close

తాజా వార్తలు

రాజీవ్‌గాంధీ చివరి సంతకం అదే!

ఆయనతో పాటు నేనూ వెళ్లాల్సింది కానీ!

‘సోగ్గాడు’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయికగా మెప్పించిన నటి... జయచిత్ర. ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ తెరను పంచుకున్న ఆమె దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించారు. ‘అబ్బాయిగారు’, ‘ఘరానా బుల్లోడు’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె నటనను ఎవరూ మర్చిపోలేరు. ‘పాదుకా పట్టాభిషేకం’లో బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన జయచిత్ర దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె ఆనాటి ఎన్నో సరదా సంగతులనీ, విశేషాలనీ పంచుకున్నారిలా!

అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు దానికి కార‌ణం?
జ‌య‌చిత్ర‌: మీ ప్రేమ‌.. అభిమానం!

క‌థానాయిక‌గా ఎన్ని సినిమాల్లో న‌టించారు?
జ‌య‌చిత్ర‌: ద‌క్షిణాది భాష‌ల్లో దాదాపు 200ల‌కు పైగా చిత్రాల్లో న‌టించా.

తొలి చిత్రం ఏది?
జ‌య‌చిత్ర‌: శోభ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘సోగ్గాడు’. అంత‌కుముందే దాదాపు 30 త‌మిళ చిత్రాల్లో న‌టించా. ‘ఇద్ద‌ర‌మ్మాయిలు’ కోసం రామానాయుడుగారు సంప్ర‌దించారు. కానీ, డేట్స్ కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత ప‌ట్టుబ‌ట్టి ‘సోగ్గాడు’ కోసం తీసుకున్నారు. అది రికార్డు బ్రేక్‌. ఆ త‌ర్వాత నేను చేసిన సినిమాల‌న్నీ భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి.

తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు! మీ సొంతూరు ఏది?
జ‌య‌చిత్ర‌: నేను పుట్టి పెరిగింది అంతా మ‌ద్రాసులోనే. మా తాత‌ముత్తాత‌ల‌ది తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ.

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రు అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టించారు? వారిలో మీకు ఎవ‌రు బాగా న‌చ్చారు?
జ‌య‌చిత్ర‌: అంద‌రూ చాలా మ‌ర్యాద ఇచ్చేవారు. శోభ‌న్‌బాబుగారు చాలా త‌క్కువ మాట్లాడేవారు. అయితే, ఆ మాటలు గొప్పగా ఉండేవి.
నేన‌న్నా, నా డ్యాన్స్ అన్నా ఆయ‌న‌కు చాలా ఇష్టం. నాగేశ్వ‌ర‌రావుగారైతే ‘అమ్మో పిల్ల కాదు.. పిల్లి’ అనేవారు. ప్ర‌తి ఒక్క‌రి దగ్గ‌రా ఒక్కో క్వాలిటీ ఉంది.

మీ అమ్మ‌గారు ఎన్టీఆర్‌తో న‌టించారు! మీరు ఏ సినిమా ఆయనతో చేశారు?
జ‌య‌చిత్ర‌: ‘మాదైవం’, ‘బొబ్బిలిపులి’, ‘వేంక‌టేశ్వ‌ర మ‌హ‌త్మ్యం’ చేశాం. ‘వేంక‌టేశ్వ‌ర మ‌హ‌త్మ్యం’లో ఎరుక‌లసాని పాత్ర నేనే చేయాల‌ని ఫోన్ చేసి మ‌రీ రమ్మన్నారు. కిరీటం పెట్టుకుని ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటే ఎంత బాగుండేదో.

మీకు ఎంత‌మంది పిల్ల‌లు?
జ‌య‌చిత్ర‌: నాకు ఒక బాబు. పేరు అమ్రిష్‌. త‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా చేస్తున్నాడు. ఒక సినిమాలో కూడా న‌టించాడు.

మీ అస‌లు పేరేంటి?
జ‌య‌చిత్ర‌: ల‌క్ష్మీ కృష్ణ‌వేణి రోహిణి పార్వ‌తీ దేవి. శుక్ర‌వారం పుట్టాన‌ని ల‌క్ష్మి.. ఆ రోజు కృష్ణ జ‌యంతి కావ‌డంతో కృష్ణ‌వేణి.. రోహిణి న‌క్ష‌త్రంలో పుట్ట‌డంతో రోహిణి, క‌పాలేశ్వ‌ర‌స్వామి గుడిలో అమ్మ‌వారి విగ్ర‌హం ఎదుట కూర్చొని పార్వ‌తి దేవిలాంటి బిడ్డ కావాల‌ని మా అమ్మ ప్రార్థించార‌ట అందుకే పార్వ‌తీ దేవి అని పెట్టారు. అలా ఇంత పెద్ద పేరు అయింది.

మ‌రి జ‌య‌చిత్ర అని ఎవ‌రు పెట్టారు?
జ‌య‌చిత్ర‌: న‌న్ను కేఎస్ గోపాల‌కృష్ణ‌గారు వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న‌కు జాత‌కాలు చూడ‌టం వ‌చ్చు. ఆయ‌నే జ‌య‌చిత్ర అని పెట్టారు.

మీ భ‌ర్త ఏం చేస్తారు?
జ‌య‌చిత్ర‌: ఆయ‌న బిజినెస్‌మ్యాన్‌. నేను న‌టిగా ఉన్న‌ప్పుడు ఫంక్ష‌న్లకు ర‌మ్మ‌ని పిలిచేవారు. నేను వెళ్లేదాన్ని కాదు. అదే స‌మ‌యంలో పెళ్లి చేసుకోమ‌ని మా అమ్మ ఒత్తిడి చేయ‌డం మొద‌లు పెట్టారు. త‌ర‌చూ ఆయన నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండటంతో పెళ్లి సంబంధం మాట్లాడారు.

మీరు ఇంటిలోనే గుడి క‌ట్టార‌ట‌!
జ‌య‌చిత్ర‌: అవును! ఇప్పుడు దాన్ని ప‌బ్లిక్ చేసేశాం. మా త‌ల్లిగారు ఉన్న‌ప్పుడు వినాయ‌కుడి గుడి క‌ట్టించారు.

ఒక సినిమాలో కృష్ణ పెద్ద‌పులితో ఫైట్ చేస్తే, మీరు చిరుత‌పులితో ఫైట్ చేశార‌ట‌!
జ‌య‌చిత్ర‌: గోపీనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘చెప్పింది చేస్తా’లో చిరుతతో ఫైటింగ్ ఉంటుంద‌ని క‌థ చెప్పిన‌ప్పుడు నాకు తెలియ‌దు. చాలా భ‌యం వేసింది. పైకి ధైర్యంగా చేసినా, లోలోప‌ల భ‌య‌మే!

ఒక ర‌హ‌స్యం. అది మీరు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రు. రాజీవ్‌గాంధీ ఒక లెట‌ర్ రాసి మీకు ఇచ్చార‌ట‌! అందులో ఏముంది?
జ‌య‌చిత్ర‌: నేను అప్పుడే కాంగ్రెస్‌లో కాస్త క్రియాశీల‌కంగా వ్యవహరిస్తున్నా. ఆయ‌న శ్రీ‌పెరంబు‌దూరు వ‌స్తున్నార‌ని తెలిసి, నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా చూడ‌మ‌ని ఆయ‌న‌ను అడిగేందుకు అక్కడకు వెళ్దామ‌నుకున్నా. ఇంతలో అమ్మ‌వారి ఆల‌యంలో నుంచి ఒక మ‌హిళ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, ‘రాజీవ్‌గాంధీని శ్రీ‌పెరంబు‌దూర్ వెళ్లి క‌ల‌వ‌డం ఎందుకు? నీ ద‌గ్గ‌ర ఉన్న మెమెంటో, శాలువా, సినిమా పాట‌ల క్యాసెట్ ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చేసెయ్’ అని చెప్పింది. దాంతో నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లా. ప్రొటోకాల్ ప్ర‌కారం వీఐపీలాంజ్‌లో కూర్చోబెట్టారు. వైజాగ్‌ నుంచి వచ్చిన ఆయ‌న విమానం ఆల‌స్యం కావ‌డంతో కాస్త ఫ్రెష్ అయి నేరుగా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. అప్ప‌టికే నేను ఒక షోకు వ‌స్తాన‌ని అవతలి వారికి హామీ ఇచ్చా. దాంతో నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆయ‌న న‌న్ను క‌లిసి మాట్లాడారు. నా సినిమా గురించి చెబితే, ఒక లెట‌ర్‌పై ‘విష్ యు ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ స‌క్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్‌. ఐ విల్‌ సీ యువర్‌ మూవీ. కంగ్రాట్స్‌’ 
అని రాసి సంత‌కం పెట్టి నా చేతిలో పెట్టారు. అది ఆఖ‌రి సంత‌కం అని తెలియ‌దు.

ఆ త‌ర్వాత ‘స‌ర్ ఒక గంట‌లో శ్రీ‌పెరంబు‌దూర్ వ‌చ్చి మిమ్మ‌ల్ని క‌లుస్తా’ అంటే స‌రే అన్నారు. నేను వేరే ప్రోగ్రామ్‌కి వెళ్తే, అక్క‌డ క‌రెంట్ పోయింది. కార్య‌క్ర‌మం ఆల‌స్య‌మైంది. ఇంత‌లో రాజీవ్‌గాంధీ చ‌నిపోయార‌ని ఫోన్ వ‌చ్చింది. ‘అదేంటండీ అలా అంటారు. ఇప్పుడే నేను క‌లిశా. ఇదిగో నాకు విషెస్‌ చెబుతూ సంత‌కం కూడా పెట్టారు’ అంటూ ఈ వార్త చెప్పిన వారిపై అరిచేశా. రెండు మూడు రోజులు నేను మామూలు మ‌నిషిని కాలేక‌పోయా. ఆ త‌ర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా లేను.

‘అబ్బాయిగారు’లో మీ పాత్ర కోసం ఈవీవీ అడిగారా? లేక నిర్మాత అడిగారా?
జ‌య‌చిత్ర‌: ఒకరోజు నిర్మాత న‌ర‌సింహారావుగారు నాకు ఫోన్ చేసి, ఇలా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర అని చెప్పారు. నేను అందుకు ఒప్పుకోలేదు. అలాంటి పాత్రలో నన్నెవరు చూస్తారనుకున్నా.
రెండు రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రామానాయుడుగారితో ఫోన్ చేయించారు. ఆ త‌ర్వాత ముర‌ళీమోహ‌న్‌గారు ఇలా అంద‌రూ ఫోన్ చేయ‌డంతో ఒప్పుకొన్నా. చివరిలో ఓ సన్నివేశం వస్తుంది. కేవలం ఆ సీన్‌ కోసం మాత్రమే ఈ సినిమా చేశా. ఇప్పటికీ ఆ సీన్‌ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. ‘ఆ పాత్రకు జయచిత్ర మాత్రమే న్యాయం చేయగలదు’ అని జమున, వాణిశ్రీ ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్నారు. అలాగే ‘ఘరానా బుల్లోడు’లో అమ్మాజీ పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది.

మీరు నటించిన చిత్రాల్లో బాగా నచ్చిన చిత్రమేది?
జ‌య‌చిత్ర‌: చాలా ఉన్నాయి. ‘సోగ్గాడు’ నాకు ప్రత్యేకం. ‘సావాసగాళ్లు’, ‘యవ్వనం కాటేసింది’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘అబ్బాయిగారు’, ‘ఘరానా బుల్లోడు’ చిత్రాలన్నా నాకు ఇష్టమే!

ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు?
జ‌య‌చిత్ర‌: చాలా బాధ్యతలు తీరిపోయాయి. బాబుకి పెళ్లి కూడా చేశా. తమిళంలో ఒక సినిమాలో నటించా. మళ్లీ కెరీర్‌ ప్రారంభించినట్లుంది.

ఎన్ని అవార్డులు వచ్చాయి?
జ‌య‌చిత్ర‌: చాలా వచ్చాయి. ‘రాజేశ్వరీ కల్యాణం’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. ఒక ఏడాదిలో 23 సినిమాల్లో నటించా. ఒక రోజులో ఐదు సినిమాల షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. మద్రాసులో పళ్లు తోముకుని, హైదరాబాద్‌లో స్నానం చేసి, బ్రేక్‌ ఫాస్ట్‌ ఒక చోట, లంచ్‌ మరొక చోట ఇలా తీరికలేకుండా సినిమాలు చేసిన రోజులున్నాయి. చిత్ర పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు లభించింది.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
సినిమా: అదొక సముద్రం
తమిళ ఇండస్ట్రీ: గ్రేట్‌ ఇండస్ట్రీ
తెలుగు ఇండస్ట్రీ: తెలుగింటి ఆడపడుచుగా నిలిపింది
రాజీవ్‌గాంధీ: గ్రేట్‌ పర్సన్‌, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి
ఎన్టీఆర్‌: మంచి వ్యక్తి, రాజకీయనాయకుడు
సోగ్గాడు: రికార్డు బ్రేక్‌
అమ్మాజీ: నా తల్లిని మిస్సవుతున్నా
అమ్రిష్‌: మై హార్ట్‌బీట్‌
ఇంట్లో గుడి: ముందుగా నాకు అన్నీ తెలియజేసేది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.