close

తాజా వార్తలు

‘మహానటి’ బయోపిక్‌ తీసి ఉండాల్సింది కాదు!

‘దేవదాస్‌’ మళ్లీ పుడితే, పార్వతిగా నేనే చేస్తా!

‘షావుకారు’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారామె. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జానకి. రేడియో నాటికల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. పెళ్లయ్యాక హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడం విశేషం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, శివాజీ గణేశన్‌, ఎంజీఆర్‌ తదితర ఎందరో లెజెండ్స్‌తో కలిసి ఆమె నటించారు. అప్పట్లో ‘దేవదాసు’లో పార్వతిగా అవకాశం కోల్పోయిన తాను ఆ దేవదాసు మళ్లీ పుడితే పార్వతిగా చేస్తానంటున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి.. ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఎలా ఉన్నారు?
షావుకారు జానకి: భగవంతుడి దయవల్ల బాగున్నా!

చెన్నై నుంచి బెంగళూరు వెళ్లిపోయారు కదా!
షావుకారు జానకి: అది 21 సంవత్సరాల కిందట జరిగింది. మా చెల్లెలు కృష్ణకుమారి ఎస్టేట్‌లో ఒక చిన్న చోటు కొనుక్కొని, ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నా. అసలు రిటైర్మెంట్‌ తీసుకుందామని వెళ్లా, కానీ, ఆర్టిస్ట్‌లకు రిటైర్మెంట్‌ ఉండదని ఇప్పుడే అర్థమవుతోంది.

ఇటీవల మీరు చేసిన సినిమాలేంటి?
షావుకారు జానకి: ‘కంచె’లో నటించా. ఆ తర్వాత వెంకటేష్‌ హీరోగా ‘బాబు బంగారం’లో నటించా. 

సాధారణంగా ఆడవాళ్లను వయసు అడగకూడదంటారు! మీ వయసెంత?
షావుకారు జానకి: చాలా మంది చెప్పరు. ‘మీరందరూ చెబుతున్నారా? నన్ను అడుగుతున్నారు’ అంటారు. నాకు అలాంటి పట్టింపులేవీ లేవు. వయసు తగ్గిపోతుందంటారు.. అసలు వయసు ఎలా తగ్గిపోతుంది? గత డిసెంబరు 12న 87 ఏళ్లు పూర్తయ్యాయి.

బ్రిటిష్‌ కాలంలో పుట్టారు? స్వాతంత్ర్యం వచ్చాక పెళ్లి చేసుకున్నారా?
షావుకారు జానకి: పెళ్లి చేసుకున్న తర్వాత నా స్వతంత్రం పోయిందనుకున్నాను.(నవ్వులు) కానీ, పోలేదు.

సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. మీరేంటి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌ అయ్యారు!
షావుకారు జానకి: సినిమాల్లోకి వెళ్లిపోతానేమోనని భయపడి మా తల్లిదండ్రులు నాకు 15వ ఏట పెళ్లి చేశారు. ఎందుకంటే అప్పట్లో రేడియో నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండేదాన్ని. నా వాయిస్‌ విని బీఎన్‌రెడ్డిగారు స్టూడియోకి ఫోన్‌ చేశారు. ‘ఆ అమ్మాయి ఉచ్ఛారణ బాగుంది. బయట ఎలా ఉంటుంది? సినిమాల్లోకి  పనికొస్తుందా?’ అని అడిగితే, ‘సన్నగా, తెల్లగా ఉంటుంది. పొడవాటి జుట్టు. నటన అంటే ఆసక్తి ఉంది. ఇక్కడ బాగానే పనిచేస్తోంది’ అని చెప్పడంతో ఆయన వచ్చారు. నన్న చూసి, ‘ఏయ్‌ అమ్మాయ్‌.. సినిమాల్లో హీరోయిన్‌ వేషం ఇస్తాం. చేస్తావా’ అని అడిగారు. ఎగిరి గంతేసి చేస్తానని చెప్పా. ఇంటికి వెళ్లి విషయం చెబితే అందరూ తిట్టారు. ‘రేడియో స్టేషన్‌లో పనిచేయించడమే తప్పు. త్వరగా పెళ్లి చేసేయండి’ అని అన్నారు. వెంటనే పెళ్లి కూడా చేశారు.

మీ సొంత ఊరు ఏది?
షావుకారు జానకి: రాజమండ్రిలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు ఇంగ్లాండ్‌లో మూడేళ్లు పేపర్‌ మ్యాన్‌ఫాక్చరింగ్‌ అండ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకుని వచ్చారు.  చాలా పద్ధతిగా పెంచారు. నాకు, మా చెల్లెలు కృష్ణకుమారికి క్రమశిక్షణ అలా అలవడింది. 

పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత పదో తరగతి పాసయ్యారట! 
షావుకారు జానకి: మా నాన్నగారు అస్సాంలో ఉండగా నేనూ, మా ఆయన అక్కడకు వెళ్లాం. నేను తల్లిని అయ్యానని అప్పుడే తెలిసింది. దీంతో మా చెల్లెలి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. మా ఆయన నాతో ప్రైవేటుగా 10 పరీక్షలు రాయించారు. ఆ తర్వాత మద్రాసు వచ్చేశాం. పాప పుట్టింది. ఆ తర్వాత నేను ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యానని మా తండ్రిగారి నుంచి టెలిగ్రాం వచ్చింది. 

ఎక్కడకు వెళ్లినా క్యారేజీ తప్పకుండా తీసుకెళ్లేవారట!
షావుకారు జానకి: ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మా పెద్ద పాపకు మూడు నెలల వయసు ఉండగా, ‘షావుకారు’లో నటించా. ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్‌కు నేను ఫస్ట్‌ హీరోయిన్‌.. ఆయన నాకు ఫస్ట్‌ హీరో. అయితే, ఆ సినిమా షూటింగ్‌కు క్యారేజ్‌ పట్టుకుని వెళ్లేదాన్ని. ఇంతవరకూ నేను ప్రొడక్షన్‌ వాళ్లు పెట్టే భోజనం చేయలేదు. తినకూడదని కాదు.. కానీ, చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. 

ఎన్టీఆర్‌తో నటిస్తున్నప్పుడు ఆయన అంత గొప్ప వ్యక్తి అవుతారని అనుకున్నారా?
షావుకారు జానకి: ఏమి అందమండీ ఆయనది. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి, ఏ ఆలోచనలకీ తావులేదు. ఆయన భయపడేవారు.. మేమూ భయపడేవాళ్లం.. ఎన్టీఆర్‌తో నటించిన ఓ సినిమాలో నేను ధరించిన జాకెట్‌ కాస్త చిన్నగా ఉంది. దీంతో సెన్సార్‌ వాళ్లు, రీషూట్‌ చేయాల్సిందేనని చెప్పారు. అప్పట్లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఇప్పుడు అసలు అలాంటి వాటికి లెక్కా పత్రం కూడా లేదు. 

అప్పట్లో బయట ప్రపంచంలో సినిమా గురించి అపోహలు ఉండేవి. అందరూ తప్పుగా మాట్లాడేవారు. సంసార పక్షంగా ఉండేవాళ్లు సినిమాల్లోకి రాకూడదనేవారు. కానీ, నిజమైన పరిశ్రమ అంటే సినిమా ఇండస్ట్రీనే. అప్పట్లో ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. మాకు సహాయకులు కూడా మహిళలే ఉండేవారు. పురుషులు ఎవరూ కనీసం దగ్గరకు కూడా వచ్చేవాళ్లు కాదు. నా కెరీర్‌లో నన్ను బాధపెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదు. మేము చాలా అదృష్టం చేసుకున్నాం. 

అందం పుట్టిన తర్వాత మీరు పుట్టారా? మీరు పుట్టాక అందం పుట్టిందా?
షావుకారు జానకి: అందం నా సొంతమేమీ కాదు. కొంచెం బాధపెట్టిన సందర్భంగా కూడా ఉంది. ‘షావుకారు’ పూర్తయిన తర్వాత కేవీరెడ్డి గారు కలిశారు. ‘ఏమ్మా! ఏ ఊరు మీది?’ అని అడిగారు. ‘రాజమండ్రి’ అని చెప్పా. ‘మీ ఊరు వెళ్లిపో! మరీ చిన్నగా, పీలగా ఉన్నావ్‌. స్టేచర్‌ లేదు.. పర్సనాలిటీ లేదు. మా హీరోలందరూ స్టైల్‌గా ఉంటే, వాళ్ల పక్కన నువ్వు చాలా చిన్నగా ఉన్నావు’ అన్నారు. కానీ, నేను రేడియోలో పనిచేయటం వల్ల పలికే భాష, ఉచ్ఛారణ స్పష్టంగా ఉండటంతో నన్ను కొనసాగించారు. కానీ, నిజమైన అందమంటే, మా చెల్లెలు కృష్ణకుమారిదే! 

శ్రీదేవిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరేనట!
షావుకారు జానకి: అవునండీ! అప్పటికి తను ఆరేళ్ల పిల్ల. వాహిని స్టూడియోస్‌ వాళ్లు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. అప్పుడే రాజేశ్వరిగారు(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘బాల మురుగన్‌ పాత్రకు చిన్న పిల్లాడు కావాలి. అందంగా ఉండాలి. బ్రిలియంట్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు. నేను అలా చూస్తుంటే శ్రీదేవి కనిపించింది. ‘ఈ అమ్మాయిని తీసుకుంటే ఎలా ఉంటుంది. వాళ్ల అమ్మగారు నాకు తెలుసు. సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తూ ఉంటారు. నాకు బాగా పరిచయం’ అని డైరెక్టర్‌గారితో చెప్పా. ‘మగపిల్లాడి వేషం కదా! మీరేమో అమ్మాయితో చేయిద్దామని చెబుతున్నారు. షర్ట్‌ లేకుండా బాగోదు కదా!’ అని అన్నారు. ‘ఆరేళ్ల పిల్ల.. చొక్కా లేకపోతే ఏమవుతుంది. కావాలంటే వాళ్ల అమ్మను ఒప్పిస్తా’ అని అన్నా. శ్రీదేవి అమ్మగారితో చెబితే సరేనన్నారు. మేకప్‌ టెస్టు చేస్తే, అందరూ ఆశ్చర్యపోయారు. బాలమురుగన్‌ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్‌లు చెప్పమంటే, ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ, తను చెప్పడం చూసి, మరో ఆలోచన లేకుండా సినిమాలో బుక్‌ చేశారు. 

ఎవరైతే వడ్డాణం ఇస్తారో వాళ్లనే పెళ్లి చేసుకుంటానని చెప్పారట!
షావుకారు జానకి: (నవ్వులు) అవును! మా ఆయనా చేయించలేదు. చివరకు ‘షావుకారు’లో ఇత్తడి వడ్డాణం పెట్టారు. 

మీ తర్వాత కృష్ణకుమారి ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు?
షావుకారు జానకి: ఏడాదిన్నర తర్వాత వచ్చింది. అసలు అందమంటే తనదే! 20ఏళ్లుగా మేమిద్దరం కలిసే ఉంటున్నాం. తన ఎస్టేట్‌లో కలిసి ఉండేవాళ్లం. ఉదయం నడకకు వెళ్తూ, ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఇటీవలే తను చనిపోయింది. మేమిద్దరం కాకుండా మాకు ఇంకో చెల్లెలు ఉంది. తను అంతకుముందే చనిపోయింది. ఇప్పటికీ ఎస్టేట్‌లో బయట తిరుగుతూ తను తిరిగి రాదని తెలిసినా, ‘కృష్ణా వెళ్లిపోయావా’ అంటుంటా.

మీ ఇద్దరి అనుబంధం ఎలా ఉండేది?
షావుకారు జానకి: మా మధ్య తేడాలు లేవు. నిజాలు మాట్లాడుకునేవాళ్లం.  ఇండస్ట్రీలో మాకు వచ్చిన ఒడుదొడుకులు.. కష్టాలు.. మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం. తనకు ఎదురైన ప్రతి సమస్యను నాతో మాత్రమే చెప్పేది. ఎవరికీ చెప్పుకొనేది కాదు. అవసరమైతేనే మాట్లాడేది. 

మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?
షావుకారు జానకి: నాకు తెలిసి, దాదాపు 370 సినిమాల్లో నటించా. హీరోయిన్‌గా 200 సినిమాలకు పైగా చేశా. కె.బాలచందర్‌గారి యూనిట్‌లోనే 13 సినిమాలు చేశా. 

‘దేవదాసు’ సినిమాలో మిమ్మల్ని బుక్‌చేసి ఒక సాంగ్‌ చేసిన తర్వాత ఎందుకు వద్దనుకున్నారు? 
షావుకారు జానకి: సాంగ్‌ చేయలేదు.. రిహార్సల్స్‌ చేశాం. అదే ‘ఓ దేవదా..’ పాట. రేపటి నుంచి షూటింగ్‌ అనగా, డీఎల్‌ గారు ‘మీరు ఈ సినిమాలో లేరు’ అని చిన్న లెటర్‌ పంపారు. అంతకుముందే ఆ సినిమా యూనిట్‌కు సంబంధించిన పెద్దలందరూ మా ఇంటికి వచ్చి ‘ఆ పాత్రకు నువ్వే కరెక్ట్‌. వయసు, అమాయకత్వం చక్కగా సరిపోతాయి’ అని చెప్పి పాత్రకు బుక్‌ చేసుకుని, అగ్రిమెంట్‌ రాయించుకుని, రిహార్సల్‌ చేసి,  నన్ను సడెన్‌గా తీసేశారు. కారణం చెప్పి ఉంటే ఇంతలా బాధపడి ఉండేదాన్ని కాదు. పది రోజులు సరిగా భోజనం చేయలేదు. ఆ తర్వాత నాకు నేనే సర్దిచెప్పుకున్నా. ఆ విషయం నాగేశ్వరరావుగారి కూడా తెలియదు. ఒక టెలివిజన్‌ కార్యక్రమంలో ‘షావుకారు జానకిని ఎందుకు తీసేశారు’ అని ఆయనను అడిగితే, ‘అవునా! నాకూ తెలియదు’ అని నాకు ఫోన్‌ చేశారు. ‘మిమ్మల్ని దేవదాస్‌ కోసం బుక్‌ చేసుకున్నారా’ అని అడిగారు. ‘అవునండీ. అప్పుడు మీరూ కొత్త కదా! రేపు షూటింగ్‌ అనగా, నన్ను తీసేసి, సావిత్రిని పెట్టారు. ఎందుకు తీసేశారో వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెబుతా’ అని చెప్పా. ఏయన్నార్‌ చివరి దశలో ఉండగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఆ తర్వాత ఆయనను కలిసే వీలు రాలేదు. కొన్నిరోజులకే  చనిపోయారు. నేనూ వదిలేశా. 

బాధపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
షావుకారు జానకి: అప్పట్లో నేనూ ఎవరితోనూ గొడవలు పెట్టుకున్నది లేదు. నా కుటుంబం, వారి సమస్యలు పరిష్కరించడానికే నాకు సమయం సరిపోయేది. నటనను నేను ఒక వృత్తిగా తీసుకున్నా. 80, 90 ఏళ్లు వచ్చినా నటిస్తూ ఉండాలనేది నా కోరిక. అలాంటిది జరగలేదు సరికదా! నేను తమిళంలో నటించిన చిత్రాలు హిట్‌ అయితే, వాటిని తెలుగులోనూ తీసేవారు. ఇక్కడ మాత్రం నన్ను హీరోయిన్‌గా తీసుకునేవారు కాదు. అప్పుడు మనసు చివుక్కుమంటుందా? లేదా? దానికి కారణాలు వెతకడం కన్నా వదిలేయడం మంచిదేమో! నేను ఎన్నడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ప్రొడ్యూసర్‌ డబ్బులతో జల్సా చేయలేదు. సినిమాకు ఏది అవసరమో అదే చేసేదాన్ని. చాలా దెబ్బలు తిన్నా. ఎన్నోసార్లు నిరాశ చెందా. అయితే, జీవితంలో మనకంటూ ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని సానుకూల దృక్పథంతో ఇన్నాళ్లూ బతికా.  మా కుటుంబంలో నాకంటే చిన్నవాళ్లు కూడా ముందే చనిపోయారు. ఆ సమయంలో మాత్రం చాలా బాధపడేదాన్ని. 

నేటి యువతరం ప్రతి దానికీ టెన్షన్‌ పడుతూ తప్పులు చేస్తోంది. అలా చేయొద్దు.  మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఒక్కసారిగా మీరు కనిపించకుండా పోతే ఏమైపోతారు? చెప్పండి. నేటి యువత నుంచి నేను కోరుకునేది ఒక్కటే.. దయ చేసి తల్లిదండ్రులను బాధపెట్టే పనులు చేయొద్దు. ‘లవ్‌ ఈజ్‌ సో బ్యూటిఫుల్‌. ఇట్‌ ఈజ్‌ గివ్‌ అండ్‌ టేక్‌ దట్‌. నాట్‌ ఎండ్‌ టు దట్‌’ .  మీరు ఏదైనా చేసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మానవశక్తి చాలా గొప్పది. అది ఆడవాళ్లైనా, మగవాళ్లైనా, అయితే, ‘ఆడది నాకన్నా శక్తిమంతమైంది’ అని మగవాడు అంటున్నాడా? లేదు. మనం సంపాదించుకోవాలి. ధైర్యంగా నిలబడండి.

‘సంసారం ఓ చదరంగం’తమిళ వెర్షన్‌లో మీ పాత్రను మనోరమ చేశారు. తొలుత మీకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు తిరస్కరించారు?
షావుకారు జానకి: రిజెక్ట్‌ చేయలేదు. ఆ స్థాయిలో నేను నటించగలనా? లేదా? అన్న అనుమానం అంతే! ఎందుకంటే అప్పటివరకూ కాస్త గ్లామర్‌ పాత్ర చేసిన నేను ఆ పాత్రకు సరిపోనని అనిపించింది. పైగా శ్రీకాకుళం యాసలో మాట్లాడాలి. ‘నేను ఆ పాత్ర చేస్తే మీ పిక్చర్‌ ఏమవుతుంది’ అని ఏవీఎం శరవణన్‌గారితో అన్నా. ‘మీరు ఒక్కరే చేయగలరు. మేము నిర్ణయం తీసేసుకున్నాం’ అని తెలుగులో నన్ను తీసుకున్నారు. 

మీరు గాంధీజీకి కూడా సేవ చేశారట!
షావుకారు జానకి: అప్పట్లో నేను దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ పాఠశాలలో చదువుకుంటున్నా. అప్పుడు గాంధీజీ హిందీ ప్రచార్‌ సభకు వచ్చారు. ఆయనకు పాలు, వేరుశెనగ పప్పులు సర్వ్‌ చేయడానికి నన్ను పంపారు. ఆ అదృష్టం నాకు దక్కింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్‌ ఇలా ఎందరో గొప్ప వ్యక్తులను నేరుగా కలిసే అవకాశం నాకు దక్కడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం.

అప్పటి సినిమాకూ ఇప్పటి సినిమాకూ ఏం తేడా గమనించారు!
షావుకారు జానకి: మనం నటించిన సినిమాల్లో టీవీలో చూసుకుంటే ఇవన్నీ మేమే చేశామా? అనిపిస్తుంది. అయితే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. గ్రాఫిక్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అప్పట్లో కేవలం మన నటన, మనం పలికించే హావభావాలపైనే దృష్టి పెట్టేవారు. 

మీతో ఎవరు ఉంటున్నారు?
షావుకారు జానకి: చాలా ఏళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నా. 

షూటింగ్‌ అయిపోయిన తర్వాత డబ్బులు పంచి పెట్టేవారట!
షావుకారు జానకి: వాళ్లకు లేదని కాదు. ప్రేమతో ఇచ్చేదాన్ని. అది అలవాటైపోయింది. మా ఇంట్లో పనిచేసే వాళ్లకి భోజనం పెట్టి, వాళ్లు కడుపునిండా తింటున్నారని తెలిసిన తర్వాతే నేను టేబుల్‌ దగ్గరికి వెళ్లి అన్నం పెట్టుకుంటా. 

‘షావుకారు’ అనే పేరు ఆ సినిమాకు ఎందుకు పెట్టారు?
షావుకారు జానకి: ‘షావుకారు’ అంటే అన్ని భాషల్లోనూ రిచ్‌మెన్‌ అని అర్థం. నేను అడిగితే కూడా ఇదే చెప్పారు. (మధ్యలో ఆలీ అందుకుని.. అసలు కారణం ఏంటో తెలుసా? చక్రపాణిగారిది తెనాలి. ఆయన ఇంటి ముందు నన్నపనేని లింగారావు అనే షావుకారు ఉండేవాడు. అందరూ ఆయన ముందు వెళ్తున్నప్పుడు ‘షావుకారు గారు నమస్కారం’ అని అనుకుంటూ వెళ్లేవారట. ఇది గుర్తుకు వచ్చిన చక్రపాణిగారు ‘ఈ పేరుతో టైటిల్‌ పెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది’ అని స్ఫూర్తిగా తీసుకుని టైటిల్‌ పెట్టారు.) అప్పట్లో ఎంజీఆర్‌గారి సతీమణి కూడా నటిస్తూ ఉండేవారు. ఆవిడ పేరు కూడా జానకి. మా పేర్లు ఒకటే కావడంతో నాకు ‘షావుకారు’ జానకి అని పెట్టారు. మా అత్తగారి ఇంటి పేరు శంకరమంచి.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను మీరు ముట్టుకున్నారని మీ బంధువులు ఇంటికి రానీయలేదట!
షావుకారు జానకి: ముట్టుకున్నానని కాదు. సినిమాలో వేషాలు వేయడానికి వెళ్లానని. పైగా హీరోయిన్‌ అయితే, హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు ఉంటాయి. ఫస్ట్‌నైట్‌ సీన్లలో ‘పాండవులు పాండవులు’ అని డ్యాన్స్‌ చేయడం.. అవన్నీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇల్లు వెతుక్కోవడానికి వెళ్లి, ఒక్కరోజు చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వాళ్లింటికి వెళ్తే, ‘వద్దమ్మా! అంకుల్‌ ఏదైనా అంటారు. రావద్దు’ అనేవాళ్లు. సినిమా వాళ్లకు ఇళ్లు ఇచ్చేవారు కాదు.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

తెలుగు ఇండస్ట్రీ: అన్ని ఇండస్ట్రీలకు పెద్దది
చెన్నై: అన్ని రకాల భాషలు, భోజనాలకు ప్రసిద్ధి
బెంగళూరు: అనుకూల వాతావరణం
షావుకారు: నాకు ఈరోజూ భోజనం పెడుతున్న పేరు
కృష్ణకుమారి: నేను పోగొట్టుకున్న ఒక మాణిక్యం 
అమ్మ: ఆరాధ్య దైవం
ఎన్టీఆర్‌: మోస్ట్‌ గ్లామరస్‌. ఒకే ఒక ఎన్టీఆర్‌ అంతే! 
దేవదాస్‌: మళ్లీ పుడతాడేమో. పుడితే నేను పార్వతి వేషం వేస్తా. 
ఎంజీఆర్‌: గ్రేట్‌ పొలిటీషియన్‌
సావిత్రి: మంచి నటి. బయోపిక్‌ తీసి ఉండాల్సింది కాదు. ఆ సినిమా నేను చూడలేదు. ఆమెను మహానటి అనుకున్నప్పుడు అక్కడితో వదిలేయాల్సింది. ఎందుకంటే ‘అంతటి నటి, ఇలా అయిపోయిందా?’ అని అందరం బాధపడతాం. ముఖ్యంగా అభిమానులు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. సినిమా జీవితానికి, వ్యక్తిగత జీవితానికి చాలా సన్నటి గీత ఉంటుంది. ఆ గీత దాటకూడదు.
శ్రీదేవి: మనల్ని అలరించడానికి పుట్టిన ఒక స్టార్‌. వన్‌ అండ్‌ ఓన్లీ స్టార్‌.. ధ్రువనక్షత్రం అది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.