close

తాజా వార్తలు

ఫోన్‌ చేసి రోజూ టార్చర్‌ పెట్టేవాడు!

‘అరుంధతి’లో నా పాట తీసేశారని చాలా బాధపడ్డా!

ఆమె గొంతు ముందు కోయిల కూడా చిన్నబోతుంది..!
అతను పాట పాడితే ప్రాణం లేచి వస్తుంది..!
వాళ్లకు పాటే ప్రపంచం.. ఆ పాటలతో జనాన్ని ఉర్రూతలూగిస్తారు..!
వారే ప్రముఖ సింగర్స్‌ మాళవిక, కారుణ్యలు.
చిన్నతనంలోనే ‘పాడుతా తీయగా’తో తమ ప్రతిభ ఏంటో ప్రేక్షకులకు తెలియజెప్పారు. పలు విజయవంతమైన చిత్రాల్లో అద్భుతమైన గీతాలు ఆలపించి ‘వహ్వా’ అనిపించుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..!

మీలో ఎవరు సీనియర్‌?
మాళవిక: ఇద్దరం ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. చిన్నప్పుడు ‘పాడుతా తీయగా’ విన్నర్స్‌ కూడా మేమే. అయితే ‘గంగోత్రి’లో ‘నువ్వు నేనూ కలిసుంటేనే నాకెంతో ఇష్టం’ పాటతో తొలి అవకాశం నాకు వచ్చింది. అలా వీళ్లకన్నా నేను కాస్త ముందుగా వచ్చా. 
మరి మీరు(కారుణ్య) పాడిన తొలి పాట ఏది?
కారుణ్య: ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అశోక్‌’లో ‘ఏకాంతంగా ఉన్నా.. ఎందరి మధ్యన ఉన్నా’. ఎన్టీఆర్‌ అన్న నాకు మొత్తం ఆల్బమ్‌ వినిపించి, ‘ఇందులో ఏ పాట పాడతావ్‌’ అని అడిగితే, నేను ఈ పాట ఎంచుకున్నా. ఇప్పటికీ నాకు ఇష్టమైన పాట ఇదే!
చిన్నప్పుడు జెమ్స్‌ అనుకుని ఏవో తినేశారట?
మాళవిక: చిన్నప్పుడు జెమ్స్‌, ఫటాఫట్‌ తినడం,  సైకిల్‌ తొక్కడం బాగా ఇష్టం. ఇంట్లో వాళ్లు రూ.10 ఇస్తే 5పెట్టి జెమ్స్‌, ఇంకో ఐదు రూపాయలతో సైకిల్‌ అద్దెకు తీసుకుని తొక్కాలనుకున్నా. అయితే ఎక్కువ సమయం సైకిల్‌ తొక్కడం వల్ల రూ.10 కట్టాల్సి వచ్చింది. ఖాళీ చేతులతో ఇంటికి వచ్చా. అప్పుడు అందరూ టీవీ చూస్తున్నారు. నేను గదిలోకి వెళ్తే, అక్కడ డబ్బాలో నీలం రంగు మాత్రలు కనిపించాయి. ఒకటి నోట్లో వేసుకుంటే తియ్యగా ఉంది. దాంతో ఐదారు తినేశా. ఆ తర్వాత అవి జెమ్స్‌ కాదు..మందులు అని తెలిసింది. ఈ విషయం కాస్తా మా కజిన్‌ ద్వారా ఇంట్లో వాళ్లకి తెలియడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దెబ్బలు కూడా పడ్డాయి. 
ఇప్పుడు కూడా ఆ అలవాటు ఉందా?
మాళవిక: లేదు. కానీ, మా అమ్మాయి అలాంటివి చేయకుండా జాగ్రత్త పడుతున్నా! ఇక మా వారు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో పనిచేస్తారు. 

మీది లవ్‌ మ్యారేజా అరేంజ్డ్‌ మ్యారేజా?
మాళవిక: అరేంజ్డ్‌ మ్యారేజ్‌. కాకపోతే ఆయన ముందు నుంచీ తెలుసు. గతంలో ఆయన యూకేలో జాబ్‌ చేస్తుండేవారు. నేను ఒకసారి అక్కడ పాటలు పాడటానికి వెళ్తే.. మేము ఎక్కాల్సిన విమానాలన్నీ క్యాన్సిల్‌ అయిపోయాయి. వారం పాటు నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అలా రెండేళ్ల తర్వాత మా పెద్దవాళ్లు కూడా ‘వీళ్లకి పెళ్లి చేస్తే బాగుంటుంది’ అనిపించి చేసేశారు. మాకొక పాప. తనకిప్పుడు 15నెలలు. ఇంట్లో మాకన్నా గట్టిగా అరిచేది అదే! 
మరి మీకు(కారుణ్య) మ్యారేజ్‌ అయిందా?
కారుణ్య: కాలేదు. చెల్లెలి పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. 
సాధారణంగా లవ్‌ లెటర్‌ రాయాలంటే ఫ్రెండ్స్‌ సలహా తీసుకుని రాస్తాం! మరి కారుణ్య అమ్మ సలహా తీసుకుని శ్రీదేవికి లవ్‌లెటర్‌ రాశాడట!
కారుణ్య: నాకు చిన్నప్పటి నుంచి శ్రీదేవిగారంటే విపరీతమైన ఇష్టం. ఏడేళ్ల వయసులో ‘చిరు సరిగమలు’ అని ఒక ఆల్బమ్‌ చేశా. అది విడుదల చేయడానికి ‘ఎస్పీ పరుశురామ్‌’ షూటింగ్‌ జరుగుతుంటే అక్కడికి వెళ్లాం. అయితే అప్పటికే శ్రీదేవిగారి షెడ్యూల్‌ అయిపోయి వెళ్లిపోయారు. శ్రీదేవిగారు వెళ్లిపోయారని నేను ఏడవటం మొదలుపెట్టా. అప్పుడు చిరంజీవిగారు నన్ను ఓదార్చి, పాటలను ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత కూడా నేను గోల చేస్తుంటే, మా అమ్మ సలహాతో శ్రీదేవిగారికి లవ్‌లెటర్‌ రాశా. ఆమె ఫొటోపై సంతకం పెట్టి నాకు పంపారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకం నా దగ్గర ఉంది. 
ఎన్ని భాషల్లో పాటలు పాడారు?
కారుణ్య: హిందీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో 300 పాటలు పాడా.

సీనియర్‌ సింగర్స్‌లో మాళవికకు ఎవరు ఇష్టం?
మాళవిక: ఎప్పటికప్పుడు మారుతుంటారు. ఎప్పటికీ ఉండేది మాత్రం సుశీలగారు.. జానకిగారు. చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ల పాటలే పాడేదాన్ని. 
కారుణ్య.. మీ ఇంట్లో పాములు ఎక్కువగా ఉండేవట?
కారుణ్య: బాలాపూర్‌ క్రాస్‌రోడ్స్‌లో త్రివేణి నగర్‌లో ఎవ్వరూ ఇల్లు కట్టుకోని రోజుల్లో మేం ఇల్లు కట్టుకున్నాం. మా అమ్మ బీడీఎల్‌లో పనిచేసేవారు. అప్పట్లో మా ఇంటికి కరెంటు లేదు, వాటర్‌ లేదు.. దగ్గర్లో ఇంకో ఇల్లు కూడా లేదు. మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ చుట్టు పక్కల పొదల్లో ఉన్న పాములు, ఉడుములు అన్నీ మా ఇంట్లోకి వచ్చేవి. ఆ తర్వాత నెమ్మదిగా ఇళ్లు పెరిగాయి. మాకు ఆ కాలనీలో తిరిగే స్వేచ్ఛ తగ్గిపోయింది. 

మిమ్మల్ని ఒక అజ్ఞాతవాసి విపరీతంగా లవ్‌ చేశాడట?
మాళవిక: అతనెవరో నాకూ తెలియదు. అయితే, చాలా ఇబ్బంది పెట్టాడు. ఒకరకంగా టార్చర్‌ చేశాడు.  నేను పాటలు పాడటానికి వెళ్లినప్పుడు నా వెంటే మా అమ్మ కూడా వచ్చేది. నా ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఫోన్లు మా అమ్మే మాట్లాడేవారు. అతను రోజూ ఫోన్‌ చేస్తుండేవాడు. ఇండస్ట్రీలో కెమెరా డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఊరికే చేస్తున్నాడని మాకు అర్థమైంది. అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకని సైలెంట్‌గా ఉన్నాం. రోజూ ఫోన్ల మీద ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు చేసేవాడు. మేము దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒకరోజు ఏదో ప్రోగ్రామ్‌ కోసం నేను, గీతామాధురి, నటుడు శివారెడ్డి, అభినయ్‌ కృష్ణ వెళ్లాం. సడెన్‌గా ఒక మెస్సేజ్‌ వచ్చింది. సౌందర్య బర్త్‌డే.. డెత్‌ డే.., వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బర్త్‌డే.. డెత్‌డే, ఇలా సెలబ్రిటీల పుట్టిన రోజులు.. చనిపోయిన రోజులు రాసి చివరకు ‘మాళవిక బర్త్‌డే.. రాసి డెత్‌ డే’ అంటూ క్వశ్చన్‌ మార్క్‌ పెట్టాడు. నాకు చాలా భయం వేసింది. ఆ సందేశాన్ని శివారెడ్డి, అభినయ్‌కృష్ణలకు చూపించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పి, వేరే ఫోన్‌ నుంచి అతని నెంబర్‌కు కాల్‌ చేసి, ‘డీఎస్పీని మాట్లాడుతున్నానని, మాళవిక మీపై కేసు పెట్టారని కాస్త గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి మళ్లీ నాకు ఫోన్‌ చేయలేదు.

నేను (ఆలీ) నీకు బర్త్‌డే విషెస్‌ చెప్పలేదని చాలా ఫీలయ్యారట!
మాళవిక: బాగా హర్ట్‌ అయ్యాను కూడా. 2009లో కీరవాణిగారితో కలిసి అమెరికా వెళ్లాం. జులై 6న నా పుట్టినరోజు, అదే రోజు కీరవాణిగారి సతీమణి వల్లీగారి పుట్టినరోజు కూడా. అందరం కేక్‌ కట్‌ చేసి బాగా సెలబ్రేట్‌ చేసుకున్నాం. ఆ తర్వాత ప్రోగ్రామ్‌ కోసమని అందరం కిందకు వచ్చాం. తెలిసిన వాళ్లూ తెలియని వాళ్లూ నాకు హ్యాపీబర్త్‌డే చెబుతున్నారు. కానీ, ఆలీగారికి నా పుట్టినరోజు అని తెలిసినా చెప్పలేదు. పైగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘అసలు ఈ మనిషి కనీసం విషెస్‌ చెబితే ఏమవుతుంది’ అని అనుకున్నా. ఐదారు నిమిషాల తర్వాత పెద్ద చాక్లెట్ల బ్యాగ్‌తో వచ్చి విషెస్‌ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. 

అంజనా సౌమ్య మీరు మంచి ఫ్రెండ్‌ కదా! మధ్యలో మాళవిక వస్తే.. ‘ఎందుకు వచ్చావని అరుస్తారట’
కారుణ్య: ‘పాడుతా తీయగా’ ప్రిలిమ్స్‌లో నేను అంజనా కలిసి పాడుతూ ఫైనల్స్‌కు వచ్చాం. ఇంకో గ్రూప్‌లో మాళవిక మరో అబ్బాయి కలిసి ఫైనల్స్‌కు వచ్చారు. మొదటి నుంచి ఉన్న పరిచయం కారణంగా అంజనా మంచి ఫ్రెండ్‌ అయింది. దీంతో ఫైనల్స్‌లో మాళవిక గెలవకూడదని అనుకున్నా. అయితే, తను గెలిచే సరికి బాగా కోపం వచ్చేసింది. అంజనా చిన్న పిల్ల కావడంతో ఏడ్చేసింది. ఆ తర్వాత మాళవిక మంచి ఫ్రెండ్‌ అయ్యింది. 
గొంతు నొప్పి ఉన్నా కూడా పాట పాడితే, మణిశర్మకు బాగా నచ్చేసిందట!
కారుణ్య: ఆ రోజు ఉదయం లేవగానే, ఎవరూ పిలవకుండా ఉంటే బాగుండు అనుకున్నా. ‘పాట పాడాలి’ అంటూ సడెన్‌గా కోటిగారి దగ్గరి నుంచి ఫోన్‌. వెళ్లి ఎలాగో పాడేశా. ఆ తర్వాత కొద్దిసేపటికే మణిశర్మగారు ఫోన్‌ చేశారు. ‘దుబాయ్‌శీను’లో పాట పాడాలన్నారు. వెళ్లి పాడేశా. మరుసటి రోజు మణిగారు మళ్లీ ఫోన్‌ ‘అద్భుతంగా పాడావ్‌ రా’ అంటూ మెచ్చుకున్నారు. అదే ‘దివాలీ హోలీ.. కలిసి మెలిసి ఖుషీ మాది’

కారుణ్య గొంతు ఆడపిల్ల గొంతులా ఉండేదని కామెంట్‌ ఉంది?
కారుణ్య: చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. చిన్నప్పుడు సుశీలగారు, లతా మంగేష్కర్‌గారు, ఆశా భోంస్లేగారి పాటలు ఎక్కువగా పాడేవాడిని. ‘పాడుతా తీయగా’చూస్తే ఆ విషయం మీకు అర్థమైపోతుంది. 
అప్పట్లో ఒక అమ్మాయి ఫోన్‌ చేసి, ఏమీ మాట్లాడకుండా ఉత్తిగా ఊపిరే పీల్చేదట!
కారుణ్య: అబ్బో చాలా భయంకరంగా నడిచింది. రాత్రి 11.30గం. నుంచి 12.00 మధ్యలో ఫోన్‌ వచ్చేది. కేవలం శ్వాస మాత్రమే వినిపించేది. కొన్ని రోజులకు ఆ నంబర్‌ బ్లాక్‌ చేశా. కనీసం 20 నెంబర్ల నుంచి ఫోన్‌ చేసింది. ఒక్కసారి మాత్రం ‘కారుణ్య గారూ’ అంది. అన్నింటినీ బ్లాక్‌ చేశా. కొన్నాళ్ల తర్వాత తనే చేయడం మానేసింది. 

మీకు మొబైల్‌ లేని రోజుల్లో మీ ఫ్రెండ్‌ వినయ్‌ ఫోన్‌ తీసుకుని మెస్సేజ్‌లు పెట్టేవారట!
కారుణ్య: వినయ్‌ నేనూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. అప్పట్లో మా ఇంట్లో ఫోన్‌ ఉండేది కాదు. వాళ్లింట్లో ఫోన్‌, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అన్నీ ఉండేవి. ‘ఇండియన్‌ ఐడల్‌-1’ తను టీవీలో చూశాడు. ‘నువ్వు ఎలాగైనా ఇండియన్‌ ఐడల్‌కు వెళ్లాలి’ అనేవాడు. అలా  ‘ఇండియన్‌ ఐడల్‌-2’కు ఆడిషన్స్‌ జరిగితే సోనీ వెబ్‌సైట్‌లో తేదీలు, అడ్రస్‌ వెతికి తన ఫోన్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపాడు. చివరకు నాకు దిల్లీలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ ఈవెంట్‌ అయిపోయే వరకూ తన ఫోన్‌ నా దగ్గరే ఉంది. ఆ తర్వాత కూడా ఆ ఫోన్‌ను నా దగ్గరే ఉంచుకున్నా. అది నా లక్కీ ఫోన్‌. వినయ్‌ వల్లే నేను ‘ఇండియన్‌ ఐడల్‌’కు వెళ్లా. 
మాళవిక ఫ్లైట్‌ మిస్సయితే, ఆ ఫ్లైటే మళ్లీ వెనక్కి తిరిగి వస్తుందట!
మాళవిక: నేనూ మా ఆయన, వారి ఫ్రెండ్‌ అమెరికాలో విమానం ఎక్కాలి. సమయం ఉంది కదాని పిజ్జా తిని వెళ్దామని అనుకున్నాం. వాళ్లు ఎప్పుడు పేర్లు పిలిచారో మాకు తెలియదు. విమానం బయలుదేరిపోయింది. మేము పరిగెత్తుకుంటూ వెళ్తే, విమానంలోకి వెళ్లడం కుదరదన్నారు. మా వారి ఫ్రెండ్‌ అప్పటికే విమానం ఎక్కేశాడు. అయితే, మేము రాలేదని, తను దిగిపోతానని చెప్పినా వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి మా కళ్లముందే విమానం వెళ్లిపోయింది. ఇక చేసేదేముందని నేను హాయిగా పిజ్జా తింటూ కూర్చొన్నా. కొద్దిసేపటికి ఆ విమానం మళ్లీ వెనక్కి తిరిగి వచ్చింది. విమానంలో ఏదో సాంకేతిక సమస్య రావడంతో వెనక్కి తీసుకొచ్చారట. లేకపోతే మధ్యలోనే కూలిపోయేదని తెలిసింది. నా పిజ్జానే మమ్మల్ని కాపాడింది. 
యంగ్‌ హీరోలకే కాకుండా ఒక సీనియర్‌ కమెడియన్‌ కూడా పాట పాడారట!
కారుణ్య: అవును! ఎంఎస్‌ నారాయణగారికి పాడా. ఒక అవార్డు ఫంక్షన్‌లో నా దగ్గరికి వచ్చి మరీ ‘చాలా బాగా పాడావ్‌’ అని మెచ్చుకున్నారు. అలా మెచ్చకున్నవారిలో మీరు (ఆలీ), ఎన్టీఆర్‌ అన్న, మహేష్‌బాబుగారు. ‘అశోక్‌’ సినిమాలో పాట పాడినందుకు  ఎన్టీఆర్‌ అన్న అయితే, ఇంటికి పిలిచీ మరీ భోజనం పెట్టి, ‘నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా చాలా చక్కగా పాడావ్‌’ అని మెచ్చుకున్నారు. 
‘అరుంధతి’లో పాట పాడితే సినిమాలో ఎందుకు పెట్టలేదు?
కారుణ్య: మొదట ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. సినిమా నిడివి ఎక్కువ కావడం వల్ల తీసేశారని ఆ తర్వాత తెలిసింది. అంత మంచి హిట్‌ సినిమాలో నా పాట లేదే అని చాలా నిరాశ పడ్డా. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

మాళవిక కారుణ్య
అగ్నిపర్వతం: మా పెళ్లికి కారణం
బల్లి: పీడకల
ఎంఎం కీరవాణి: స్ఫూర్తినిచ్చే వ్యక్తి
మణిశర్మ: గురువు
పెళ్లి: సూపర్‌ హ్యాపీ
ఎస్పీబీ: పాటల దేవుడు
ఫోన్‌ లవర్‌: వాడి పేరు నాకు తెలియదు
అమ్మ: అన్నీ
వినయ్‌: బెస్ట్‌ ఫ్రెండ్‌
నాన్న: మై బెస్ట్‌ బడ్డీ
పెళ్లి: చేసుకుందాం!
మణిశర్మ: మైల్‌ స్టోన్‌
ఎన్టీఆర్‌: అన్న
ఊపిరి పీల్చే సుందరి: హా...
మాళవిక: బెస్ట్‌ కో సింగర్‌
అంజనా సౌమ్య: మంచిపిల్ల 
ఎస్పీబీ: నాకు చాలా ఇష్టమైన వ్యక్తి

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.