close

తాజా వార్తలు

అందుకే ఆ డైరెక్టర్‌ చెంప పగలగొట్టా!

మె కనుసైగకు కుర్రకారు కుదేలైపోయింది. కాలు కదిపితే ‘ఆశ పెట్టేసి పోవద్దు’ అని బతిమలాడుకుంది. తన డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించడమే కాదు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు రాణి అలియాస్‌ రక్ష. ‘నచ్చావులే’ చిత్రంతో అమ్మగా నటించి, ప్రేక్షకులను మెప్పించడమే కాదు, నంది అవార్డునూ సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు. 

రాణి.. రక్షలా ఎందుకు మారాల్సి వచ్చింది?
రక్ష: తమిళంలో నటించేటప్పుడు అందరూ రాణి అనే పిలిచేవారు. తెలుగులోకి వచ్చేసరికి రక్షగా మారింది.

మీ సొంతూరు ఏది?
రక్ష: అనకాపల్లి పక్కన చిన్న గ్రామం. సినిమాలు నిర్మిద్దామనే ఉద్దేశంతో నాన్నగారు చెన్నై వచ్చారు. ఎన్టీఆర్‌-జమునలతో ఒక సినిమాతో పాటు మరో సినిమాను కూడా చేశారు. నా చదువంతా చెన్నైలోనే సాగింది. ఏడో తరగతి వరకూ చదువుకున్నా. 

మరి ఆ సినిమాలు ఎలా ఆడాయి?
రక్ష: ఆ రెండు సినిమాలతో నాన్న ఆర్థికంగా నష్టపోయారు. దాంతో నేను సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. అయితే, నేను చిత్ర పరిశ్రమలోకి రావడం నాన్నగారికి కూడా ఇష్టం లేదు. నా ఇష్టంతోనే ఇక్కడకు వచ్చా. 

సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
రక్ష: చిన్న పాత్రలతోనే నా సినీ కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత గ్రూప్‌ డ్యాన్సర్‌గా పలు పాటలు చేశా. అప్పుడే ఇళయరాజాగారి బ్రదర్‌ నన్ను చూసి, ‘ఈ అమ్మాయి బాగుందే! హీరోయిన్‌గా చేస్తే బాగుంటుంది’ అని నన్ను అడగడంతో నేనూ ఒప్పుకొన్నా. అప్పటి నుంచి కథానాయికగా వరుస సినిమాలు చేశా. 

హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేశారు?
రక్ష: ఎప్పుడూ లెక్కపెట్టలేదు కానీ, అన్ని భాషల్లో కలిపి దాదాపు 30కు పైగా సినిమాల వరకూ చేసి ఉంటా.

‘ప్రేమలేఖలు’ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది?
రక్ష: ఆ సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌ సంపత్‌రాజ్‌. ఆయన మా చెల్లెలి భర్త. 1995లో వాళ్ల అబ్బాయిది మొదటి పుట్టిన రోజు అయితే, ఆ సినిమా డైరెక్టర్‌ అగస్త్యన్‌ ఆ ఫంక్షన్‌కు వచ్చారు. అప్పుడు సంపత్‌రాజ్‌ మాస్టర్‌ నన్ను పరిచయం చేసి, ‘‘చిన్న దానా.. ఓసి చిన్నాదానా’ పాట రక్ష చేస్తే బాగుంటుంది. అవకాశం ఇస్తారా’’ అని అడిగారు. ఆయన ఒప్పుకొన్నారు. అయితే నేను మాత్రం అందులో టైటిల్‌ సాంగ్‌ చేయాలని అనుకున్నా. ఇదే విషయం మా చెల్లికి చెబితే, ‘‘చిన్న దానా’ పాటకు మంచి పేరు వస్తుంది. ఇదే చెయ్‌’ అని తిట్టింది. దాంతో ఆ పాట చేశా.

ఈ పాట చేసినప్పుడు అంత పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నారా?
రక్ష: అస్సలు అనుకోలేదు. మామూలుగా మన తెలుగు సినిమాల్లో పాటకు రిచ్‌లుక్‌ను ఇచ్చే కాస్ట్యూమ్స్‌ వేసుకుంటాం. నేను కూడా అలాగే వేసుకెళ్లా. అప్పుడు డైరెక్టర్‌ ‘అమ్మా! ఇది మాస్‌ సాంగ్‌. తమిళ సినిమా. మీరు చాలా నేచురల్‌గా ఉండాలి’ అనడంతో చాలా సింపుల్‌గా వెళ్లా. ఈ పాట నా కెరీర్‌కు చాలా ప్లస్‌ అయింది. డైరెక్టర్‌ సాగర్‌గారు నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ‘అహో విక్రమార్క’ సినిమాలో కృష్ణగారు, రమేష్‌బాబుగారు కలిసి నటించారు. అయితే, ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. అయినా, నాకు అవకాశాలు వచ్చాయి.

మళ్లీ రీ ఎంట్రీ ఏ చిత్రంతో ఇచ్చారు?
రక్ష: ‘నచ్చావులే’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించా. ఒక రోజు రామోజీఫిల్మ్‌ సిటీలో ఏదో షూటింగ్‌కు వచ్చా. ఆ సమయంలో ప్రెస్‌వాళ్లు ఫొటోలు తీసుకుంటామన్నారు. అప్పుడే నా ఎదురుగా ఒక కారు వెళ్లింది. మళ్లీ వెనక్కి వచ్చి, ఆగింది. అందులో నుంచి కో-డైరెక్టర్‌ నరేష్‌గారు కారు దిగి నా దగ్గరకు వచ్చారు. ‘మా సినిమాలో మదర్‌ క్యారెక్టర్‌ చేస్తారా?’ అని అడిగితే, మొదట నేను చేయనని చెప్పా. అయితే, రవిబాబుగారు, నరేష్‌గారు ‘మంచి పాత్ర’ అని నన్ను ఒప్పించారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నా. ఇండస్ట్రీలోని హీరోయిన్‌లకు పెళ్లయితే, ‘ఆంటీ’, పిల్లలు పుడితే ‘అమ్మమ్మ’ పాత్రలే వస్తాయి. మగవాళ్లకు ఎంత వయసు వచ్చినా, వాళ్లు హీరోలే! అని ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నా. నాకు నంది అవార్డు వస్తుందని మాత్రం అనుకోలేదు. 

ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయా?
రక్ష: ఏమీ రాలేదు. అందుకు కారణాలు ఏంటో మీకు కూడా తెలుసు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అవకాశాలు ఇస్తున్నారు. మేము లేమా! చేయలేమా! టాలెంట్‌ లేదా! అది ఉండబట్టే నంది అవార్డు ఇచ్చారు. అలాంటప్పుడు ఎందుకు బయట నుంచి వేరేవాళ్లను తీసుకొస్తున్నారో అర్థం కావటం లేదు. 

స్కూల్‌కు వెళ్తుంటే రోజూ ఒక అబ్బాయి వెంటపడేవాడట!
రక్ష:(నవ్వులు) అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. ఒకడు రోజూ నన్నే ఫాలో అయ్యేవాడు. నాకేమో కాస్త భయంగా ఉండేది. ఈ విషయాన్ని నాన్నగారికి చెబితే, స్కూల్‌ మానిపించేస్తారు. అందుకే నేను మాట్లాడకుండా ఉన్నా. అయితే, ఈ విషయం మా తమ్ముడు నాన్నగారికి చెప్పేశాడు. ‘ఈరోజు మీరు స్కూల్‌కు వెళ్లండి. నేను మీ వెనకాలే వస్తా. కానీ నేను ఉన్నట్లు మీరు ఎవరికీ చెప్పకండి’ అన్నారు. ఆ రోజు వాడు రాలేదు. (నవ్వులు). దీంతో ఇంటికి వచ్చిన తర్వాత ‘స్కూల్‌ మానేసెయ్‌’ అని నాన్నగారు అనడంతో ఆయనను బతిమిలాడి మళ్లీ స్కూల్‌కు వెళ్లా.

మరి విమానంలో కూడా ఒక వ్యక్తి వెంటపడితే కొట్టారట!
రక్ష: (నవ్వులు) బి.గోపాల్‌గారి దర్శకత్వంలో ‘రవన్న’ చేస్తున్నాం. నేను అప్పుడు చెన్నై నుంచి వచ్చేదాన్ని. విమానంలో విండో సీట్‌ తీసుకున్నా. నా పక్కనే ఒక పెద్దాయన కూర్చున్నాడు. కొద్దిసేపైన తర్వాత చేతితో పొడవటం మొదలు పెట్టాడు. ‘పెద్దాయన కదా! తెలియక తగిలి ఉంటుందనుకున్నా’ రెండు, మూడుసార్లు అలాగే చేయడంతో కోపం ఆగలేదు. ‘ఏంటి రా! ఇంత వయసొచ్చింది ఇవేం పనులు’ అంటూ లాగిపెట్టి కొట్టా. అదే విమానంలో బి.గోపాల్‌ గారు కూడా ఉన్నారు. ఈ సంగతి ఆయనకు తెలీదు. నేను మంచి పని చేశానని అందరూ మెచ్చుకున్నారు. ఇలా నలుగురైదుగురికి పడ్డాయి. 

రామకృష్ణా స్టూడియోస్‌లో షూటింగ్‌ చేస్తుంటే, స్టేజ్‌ మీద నువ్వు ఉండగా, ఒక వ్యక్తి నిన్ను చూసి కన్ను కొట్టారట!
రక్ష: ‘శుభలేఖలు’ సినిమాలో శ్రీకాంత్‌గారు, రోషిణి, నేను ఒక సాంగ్‌ చేస్తున్నాం. అప్పుడు స్టేజ్‌పై పాటలు చేస్తుంటే, కింద ప్రేక్షకులు చప్పట్టు కొట్టేవారు. అలా మేము స్టేజ్‌పైన ఉంటే ఒకడు నాకు కన్నుకొట్టాడు. అనుకోకుండా అలా జరిగిందేమో అనుకున్నా. కానీ, రెండోసారి కూడా కన్ను కొట్టి, ‘బాగుందా’ అంటూ తలూపాడు. నాకు ఒళ్లు మండి స్టేజ్‌ దిగి వాడిని చితకొట్టేశా. ఎవరైనా ఇలా పిచ్చిపిచ్చి పనులు చేస్తేనే నాకు కోపం వస్తుంది. 

మీది ప్రేమ వివాహమా? 
రక్ష: అవును! ఏదైనా సినిమాలో అవకాశం వచ్చినా, ఆయనను సంప్రదించిన తర్వాతే ఒప్పుకొంటా. ఆయన కూడా చాలా సపోర్ట్‌ ఇచ్చారు. టెన్షన్స్‌ పెట్టుకోకుండా షూటింగ్‌లకు వెళ్లమంటారు. ఏ పాత్ర అయినా, నచ్చితేనే చేయమంటారు. మా పాప కూడా అంతే. మా ఆయన బిజినెస్‌ చేస్తారు. దుబాయ్‌లో హోటల్స్‌ ఉన్నాయి. ఆర్థికంగా ప్రస్తుతం బాగానే ఉంది.

సినిమాలకు విరామం ఎప్పుడు తీసుకున్నారు?
రక్ష: నేనెప్పుడూ విరామం తీసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా. పాప పుట్టిన తర్వాత కూడా. విక్రమ్‌తో ‘జెమిని’(తమిళం) సినిమాలో ఓ పాట చేశా. తెలుగులో కూడా వెంకటేష్‌తో చేయమన్నారు. కానీ, హైదరాబాద్‌లోనే పది రోజులు ఉండాలని చెప్పడంతో నా వల్ల కాదని చెప్పేశా. అసలు మొదట ‘జెమిని’ కూడా చేయొద్దని మా ఆయన చెప్పారు. విక్రమ్‌ సర్‌ మంచి ఫ్రెండ్‌ కావడంతో మా ఆయనను ఒప్పించి ఆ పాట చేశా. తెలుగులో ఆ పాటను ముంతాజ్‌ చేశారు. 

మీ పాప ఏం చదువుతోంది?
రక్ష: డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌. ‘ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, చదువు అయిన తర్వాతే తీసుకో’ అని చెప్పా.

‘యమజాతకుడు’ షూటింగ్‌ సమయంలో ఎవరో ఎవరినో గుర్తు పట్టలేదట!
రక్ష: మోహన్‌బాబుగారు హీరోగా ‘యమజాతకుడు’ చేశాం. అందులో రాజేంద్రప్రసాద్‌గారు చిన్న యముడుగా చేశారు. ఆయన భార్య పాత్రను నేను పోషించా. షూటింగ్‌ సమయంలో ఆయన చాలా సరదాగా ఉండేవారు. నాతో పాటు సాధిక అనే మరో నటి కూడా చేసింది. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఒక రోజు సాంగ్‌ షూటింగ్‌ అయిపోయిన తర్వాత రాజేంద్రప్రసాద్‌గారు మేకప్‌ తీసేని షార్ట్‌, టీషర్ట్‌ వేసుకుని వచ్చారు. నేను ఆయనతో మాట్లాడుతుంటే.. సాధిక నా దగ్గరకు వచ్చి, ‘ఈయన ఎవరు?’ అని అడిగింది అమాయకంగా. నాకు నవ్వు ఆగలేదు. రాజేంద్రప్రసాద్‌గారికి చెబితే ఆయన కూడా నవ్వులే నవ్వులు.

షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో అమ్మని చూసుకోలేకపోతున్నానని బాధపడేవారట!
రక్ష: 1997లో చాలా బిజీగా ఉండేదాన్ని. అమ్మకు క్యాన్సర్‌ అని లాస్ట్‌ స్టేజ్‌లో తెలిసింది. ఆమె చాలా కుంగిపోయింది. ఉదయం ఫ్లైట్‌కు ఇక్కడకు వచ్చి, సాయంత్రం మళ్లీ చెన్నై వెళ్లిపోయేదాన్ని. జగపతిబాబుగారితో సినిమా చేస్తుండగా, ఒకరోజు ‘అమ్మకు సీరియస్‌గా ఉంది’ అని ఫోన్‌ చేశారు. వెళ్తే, అప్పటికే అమ్మ చనిపోయారు. 2007 నాన్న కూడా చనిపోయారు.

ఎక్కువ పాటలు లారెన్స్‌ కొరియోగ్రఫీలో చేసేవారు కదా!
రక్ష: ఆయన కంటే నేనే సీనియర్‌. నేను గ్రూప్‌ డ్యాన్సర్‌గా చేస్తున్న సమయానికి ఆయన అస్సలు ఇండస్ట్రీకి రాలేదు. నేను ఆర్టిస్ట్‌ అయ్యాకే వచ్చారు. అందరికీ లారెన్స్‌ పనిచేస్తుండటంతో సాంగ్స్‌ కోసం నన్ను కూడా తీసుకునేవారు. 

ఇండస్ట్రీకి వచ్చినందుకు లాభపడ్డారా? నష్టపోయారా?
రక్ష: నేను మంచి హీరోయిన్‌ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చా. కానీ, నేను అనుకున్నంత అవలేకపోయా. సాంగ్స్‌తో మంచి పేరు వచ్చింది. నేను నష్టపోయింది ఏమీ లేదు. 

ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
రక్ష: సెంటిమెంట్‌గా హోమ్లీ పాత్రల్లో చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్న పలు సీరియళ్లలో ప్రతినాయకురాలి ఛాయలున్న పాత్రలు చేస్తున్నా. తెలుగు సినిమాలో మాత్రం నాలాంటి వారికి అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ అలా ఎవరైనా ఇద్దామని అనుకున్నా.. పక్కన ఉన్న వాళ్లు ఇవ్వనివ్వరు. వస్తే మాత్రం తప్పకుండా చేస్తా. 

హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంది?
రక్ష: ఇక్కడ చాలా బాగుంటుందని చెన్నై నుంచి వచ్చా. ‘మేడమ్‌ మీరు చెన్నైలో ఉండటం వల్ల.. ఫ్లైట్‌ టికెట్లు, హోటల్‌ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడకు వస్తే, మంచి పాత్రలు దక్కుతాయి’ అని కొందరు చెప్పారు. కానీ, ఇక్కడకు వస్తే, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. ఒక వ్యక్తితో నేను పనిచేయాలి. కానీ, షూటింగ్‌ సమయంలో అతను చాలా బ్యాడ్‌గా మాట్లాడాడు. గట్టిగా వార్నింగ్‌ ఇచ్చా. దాంతో అతనితో నాకు ఏ క్యారెక్టర్‌ వచ్చినా, ‘ఆమెతో అయితే నేను చేయను’ అని చెప్పడంతో నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. 

‘ప్రేమలేఖ’ తర్వాత మీకు ప్రేమలేఖలు వచ్చాయా?
రక్ష: చాలా వచ్చాయి. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ, నాకు ఇష్టం లేదని చెప్పేశా!

అసలు మీకు తొలి అవకాశం ఎలా వచ్చింది?
రక్ష: అప్పుడు నాకు 14ఏళ్లు ఉంటాయి. దాసరిగారి దర్శకత్వంలో వచ్చిన ‘పోలీస్‌ వెంకటస్వామి’లో తొలి అవకాశం వచ్చింది. అందులో సురేష్‌ హీరో. ఆయనకు చెల్లెలిగా చేశా. చిరంజీవి, రజనీకాంత్‌ తప్ప దాదాపు అందరు అగ్రహీరోలతో చేశా. 

షూటింగ్‌ సమయంలో ఒక డైరెక్టర్‌ని కొట్టారు కదా!
రక్ష: అవును కొట్టా. ఆయనతో ఒకే ఒక్క సినిమా చేశా. ఆ తర్వాత మళ్లీ ఆయనను కలవలేదు. తమిళంలో నాకు స్టోరీ చెప్పినప్పుడు ‘నేను గ్లామర్‌ పాత్రల్లో చేయడం లేదు. నాకు పెళ్లయింది. పాప కూడా ఉంది. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లు నేను వేసుకోను’ అని చెప్పా. ‘మంచి పాత్ర మేడమ్‌’ అని చెప్పి ఒప్పించారు. అక్కడకు వెళ్లిన తర్వాత యాక్టింగ్‌ మరోలా చేయమన్నారు. ద్వంద్వార్థాలు వచ్చేలా నన్ను పొగడటం మొదలు పెట్టారు. మా ఆయనను చూపించి.. ‘ఆయన మీ భర్తా’ అంటూ అడగటం ప్రారంభించారు. కథ చెప్పడానికి వచ్చినప్పుడు పరిచయం చేశా. షూటింగ్‌ స్పాట్‌లో కూడా పరిచయం చేశా. అయినా కూడా పదేపదే ఏదో రకంగా విసిగించేవారు. దాంతో కోపం వచ్చేసి, ‘ఒరేయ్‌ ఇలా రారా’ అని పిలిచి చెంపమీద లాగిపెట్టి కొట్టా! ‘చెప్పు తెగుతుంది. నీకు అన్నీ చెప్పి వచ్చా. అప్పుడు సరేనని, ఇక్కడకు తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి పనులు చేయమంటావేంటిరా! ఏమనుకున్నావు నన్ను. నేను ఈ సినిమా చేయను. నాకు అవసరం లేదు.’ అని చెప్పి వచ్చేశా. పోలీస్‌ కంప్లయింట్‌ కూడా ఇద్దామని అనుకున్నా. కానీ, ఆ సినిమా హీరో వచ్చి, ‘వద్దు మేడమ్‌. నా సినిమా ఆగిపోతుంది. దీన్ని ఇక్కడితో వదిలేయండి’ అని అనడంతో పోనీలే అని వదిలేశా!

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం!
రాణి: నాకు ఇష్టమైన పేరు
రక్ష: ప్రేక్షకుల కోసం పెట్టుకున్న పేరు
నంది అవార్డు: నా ప్రాణం, నా కల
నాన్న: అమ్మానాన్న రెండు కళ్లు
పెళ్లి: ఆశ. పిల్లాపాపలతో సరదాగా ఉండాలనుకున్నా. 
కూతురు: ప్రాణానికి ప్రాణం
కోపం: నా శత్రువు
రవిబాబు: ఆయనను మర్చిపోలేను. ‘ప్రేమలేఖ’ తర్వాత ‘నచ్చావులే’ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. 
భర్త: నా కలల రాజా
ఆలీ: మంచి ఫ్రెండ్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.