close

తాజా వార్తలు

తనే లేకపోతే చనిపోయి ఉండేదాన్ని!

ఆ విషయంలో పవన్‌కు నాకూ గొడవైంది: ఆలీ 

ఆమె చూపులు ఎన్నో హృదయాలను ప్రేమలో పడేశాయి..
ఆమె నవ్వులు ఎన్నో పెదవులను మనస్ఫూర్తిగా నవ్వేలా చేశాయి.
అందం.. అభినయం.. ఆలోచన.. ప్రేమ.. బాధ్యత.. త్యాగం.. గౌరవం అన్నీ ఒకే దగ్గర కలిశాయి.. ఒకే చోట మెరిశాయి. ఆ రూపమే రేణూ దేశాయ్‌..! ‘బద్రి’, ‘జానీ’ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత తెరవెనుక సాంకేతిక నిపుణురాలిగా పలు చిత్రాలకు పనిచేశారు. త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సంగతులు పంచుకున్నారు..

నమస్కారం రేణు దేశాయ్‌ గారూ..! బాగున్నారా!
రేణు దేశాయ్‌: చాలా బాగున్నా! 
మీ పేరంటే మీకు ఇష్టం ఉండదట!
రేణు దేశాయ్‌: అస్సలు ఇష్టం ఉండదు. నా పేరులో పెద్ద క్రియేటివిటీ ఏమీ లేదు. రేణు అంటే ఎలక్ట్రాన్‌. అణు అంటే అణుశక్తి.. మా అమ్మమ్మ అలా పెట్టేశారు. హీరావతి అని పెడితే బాగుండేది. ఇంకా రేవతి, లేదా రేవా అని పెట్టినా భలే ఉండేది. 

మరి మీ పాపకు మీరు అనుకున్న పేరు పెట్టారా?
రేణు దేశాయ్‌: పాపకే కాదు.. బాబు కూడా ఛాయిస్‌ ఇస్తూ, రెండు పేర్లు పెట్టాను. పాపకు ఆద్య కాత్యాయిని.. బాబుకు అకీరా నందన్‌.. అని పెట్టా.

అకీరా నందన్‌ ఏం చేస్తున్నాడు?
రేణు దేశాయ్‌: ఇప్పుడు తను పుణెలో ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్నాడు. పాప కూడా అక్కడే ఉంది. 

‘బద్రి’ కోసం పూరి జగన్నాథ్‌కు రేణు దేశాయ్‌ అనే అమ్మాయి ఎక్కడ కనిపించింది?
రేణు దేశాయ్‌: అప్పట్లో నేను ముంబయిలో మోడలింగ్‌ చేసేదాన్ని. పూరిగారికి నా ఫొటో ఎక్కడో దొరికింది. నా వివరాలు అన్నీ సేకరించి, నా ఫొటోను ఆయన డైరీలో పెట్టుకున్నారు. కల్యాణ్‌గారు ఎప్పుడు డేట్స్‌ ఇస్తే, అప్పుడు నా ఫొటో చూపించి, ‘హీరోయిన్‌గా ఈమెను అనుకుంటున్నా’ అని చెబుదామని అనుకున్నారు. కల్యాణ్‌ గారు కథ ఓకే చెప్పడంతో ఇద్దరూ కలిసి ముంబయి వచ్చి, నాకు ఫోన్‌ చేశారు. ఆ సమయంలో నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం లేదు. దర్శకత్వం చేయాలని ఉండేది. అప్పటికే నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నా. ఫోన్‌ చేసి, ‘సినిమాలో హీరోయిన్‌గా చేయాలి’ అని అడిగారు. ‘నేను హీరోయిన్‌ కాదు.. హీరోయిన్‌ మెటీరియల్‌ అంతకన్నా కాదు.. నేను చేయను’ అని చెప్పేశా. ‘కాదమ్మా.. చాలా మంచి రోల్‌.. మీరు తప్పకుండా చేయాలి.. ఒక్కసారి డైరెక్టర్‌ని కలవండి’ నన్ను ఒప్పించారు. ‘కలుస్తాను.. కానీ, హోటల్‌ లాబీలో మాత్రమే’ అని కచ్చితంగా చెప్పేశా. అప్పుడు పూరిగారు కథ, సరయు పాత్ర(సినిమాలో అమీషా పటేల్‌ ఈ పాత్ర పోషించింది)  గురించి చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. అయితే, వెన్నెల పాత్ర గురించి నాకు తెలియదు. నన్ను సరయు పాత్రలో అనుకున్నారు. చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. మంచి రోల్‌ అని ఒప్పుకొన్నా. అయితే, హీరోను కలిసిన తర్వాతే తాను నటించే విషయంపై స్పష్టతనిస్తానని చెప్పా. ఎందుకంటే అప్పటికి ముంబయి, పుణెలలో సౌత్‌ స్టార్స్‌ అంటే వెంకటేష్‌, నాగార్జున, చిరంజీవి.. తమిళ్‌లో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌.. ఇంతే తెలుసు. అక్కడ ఎప్పుడూ పవన్‌కల్యాణ్‌ అనే పేరే వినలేదు. ‘సర్‌.. ఆరు నెలలు నేను ఏ హీరోతో పనిచేయాలి.. నాకు కాస్త సౌకర్యంగా ఉండాలి..’ ఇలా అడిగేదాన్ని. ఆ తర్వాత మా అమ్మతో కలిసి హైదరాబాద్‌కు వచ్చా. ఇది ‘బద్రి’ సినిమాకు ముందు జరిగింది.

మొదటిసారి పవన్‌కల్యాణ్‌ను ఎక్కడ చూశారు?
రేణు దేశాయ్‌: రామానాయుడు స్టూడియోలో ‘తమ్ముడు’ షూటింగ్‌ జరుగుతుంటే అక్కడ చూశా. వచ్చాక తెలిసింది.. ఆయన ఇక్కడ పెద్దస్టారని. ఇప్పుడన్నీ కలిసిపోయాయి కానీ, అప్పట్లో ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. పైగా నేను చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని కాను. 
తొలిసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి?
రేణు దేశాయ్‌: వచ్చారు.. కలిశాం.. మాట్లాడుకున్నాం. అంతే.. సినిమాటోగ్రాఫర్‌ మధు.. మా అమ్మగారు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు అవన్నీ చెబుతుంటే క్రేజీగా ఉంది. (నవ్వులు)

24ఫ్రేమ్స్‌లో మీరు నేర్చుకోవాల్సినవి ఏం ఉన్నాయి?
రేణు దేశాయ్‌: ఆర్ట్‌ డైరెక్షన్ నేర్చుకోవాలి‌. స్టిల్‌ కెమెరా గురించి కొంత నేర్చుకున్నా. 
త్వరలోనే రేణు దేశాయ్‌ను డైరెక్టర్‌గా చూడవచ్చా?
రేణు దేశాయ్‌: మరాఠీలో చూశారు. తెలుగులో చూస్తారు. కథ నేనే రాసుకున్నా. ఇప్పుడు దర్శకత్వం వహించబోతున్నా.

ఎలాంటి కథ?
రేణు దేశాయ్‌: నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూస్తూ, చేస్తూ పెరిగాను. నాకు వరి, గోధుమ పండించటం తెలుసు. మా పొలంలో పనిచేసిన కూలీలకు అమ్మ డబ్బులిస్తుంటే, వాళ్ల కష్టాలు చెప్పుకొనేవాళ్లు. రైతులు ఇంత కష్టపడతారా? అని అప్పుడే అనిపించింది. 17ఏళ్ల వయసులోనే మోడల్‌గా చేశా. 18ఏళ్లకు ‘బద్రి’ చేశాను. 19వ ఏట పెళ్లయింది. 23ఏళ్లకు అకీరాను, 29ఏళ్లకు ఆద్యను కన్నాను. ఇప్పటివరకూ నా జీవితంలో ఎక్కువ భాగం భార్యగా, తల్లిగా గడిచిపోయింది. ఆద్య పెద్దది అయిన తర్వాత సమయం మిగులుతోంది. దీంతో రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టా. ఆ ఆలోచనల నుంచే కథ పుట్టింది. అలా అని రైతు ఆత్మహత్యల నేపథ్యంలో సందేశాత్మకంగా తీస్తే, అది డాక్యుమెంటరీ అవుతుంది. అలా కాకుండా రైతుల పిల్లల పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి కథ సాగుతుంది. 
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా?
రేణు దేశాయ్‌: అస్సలు లేదు. 

అకీరాను భవిష్యత్‌లో ఏం చేద్దామనుకుంటున్నారు?
రేణు దేశాయ్‌: నేను ఏం చేద్దామనుకోవడం లేదు. వాడికి ఎనిమదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ప్రొఫెషన్‌ మార్చుకుంటూ వచ్చాడు. అప్పుడు వాడికి క్రికెటర్‌ అవ్వాలని ఉండేది. ఆ తర్వాత బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అవ్వాలనుకున్నాడు. 10ఏళ్ల వయసులో యూట్యూబర్‌ అన్నాడు. గతేడాది రైటర్‌ అవుతానన్నాడు. ఇప్పుడు మ్యూజిక్‌ నేర్చుకుంటా అంటున్నాడు. ఒక తల్లిగా మంచి చెప్పడం.. సంస్కారవంతుడిగా చేయడం.. 18ఏళ్లు తర్వాత వాడిని వదిలేయడమే నేను చేయగలిగేది. 
తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కదా!
రేణు దేశాయ్‌: ఇంకా బాగా మాట్లాడటం రాలేదు. పుణెలో అందరూ ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ మాట్లాడతారు. మనం ఏ కార్యక్రమానికి వెళ్తామో వారి భాష మాట్లాడితేనే బాగుంటుంది.
నటుడిగా కాకుండా, వ్యక్తిగతంగా ఆలీ గురించి మీ అభిప్రాయం?
రేణు దేశాయ్‌: మిమ్మల్ని సినిమా నటుడిగా ఎప్పుడూ చూడలేదు. కల్యాణ్‌గారికి మీకూ ఉన్న స్నేహం వల్ల ఒక కుటుంబ సభ్యుడిగానే చూశాం. ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకున్నది లేదు.. కలిసింది లేదు. కానీ, మీరు ఎప్పటికీ మా కుటుంబంలోని వ్యక్తిలాంటివారే! (మధ్యలో ఆలీ అందుకుని.. ‘జానీ’ షూటింగ్‌ సమయంలో మనం ముగ్గురం వెళ్లి పానీ పూరి తిన్నాం. మీరు డ్రైవర్‌తో మరాఠీలో మాట్లాడుతుంటే మేమిద్దరం అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉన్నాం... (నవ్వులు)

‘బద్రి’లో మీరు చెప్పిన మొదటి డైలాగ్‌ ఏంటి?
రేణు దేశాయ్‌: నాకు గుర్తులేదు. కానీ, ఆ సినిమాలో అందరూ భోజనం చేస్తుంటే, లోపల మేమిద్దరం రొమాన్స్‌ చేసుకుంటూ పైకి మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటాం.. ఆ సీన్‌ ఇప్పటికీ గుర్తే!

అప్పట్లో మీపై ఒక టాక్‌ ఉంది?
రేణు దేశాయ్‌: నాపై చాలా టాక్‌లు ఉన్నాయి. మీరు అడిగేది ఏ టాక్‌ గురించి..?(నవ్వులు)

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకునే ఎడిటర్‌ మీరేనట!
రేణు దేశాయ్‌: నాకు ఎడిటర్‌గా ఎప్పుడూ రెమ్యునరేషన్‌ రాలేదు. ఫ్రీగా చేసి పెట్టేదాన్ని. ‘జానీ’, ‘ఖుషీ’, ‘అన్నవరం’, ‘బాలు’ సినిమాలకు ఎడిటింగ్‌ చేశా. ‘పులి’కి కొంచెం మాత్రమే ఎడిట్‌ చేశా. సూర్యగారు, ఏఎం రత్నం గారు, నా మాజీ భర్త ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం క్రెడిట్‌ కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో ‘ యే మేరా జహా..’ పాట షూట్‌ జరుగుతోంది. దానికి బృందగారు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరికి హిందీ రాదు. హిందీ పదాలు అర్థం కావటం లేదని నన్ను పంపారు. అది షూటింగ్‌ అయిపోయిన తర్వాత మార్తాండ్‌ కె వెంకటేష్‌ గారు ఎడిటింగ్‌ చేస్తుంటే మళ్లీ నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు అప్పటికే ఎడిటింగ్‌పై కాస్త అవగాహన ఉంది. నేను, వెంకటేష్‌గారు మూడు రోజుల పాటు ఎడిటింగ్‌ చేశాం. ఫైనల్‌ ఎడిట్‌ కోసం కల్యాణ్‌గారు శబ్దలయాకు వచ్చారు. నేను మాత్రం లోపలికి వెళ్లలేదు. భయంతో గేటు బయటే నిలబడ్డా. 5 నిమిషాల పాట 15నిమిషాలు అయినా, ఎవరూ బయటకు రావడం లేదు. ప్రొడక్షన్‌ వాళ్లను అడిగితే ‘చూస్తున్నారు’ అని అన్నారు. నా పనిపోయిందిరా బాబూ అనుకున్నా. కల్యాణ్‌గారు బయటకు వచ్చారు. ఆయన గురించి తెలుసు కదా! బాగుందంటే ఏమీ పొగడరు. కానీ, నచ్చకపోతే, మాత్రం తిట్లు పడతాయి. అప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు పంపినా తీసుకుంటా.. (నవ్వులు).

పీసీ శ్రీరామ్‌ మిమ్మల్ని ముద్దుగా పిలుస్తారట!
రేణు దేశాయ్‌: మినీ స్పీల్‌బర్గ్‌. ‘యే మేరా జహా’ పాటకు పనిచేస్తుండగా, ప్యాంట్, షర్ట్‌ వేసుకుని బ్లాక్‌ కళ్లద్దాలు, టోపీ పెట్టుకునే దాన్ని. అందుకే అలా పిలిచేవారు. 

మీ ఆఫీస్‌లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారట!
రేణు దేశాయ్‌: ఆడవాళ్లు చాలా మంచివాళ్లు, కష్టపడి పనిచేస్తారు. మల్టీటాస్కింగ్‌ చేస్తారు. నేను చేయబోయే కొత్త సినిమాకు దాదాపు 70శాతం మంది మహిళలనే పెట్టుకుంటా. 
మీ జీవితంలో మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?
రేణు దేశాయ్‌: సోనాలి. ఎనిమిదేళ్ల వయసు నుంచీ మేమిద్దరం ఫ్రెండ్స్‌. తను చెన్నైలో ఉంటుంది.  
మరి ఆవిడ మిమ్మల్ని తిడుతూ మెసేజ్‌ పెట్టింది?
రేణు దేశాయ్‌: మీకో విషయం చెబుతున్నా. ఆ దేవుడు దిగి వచ్చి, తను నన్ను తిట్టిందని చెప్పినా నమ్మను. స్టాంప్‌ పేపర్‌ మీద రాసిస్తా. తన ప్రేమకు బౌండరీలు ఉండవు.
మగవాళ్లు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవాళ్లు ఎందుకు చేసుకోకూడదు?అని మీరు పోస్ట్‌ పెట్టారు కదా! 
రేణు దేశాయ్‌: ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టా. దాని వల్లే అంత హడావిడి అయింది. సినిమాల వల్ల నేను ఒక పబ్లిక్‌ పర్సన్‌ కావచ్చు. కానీ, నాకు ఒక పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది కదా! దాన్ని నా అభిమానులకు తెలియజేసేందుకు ఆ పోస్ట్‌ పెట్టా. ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదేమీ దొంగపెళ్లి కాదు. కేవలం రెండు చేతులు కలిపి పోస్ట్‌ పెట్టినందుకు సర్కస్‌ చేసి పారేశారు. అవును! ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. నా పెళ్లిపై కూడా పెద్ద చర్చ.. రచ్చ.. నాకు, నా ఫ్రెండ్స్‌కి, నా పిల్లలకు లేని హడావుడి బయట వాళ్లకు ఉంది. (నవ్వులు).

ఆయన ఏం చేస్తారు?
రేణు దేశాయ్‌: ఐటీ కంపెనీ డైరెక్టర్‌. పుణెలో ఉంటారు. 
ఆయన పేరు ఏంటి?
రేణు దేశాయ్‌: పేరు మాత్రం చెప్పను!
మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చూడటానికి మీ ఫాదర్‌ రాలేదట!
రేణు దేశాయ్‌: అమ్మాయిని పుట్టానని రాలేదు. ఎందుకంటే నా కంటే ముందు అక్క పుట్టింది. రెండో సంతానంగా అబ్బాయి పుడితే బాగుండేది అనుకున్నారు. కానీ, ఆయన చనిపోయే ముందు ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా’ అని చెప్పారు. 
మొత్తం మీరు ఎంతమంది?
రేణు దేశాయ్‌: అక్క, నేను, తమ్ముడు.  అక్క పుణెలో, తమ్ముడు ముంబయిలో ఉంటారు. అందరం అప్పుడప్పుడు కలుస్తాం.
అకీరాతో తెలుగు, ఆద్యతో మరాఠీ మాట్లాడతారట!
రేణు దేశాయ్‌: అకీరా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. కానీ, ఆద్య పుట్టిన తర్వాత పుణె వెళ్లిపోయాం. దానికి కొంచెం తిక్క. కొన్ని సార్లు మరాఠీ కూడా మాట్లాడదు. ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మాతృభాష మాట్లాడలేకపోవడం మనకు శాపం. నా చిన్నప్పుడు ఇంట్లో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి అనేవారు. ఇప్పుడు అందరూ కొంచెం మాతృభాష మాట్లాడనివ్వండి అంటున్నారు.
మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?
రేణు దేశాయ్‌: ‘బద్రి’, ‘జానీ’.. ప్రభుదేవాతో ‘జేమ్స్‌ పాండు’ అని ఒక మర్డర్‌ మిస్టరీ మూవీ చేశా. 
మీ పాప ఆద్య గురించి?
రేణు దేశాయ్‌: తను నా జీవితం. నేను బతికి ఉండటానికి కారణం కూడా తనే. ఆద్య  లేకపోతే, నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. అకీరా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల చూపే ప్రేమ వేరుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూతురి ప్రేమను ఆస్వాదించాలి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. 
బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని వదినా.. వదినా.. అంటారు కదా! మీకు ఎలా ఉంటుంది?
రేణు దేశాయ్‌: ప్రేమతో పిలిస్తే, పర్వాలేదు. నేను ఆ వ్యక్తికి భార్యను అయినందుకు  ఫలానా పనులు చేయకూడదు.. అని నాపై ఓనర్‌షిప్‌ చూపిస్తారు కదా! అది కరెక్ట్‌ కాదు. ‘వదినా..’ ఎంత చక్కని పేరు.. అయితే, ఆ పదాన్ని వాళ్లు సరిగా వాడరు.. వదినా.. అంటూ మొదలు పెట్టి, దాని వెనకాల ఒక వ్యాసం రాస్తారు. నేను ఎలా ఉండాలి.. ఎవరితో ఉండాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఎలా ఉండాలి.. ఎలా కూర్చోవాలి.. ఎలా నడవాలి.. ఎలా ఊపిరి పీల్చుకోవాలి.. ఇలా ఒక పెద్ద లిస్ట్‌ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. 
(ఒక సీరియస్‌ క్వశ్చన్‌కు సమాధానం చెబుతారా? అని ఆలీ అంటుంటే.. అన్నీ ప్రశ్నలూ మీరే అడుగుతారా? నేనూ ఒక సీరియస్‌ క్వశ్చన్‌ మిమ్మల్ని అడుగుతా.. సమాధానం చెప్పండి)
రేణుదేశాయ్‌: మీకు, కల్యాణ్‌గారికి పెద్ద గొడవైందని ఒక న్యూస్‌ చదివా.. నిజమా? 
ఆలీ: అవును మా ఇద్దరి మధ్య పెద్ద గొడవైంది. ట్రంప్‌ కూతురు ఇవాంకా ఉంది కదా! ఆ అమ్మాయి హైదరాబాద్‌ వచ్చింది. ఆ అమ్మాయి కోసం మేమిద్దరం కొట్టేసుకున్నాం. ఆయన కరాటే చేశారు.. నేను కుంగ్‌ఫూ చేశా. (నవ్వులు) మా మధ్య ఏం గొడవలు ఉంటాయి చెప్పండి. న్యూస్‌ ఆర్టికల్స్‌ అలాగే రాస్తారు. వాళ్ల పనే అది. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
రేణు దేశాయ్‌: హ్యాపీ సోల్‌
అకీరా: ఆసమ్‌ సోల్‌
ఆద్య: నా దేవత
పెళ్లి: బ్యూటిఫుల్‌ కాన్సెప్ట్‌
దర్శకత్వం: మై సోల్‌
బద్రి: సంతోషంగా జరిగిపోయింది
పూరి జగన్నాథ్‌: గ్రాటిట్యూడ్‌
తెలుగు: ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌. చాలా బాగుంది.
మరాఠీ: మాతృభాష
ఆలీ: ఫ్యామిలీ.. అన్న..


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.