close

తాజా వార్తలు

లోయలో పడి చనిపోయాననుకున్నారు!

ఇంటర్నెట్‌డెస్క్‌:కౌబాయ్‌ క్యారెక్టర్స్‌కు ఆమె ఒక బ్రాండ్‌.. నటనలో జేమ్స్‌ బాండ్‌.. మంచిగా ఉంటే చలాకీ రాణి, మాట తప్పితే రివాల్వర్‌ రాణి. అశ్వమెక్కితే విశ్వమంతా ఘన స్వాగతం పలుకుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, నటిగా, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయలలిత. ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..!

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?
విజయ లలిత: 1966లో ‘భీమాంజనేయ యుద్ధం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యా. అందులో నాది రంభ పాత్ర. నేను డ్యాన్స్‌ నేర్చుకోవడంతో ఆ పాత్ర ఇచ్చారు. నా మొత్తం కెరీర్‌లో అయిదు భాషల్లో నటించా.

ఎన్టీఆర్‌తో ఏ సినిమా చేశారు?
విజయ లలిత: చాలా సినిమాల్లో నటించా. తొలి సినిమా మాత్రం ‘చిక్కడు దొరకడు’. విఠలాచార్య దర్శకుడు.

లేడీ జేమ్స్‌బాండ్‌ అంటే మీరే గుర్తొస్తారు..! హార్స్‌ రైడింగ్‌, కత్తియుద్ధం నేర్చుకున్నారా?
విజయ లలిత: ముందుగా ఏదీ నేర్చుకోలేదు. దర్శకులు ఏది చెబితే అది చేసేదాన్ని. నాకేమీ కష్టం అనిపించలేదు. బ్రేక్‌ టైమ్‌లో కూడా గుర్రం దిగేదాన్ని కాదు. జెమినీ స్టూడియోస్‌ వారి ‘శాంతినిలయం’లో నేను జెమినీ గణేశన్‌గారితో కలిసి నటించాం. అందులో ఆయన నేనూ గుర్రం మీద ఎక్కి వెళ్లే సన్నివేశం ఉంది. అందుకోసం వాళ్లు హార్స్‌ రైడింగ్‌లో తర్ఫీదు ఇచ్చారు.

‘దేవుడు మావయ్య’ కన్నా ముందు నిర్మాతగా ఏవైనా సినిమాలు చేశారు?
విజయ లలిత: చేయలేదు. ఈ సినిమా ఒక రకంగా నాకు నష్టాన్నే మిగిల్చింది. ఆ తర్వాత ‘ఆడదాని సవాల్‌’ సినిమా చేశా. ఈ చిత్రం ద్వారానే విజయశాంతిని పరిచయం చేశా. అక్క కూతురు కావడంతోనే ఆమెను సినిమాలోకి తీసుకున్నా. తను స్టార్‌ అయిన తర్వాత ఎక్కువ గర్వపడింది నేనే.

మీరు ఇండస్ట్రీకి వచ్చి లాభపడ్డారా? నష్టపోయారా?
విజయ లలిత: నేను టైమ్‌కు వస్తానని మంచి పేరు. ఏ ప్రొడ్యూసర్‌ని కష్టపెట్టలేదు. వారు చెప్పిన సమయం కన్నా ముందే వచ్చేదాన్ని. ఆ తృప్తి ఉంది నాకు.

మరి మళ్లీ సినిమాలు చేయాలని ఎందుకు అనుకోలేదు?
విజయ లలిత: ఒక స్థాయికి వచ్చిన తర్వాత అన్ని పాత్రలు చేసేయలేం. కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేయాలి. నేను చేసిన పాత్రకు ఒక అర్థం ఉండాలి. అది ఉండదేమోననిపించి సినిమాలు చేయలేదు.

విజయ లలిత, విజయ నిర్మల, విజయశాంతి వీళ్ల ముగ్గురికీ ఉన్న సంబంధం ఏంటి?
విజయ లలిత: విజయ నిర్మల గారు నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. విజయశాంతి నా అక్క కూతురు. విజయ నిర్మలకు నాకూ ఎలాంటి చుట్టరికం లేదు. చాలా చోట్ల తప్పుగా రాశారు. అవన్నీ కరెక్ట్‌ కాదు.

ఇండస్ట్రీకి రావడంతోనే మీకు హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయా?
విజయ లలిత: ఫస్ట్‌ వ్యాంప్‌ పాత్రలే దక్కాయి. ఆ తర్వాత డ్యాన్సర్‌గా చేశా. కేవలం ఒక్క పాటలో కనిపించే పాత్రలు కూడా చేశా. ఆ తర్వాత హీరోయిన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌‌గా చాలా సినిమాల్లో నటించా. పదేళ్ల పాటు ఇంటికి వెళ్లే సమయం కూడా లేకుండా సినిమాలు చేశా.

మీ సొంతూరు ఏది?
విజయ లలిత: అమ్మది రాజమండ్రి దగ్గరలోని అనపర్తి. నాన్నది వరంగల్‌ సమీపంలోని ఏటూరు నాగారం.

ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది?
విజయ లలిత: నాకు ఏడేళ్ల వయసు ఉండగా చెన్నై తీసుకొచ్చారు. నాకు డ్యాన్స్‌ నేర్పాలని అమ్మకు ఆశ ఉండేది. ‘మీ అమ్మాయి బాగా చేస్తుంది. సినిమాల్లోకి తీసుకొస్తే మంచిగా రాణిస్తుంది’ అని అమ్మకు కొందరు చెప్పారు. దర్శకుడు ఎస్డీలాల్‌ మా ఇంటి పక్కనే ఉండేవారు. ‘భీమాంజనేయ యుద్ధం’లో పాట కోసం ఒకరిని బుక్‌చేస్తే ఆమె రాలేదు. మరుసటి రోజే షూటింగ్‌. రాత్రి 11గంటలకు వచ్చి మా ఇంటి తలుపు తట్టి, పరిస్థితి గురించి చెప్పారు. అమ్మ కూడా ఒప్పుకొన్నారు. అలా నా ప్రస్థానం మొదలైంది.

మీ ఆయన ఏం చేస్తారు?
విజయ లలిత: మా ఆయన పేరు శివప్రసాద్‌. అమెరికాలో బిజినెస్‌మెన్‌. మా అబ్బాయి హృదయ సాయి ప్రీ మెడిసన్‌ చదువుతున్నాడు.

మీది ప్రేమ వివాహమా?
విజయ లలిత: అవును! ఒక ఫంక్షన్‌లో ఆయన్ను కలిశా. 1994లో మాకు పెళ్లయింది.

ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చేస్తారా?
విజయ లలిత: చేయను. ఒక పాత్ర చేయడం మొదలు పెడితే అది అక్కడితో ఆగదు. నేను సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఉంది. పిల్లలంటే నాకు బాగా ఇష్టం. నాకు అబ్బాయి పుట్టిన తర్వాత వాడిని బాగా చూసుకోవాలని ఆశ. అందుకే అవకాశాలు వచ్చినా, ఒప్పుకోలేదు.

గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు ప్రాణ భయం వేయలేదా?
విజయ లలిత: ‘రౌడీ రాణి’ హిందీ ‘రాణి మేరా నామ్‌’ ముదుమలై యార్కాడులో షూటింగ్‌ జరుగుతుంది. ఒక సన్నివేశంలో నేను గుర్రంపై వచ్చి టర్న్‌ తీసుకుని ఆపాలి. కానీ, నేను ఎంత ఆపినా ఆ గుర్రం ఆగకుండా పరిగెడుతూనే ఉంది. ఒకవైపు 80 అడుగుల లోయ.. అప్పుడు కొంచెం భయం వేసింది. నేను లోయలో పడి చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్త తెలిసి అమ్మ కళ్లు తిరిగి పడిపోయిందట. నేను హోటల్‌కు వచ్చి ట్రంకాల్‌ బుక్‌ చేసి, మాట్లాడే సరికి ఆశ్చర్యపోయారు.

విజయలలిత మీ అసలు పేరేనా? ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారా?
విజయ లలిత: నా అసలు పేరు లలిత. విజయ అనేది తోడైతే మంచి జరుగుతుందని ఆ పదం జోడించారు.

ఎన్టీఆర్‌పై అభిమానంతో కొన్ని సినిమాలకు డబ్బులు తీసుకోలేదని విన్నాం! ఎంత వరకూ నిజం?
విజయ లలిత: అలా ఎప్పుడు జరగలేదు. ఆయనపై వల్లమాలిన అభిమానం. ఎన్‌ఏటీ సంస్థలో ఏ చిన్న వేషం వేయాల్సి వచ్చినా పిలిచేవారు. సమయపాలన ఆయన నుంచే నేర్చుకున్నా. నిర్మాతకు ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని చెప్పేవారు.

జ్యోతిలక్ష్మి మీకు పోటీ అనుకున్నారా?
విజయ లలిత: నేనెప్పుడూ అనుకోలేదు. ఎవరి టాలెంట్‌ వారిది. ఆమె నా కన్నా సీనియర్‌. నా చిన్నప్పుడే ఆమె పలు చిత్రాల్లో నటించారు. మేము ఫ్రెండ్స్‌లాగానే మాట్లాడుకునేవాళ్లం. అప్పట్లో ఐటమ్‌ సాంగ్‌ను సోలో సాంగ్‌ అనేవారు. సినిమాతో సంబంధం లేకపోయినా విజయలలిత సాంగ్‌ ఉండాలని పంపిణీదారులు కోరేవారు. కురచ దుస్తులు వేసుకుని డ్యాన్స్‌ చేయడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇది మన వృత్తి.

చాలా మంది హీరోలతో నటించారు? ఏ హీరోతోనైనా ప్రేమలో పడ్డారా?
విజయ లలిత: లేదండీ! ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. సినిమా అయిపోతుందంటే ఏడుపు వచ్చేసేది. అందరికీ స్వీట్లు, చాకెట్లు పంచేవాళ్లం.

మీరు చెన్నైలోనే ఉండిపోవడానికి కారణం ఏంటి?
విజయ లలిత: పెళ్లయిన తర్వాత ఇక్కడకు రావడానికి వీల్లేకుండాపోయింది.

మీరు చేసిన పాత్రల వల్ల బయట ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా?
విజయ లలిత:‘సినిమాల్లో చాలా పొగరుగా ఉంటారు. కఠినంగా మాట్లాడతారు. ఆడవాళ్లను తిడతారు. మీరేంటండీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు’ అని చాలా మంది అడిగేవారు. నాతో పాటు పనిచేసిన వారు కూడా ఆశ్చర్యపోయేవారు.

ఒక హిందీ సినిమాలో మీ డ్యాన్స్‌ చూసి డ్యాన్స్‌ మాస్టర్‌ కింద పడిపోయారట!
విజయ లలిత:‘లోక్‌పర్‌లోక్‌’ షూటింగ్‌ సందర్భంగా జరిగింది. డ్యాన్స్‌ మాస్టర్‌ పిలిచి ‘అమ్మా వాళ్లు చెన్నై వారిని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఈ మూమెంట్‌ సింగిల్‌ షాట్‌లో పూర్తి చేయాలి’ అని అన్నారు. అలాగే చేశా. ప్యారేలాల్‌ చాలా సంతోష పడిపోయారు.

మీ అబ్బాయి కోసం స్కూల్‌ దగ్గర చాలా సేపు వేచి చూసేవారట!
విజయ లలిత:వాడిని ప్రీకేజీలో జాయిన్‌ చేసిన తర్వాత నా కోసం ఏడిస్తే ఇంటి నుంచి రావడం ఆలస్యమవుతుందని స్కూల్‌ దగ్గరే ఎక్కువ సేపు వేచి చూసేదాన్ని.

ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానురా? అని ఎప్పుడైనా అనిపించిందా?
విజయ లలిత: ఎప్పుడూ, కలలో కూడా అనిపించలేదు. చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు అలాగే ఉన్నా!

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

తెలుగు ఇండస్ట్రీ: నా ప్రాణం
ఎన్టీఆర్‌: నా దైవం
ఎంజీఆర్‌: ఆయనతో నటించడం ఒక గొప్పతనం 
రౌడీ రాణి: మంచి పేరు తెచ్చింది
గుర్రం: నా ఇష్టం
క్లబ్‌ సాంగ్స్‌: ఇష్టపడి చేసినవి
డ్యాన్స్‌: నా ప్రాణంలో ప్రాణం
హృదయ సాయి: అందరి కన్నా ఎక్కువ
ఏయన్నార్‌: మహానుభావుడు
విజయశాంతి: నా అక్క కూతురు
ఆలీ: నా ప్రాణం అందుకే ఇంతదూరం వచ్చా!


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.