిమాలో ‘మోనాలిసా.. నా సిస్టరే’ సాంగ్‌కు ట్రాక్‌ పాడాలని చెప్పారు. వెళ్లి పాడాను. చివరకు నా వాయిస్‌ ఉంచేశారు. అప్పటి నుంచి మణి సర్‌, దేవి అన్న దగ్గర వరుసగా పాటలు పాడుతూ వచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను తమిళం కన్నా తెలుగు పాటలే పాడా. మొత్తం కెరీర్‌లో 1500 పాటలకు పైగా పాడా. 

బాగా బ్రేక్‌ ఇచ్చిన పాట ఏది?
కల్పన: ‘ముసుగు వేయొద్దు మనసు మీద’,(ఖడ్గం) ‘గోంగూర తోటకాడ కాపు కాసా..’(వెంకీ), ‘అమ్మడు అచ్చీ..’ (ఇంద్ర), ‘దొండ పండులాంటి పెదవే నీది..’(పెళ్లాం ఊరెళితే)

మీరు మొదటిసారి పాడిన పాట?
రమ్య బెహర: మీనా గారు నటించిన ‘వెంగమాంబ’ సినిమాలో మొదటిసారి పాడా. ఆ తర్వాత నాగార్జునగారు నటించిన ‘రాజన్న’ లో చిన్న పాపకు పాడా. అప్పటి నుంచి వరుసగా పాటలు పాడుతూనే ఉన్నా.

రమ్యకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏది?
రమ్య బెహర: ‘బాహుబలి’లో ‘ధీవరా..’ పాటకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 200లకు పైగా పాటలు పాడి ఉంటా. 

జస్టిన్‌ బీబీర్‌ (కెనడియన్‌ పాప్‌ సింగర్‌)కు ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని ఏడ్చారట!
రమ్య బెహర: జస్టిన్‌ బీబీర్‌ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ అయిందని ఏడవలేదు కానీ, చాలా రోజులు బాధపడ్డా. ఆయన పాడిన పాటలు విని ఇంగ్లీష్‌ పాటలు పాడటం నేర్చుకున్నా. 

మీరు చాలా సార్లు యూఎస్‌ వెళ్లారు కదా! బీబీర్‌ను కలవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా?
రమ్య బెహర: లేదు. (మధ్యలో ఆలీ అందుకుని.. నాకు చెప్పి ఉంటే నేను సెట్‌ చేసి ఉండేవాడిని) ఇప్పటికీ మించిపోయింది లేదు.(నవ్వులు) బీబీర్‌ కాకుండా అర్జీత్‌ సింగ్‌, ఆయన పాటలూ ఇష్టమే.

పవర్‌స్టార్‌ అంటే చాలా ఇష్టమట!
రమ్య బెహర: చాలా ఇష్టం. అయితే, ఆయన్ను నేరుగా కలిసే అవకాశం కానీ, ఆయన సినిమాలో పాటలు పాడే ఛాన్స్‌ కానీ రాలేదు. ఆడియో విడుదల వేడుకల్లో దూరం నుంచి చూశానంతే. 

కీరవాణితో అమెరికా వెళ్లినప్పుడు మీకు మీరే పరిచయం చేసుకున్నారట!
రమ్య బెహర: అవును. 2013లో అప్పటికి నేను పెద్దగా పాటలు పాడలేదు. అయితే, కీరవాణిగారు నన్ను కూడా అమెరికా తీసుకెళ్లారు. అప్పుడు నా గురించి ఆయన రాసిన పరిచయ పాటను ప్రతి వేదికపైనా పాడమన్నారు. దానికి బాగా రెస్పాన్స్‌ వచ్చింది. 

‘చిట్‌ చాట్‌ చాయ్‌’లో ఒక ప్రత్యేకమైన టీ మాత్రమే తాగుతారట!
రమ్య బెహర: నాకు టీ, కాఫీలంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని ‘చిట్‌ చాట్‌ చాయ్‌’లో చాలా వెరైటీలు ఉన్నాయి. అందులో బ్యూటీకి సంబంధించిన టీ ఉంటే ఆర్డర్‌ చేశా. అది తాగాను. ఏమీ కాలేదు. హిందీ సీరియల్‌ నటుడు పార్థ్‌ సమ్‌థాన్‌ అంటే ఇష్టం. ఒక రకంగా ఫస్ట్‌ క్రష్‌(మధ్యలో ఆలీ అందుకుని మరి ఇందాక జాన్‌ బార్బరే అన్నావు) సర్‌.. జాన్‌ బార్బరే కాదు.. జస్టిన్‌ బీబీర్‌.. (అయితే, చాలా మందిని లైన్‌లో పెట్టావుగా.. నవ్వులు) ఆయన తర్వాత బురాగ్‌ డెన్నిస్‌ అని టర్కీ సీరియల్స్‌లో చేసే నటుడు ఇష్టం. 

మీకు వచ్చిన బెస్ట్‌ ప్రపోజల్‌ ఏంటి?
రమ్య బెహర: నాకు ఏ ప్రపోజల్‌ బెస్ట్‌గా అనిపించలేదు. 

ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారా?
కల్పన: చాలా ఉన్నాయి. ఇందాక మీరు ఫైర్‌ బ్రాండ్‌ అన్నారు కదా! కొన్ని విషయాల్లో నేను ఫైర్‌ బ్రాండే. నేనొక భిన్నమైన వ్యక్తిని. ఎవరికైనా చెడు జరిగితే, అందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉందా? అని ఆలోచిస్తా. దాని నుంచి నేను ఏం నేర్చుకున్నానని కూడా విశ్లేషించుకుంటా. ఈ దృష్టికోణం నుంచే నేను ఆలోచిస్తా. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. నేను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు కాస్త ఫన్నీగా ఉంటాయి. బాగా తెలివైన వారితో పనిచేయవచ్చు. అస్సలు ఏమీ తెలియని వారితోనూ పనిచేయవచ్చు. కానీ, సగం సగం తెలిసిన వారితో పనిచేయాలంటే చాలా కష్టం. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ నేను పేర్లు చెప్పను. ఇళయరాజా సర్‌లాంటి గొప్ప సంగీత దర్శకులు చెప్పింది పాడితే చాలు.. యూనివర్సిటీలో గోల్డ్‌ మెడల్‌ కొట్టినట్లే. ‘మేడమ్‌ మాకు అంతగా తెలియదు మేడమ్‌. మీరే ఎలాగో అడ్జస్ట్‌ చేసుకుని పాడాలి’ అని ఎవరైనా అడిగినా పాడవచ్చు.

మధ్యలో ఉన్న వాళ్లు బుర్ర తినేస్తారు. అలా ఒకసారి జరిగింది. ఒక తమిళ సినిమా రికార్డింగ్‌లో పేపర్‌ను విసిరేసి స్టూడియో నుంచి వెళ్లిపోయా. కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌లో ద్వంద్వార్థాలు ఉంటాయి. ఆ సన్నివేశానికి తగట్టు జనాలు చూస్తారు కాబట్టి, పాడక తప్పదు. కానీ, భార్యభర్తల మధ్య ప్రేమగీతం వచ్చే సమయంలోనూ బూతులతో కూడిన సాహిత్యంతో పాటలు రాస్తారు. అసలు ఏ భార్య-భర్త కూడా అలా పాడుకోవాలని అనుకోరు. అలా ఉంటాయి ఆ పాటలు. అంత జుగుప్సాకరమైన పదాలు అవసరం లేదనిపిస్తుంది. రెండు, మూడు పాటలు అలా వస్తే, మధ్యలోనే వదిలేసి వచ్చేశా. ‘మీరు ఏమైనా సుశీలా.. జానకీనా.. పోజ్‌ కొడుతున్నారేంటి’ అని అడిగిన వాళ్లూ ఉన్నారు. ‘మీకు ఈ పాట సుశీలమ్మ, జానకమ్మ పాడతానంటే వాళ్లతోనే పాడించుకో. నన్నెందుకు పిలుస్తున్నారు’ అని వచ్చేశా. ఆ ఇద్దరిపై వాళ్లకన్నా నాకే ఎక్కువ అభిమానం ఉంది.
కొందరు పాపం డబ్బు అవసరం కోసం పాడతారు. వాళ్లకు తప్పదు. కానీ, నేను అలా పాడలేను. ఇటీవల నేను ఇంకో సమస్య ఎదుర్కొన్నా. పాడటానికి వస్తే, మేకప్‌ వేసుకుని, మంచి చీర కట్టుకుని రావాలట. నా చిన్నప్పటి నుంచి సుశీలమ్మను చూస్తూ పెరిగా, ఒక్కసారి కూడా ఆమె ఖరీదైన చీర కట్టుకుని పాటలు పాడటానికి రాలేదు సరికదా, చెవులకు దిద్దులు కూడా లేకుండా వచ్చి పాడిన సందర్భాలు ఉన్నాయి. 
మీరు ఒక విమానంలో అమెరికా వెళ్తే, మీ సామాన్లు ఇంకో విమానంలో వస్తాయట!
కల్పన: (నవ్వులు) నేను విదేశాలకు వెళ్తే, బయట ప్రదేశాలు చూడటానికి పెద్దగా వెళ్లను. బుక్స్‌, మ్యూజిక్‌ ఉంటే చాలు.. నాకు టీవీ, రేడియో ఏదీ అవసరం లేదు. ఎన్ని రోజులైనా ఉండిపోతా. నాకు చలి అంటే పడదు. అందుకే కాస్త ఎక్కువగా బట్టలు ఉంటాయి. 

రమ్య.. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భం ఉందా?
రమ్య బెహర: ఒక్కసారి జరిగింది అలా.. ఇంకెప్పుడూ రాలేదు. 

చిన్నప్పుడు జ్వరం వస్తే, టాబ్లెట్లు వేసుకునేవారు కాదట!
రమ్య బెహర: టాబ్లెట్లు వేసుకోవాలంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు ఒకసారి నాకు వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. టాబ్లెట్లు వేసుకుంటే గొంతులో ఇరుక్కుపోతాయని భయం వేసి, దిండు కింద.. దుప్పటి కింద దాచేసేదాన్ని. ఒకరోజు అమ్మ పక్క దులుపుతుంటే చాలా టాబ్లెట్లు కింద పడ్డాయి. దీంతో అమ్మ బాగా తిట్టింది. అప్పటి నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నా. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

రమ్య కల్పన
జస్టిన్‌ బీబీర్‌: బీబీర్‌ ఫ్యాన్స్‌కు బిలీబర్స్‌ అనే పేరుంది. తను నా బిలీబర్‌
కీరవాణి: గురువు
రామాచారి: గురువు
సునీత: లవ్‌
కల్పన: ఇన్స్‌పిరేషన్‌
బాహుబలి: బ్రేక్‌ త్రూ
పవర్‌స్టార్‌: పవర్‌ఫుల్‌ ఐస్‌
పెళ్లి: ఫ్యూచర్‌లో..ఎవరో ఒకరు ఉంటారు పాపం 
స్వరాభిషేకం: నాలో నమ్మకాన్ని పెంచిన కార్యక్రమం
చెన్నై: పుట్టిన ఇల్లు
హైదరాబాద్‌: ఇష్టమైన ఇల్లు
ఎస్పీబీ: కళా రసికుడు 
మణిశర్మ: ఆయన స్కూల్‌లో బాగా నేర్చుకున్నా
పెళ్లి: సస్పెక్ట్‌
కెరీర్‌: ఇంపార్టెంట్‌
పాట: ప్రాణం
లగేజ్‌: అవసరం
నెగెటివ్‌ కామెంట్స్‌: పట్టించుకోను
జీవితం: జర్నీ
మీ అమ్మాయి: నా కర్తవ్యం
ఆలీతో సరదాగా: ఎంజాయ్‌మెంట్‌ 

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.