close

తాజా వార్తలు

అందుకే సినిమాలు వద్దనుకున్నా

నేను ముందు భోజనం చేశానని ఆ నటి క్యారేజ్‌ని కాలితో తన్నింది!

అమ్మ పాత్ర అంటే ఆవిడే గుర్తొస్తుంది. ఆవిడ డబ్బింగ్‌ చెబితే ఏ నటికైనా అతికినట్లు సరిపోతుంది. ‘భూ కైలాస్‌’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 700లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రవేసి.. ఆ డబ్బింగ్‌నే ఇంటిపేరుగా మార్చుకున్న జానకి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సంగతులు పంచుకున్నారిలా..


 

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలమైంది?
డబ్బింగ్‌ జానకి: నేను ఇండస్ట్రీకి వచ్చి 60ఏళ్లు దాటింది. నాకు 15-16ఏళ్ల వయసుండగానే పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చా.  మాది పెద్దాపురం.

చిత్ర పరిశ్రమకు రావాలని ఎందుకు అనిపించింది?
డబ్బింగ్‌ జానకి: బతుకు తెరువు కోసమే వచ్చా. మా ఆయన మిలటరీలో పనిచేసేవారు. నాకేమో చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అలవాటు. అలా మద్రాసు వచ్చి, సినిమాల్లో అవకాశాల కోసం తిరిగా. అప్పుడు మా ఇంటి అద్దె 16రూపాయలు.

డబ్బింగ్‌ మీ ఇంటిపేరు ఎలా అయింది?
డబ్బింగ్‌ జానకి: అప్పట్లో ఆర్టిస్ట్‌ జానకి అంటే.. ‘ఏ జానకీ అండి’ అని అడిగేవారు. నేను డబ్బింగ్‌ చెబుతుండటంతో నా పేరు అన్ని చోట్ల డబ్బింగ్‌ జానకి అని రాసేవారు. 

తొలిసారి ఏ సినిమాకు డబ్బింగ్‌ చెప్పారు?
డబ్బింగ్‌ జానకి: తమిళ చిత్రం ‘గూఢచారి 117’ను తెలుగులోకి డబ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీగారు పిలిచి ఒక పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలని అడగడంతో ఆ సినిమాలో సచ్చుకి చెప్పా. 

అసలు మీ సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది. నటిగానా? డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానా?
డబ్బింగ్‌ జానకి: నటిగానే నా కెరీర్‌ ప్రారంభమైంది. ‘భూ కైలాస్‌’లో జమున చెలికత్తెగా కనిపిస్తా. 

అప్పట్లో మీతో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్స్‌ అయ్యారు? ఆ స్థాయికి ఎందుకు వెళ్లలేకపోయానే అని అనిపించిందా?
డబ్బింగ్‌ జానకి: నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. మొదటి నుంచి నేను పెద్ద స్టార్‌ని, పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనుకోలేదు . కేవలం నా కుటుంబానికి సరిపడా సంపాదించుకుంటే చాలు అనుకున్నా. డబ్బింగ్‌లు చెప్పా.. డ్రామాలు వేశా.. గ్రూప్‌ డ్యాన్స్‌లు చేశా.. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశా. ఇదంతా కేవలం బతుకు తెరువుకోసమే. ఇవాల్టికీ ఆ ఆలోచన లేదు.

ఎన్ని భాషల్లో నటించారు?
డబ్బింగ్‌ జానకి: తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, ఒరియా భాషల్లో నటించా. దాదాపు ఏడెనిమిది వందల సినిమాల్లో నటించా. 

నటులు విభిన్న పాత్రలు ఎంచుకుంటారు? కానీ, మీరు విశ్వనాథ్‌గారి చిత్రాల్లో ఒకే తరహా పాత్రలు చేశారు?
డబ్బింగ్‌ జానకి: నేనెప్పుడూ అలా అనుకోలేదు. విశ్వనాథ్‌గారిది ఒక స్కూల్‌. ఒకరకంగా నన్ను నిలబెట్టింది కూడా ఆయన చిత్రాలే. ‘శంకరాభరణం’లో చిన్న పాత్ర అయినా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్‌కు తల్లి పాత్రలో కనిపించా. అది అందరికీ గుర్తుండిపోయింది. ఎక్కడికి వెళ్లినా, ‘కమల్‌ అమ్మ’ అంటూ పలకరించేవారు. 

నాటకాల్లో మిమ్మల్ని జూనియర్‌ కన్నాంబ అనేవారట!
డబ్బింగ్‌ జానకి: నేను కన్నాంబ అవార్డు తీసుకున్నా. నాటక రంగానికి సంబంధించి అప్పట్లో ‘కన్నాంబం’, ‘బళ్లారి రాఘవ’ అవార్డులకు పోటీ పెట్టారు. గొప్ప గొప్ప ఆర్టిస్ట్‌లను దాటుకుని ఆ అవార్డు నన్ను వరించింది. ఇప్పటికీ ఈ సంఘటన నా కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ సమయంలోనే వెండి కిరీటం ఇచ్చారు.

ప్రస్తుతం ఆర్థికంగా ఎలా ఉన్నారు?
డబ్బింగ్‌ జానకి: బాగా ఆస్తులు సంపాదించలేదు కానీ, ఉండటానికి, తినడానికి లోటు లేదు. మద్రాసులో ఇల్లు ఉంది. ప్రస్తుతం నేను అక్కడే ఉంటున్నా. నా పిల్లలు కూడా నాతో పాటే ఉంటారు. అంతా నన్ను బాగా చూసుకుంటారు.

హైదరాబాద్‌ రాకపోవడానికి కారణం ఏంటి?
డబ్బింగ్‌ జానకి: ఒకప్పుడు అవకాశాల కోసం మద్రాసు వచ్చాం. అక్కడ స్థిరపడిపోయాం. ప్రస్తుతం అంతా బాగుంది. హైదరాబాద్‌లో అందరూ కొత్తవాళ్లు. మళ్లీ అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగాలి. అందుకే వద్దనుకున్నా. 

చిన్నప్పుడు మీ పిన్ని మిమ్మల్ని బాగా కొట్టేవారట! 
డబ్బింగ్‌ జానకి: (నవ్వులు) నేను చేసే తప్పులకు అలా దెబ్బలు పడేవి. ఒకరోజు మా పిన్ని ఏదో పిండి వంట చేస్తూ బయటకు వెళ్లింది. పొయ్యిమీద నూనె అలాగే ఉంది. ఇంతలోనే నేను, మా చెల్లి వచ్చి, అందులో పిండి వేశాం. అంతే, ఒక్కసారిగా ఆ పిండి ముద్దలు పేలడం ప్రారంభించాయి. నాకు చాలా భయంవేసింది. దీంతో నీళ్లు పోసేద్దామనుకున్నా. ఇంతలో మా పిన్ని వచ్చింది. మేము చేసిన పనికి చీపురుకట్ట పట్టుకుని ఇంటి చుట్టూ తిప్పుతూ బాగా కొట్టింది. కానీ, ఎందుకు కొట్టానా? అని ఆమె తర్వాత బాధపడింది. 

మీరు నటిగా ఉన్నప్పుడు మీ సన్నివేశాలకు సంబంధించి స్క్రిప్ట్‌ పంపేవారా?
డబ్బింగ్‌ జానకి: చాలా మంది పంపేవారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాకైతే ఎన్టీఆర్‌గారు ఇంటికి పిలిచి మరీ స్క్రిప్ట్‌ ఇచ్చారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో ఉన్న అగ్ర హీరోలందరితోనూ చేశా. ఇప్పుడున్నవారితో ఏ సినిమా చేయలేదు. 

మీకు సీరియల్స్‌తో మంచి పేరు వచ్చిందట నిజమేనా?
డబ్బింగ్‌ జానకి: అవును! సినిమాలను పక్కన పెడితే, సీరియల్స్‌కు వచ్చినప్పటి నుంచి రోజూ జనానికి కనిపిస్తాం. ఒక రోజు నేనూ, కేఆర్‌ విజయగారు సామర్ల కోట రైల్వేస్టేషన్‌లో రైలు కోసం వెయిట్‌ చేస్తున్నాం. అప్పుడు ఆమె ‘మహిళ’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు. అక్కడ ఉన్న జనమంతా ఆమె దగ్గరకు వచ్చి, ‘అమ్మా! మీ మహిళ నాటిక చాలా బాగుంది. చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. దేవత అంటే కేఆర్‌ విజయనే గుర్తుకు వస్తారు. అలాంటిది ఆమె నటించిన నాటిక గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యమేసింది. నాటికకు ఉన్న శక్తి ఏంటో అప్పుడు తెలిసింది.  

మీరు రంగు తక్కువగా ఉన్నారని ‘లవకుశ’లో తీసుకోలేదట!
డబ్బింగ్‌ జానకి: అప్పట్లో ఏ పాత్రనైనా అన్ని రకాలుగా పరిశీలించేవారు. చెలికత్తె వేషానికి కూడా మేకప్‌ టెస్ట్‌, ఫొటోషూట్‌ చేసి అప్పుడు సెలెక్ట్‌ చేసేవారు. అలా ‘లవకుశ’కు అన్ని రకాలుగా పరీక్షించి, కలర్‌ తక్కువగా ఉన్నానని వద్దనుకున్నారట. ఆశ్చర్యకర విషయమేమిటంటే, ఆ పాత్రలో జయంతిగారిని తీసుకున్నారు. ఆ సినిమా చూసినప్పుడల్లా ‘అయ్యో ఇందులో నేను నటించాల్సింది కదా’ అంటూ బాధపడుతుంటా.

‘నిండు సంసారం’ చేస్తుండగా ప్రమాదం జరిగిందట!
డబ్బింగ్‌ జానకి: నాకు నీళ్లంటే భయం. ఇప్పటికీ అలాంటి సన్నివేశాలు ఉంటే చేయనని చెప్పేస్తా. ఆ సినిమాలో నేను రామారావుగారి చెల్లెలి పాత్ర చేశా. చెట్టుపై నుంచి నీళ్లలోకి దూకి, ఆత్మహత్య చేసుకునే సన్నివేశమది. డూప్‌ను కూడా పెట్టారు. అయితే, నేను చెట్టుపై నుంచి దూకేశా. దీంతో ముక్కుల్లోకి, నోట్లోకి నీళ్లు వెళ్లిపోయాయి. స్పృహ కూడా కోల్పోయా. ఎలాగోలా నన్ను బయటకు తీసుకొచ్చి బతికించారు. అప్పటి నుంచి అలాంటి సన్నివేశాలు చేయకూడదు అనుకున్నాను. 

తమిళ ఇండస్ట్రీ వల్లే మంచిపేరు వచ్చిందని చెబుతారట. తెలుగు ఇండస్ట్రీ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా?
డబ్బింగ్‌ జానకి: అలా ఏమీ లేదు. రెండు చిత్ర పరిశ్రమల్లో మంచి సినిమాలే చేశా. ఇంకా చెప్పాలంటే తెలుగులో నేను చేసిన అనేక సినిమాల్లో మంచి పేరు వచ్చింది. అయితే, తమిళ ఇండస్ట్రీలో హీరోల ప్రవర్తన కానీ, మరేదైనా కానీ అదొక కంఫర్ట్‌ జోన్‌ అనిపిస్తుంది. నేను అన్ని సంవత్సరాలు అక్కడ ఉండటం వల్ల అలా అనిపించిదేమో!

ఏవీఎం స్టూడియోలో పర్మనెంట్‌ ఆర్టిస్ట్‌గా చేయమంటే రానన్నారట. అందుకే మీరు హీరోయిన్‌గా ఎదగలేదని అనుకుంటున్నారా?
డబ్బింగ్‌ జానకి: అలా ఏమీ లేదండీ! ‘పర్మనెంట్‌ ఆర్టిస్ట్‌గా చేయాలని అడుగుతారు. సంతకం పెట్టవద్దు’ అని నాకు కొంతమంది ముందు చెప్పారు. అందుకే నేను సంతకం పెట్టలేదు. ఒక వేళ సంతకం పెట్టి ఉంటే, వాళ్లు ఏ పాత్ర ఇచ్చినా చేయాల్సి వచ్చేది. ఇంకో సంస్థలో చేయడానికి వీల్లేకుండా పోయేది. 

ఎన్ని అవార్డులు వచ్చాయి?
డబ్బింగ్‌ జానకి: ‘అమ్ములు’ సినిమాకు మాత్రమే నాకు నంది అవార్డు వచ్చింది. 

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
డబ్బింగ్‌ జానకి: సినిమాలు లేవు కానీ, సీరియల్స్‌ చేస్తున్నా. ‘సీతారామయ్యగారి మనవరాలు’ దగ్గరి నుంచి ఇటీవల ‘చిత్రలహరి’ వరకూ రోహిణి హట్టంగడిగారికి నేనే డబ్బింగ్‌ చెబుతున్నా. ఆవిడ పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. 

ఒక యాక్టర్‌ భోజనం చేయడం కన్నా ముందు మీరు భోజనం చేశారని గొడవైందట!
డబ్బింగ్‌ జానకి: అవుట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్తే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రూమ్‌ ఇస్తున్నారు కానీ, అప్పట్లో ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక రూమ్‌ ఇచ్చేవాళ్లు. త్వరగా భోజనం చేసి, పడుకోవడం నాకు అలవాటు. అలాగే నేను భోజనం చేసి పడుకున్నా. ఆవిడ తీరిగ్గా వచ్చి, ‘జానకి తినేసిందా? అంటే ఆవిడ తిన్న తర్వాత మిగిలినది నేను తినాలా’ అని క్యారేజ్‌ను ఒక్క తన్ను తన్నింది. అంతే అన్నమంతా చిందరవందరగా పడిపోయింది. ఆ తర్వాత దానికి ఫలితం ఆవిడ అనుభవించింది. ఆమె పేరు చెప్పలేను కానీ, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంది.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానం

తెలుగు ఇండస్ట్రీ: చాలా గొప్పది
తమిళ ఇండస్ట్రీ: నాకు ఆశ్రయం ఇచ్చింది
కమల్‌హాసన్‌: గ్రేట్‌ ఆర్టిస్ట్‌
విశ్వనాథ్‌: నటన భిక్ష పెట్టిన దేవుడు
భూకైలాస్‌: మొదటిసారి నిలబెట్టిన సినిమా
పెళ్లి: గొప్ప అనుభూతి అని చెప్పలేను కానీ..
పిన్ని: దైవం
జీవితం: ఎన్నో పాఠాలు నేర్పింది 
డబ్బింగ్‌: ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది
నాటకం: నా ఊపిరి
డబ్బు: బతకడానికి కావాలంతే!
ఆలీ: నా బిడ్డలాంటివాడు


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.