close

తాజా వార్తలు

అందుకేనేమో నేనెక్కువ సినిమాలు చేయలేదు

ఒకరు కళ్లతోనే నటిస్తారు.. మరొకరు ఆ కళ్లతోనే పడేస్తారు.. ఆ కన్నూ.. ఈ కన్నూ కలిస్తే.. కల్మషం లేని కాపురంగా నిలిచింది. ఆ నట జంట రీల్‌ స్టోరీ ఏంటో.. రియల్‌ స్టోరీ ఏంటో..  చెప్పేశారు. వారే బుల్లితెర నటులు ప్రీతి నిగమ్‌, నాగేష్‌లు. అనేక సీరియల్స్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వారు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. 

ప్రీతి నిగమ్‌ ఎక్కడి నుంచి..?
ప్రీతి నిగమ్‌: పక్కా హైదరాబాదీ. నిగమ్‌ అనేది సర్‌ నేమ్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి నా పూర్వీకులు ఎప్పుడో ఇక్కడకు వలస వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న కుటుంబం మాది. నేను యూపీకి ఎప్పుడూ వెళ్లలేదు కూడా. అందుకే నేను పక్కా హైదరాబాదీ. 
నాగేష్‌: ప్రీతి నిగమ్‌తో పెళ్లయిన తర్వాత వాళ్ల తాతగారు చెప్పారు. వీళ్ల ముత్తాతలు ఎప్పుడో ఇక్కడకు వచ్చేశారట. నిజాం రాజ్యంలో మంత్రులుగా ఉండేవారు. 

నిజాం పాలనలో మంత్రులంటే చాలా డబ్బులుంటాయనుకుంటా!
ప్రీతి నిగమ్‌: అప్పట్లో ఉండేవి. మా నాన్నగారు వదిలేశారు. 
నాగేష్‌: వరంగల్‌ దగ్గర వీరికి 50-60ఎకరాల భూమి కూడా ఉందట. ఆ భూమికి సంబంధించిన కాగితాలు ఉర్దూలో ఉన్నాయి.  దాని వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతోందని భావించిన ఆయన తగలబెట్టేశాడట. అయితే, ఆ భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 

సాధారణంగా పెళ్లి గుడిలో జరుగుతుంది.. ఆర్య సమాజ్‌లో జరుగుతుంది.. లేదంటే ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతుంది. మీ పెళ్లి ఎగ్జిబిషన్‌లో జరిగిందట!
నాగేష్‌: మన ఇండస్ట్రీ వాళ్లందరూ రావాలి కదా! అందుకనే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పెట్టారు. అప్పట్లో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్‌ లేవు. అందుకే అక్కడ పెట్టారు. 
ప్రీతి నిగమ్‌: మా తండ్రి ఎక్కువ ఆలోచించేవారు. వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మా తండ్రి తరపు చుట్టాలు.. మా ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నారు. 
నాగేష్‌: మాది అమలాపురం దగ్గర ఊరు. దీంతో తెలిసిన వాడు.. తెలియని వాడు.. చాలా మంది వచ్చేశారు. సాయంత్రం 7గంటలకు రిసెప్షన్‌ ప్రారంభమైతే, రాత్రి ఒంటిగంట వరకూ భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. 

మీ ఇద్దరికీ ఎక్కడ పరిచయం? ఒకరి విషయంలో మరొకరికి ఏం నచ్చాయి?
నాగేష్‌: రుతురాగాలు సెట్‌లో. 
ప్రీతి నిగమ్‌: నేను ఏం చూడకుండానే పెళ్లి చేసుకున్నా.
నాగేష్‌: ఈమె ఏమీ చూపించలేదు కూడా(నవ్వులు)
ప్రీతి నిగమ్‌: మా తల్లిదండ్రులు ఎవరిని చెబితే వారిని చేసుకోవాలని అనుకున్నా. అయితే, ఈయన పేరు చెప్పకుండా, ప్రపోజల్‌ తెచ్చేవారు. ‘ఆ అమ్మాయి ఎవరో చెబితే, మేము కూడా హెల్ప్‌ చేస్తాం’ అని అడిగేవాళ్లం. అందరికీ ఐస్‌క్రీమ్‌లు ఇప్పించేవారు. 1998లోనే రోజుకు రూ.500 ఖర్చు పెట్టేవారు.

మరి ఎలా ప్రపోజ్‌ చేశారు?
ప్రీతి నిగమ్‌: మామూలుగానే ప్రపోజ్‌ చేశారు. అయితే, మొదట నేను ఒప్పుకోలేదు. ఆయనకు శ్రుతి ఫుల్ సపోర్ట్‌ చేసేది. ఆ తర్వాత మా అక్కను కలిసి విషయం చెప్పారు. 

చెల్లికి ప్రపోజ్‌ చేద్దామని వెళ్లారా? లేక అక్కను చూసి చెల్లికి ప్రపోజ్‌ చేశారా?
నాగేష్‌: అక్కకు అప్పటికే మ్యారేజ్‌ అయిపోయింది. అయితే, అప్పటికే కొందరితో పరిచయాలు ఉన్నా, అవేవీ పెళ్లి వరకూ రాలేదు. ప్రీతి చాలా సౌమ్యంగా ఉండేది. ఆమెలోని యాటిట్యూడ్‌ వల్లే ఆమెను ప్రేమించా. నాకు ‘రుతురాగాలు’ ఆఫర్‌ రాకముందు నేను విశాఖపట్నంలో జాబ్‌ చేసేవాడిని. ఒక రోజు నేను ఆఫీస్‌కు వెళ్లలేదు. టీవీ పెడితే రుతురాగాలు వస్తోంది. దాన్ని చూసి నేను ‘బూతు రాగాలు’ అనుకున్నా. అప్పుడే ప్రీతినిగమ్‌ను చూశా. ఆ తర్వాత అదే సీరియల్‌లో నటించే అవకాశం నాకు వచ్చింది. 

ఏ టు జెడ్‌ లెటర్లతో అమ్మాయిలను ప్రపోజ్‌ చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారట!
నాగేష్‌: జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి, నా జేబులో చిన్న పాస్‌ పుస్తకాన్ని ఎప్పుడూ నాతోనే ఉంచుకునేవాడిని. ఎందుకంటే అప్పట్లో మొబైల్స్ ఏవీ లేవు కదా!  అలా ఫ్రెండ్స్‌ మొదటి అక్షరాన్ని బట్టి, ఆ పుస్తకంలో రాసుకునేవాడిని. ‘జెడ్‌’ అక్షరం పేరు లేకపోతే, మా అన్నయ్య స్నేహితురాలు, జీవా పేరును రాసుకున్నా.  ఇవన్నీ కాలేజ్‌ లైఫ్‌ స్టోరీలు..

పెళ్లయ్యాక అన్నీ చెప్పారా?
నాగేష్‌: ఆ పాస్‌ పుస్తకం పడేశా(నవ్వులు)

చిన్నప్పుడు బాయ్స్‌తో పాటు కలిసి మీరు ఓ గ్యాంగ్‌ను మెయింటేన్‌ చేసేవారట!
ప్రీతినిగమ్‌: స్కూల్లో నేను టామ్‌ బాయ్‌ని. ఎప్పుడూ అల్లరి చేస్తుండేదాన్ని. పోటీ ఏదైనా ఉందంటే, నా పేరు ముందే రాసేవారు. ఏ పోటీ అయినా కానీ, మనకు ప్రైజ్‌ వస్తుందా? రాదా? అన్నది నాకు ముఖ్యం కాదు. ప్రతి దానిలో పాల్గొనేదాన్ని.  మా నాన్నగారు కూడా అందులో పనిచేసేవారు. మేము స్కూల్లో ఉండగా, మాస్టర్‌.. విద్యార్ధిలాగానే ఉండేవాళ్లం. ఆయన కూడా అదే చెప్పేవారు. హోం వర్క్‌ చేయనందుకు ఒక రోజు నన్ను కొట్టారు. క్లాస్‌ అందరూ చూశారన్న కోపంతో ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని అనుకున్నాం. అందుకే ఆయన సైకిల్‌ పంక్చర్‌ చేసేవాళ్లం. అంతేకాదు, గాలిపోకుండా ఉండే వాషర్‌ను కూడా పడేశాం.. అప్పట్లో కెమెరాలు లేవు కదా! నాలుగైదు రోజుల చేశాం. ఆ విషయాలన్నీ ఇప్పుడు తలుచుకుంటే చాలా గిల్టీగా ఉంటుంది.

రుతురాగాలు చేస్తుండగా, మీ మ్యారేజ్‌కు ఇంట్లో ఒప్పుకున్నారా?
ప్రీతినిగమ్‌: నేను ఇలా ఒకరిని ఇష్టపడుతున్నా. వారినే చేసుకుంటా.. అని చెప్పలేదు.
నాగేష్‌: రుతురాగాలు సీరియల్‌ షూటింగ్‌కు వెళ్లాలంటే మొదట నన్ను పిక్‌  చేసుకుని, అందరినీ ఎక్కించుకుని చివరకు షూటింగ్‌ వెళ్లేవాళ్లు. అలా వీళ్ల ఇంటికి వెళ్లే ఛాన్స్ దొరికింది. 
ప్రీతినిగమ్‌: నాకు జంతువులంటే ఇష్టం. నాకు భయం లేదు. ఒక రోజు షూటింగ్‌ వెళ్తుంటే ఉదయం తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుందామని వెళ్తే, గోళ్లు గుచ్చుకోవడంతో వదిలేశా. అయితే, ఆ తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లా. నీళ్లలో వేసి ఉంచితే, అది ఏమీ తినడం లేదు. దీంతో అనవసరంగా దాన్ని తీసుకొచ్చామేమోనని బాధేసింది. అయితే, ఈ విషయాన్ని ఒక రోజు సెట్‌లో చెబుతుంటే, ఈయన(నాగష్‌) విని, తెలియకపోయినా సలహాలు ఇచ్చేవారు. అప్పుడు ఈయన ప్రేమిస్తున్న బకారా ఎవరో తెలిసిపోయింది. దాంతో అప్పటి నుంచి మాట్లాడటం మానేశా. ‘ఆ తాబేలును ఎలా పెంచాలో మాకు తెలుసు’ అని బంధువులు ఎవరో అంటే దాన్ని ఇచ్చేశా. 

పెళ్లయిన తర్వాత మీ మధ్య విభేదాలు వచ్చాయా?
ప్రీతినిగమ్‌: రోజూ గొడవ పడతాం!(నవ్వులు)
నాగేష్‌: మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. పిల్లల విషయంలో మాత్రమే గొడవలు అవుతాయి

సాధారణంగా ఆడ సవతులు ఉంటారు.. మీకేంటి మగ సవుతులు ఉన్నారట!
ప్రీతినిగమ్‌: అవును ఉన్నారు. విజయాధోని, రామ్‌జగన్‌ ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి టూర్‌లకు వెళ్తారు.

మీ అబ్బాయి గురించి..
నాగేష్‌: వండర్‌ఫుల్‌ స్విమ్మర్‌. గంగానదిలో కూడా ఈతకొట్టాడు. అది చాలా కష్టం. హరిద్వార్‌ వద్ద రివర్‌ రాఫ్టింగ్‌ జరిగే చోట ఈత కొట్టడం మమూలు విషయం కాదు. ఈ ఏడాది తనే స్కేటింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో ఇండియా తరపున సెలెక్ట్‌ అయ్యాడు. 19ఏళ్ల తర్వాత మనకు కాంస్య పతకం వచ్చింది.

సాధారణంగా పర్సులో కుటుంబ సభ్యుల ఫొటోలు పెట్టుకుంటారు. అతనెవరో మీ ఫొటోను పెట్టుకుని తిరుగుతున్నారట!

నాగేష్‌: అతను నాకు ట్యాండ్‌ బండ్‌పై పరిచయం అయ్యాడు. ఏదో టెన్షన్‌లో ఉన్నాడని అర్థమైంది. విషయం ఏంటని అడిగితే, ‘నా జాబ్‌పోయింది సర్‌. ఎక్కడికి వెళ్లినా రిజెక్ట్‌ అవుతున్నా, చాలా సమస్యలు ఉన్నాయి’ అని చెప్పాడు. నువ్వు బాధపడవద్దు.. నా ఉద్యోగం కూడా పోయింది. అని చెప్పా.. అప్పటి నుంచి నేను ఇంటర్వ్యూలకు వెళ్లిన ప్రతిసారి అతని రెజ్యూమ్‌ అందరికీ ఇచ్చేవాడిని. నేను ఒక ఇంటర్వ్యూకు వెళ్తే, ఈ అబ్బాయి కూడా ఉన్నాడు. ఒక వేళ నాకు జాబ్‌ వస్తే, అతనికి ఇచ్చేదమని అనుకున్నా. ఇద్దరికీ జాబ్‌ వచ్చింది. అతను మేనేజర్‌ స్థాయికి వచ్చే వరకూ నేను అక్కడే జాబ్‌ చేశా. 
ప్రీతినిగమ్‌: నాగేష్‌ చాలామందికి జాబ్‌ ఇప్పించారు.

మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడే ఏడ్చేశారట
ప్రీతినిగమ్‌: అప్పటి వరకూ నిగమ్‌ సిస్టర్స్‌ అంటే స్టేజ్‌పై ఎంతో క్రేజ్‌. మా డ్యాన్స్‌ గురువుగారు అనిల్‌కుమార్‌గారు మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అంబేడ్కర్‌ డాక్యుమెంటరీలో నటిస్తుండగా తెలుగులో డైలాగ్‌ చెప్పడం రాలేదు. దీంతో అందరూ నవ్వేశారు. నాకేమో కన్నీళ్లు ఆగలేదు. ఇచ్చిన డైలాగ్‌లన్నీ చెప్పేశా.

అమితాబ్‌ బచ్చన్‌తో నటించారా?
ప్రీతినిగమ్‌: ‘షూబాయ్‌’ అనే చిత్రంలో నటించా. నాకు చిన్నప్పటి నుంచి అమితాబ్-రేఖ అంటే ఎంతో పిచ్చి. ఇంట్లో వాల్‌పోస్టర్లు అతికించేదానిని. అలాంటిది.. ఆయనతో పనిచేయడం చాలా సంతోషమనిపించింది. అంతేకాదు, ఆయన నన్ను మెచ్చుకున్నారు కూడా. ‘మీతో ఫొటో దిగవచ్చా’ అని అడిగితే, షూటింగ్‌ తర్వాత అన్నారు. మళ్లీ అడిగితే బాగోదేమోననిపించింది. అయితే, ఆయనే గుర్తు పెట్టుకుని మరీ ఫొటోదిగడానికి పిలిచారు. అయితే, ఆయనతో దిగిన ఫొటోను మా ఆయన పొగొట్టారు.  
ప్రీతినిగమ్‌కు సినిమాల్లో మంచి పేరు రాకపోవడానికి కారణం ఏంటి?
ప్రీతినిగమ్‌: అది మన ప్రొడ్యూసర్లు, దర్శకులు ఆలోచించాలి. నాలో కొన్ని లోపాలు ఉన్నాయి. పీఆర్వోను పెట్టుకోలేదు. ఇండస్ట్రీకి దగ్గరగా కూడా ఉండను. బహుశా అందుకే నాకు పిలిచి అవకాశాలు ఇవ్వడం లేదేమో!
నాగేష్‌: ఈటీవీ ప్రారంభమైనప్పటి నుంచి తీసుకుంటే, 8.30స్లాట్‌లో ప్రీతి ఆర్టిస్ట్‌. ఈ విషయాన్ని మాకొక ప్రొడ్యూసర్‌ చెప్పారు. ఎండమావులు నుంచి అలా చేసుకుంటూ వచ్చింది. మొదట్లో రాజశేఖర్‌గారితో సోలో క్యారెక్టర్‌ నేను చేయాల్సింది. కుదరలేదు. భాగ్యశ్రీ ఆ పాత్ర చేశారు. తనకున్న భయాల వల్ల సినిమాలు చేయడానికి ఆసక్తి చూపలేదు. క్యారెక్టర్‌ ఏంటో తెలిసిన తర్వాత తను చేసిన ఫస్ట్‌ సినిమా  ‘స్టూడెంట్‌ నెం.‌1’

గడ్డం వెనుక కథ ఏంటి?
నాగేష్‌: సీరియల్‌ కోసం పెంచుతున్నాను అంతే! కథేం లేదు.
ప్రీతినిగమ్‌: ఒక సీరియల్‌ కోసం క్లీన్‌ షేవ్‌ చేసుకుని ఇంటికి వచ్చారు. అప్పటికి మా పాప చిన్న పిల్ల. డోర్‌ కొట్టగానే, తలుపు తీసి, ‘అమ్మా ఎవరో అంకుల్‌ వచ్చారు’ అంది. తీరా చూస్తే, ఈయన(నవ్వులు)

ఇండస్ట్రీకి రావడం వల్ల మంచి జరిగింది అనిపిస్తుందా?
నాగేష్‌: కచ్చితంగా.. మాకు అన్ని రకాలుగా గౌరవం లభించింది. శ్యామబెనగల్‌గారు మా ఇంటికి వచ్చి మరీ భోజనం చేసి వెళ్లారు. చాలా గొప్ప డైరెక్టర్‌.. ఇంకో విషయమేమిటంటే, ప్రీతి జాతీయ అవార్డు అందుకుంటున్న సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ‘కావ్యాంజలి’ సీరియల్‌ చేసే సమయానికి మా అబ్బాయి ఆర్యన్‌కు ఆరు నెలలు. ప్రీతి చాలా కష్టపడింది. ప్రీతి లేకుండా సీరియల్‌ చేసి, ఏక్తాకపూర్‌కు ఇస్తే తీసుకోలేదు. 

ప్రీతినిగమ్‌: మా అబ్బాయి పుట్టినప్పుడు చిన్న సమస్య వచ్చింది. ట్రీట్‌మెంట్‌ దగ్గర ఇబ్బంది పడుతున్నా. అలాంటి సమయంలో సీరియల్‌ చేసే అవకాశం వస్తే, ‘నేను చేయను’ అని చెప్పా. అయితే, ఒక గుడికి వెళ్తే, అక్కడ ఒక అమ్మాయికి పూనకం వచ్చింది. నేను వెళ్లి ‘నా బాబుకు నయం అవుతుందా’ అని అడిగితే కాదు, అని చెప్పింది. నేను గొడవ కూడా పెట్టుకున్నా. చెన్నైకి వెళ్లు అని మాత్రం చెప్పింది. ఒక 15రోజుల తర్వాత ఈ ఆఫర్‌ వచ్చింది. ఆ సమయంలో అన్ని గుళ్లకు తిరిగా, సర్జరీ లేకుండా అతనికి నయం అయిపోయింది.

మరికొన్ని ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం

నాగేష్‌ ప్రీతినిగమ్‌
ప్రీతి నిగమ్‌: ఒక అద్భుతమైన క్యారెక్టర్‌
ఏ టు జెడ్‌ అమ్మాయిలు: పాస్‌
ఆర్యన్‌: మై డ్రీమ్‌
పాప: ఇంకో గుండె
సీరియల్‌: ప్యాషన్‌
అమలాపురం: హెవెన్‌
ప్రేమ: అమ్మాయా? ప్రేమ.. అంటే అమ్మ
నాగేష్‌: లైఫ్‌
సినిమా: ప్యాషన్
సీరియల్‌: ఇంకో జీవితం
స్టేజ్‌: ఊపిరి
డబ్బు: అవసరం లేదు
పిల్లలు: నా ప్రాణం
ప్రేమ: నాగేష్‌, ఫ్యామిలీ

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.