close

తాజా వార్తలు

ఇంకో పెళ్లి చేసుకున్నానని అనుకోవద్దు

బుల్లితెరపై ‘నవ్వు నవ్వించు’ అంటూ కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికీ తనదైన కామెడీతో నవ్విస్తూనే ఉన్న హాస్యనటుడు రాఘవ. ‘జబర్దస్త్‌’తో రాకెట్‌ రాఘవగా గుర్తింపు తెచ్చుకుని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ హాయిగా నవ్వుకునే స్కిట్‌లతో అలరిస్తున్నారు. ముసలి స్పైడర్‌ మ్యాన్‌.. దశావతారం బామ్మ.. సుజాత అంటూ థియేటర్‌లో హడావుడి చేసే భర్త స్కిట్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి, ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు.

రాఘవా... మీరు డ్యాన్స్‌ ఎక్కడ నేర్చుకున్నారు?
రాఘవ: నేను చేసిన దాన్ని మీరు డ్యాన్స్‌ అన్నారు. అదే సంతోషం. నేను ఒకసారి వేసిన స్టెప్‌ మరోసారి వేయను. చిన్నప్పుడు ఊళ్లో మట్టి, పేడ తొక్కిన అనుభవం బాగా కలిసొచ్చింది.

మీరు రెండు అంగుళాలు పొడుగైనట్లు ఉన్నారు?
రాఘవ: కొత్త షూ కొన్నానండీ! అవి రెండు అంగుళాలు అరిగేవరకూ పొడుగ్గానే కనిపిస్తా! (మధ్యలో ఆలీ అందుకుని.. అంతేనా.. ఈ షోకు వచ్చే ముందు ఏదైనా గుడి దగ్గర.. నవ్వులు)

ఈ మధ్యకాలంలో ఒక ఇంటివాడివి అయ్యావని విన్నాను, సంతోషం!
రాఘవ: అవునండీ! ఇంటివాడంటే ఇంకో పెళ్లి చేసుకున్నానని అనుకోవద్దు. కొత్తగా కట్టుకున్న ఇల్లు గురించి..

ఏంటీ ఇలాగ కూడా అర్థం చేసుకుంటారా? ఒక రోజు షూటింగ్‌లో నాకు చెప్పావ్.. ఆ మేటర్‌ చెప్పలేదా?
రాఘవ: (నవ్వులు) ఆ రోజు చెప్పిందీ, మా ఆవిడ గురించే!

పండితపుత్ర పరమ శుంఠ అంటారు కదా! మరి నువ్వు పండిత పుత్రుడివా? పంచ్‌ల పుత్రుడివా?
రాఘవ: ఇండస్ట్రీకి రాకముందు నేను పండిత పుత్రుడినే! అలాగే సక్సెస్‌ వచ్చే వరకూ నేను పరమ శుంఠగా ఉన్నా(నవ్వులు). అసలు మాది విశాఖపట్నం జిల్లా చోడవరం సమీపంలోని వీరవల్లి అగ్రహారం. మా తండ్రిగారు టీచర్‌. మా ఇంట్లో దాదాపు అందరూ టీచర్లే. నేను దారి తప్పి ఇటు వచ్చా!

కాలేజీ రోజుల్లో ‘నేనొక ప్రేమ పిపాసిని’ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగేవారట!
రాఘవ: కాలేజీలో రోజుల్లో నాకా అవకాశం రాలేదు. ఎందుకంటే నేను డిగ్రీకి వచ్చినా నాకు మీసాలు రాలేదు. హైట్‌ కూడా తక్కువ ఉండేవాడిని. ఇక మా క్లాస్‌ లేడీస్ ఒక్కొక్కళ్లు ఆరేసి అడుగులు ఉండేవారు. నేను ప్రపోజ్‌ చేస్తే ఎక్కడ కొడతారోనని భయం వేసేది.

మరి మీది అరేంజ్డ్‌ మ్యారేజేనా?
రాఘవ: అవును! మా ఆవిడ వాళ్లది గుంటూరు. నేను యాంకరింగ్‌ చేస్తున్న రోజుల్లో పెళ్లి సంబంధాల కోసం చాలా మ్యారేజ్‌ బ్యూరోల చుట్టూ తిరిగా. ఒక రోజు నాకు వరసకు బావ అయిన వ్యక్తి కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాడు. ఆ కారు నేర్పే వ్యక్తి కూడా మ్యారేజ్‌ బ్యూరో నడుపుతున్నాడు. దాంతో ఆయన దగ్గర ఫొటోలు చూసి మా బావ నాకు ఫోన్‌ చేశాడు. నేనొక ఫొటో చూసి, ఫోన్‌ చేసి మాట్లాడా! వెళ్లి కలిశాం.. సంబంధం ఒకే అయింది. కొన్ని అలా అనుకోకుండా జరిగిపోతాయి.(నవ్వులు)

మీ ఊరి సర్పంచ్‌ కొడుకు నిద్రపోతుంటే మంచంతో సహా తీసుకెళ్లిపోయారట!
రాఘవ: మేమంతా కలిసి రాత్రి గ్రూప్‌ స్టడీ చేసేవాళ్లం. పెద్దవాళ్లు నిద్రపోగానే సెకండ్‌ షోకు వెళ్లేవాళ్లం. ఒక రోజు రాత్రి అందరం ఏటికి వెళ్దాం అనుకున్నాం. సర్పంచ్‌ ఇంటి మీదుగా వెళ్తుంటే మంచంపై వాడు పడుకొని ఉన్నాడు. నలుగురం కలిసి మంచాన్ని నెమ్మదిగా నాలుగువైపులా పట్టుకుని బయటకు తీసుకొచ్చి, ఏటివైపునకు బయలు దేరాం. రావిచెట్టు దగ్గర రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో మధ్యదారిలో వాడికి మెలకువ వచ్చింది. ఒకటే అరుపులు. అంతే మంచం పట్టుకున్న వాళ్లు దాన్ని వదిలేసి పరుగో పరుగు.

ఛార్మితో ప్రేమలో పడ్డావట!
రాఘవ: ఆ అవకాశం రాలేదు. (నవ్వులు) ఆమెకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. అయితే, నాకోసం జబర్దస్త్‌కు వచ్చి ఆమె చేతుల మీదుగా చెక్‌ ఇవ్వడం మర్చిపోలేను. నేను యాంకరింగ్‌ చేస్తున్నప్పుడు ఆమెను ఇంటర్వ్యూ కూడా చేశా. ఆమె నిబద్ధత చూసి ఇష్టపడ్డా. ఆమె పంజాబీ అయినా, తెలుగు బాగా మాట్లాడతారు. అందుకే ఆమెను ఇష్టపడ్డా. అంతేకానీ, ప్రేమ అలాంటివి ఏవీ లేవు.

షాపులో వాచ్‌ ఒకటి కొట్టేసి దాచావట! ఇంతవరకూ దొరకలేదట!
రాఘవ: అది ఇప్పటికీ మిస్టరీనే! నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు షాపునకు వెళ్లాం. అక్కడ రబ్బరు వాచ్‌ కనపడితే, తీసి బ్యాగులో వేశా. ఇంటికి వచ్చి చూస్తే కనిపించలేదు. ఎవరు తీశారో ఎంతకీ అర్థం కాలేదు. ఇప్పటికీ తెలియదు.

తారాజువ్వలంటే బాగా ఇష్టమట!
రాఘవ: అవునండీ! వాటివల్ల ఒకసారి నాకు భయంకరమైన ఎక్స్‌పీరియన్స్‌ వచ్చింది. నేను డిగ్రీ చదువుతుండగా, వీధిలో మంచం వేసుకుని పడుకొన్నా. నా ముందు నుంచే పెళ్లి వాళ్లు డప్పులు మోగించుకుంటూ వెళ్తున్నారు. వాళ్లు టపాసులు పేలుస్తున్నారు. ఒకడు తారాజువ్వ వేశాడు. అది నేరుగా నా పక్కలోకి దూసుకొచ్చి పేలింది. పక్కన పేలిందేమో అనుకున్నా. ఉదయం చూసుకుంటే అది నా పక్కలో పేలిందని అర్థమైంది.

‘జబర్దస్త్‌’లో చేయకముందు బుల్లితెరతో మీకున్న అనుబంధం?
రాఘవ: జెమినీలో ‘నవ్వు నవ్వించు’తోనే కెరీర్‌ ప్రారంభమైందని చెప్పాలి. అంతకుముందు ఈటీవీలో ‘విధి’ సీరియల్‌లో కొన్ని ఎపిసోడ్లు చేశారు. శ్రీనివాసరెడ్డికి ‘ఇడియట్‌’లో అవకాశం రావడంతో ‘నవ్వు నవ్వించు’లో చేసే ఛాన్స్‌ నాకు దొరికింది. అయితే, అంతకుముందు నాకు యాంకరింగ్‌లో అస్సలు అనుభవం లేదు. మా చిన్నక్క ఎప్పుడో దూరదర్శన్‌లో చేసేవారు. ఆమే నాకు కొంత స్ఫూర్తి. సుమ, ఝాన్సీ వీళ్లంతా కూడా నాకు స్ఫూర్తినిచ్చినవారే!

అసలు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే..!
రాఘవ: విశాఖ ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశా. బహుశా అలాగే కొనసాగేవాడినేమో! అయితే, నా పరిస్థితికి మా కుటుంబ సభ్యులు ఫుల్‌ హ్యాపీ. తొలి రోజుల్లో అవకాశాల కోసం చూస్తున్నప్పుడు వచ్చేయమని అన్నారు. ఆరు నెలల సమయం అడిగా. చివరి రోజు జెమినీ నుంచి ఫోన్‌ వచ్చింది. అన్నీ అలా సినిమాటిక్‌గా జరిగాయి.

జబర్దస్త్‌లో దాదాపు 300 స్కిట్‌లు చేశారు? ఇంత ఫేమస్‌ అవుతుందని అనుకున్నారా?
రాఘవ: మంచి ఆదరణ లభిస్తుందని అనుకున్నాం. కానీ, ఇంత స్థాయిలో సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. అయితే, ప్రతి స్కిట్‌కు చాలా కష్టపడతాం! ఒక స్కిట్‌కీ, మరో దానికీ సంబంధం లేకుండా చూసుకోవాలి. దర్శకులకు నచ్చేవరకూ ఎన్నో మార్పులు జరుగుతాయి.

జబర్దస్త్‌లో బాగా గుర్తింపు వచ్చిన పాత్రలు?
రాఘవ: చాలా పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా ముసలి స్పైడర్‌మ్యాన్‌, దశావతారం బామ్మ, హిట్లర్‌,  ‘సుజాత..’ అంటూ థియేటర్‌లో హడావుడి చేసే భర్త.. ఇలా చాలానే!

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
బ్రహ్మానందం: బెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌
కామెడీ: చేయాలన్నా చూడాలన్నా అదృష్టం ఉండాలి.
జబర్దస్త్‌: అదృష్టం
కుక్కులు: భయం
మొహమాటం: మా ఇంటి పేరు.
సిగ్గు: ఉండాలి
భార్య: చాలా మంచి భార్య
చోడవరం: పండగ
ఛార్మి: ఇష్టం
హైట్‌: ఈ జన్మకు ఇంతే!
అనసూయ: జబర్దస్త్‌ బార్బీ డాల్‌
రేష్మి: ఇంకో బార్బీడాల్‌
రోజా: సీనియర్‌ బార్బీడాల్‌
నాగబాబు: జబర్దస్త్‌
శ్యాంప్రసాద్‌రెడ్డి: దేవుడు


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.