close

తాజా వార్తలు

‘అంతేగా.. అంతేగా..’ ఒక్క డైలాగ్‌తో అందరికీ తెలిసిపోయా!

‘ముద్ద మందారం’లో తనదైన నటనతో ఆంధ్రా కమల్‌హాసన్‌ అనిపించుకున్నారు నటుడు ప్రదీప్‌. వెండితెరపై చేసిన చిత్రాలు తక్కువే అయినా, బుల్లితెర ప్రారంభమైన నాటి నుంచి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక తెలుగువారికి తెనాలి రామకృష్ణుడు అంటే గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆ పాత్రకు జీవం పోసిన నటుడు అశోక్‌కుమార్‌.. అంతేకాదు.. నారదుడు అంటే కాంతారావు తర్వాత అశోక్‌కుమారే గుర్తొస్తారు. ఆలీ వ్యాఖ్యతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వీరిద్దరూ విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారిలా!

టీవీ ఎప్పుడు పుట్టింది?
ప్రదీప్‌: టీవీ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ, మాతో టీవీ.. టీవీతో పాటు మేము పుట్టాం. 

మీరిద్దరూ ఫ్రెండ్సా.. చుట్టాలా?
ప్రదీప్‌: అశోక్‌కుమార్‌, నేనూ చిన్నప్పుడు బాలానందం నాటకాలు వేసినప్పటి నుంచి ఫ్రెండ్స్‌. రేడియో, సినిమాలు, సీరియల్స్‌ అన్నీ అలా కలిసే చేశాం. 

మిమ్మల్ని చూసి బయట ఎవరైనా తికమక పడతారా?
ప్రదీప్‌: చాలా సార్లు. నన్ను అశోక్‌కుమార్‌, శాంతి స్వరూప్‌ అనుకుంటారు.
అశోక్‌కుమార్‌: నన్ను కూడా అంతే. ఎందుకంటే ఇద్దరం దాదాపు ఒకేలా ఉంటాం. మా తలపై నేషనల్‌ హైవే కూడా ఒకేలా ఉంటుంది కదా(నవ్వులు) 

పెళ్లై ఎన్ని సంవత్సరాలు అవుతోంది?
ప్రదీప్‌:  31 సంవత్సరాలు అవుతోంది.
అశోక్‌కుమార్‌: 35ఏళ్లు పూర్తయ్యాయి.
ప్రదీప్‌: ఇండస్ట్రీకి వచ్చి 39ఏళ్ల అయింది. ఇన్నేళ్లలో రేపేంటి? అన్న భయం లేకుండా ఉన్నాం. నాకు ఒక పాప.. బాబు.. పాపకు పెళ్లైంది. తను యాంకర్‌, డాక్టర్‌, యాక్టర్‌ కూడా. మా అబ్బాయి జేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాడు. 

తల్లిదండ్రులను కూడా మర్చిపోయే ఈ రోజుల్లో ఏటా గురువు జంధ్యాల పేరుమీద అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారు? దాని వల్ల మీకు లాభం ఏంటి?
ప్రదీప్‌: సాధారణంగా ఒక డైరెక్టర్‌ నటులకు కెరీర్‌ ఇస్తాడేమో! నాకు జీవితానికి సరిపోయేంత జ్ఞానాన్ని గురువు ఇచ్చాడు. ఆయన దగ్గర చేసింది మూడు సినిమాలే అయినా, వాటి వల్ల 36ఏళ్లు ఎలా బతకాలో తెలిసింది. ఆకలి ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతాడు.. చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించాడాయన. ఆకలనేదే లేకుండా చేశాడు. అందుకే ఆయన గుర్తుగా ఆ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా. జంధ్యాలగారు చనిపోయినప్పుడు ఆరేడు వేలమంది శ్మశానానికి వచ్చి కన్నీళ్లు పెట్టారు. ఆయనతో సంబంధం లేని అంతమంది వచ్చారంటే జన హృదయంలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యక్తి జంధ్యాల. ఆయన పేరుని అజరామరం చేయాలంటే కొడుకుల్లాంటి మేము ఆయన జ్ఞాపకార్థం ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందుకు మీలాంటి(ఆలీ) వాళ్లు కూడా సాయం చేస్తున్నారు. 

అశోక్‌.. మీరు ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?
1985లో వచ్చా. మాగంటి రవీంద్ర చౌదరిగారు నన్ను పరిచయం చేశారు. మా నాన్నగారు ఐఏఎస్‌ అధికారి. ఆయనకు ఈయన మంచి ఫ్రెండ్‌. నేను నటిస్తున్న ఫొటో ఒకటి చూసి సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి వెంటబెట్టుకుని మరీ విజయ బాపినీడు గారికి పరిచయం చేశారు. అలా ‘పున్నమి చంద్రుడు’ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యా. ఒక నాలుగు సినిమాలు అయిన తర్వాత ‘తెనాలి రామకృష్ణుడు’ సీరియల్‌ చేశా.

ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేసినట్లు ఉన్నారు?
అశోక్‌కుమార్‌: అవును. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చేశా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన నన్ను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. ఇద్దరు లెజెండ్స్‌ ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌లతో ఆత్మీయమైన పరిచయం ఉంది.

నారదుడు క్యారెక్టర్‌ అంటే ఒకప్పుడు కాంతారావు పేరు.. ఆ తర్వాత అశోక్‌కుమార్‌ పేరే వినిపించేది? ఏంటి ప్రత్యేకత?
అశోక్‌కుమార్‌: కృష్ణుడు, నారదుడు పాత్రలకు పెద్ద వ్యత్యాసం లేదు. కృష్ణుడికి ఎన్టీఆర్‌ పెట్టింది పేరు. బహుశా ఆయన ప్రభావం నాపై ఉండవచ్చు. ‘ఏ పాత్రను నటించవద్దు.. ఆ పాత్రలా ప్రవర్తించండి’.. మొదటి నుంచి గురువులు నేర్పింది ఇదే!

తెనాలి రామకృష్ణుడు చేసేటప్పుడు అక్కినేనిని ఇమిటేట్‌ చేసేవారు కదా!
అశోక్‌కుమార్‌: ఏయన్నార్‌ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఇమిటేట్‌ చేయలేదు. ఆయనకు నాకూ దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ గెటప్‌ వేయగానే, అచ్చం ఆయనలా కనిపించాను. నేను ఏం చేసినా ప్రేక్షకులకు ఆయన చేసినట్లే అనిపించింది. ఆయన ఆహార్యం నా పాత్రలో 50శాతానికి పైగా వచ్చేసింది. 

కేవలం నటనేనా.. దర్శకత్వం కూడా చేశారా?
అశోక్‌కుమార్‌: ఒక సినిమా.. ఆరు సీరియల్స్‌కు దర్శకత్వం వహించా.

అందరినీ విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేస్తే.. ఆయనను మీరు డైరెక్ట్‌ చేశారట!
అశోక్‌కుమార్‌: ‘కుచ్చి కుచ్చి కూనమ్మ’ సినిమాలో విశ్వనాథ్‌గారిది ప్రధాన పాత్ర. ఆయన అంత పెద్ద దర్శకుడైనా, సెట్‌లో దర్శకుడు చెప్పిందే చేసేవారు. సెట్‌కి వెళ్లినప్పుడు ఎలా ఉండాలో ఆయన నుంచే నేర్చుకున్నా. 
ప్రదీప్‌: ఒకసారి యువ దర్శకుడి సినిమాలో విశ్వనాథ్‌గారు నటిస్తున్నారు. ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు ‘ఇంత పెద్ద దర్శకుడై ఉండి మీరు ఎలా ఒదిగి ఉన్నారు’ అని అడిగితే.. ‘నేను డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల నుంచి ఏం రాబట్టుకోవాలో నాకు తెలుస్తుంది. ఈ డైరెక్టర్‌ కూడా అలాగే అనుకుంటాడు కాబట్టి, నా  పాత్రకు తగ్గట్టు సెట్‌లో ఉంటా’ అని చెప్పారు. 
అశోక్‌కుమార్‌: ఆయన(విశ్వనాథ్‌) సెట్‌లో చిన్నపిల్లాడిలా ఉంటారు. ఏం చెబితే అదే చేసేవారు. ఒకసారి నేను డైరెక్ట చేసిన సన్నివేశాన్ని కెమెరాలో చూస్తానని అన్నారు. ‘అంతకన్నా భాగ్యమా! తప్పకుండా చూడండి’ అని నేను కోరా! 

ఎన్ని సినిమాల్లో నటించారు?
అశోక్‌ కుమార్‌: 270కి పైగా సినిమాల్లో చేశా!
ప్రదీప్‌: ఒక 20 సినిమాల్లో నటించి ఉంటానేమో! పది సినిమాలు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశా. ఎక్కువగా సీరియల్స్‌ చేశా. 1986 నుంచి ఇప్పటి వరకూ కొన్ని వందల సీరియల్స్‌ ప్రొడ్యూస్‌ చేశా.. డైరెక్ట్‌ చేశా. నటించాను కూడా.. సత్యం కంప్యూటర్స్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా నటించాను. ఎందుకంటే అది నాకు ప్యాషన్‌. 
అశోక్‌ కుమార్‌: సినిమాల్లో రాకముందు అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసేవాడిని. ‘తెనాలి రామకృష్ణుడు’కి వచ్చిన స్టార్‌డమ్‌తో దాన్నీ వదులుకోవాల్సి వచ్చింది. 

ఇండస్ట్రీలో ఎవరితోనైనా విభేదాలు వచ్చాయా?
ప్రదీప్‌: నాకు చాలా మందితో విభేదాలు వచ్చాయి. నా యాటిట్యూడ్‌కి.. సినిమా వాతావరణంలో ఉన్నవారితో పడలేదు. నేను చాలా ముక్కు సూటిగా వెళ్తా.. పైగా సున్నిత మనస్కుడిని. ఎవరైనా మాటంటే మర్చిపోలేను. ఇండస్ట్రీ నుంచి గ్యాప్‌ తీసుకుని బయటకు వెళ్లిన విషయం వాస్తవమే! ఎవరిదీ తప్పు కాకపోవచ్చు. నేను ఇమడలేకపోయా! ప్రారంభ రోజుల్లో నేను సంతృప్తికరంగా లేను. సినిమాలు వదిలేసి.. సీఏ చదువుతానంటే జంధ్యాలగారికి కోపం కూడా వచ్చింది. 

ఇప్పటికీ కొందరి సెల్‌ఫోన్లలో ‘అలివేణీ.. ఆణిముత్యమా’ పాట వస్తుంది? అది చాలా రొమాంటిక్‌ పాట అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?
ప్రదీప్‌: ‘ముద్ద మందారం’ సమయానికి నాకు 19ఏళ్లు. పూర్ణిమకు 15ఏళ్లు. తెలుగు ఇండస్ట్రీలో ఒక యువ జంటతో రొమాంటిక్‌ సాంగ్‌ అంటే ఇదే. ‘సీతాకోకచిలుక’, ‘సప్తపది’, ‘జేగంటలు’ కూడా అదే సమయంలో విడుదలయ్యాయి. మా సినిమాలో మేము చేసింది ఒక ఫస్ట్‌నైట్‌ సాంగ్‌.. చాలా చిన్న గది.. అందులో 40కిలో వాట్ల లైట్‌.. 30మందికి పైగా సినిమా యూనిట్‌ సభ్యులు.. జీవితంలో స్త్రీ, పురుష స్పర్శ తెలియని ఇద్దరు అమాయక ప్రాణులు.. వీటి మధ్యలో మూడు రోజుల పాటు పాట.. ఆ పాట ఈ రోజుకీ చాలా మెలోడియస్‌గా ఉంటుంది. ఆ పాటలో డైరెక్టర్‌గా ఏం చెబితే అది చేశాం అంతే!

ఈ సినిమా మీ తల్లిదండ్రులు చూశారా?
ప్రదీప్‌: చూశారు.. అయితే, నా భార్య మాత్రం చూడలేదు. పెళ్లయిన తర్వాత చూపిస్తే, కాస్త నిరాశకు లోనైంది. కానీ, తట్టుకుంది.(నవ్వులు) 

జుట్టు పెంచనని ఏమైనా శపథం చేశారా?
అశోక్‌కుమార్‌: అలా ఏమీ లేదు. ఒకటి రెండు సార్లు గుండు చేయించుకుంటే ఇలాగే బాగుందనిపించింది. అందుకే ఈ స్టైల్‌ కొనసాగించా(నవ్వులు) 

మీది లవ్‌ మ్యారేజా.. అరేంజ్డ్‌ మ్యారేజా?
అశోక్‌కుమార్‌: కొంత లవ్‌.. ఇంకొంత అరేంజ్డ్‌. ఒక పాటల కార్యక్రమానికి జడ్జిగా వెళ్లా. అక్కడకు ఒక అమ్మాయి వచ్చింది. తను నచ్చడంతో అడ్రస్‌ తీసుకుని, మా తండ్రిని వెంట బెట్టుకుని వాళ్లింటికి వెళ్లా. వాళ్లు ఆశ్చర్యపోయారు. కొద్ది కాలం తర్వాత వాళ్లు ఒప్పుకొన్నారు. 
అశోక్‌ సాఫ్టా.. యారోగెంటా..?
అశోక్‌ కుమార్‌: ఒకప్పుడు యారోగెంట్‌గా ఉండేవాడిని.. ఇప్పుడు సాఫ్ట్‌. అడ్వకేట్‌గా కేసులు కోసం చూసి చూసి.. ఓర్పుగా ఎలా ఉండాలో తెలిసింది. అలా సాఫ్ట్ అయిపోయా..

అంతేగా.. అంతేగా.. డైలాగ్‌ మీ జీవితంలో ఏమైనా మార్పును తెచ్చిందా?
ప్రదీప్‌: చాలా మార్పు వచ్చింది. అనిల్‌ రావిపూడిగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నాకు కథ చెప్పినప్పుడు ‘సినిమా అంతా ఒకే డైలాగ్‌ చెబుతారండీ’ అన్నారు. వ్యక్తిత్వవికాస నిపుణుడిగా లక్షలమంది పిల్లలకు శిక్షణ ఇచ్చా. ఈ ప్రభావం దానిపై పడుతుందా? అని ఆలోచించి.. మొహమాటంతో సరేనని తలూపా! ‘సినిమా అయిన తర్వాత అందరికీ ఆ డైలాగ్‌తో మీరే గుర్తొస్తారండీ’ అన్నారు. నేను నమ్మలేదు.. సెట్‌లో రెండు మూడు రోజులు చేసిన తర్వాత అందరూ నన్ను ప్రదీప్‌గారు అని పలకరించడం మానేశారు.. ‘అంతేగా.. అంతేగా’ అనడం మొదలు పెట్టారు.. అందరికీ కనెక్ట్‌ అయిందనుకున్నా. సినిమా విడుదలయ్యాక నేను ఒక పార్టీకి వెళ్లా.. రెండేళ్ల పిల్ల నన్నే తదేకంగా చూస్తోంది. ‘ఏంటమ్మా’ అన్నా.. ‘అంతేగా.. అంతేగా’ అంది. (నవ్వులు) ఇన్నాళ్లూ నేను పడిన కష్టం.. శ్రమ ఒక తరానికి తెలుసు.. కానీ.. ఈ ఒక్క డైలాగ్‌లో కొత్త తరానికి కూడా తెలిసేలా చేసింది.

‘చాణక్య’ సీరియల్‌లో అవార్డు రాలేదని అంతృప్తి ఉందా?
ప్రదీప్‌: అది ఒక అద్భుతమైన సీరియల్‌. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఆ సీరియల్‌ ది బెస్ట్‌. అందులో అశోక్‌కుమార్‌ అలెగ్జాండర్‌ పాత్ర వేశాడు. ఆ సమయంలో విజయ నిర్మలగారు జ్యూరీ కమిటీ ఛైర్‌పర్సన్‌. అవార్డుల ప్రకటనకు రెండు రోజుల ముందు ఆమె నాకు కనిపిస్తే.. ‘నేను నీతో మాట్లాడ కూడదు’ అన్నారు. ‘ఎందుకు’ అని అడిగా..‘నీ సీరియల్‌ కూడా అవార్డుల పోటీలో ఉంది కదా. ఇప్పుడు నీతో మాట్లాడకూడదు’ అన్నారు. నాకు కచ్చితంగా ఉత్తమ నటుడు అవార్డు వస్తుందనుకున్నా. ఆరు నంది అవార్డులు వచ్చాయి కానీ, ఉత్తమనటుడు మాత్రం రాలేదు. చాలా నిరాశ చెందా. ఆరు నందులు వచ్చిన ఆనందం ఆవిరైంది. ఉత్తమనటుడిగా అచ్యుత్‌ ఎంపికయ్యారు. సాధారణంగా మనకు అవార్డు వస్తే..‘అది మన ప్రతిభ‌’ అని అంటాం.. రాకపోతే.. ‘వాడు జ్యూరీకి తెలిసినవాడేగా.. అందుకే వచ్చింది’ అని అంటాం.. కానీ నేను అలా అనుకోలేదు.. ఆ తర్వాత యానాంలో 100మంది వేద పండితులు నన్ను పిలిచి ఆశీర్వచనం చేసి సన్మానించారు. ‘చాణక్యలో మీ పాత్ర అద్భుతం అందుకే ఈ సన్మానం’ అన్నారు. నంది అవార్డు వచ్చినంత సంతోషం వేసింది. 

మీతో సినిమా తీసి, ఎన్టీఆర్‌ సినిమాతో పాటు విడుదల చేస్తానని జంధ్యాల అన్నారట ఏంటది?
ప్రదీప్‌: 1975లో నేను 9వ తరగతి చదువుతుండగా, ‘అడవిరాముడు’ విడుదలైంది. ఆరుసార్లు థియేటర్‌లో చూశా. జంధ్యాలగారు మా మావయ్యకు స్నేహితుడు. ఒకరోజు మా ఇంటికి భోజనానికి వస్తే, ‘అడవిరాముడు’లో డైలాగ్‌లు చెబుతూ.. ‘ఎన్టీఆర్‌ను కలిసే ఏర్పాటు చేయండి’ అంటూ బతిమిలాడా. అప్పుడు ఆయన ‘సమయం వచ్చినప్పుడు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసి, ఎన్టీఆర్‌ సినిమాకు పోటీగా విడుదల చేస్తా. నీ సినిమా ప్రివ్యూకు ఆయన్ను పిలుస్తా.. అప్పుడు పరిచయం చేస్తా’ అన్నారు. ఆ తర్వాత ఆ విషయం నేను మర్చిపోయా. నాలుగేళ్ల తర్వాత జంధ్యాలగారు రాసిన ‘ఓ చీకటి రాత్రి’ అనే నాటికను రవీంద్రభారతిలో ప్రదర్శిస్తున్నాం. దానికి ఆయన అతిథిగా విచ్చేశారు. అప్పుడు నన్ను చూసి ‘సినిమాల్లో యాక్ట్‌ చేస్తావా’ అని అడిగారు. ‘నాన్నగారు ఒప్పుకుంటే తప్పకుండా చేస్తా’నని చెప్పా. సినిమా పూర్తయిన తర్వాత ప్రివ్యూకి ఎన్టీఆర్‌ను పిలిచారు. ఆయన ఒక్కరే సినిమా చూశారు. చివరి సీట్లో నేనూ, జంధ్యాల గారు కూర్చొన్నాం. బయటకు వచ్చిన నా భుజంపై చేసి వేసి ‘చాలా బాగా చేశావ్‌’ అని ఎన్టీఆర్‌ అంటే ఒళ్లు గగురుపొడిచింది. చెప్పలేనంత ఆనందమేసింది. 

ఆ సినిమా తర్వాత చదువు కొనసాగించారా?
ప్రదీప్‌: ‘ముద్ద మందారం’ సినిమా సమయంలో నేను డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా. అది పూర్తయిన తర్వాత సీఏ చేశా. మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నా సినిమా విడుదలయ్యే ముందు రోజు.. కాలేజ్‌లో నా స్నేహితులందరూ ‘అరే! అక్కడి నీది 15 అడుగుల కటౌట్‌ పెట్టారు.. ఇక్కడ 12 అడుగుల కటౌట్‌ పెట్టారు’ అని చెప్పేవారు. ఆ సమయంలో నా దగ్గర బైక్‌ కూడాలేదు. నెల రోజులకు పాకెట్‌ మనీ కింద రూ.10 ఇచ్చేవారు. నేను మా తమ్ముడు ఉదయ్‌.. రాత్రి 11గంటలకు ముఖానికి జేబు రుమాల కట్టుకుని సైకిల్‌పై సిటీలో 40 కి.మీ. తిరిగాం. ప్రతీ పోస్టర్‌.. కటౌట్‌ దగ్గరకు వెళ్లి చూసుకుని ఆనందపడేవాళ్లం. సడెన్‌గా హీరో అయిపోయి, అమ్మాయిలు ప్రేమలేఖలు రాసినంత మాత్రాన మన జీవన స్రవంతిలో పెద్దగా మార్పు రాదు కదా! ఆర్టీసీ బస్సు ఎక్కి సీఏ ఆడిట్‌కు వెళ్లేవాడిని.. ఒకసారి నల్గొండ ఆడిట్‌కు వెళ్తే, ఆ బస్సులో నేను ఉన్నానని తెలిసి, జనం విరగబడి వచ్చారు.. బస్సు అద్దం కూడా పగిలిపోయింది. డ్రైవర్‌ ఒకటే తిట్లు. నేరుగా డిపోకు తీసుకెళ్లి, నా వల్ల అద్దం పగిలిపోయిందని లెటర్‌ కూడా రాయించారు. 

ఇతర ఆర్టిస్ట్‌లతో చేస్తుంటే ఇబ్బందులు ఎదురైన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? 
అశోక్‌కుమార్‌: ఎవరితోనూ రాలేదు. కానీ, డబ్బులు ఎగొట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఒక పెద్ద సంస్థ నుంచి చాలా డబ్బులు రావాలి.. ఇప్పటికీ రాలేదు.. మంగళహారతి పాడేశాం. ఆ సంస్థ ఇప్పుడు సినిమాలు తీయడం లేదులెండీ 

‘పున్నమి చంద్రుడు’లో శోభన్‌బాబుగారితో నటించడం ఎలా అనిపించింది?
అశోక్‌కుమార్‌: ఆయనతో ఆ ఒక్క సినిమానే చేశా. షూటింగ్‌ తొలిరోజు మర్చిపోలేని అనుభవం. మేము నాటకం వేస్తే మూడు గంటల పాటు మొత్తం స్క్రిప్ట్‌ గుర్తుండేది. అలాగే ఈ సినిమా ఫస్ట్‌ డే రోజు పెద్ద షాట్‌ పెట్టారు. నాటకాలపై ఉన్న అనుభవంతో నేను అలవోకగా చేసేశా. ఆయన మెచ్చుకున్నారు..

ప్రదీప్‌: ఈ విషయంలో నాకో అనుభవం ఉంది. ‘ముద్ద మందారం’ సినిమాకు ముందు దాసరిగారి దర్శకత్వంలో  ‘ఇదెక్కడి న్యాయం’ చేశా. మురళీమోహన్‌, ప్రభగారు కలిసి నటించారు. అందులో నేను ప్రభగారి తమ్ముడి పాత్ర చేశా. నేను పరీక్ష పాసైన విషయం అక్కకు చెప్పాలి. అది సీన్‌. అప్పుడు ‘అక్కా.. అక్కా.. నేను పరీక్ష పాసయ్యా’ అని  నాటకాల్లో మాదిరిగా గట్టి అరుచుకుంటూ చెబితే.. దాసరిగారు పిలిచి ‘చెవులు పగిలిపోతున్నాయి.. కాస్త నెమ్మదిగా చెప్పు నాయనా’ అన్నారు. 

‘తెనాలి రామకృష్ణుడు’ వచ్చి 30ఏళ్ల దాటింది.. అయినా, తెనాలి రామకృష్ణుడు అంటే అశోక్‌.. అశోక్‌ అంటే తెనాలి రామకృష్ణుడు అన్న భ్రమలో మీరు ఉంటారని బయట అనుకుంటున్నారు.. ఎంత వరకూ నిజం?
అశోక్‌కుమార్‌: నేను చెప్పుకోవడం కాదు.. నాగేశ్వరరావుగారు 1955లో ఆ సినిమా చేసిన తర్వాత 1986లో నేను చేశా. ఇంత వరకూ మళ్లీ ఎవరూ ఆ సబ్జెక్ట్‌ టచ్‌ చేయలేదు. ఆయన తర్వాత నేనే ఉన్నా. కొత్త వాళ్లు ఎవరైనా చేస్తే, వాళ్లు అవుతారేమో! 

నారదుడు.. తెనాలి రామకృష్ణుడు ఈ రెండు పాత్రల్లో మీకు నచ్చిదంటే..! 
అశోక్‌కుమార్‌: కెరీర్‌ను బట్టి చూసుకుంటే నా మొదటి ప్రాధాన్యం తెనాలి రామకృష్ణుడికే. అయితే, నారదుడు అనేది ఎంత గొప్ప క్యారెక్టర్‌ అంటే..  నా కెరీర్‌ ఎప్పుడు డ్రాప్‌ అవుతున్నా అది నన్ను పైకిలేపేది. రాఘవేంద్రరావుగారి ‘నారద లీలలు’ నా కెరీర్‌ను పెంచింది. నాలుగేళ్లు అసలు ఖాళీనే లేదు. ఒక నటుడిగా నా జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నా. 

మిమ్మలి ఆంధ్రా కమల్‌హాసన్‌ అనేవారా?
ప్రదీప్‌: ఆయనకు నాకు దగ్గర పోలికలు ఉండేవి. అప్పట్లో మద్రాసు వెళ్లడానికి ఒకటే ట్రైన్‌ ఉండేది. ఏపీ బోర్డర్‌ దాటిన తర్వాత ఎవరైనా నన్ను చూస్తే, ‘కమల్‌ తంబి.. కమల్‌ తంబి’అని దగ్గరకు వచ్చేవారు. ఆయన్ను కలవాలన్న కోరిక గతేడాది తీరింది. ఒక రోజంతా ఆయనతో ఉండే అవకాశం లభించింది.

మరికొన్ని ప్రశ్నలకు ప్రదీప్‌ ఒక్క మాటలో సమాధానం
ప్రదీప్‌: ఒక పాజిటివ్‌ పర్సన్‌ 
జంధ్యాల: ఎన్‌సైక్లోపిడియా, లైబ్రరీ, మార్గదర్శి
ముద్దమందారం: ఒక అద్భుతమైన అనుభవం
నాలుగు స్తంభాలాట: జీవితంలో నేర్చుకోవాల్సిన ఆట
పూర్ణిమ: ఫస్ట్‌ క్రష్‌ 
సరస్వతి: బెస్ట్‌ క్రష్‌ 
జీవితం: ఫౌంటెన్‌ 
నాన్న: 100 జన్మలకు ఆయనే నా కొడుకుగా పుట్టాలి
సీరియల్‌: నాకొక బ్రాండ్‌ ఇమేజ్‌ను తెచ్చినవి 
నరేశ్‌: బెస్ట్‌ ఫ్రెండ్‌
అంతేగా అంతేగా: జీవితం మనకు అవకాశాల తలుపు తెరిచినప్పుడు.. ప్రతిదీ పాజిటివ్‌గా ఉన్నప్పుడు.. ఎదురుగా వచ్చిన అవకాశం మనకు మంచి జరుగుతున్నప్పుడు.. అవతలి వ్యక్తిలో దేవుడిని చూడగలిగినప్పుడు.. ప్రతి క్షణం ఆనందమయం అదే అంతేగా.. అంతేగా..

మరికొన్ని ప్రశ్నలకు అశోక్‌కుమార్‌ ఒక్క మాటలో సమాధానం
అడ్వకేట్‌: నా సక్సెఫుల్‌ ప్రొఫెషన్‌
తెనాలి రామకృష్ణ: నా స్టార్‌డమ్‌
నారదుడు: నా జీవితం
ఎన్టీఆర్‌: గ్రేట్‌ మ్యాన్‌
విజయబాపినాడు: నా తొలి దర్శకుడు
అక్కినేని నాగేశ్వరరావు: ఆయనే నా ప్యాషన్‌ 
డబ్బులు: లేవుగా
పున్నమి చంద్రుడు: తెరకు నన్ను పరిచయం చేసిన చిత్రం
గుండు: నా భవిష్యత్‌ 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.