close

తాజా వార్తలు

‘ఇలా అయ్యావేంటీ‌’ అని అడ‌గాల‌నుకున్నా!

నేను ఉత్త‌రం రాస్తే స‌మాధానం కూడా ఇవ్వ‌లేదు

‘య‌శోద‌కృష్ణ‌’తో బాల న‌టిగా ప‌రిచ‌య‌మై అల‌నాటి అగ్ర న‌టులంద‌రితోనూ న‌టించి మెప్పించారు రోహిణి. క‌థానాయిక‌గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి జాతీయ అవార్డును సైతం సొంత చేసుకున్నారు. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ‘అలా మొద‌లైంది’తో రీఎంట్రీ ఇచ్చి,  ఫ్రెండ్లీ మ‌ద‌ర్ పాత్ర‌ల‌కు స‌రికొత్త అర్థం చెప్పారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ న‌టిగా విభిన్న పాత్ర‌ల‌ను పోషిస్తూ అల‌రిస్తున్నారామె.  ఆలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ‘ఆలీతో స‌ర‌దాగా’ కార్య‌క్ర‌మంలో తన జీవితానికి, సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రోహిణి నిజ‌మైన పేరా?
రోహిణి: అవును! అమ్మానాన్న అదే పేరు పెట్టారు. 
ఐదేళ్ల వ‌య‌సులోనే ‘య‌శోద‌కృష్ణ‌’లో నటించే అవకాశం ఎలా వ‌చ్చింది?
రోహిణి:  సినిమాల్లో న‌టించ‌డం మా నాన్న‌కు చాలా ఇష్టం. ఆయ‌న ఆఫీస్‌కు వెళ్లేట‌ప్పుడు న‌న్ను కూడా తీసుకెళ్లేవారు. అప్పుడు వాళ్లు చూసి ‘ఈ పాప ముద్దుగా ఉంది. యాక్టింగ్ చేయ‌నిస్తారా’ అని అడిగారు. అప్పుడు మేక‌ప్ టెస్టు చేసి సినిమాలో అవ‌కాశం ఇచ్చారు.
బాల‌న‌టిగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు?
రోహిణి:  లెక్క పెట్ట‌లేదు కానీ, చాలా సినిమాలు చేశా. దాదాపు 200 వ‌ర‌కూ ఉంటాయేమో. హీరోయిన్‌గా అన్ని భాష‌ల్లో క‌లిపి 80 సినిమాలు చేశా. మొత్తం సుమారు 300 పైనే సినిమాల్లో న‌టించా. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు, హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ న‌టించా. ఎక్కువ‌గా త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలు చేశా.


నాన్న‌ ఏం చేసేవారు?
రోహిణి: ప‌ంచాయ‌తీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసేవారు. త‌ర‌చూ బదిలీలు అయ్యేవి. అమ్మ‌ది తాపేశ్వ‌రం ప‌క్క‌న ఇంప‌న‌పాడు. అప్పుడ‌ప్పుడూ సొంతూరుకి కూడా వెళ్తుంటా. 
న‌టిస్తూనే డ‌బ్బింగ్ చెప్పారు క‌దా! మొద‌టి సినిమా ఏది?
రోహిణి: ‘గీతాంజ‌లి’. అందులో చాలా డైలాగ్‌లు గుర్తున్నాయి కానీ, ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం. చాలా మంది దాన్ని రింగ్‌టోన్‌గా కూడా పెట్టుకున్నారు. ‘లేచిపోదామ‌న్న మ‌గాడా! రా చూద్దాం’ అన్న డైలాగ్ విన్న‌ప్పుడు నాకు చాలా ఆనంద‌మేస్తుంది. 
మ‌ణిర‌త్నం  సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
రోహిణి: ఈ సినిమాకు తెలుగులో జంధ్యాల‌గారు సంభాష‌ణ‌లు రాశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘నాలుగు స్తంభాలాట’కు నేను డ‌బ్బింగ్ చెప్పాను. అప్పుడు  అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన పాణిగారికి నేను డ‌బ్బింగ్ చెప్ప‌డం న‌చ్చింది. దాంతో ఆయ‌న ‘గీతాంజ‌లి’ సినిమా కోసం నా పేరు సూచించారు. అయితే, నేను చాలా ఆలోచించా. హీరోయిన్‌గా చేస్తున్న స‌మ‌యంలో డ‌బ్బింగ్ చెబితే, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ అనేస్తారేమోన‌ని భ‌యం. మ‌ణిర‌త్నంగారు అనేస‌రికి ఒప్పుకొన్నా. నేను చివ‌రిగా డ‌బ్బింగ్ చెప్పిన సినిమా ‘రావ‌ణ్‌’.(మ‌ధ్య‌లో అలీ మాట్లాడుతూ.. పాణిగారు హాలీవుడ్‌కు వెళ్లారు. స్పీల్‌బ‌ర్గ్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ షోలు చూసిన ఆయ‌న ఫోన్ చేసి ‘నీ యాంకరింగ్ చాలా బాగుంది. చాలా మందిని గుర్తు చేస్తున్నావు’ అని మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది)
మీ కుటుంబంలో మీరు కాకుండా స్టార్స్ ఎవ‌రు?
రోహిణి:  మా అన్న‌య్య బాలాజీ కూడా న‌టుడే. మేము మొత్తం ఐదుగురం. నాక‌న్నా పెద్ద వాళ్లు ముగ్గురు ఉన్నారు. నా త‌ర్వాత త‌మ్ముడు పుట్టాడు. 
చిన్న‌ప్పుడు డైలాగ్‌లు చెప్ప‌డానికి శిక్ష‌ణ ఇచ్చారా? లేక నేరుగా చెప్పేసేవారా?
రోహిణి:  మా నాన్న‌గారు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ప్ర‌తి డైలాగ్ ఆయ‌న చెప్పి, నాతో చెప్పించేవారు.


ఇంత సాఫ్ట్‌గా క‌నిపించే రోహిణి విల‌న్‌ను ఎలా ప్రేమించింది?
రోహిణి:  నేను హీరోయిన్‌గా ‘క‌క్క‌’ అని మ‌ల‌యాళంలో ఒక సినిమా చేశా. అప్పుడు నాకు 15 సంవ‌త్స‌రాలు. అందులో ర‌ఘువ‌ర‌న్ హీరో. అదే నా ఫ‌స్ట్ ల‌వ్‌. ఆ త‌ర్వాత చాలా సంవ‌త్స‌రాలు క‌లుసుకోలేదు. నేను మాత్రం ఉత్త‌రం రాశాను. ఆయ‌న నుంచి స‌మాధానం రాలేదు. సినిమా అంటే ఆయ‌న‌కు ప్యాష‌న్. కానీ, చాలా స‌మ‌స్య‌ల్లో ఉన్నాడ‌ని తెలిసింది. ముఖ్యంగా చెడు అల‌వాట్ల‌కు బానిస అయ్యాడ‌ని తెలిసి, వెళ్లి క‌లిసి ‘ఎందుక‌లా చేస్తున్నావ్‌. ఇలా అయ్యావేంటి’ అని అడుగుదామ‌నుకున్నా. కానీ, కుద‌ర‌లేదు. దాదాపు 13ఏళ్ల త‌ర్వాత మేమిద్ద‌రం క‌లిసి త‌మిళ సినిమా చేశాం. అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం పెరిగింది. ఆయ‌నే ప్ర‌పోజ్ చేశారు. ‘అంజ‌లి’ సినిమా త‌ర్వాత మా పెళ్ల‌యింది. మాకు ఒక అబ్బాయి రుషి. డిగ్రీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. 
రోహిణి సాఫ్టా?  యారోగెంటా?
రోహిణి:  నేను కొంచెం ఇంట్రోవ‌ర్ట్. అందుకే చాలా మందికి యారోగెంట్‌లా అనిపిస్తుంది. దానిని స‌రిచేయాల‌ని అనుకోలేదు. నేను ఎప్పుడూ నా ప్ర‌పంచంలో ఉంటా. 
సెట్‌లో ఉంటే ద‌డ‌ద‌డ‌లాడిస్తార‌ని విన్నాం నిజ‌మేనా?
రోహిణి: ద‌డ‌ద‌డ‌లాడించ‌డం అంటే ఏంటి? అస‌లు అది ఎందుకు వ‌చ్చిందో నాకు తెలియ‌దు. నేనెప్పుడూ ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల వైపే ఉంటా. ఎందుకంటే కొన్ని సార్లు అనుకున్న స‌మ‌యానికి షాట్‌రెడీ కాక‌పోవ‌చ్చు. ఆ మాత్రానికే కోపం తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇవ‌న్నీ చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూనే ఉన్నా. అయితే, నేను ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఎవ‌రైనా మాట్లాడుతుంటే కాస్త కోపం వ‌స్తుంది. అంత‌కు మించి ఏదీ లేదు.
అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేశారా?
రోహిణి: అవును! సింగీతం శ్రీ‌నివాస‌రావుగారి ద‌గ్గ‌ర ‘వెల్‌క‌మ్ ఒబామా’ కోసం ప‌నిచేశా. నాకు కూడా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని కోరిక‌.

 
మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని గుణ‌శేఖ‌ర్ అడిగితే చేయ‌లేదు.. నందినీరెడ్డి అడిగితే చేశారు కార‌ణం?
రోహిణి: (న‌వ్వులు) ఆయ‌న అడిగిన‌ప్పుడు నాకు 34 సంవ‌త్స‌రాలు. ఇప్పుడు త‌ల్లి పాత్ర‌లా? అనిపించింది. ఆ త‌ర్వాతి సంవ‌త్స‌ర‌మే నందినీ వ‌చ్చి అడిగింది. సినిమాల్లో న‌టించ‌డం లేదు క‌దాని నేను హెయిర్‌క‌ట్ చేసుకుని ఉన్నా. ఫ్రెండ్లీ మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ అని చెప్ప‌డంతో ఒప్పుకొన్నా. ఒక‌వేళ గుణ‌శేఖ‌ర్ కూడా అలాంటి పాత్ర చెప్పి ఉంటే వెంటనే ఒప్పుకొనేదాన్ని.
మీకు జాతీయ అవార్డు వచ్చింది క‌దా!
రోహిణి: 1996లో సేతుమాధ‌న్‌గారు ‘స్త్రీ’ అని తెలుగు సినిమా తీశారు. నేను తెలుగులో చాలా త‌క్కువ సినిమాలు చేశా. వాటిల్లో ఈ చిత్రానికి జాతీయ అవార్డు వ‌చ్చింది. 
భ‌విష్య‌త్‌లో మిమ్మ‌ల్ని పెద్ద‌ డైరెక్ట‌ర్‌గా చూడ‌వ‌చ్చా?
రోహిణి: అవ‌కాశాల‌ను బ‌ట్టి ఉంటుంది. ప్ర‌స్తుతం నాకు మంచి పాత్ర‌లు వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కులు వ‌చ్చి కొత్త కొత్త పాత్ర‌ల గురించి చెబుతుంటే చాలా ఆస‌క్తిగా ఉంటోంది. డైరెక్ష‌న్ ఒక త‌ప‌స్సులాంటిది. న‌టిగా అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్పుడు దాని మీద దృష్టి పెట్ట‌డం క‌ష్ట‌మ‌వుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో బిజీగా ఉన్నా. 
మీకు బాపు, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, జ‌య‌సుధ‌ స్ఫూర్తి అని చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు? ఎందుకు?
రోహిణి:  బాపుగారి గురించి ఏమ‌ని చెప్పాలి. ఆర్టిస్టిక్ క‌దా! ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘త్యాగయ్య‌’లో నేను న‌టించా. ఒక స‌న్నివేశంలో నాకు రాముడి గెట‌ప్ వేసి నిల‌బెట్టారు. నేను ఎలా నిల‌బ‌డాలో పేప‌ర్‌పై గీసి చూపించారు. ఎంత గొప్ప డైరెక్ట‌ర్‌. అలాగే బాల సుబ్ర‌హ్మ‌ణ్యంగారు కూడా. ఆయ‌న‌కు అస్స‌లు కోప‌మే రాదు. ఇక జ‌య‌సుధ‌గారు గొప్ప న‌టి. న‌ర్గీస్‌, సావిత్రిగార్ల త‌ర్వాత మ‌న‌కు దొరికిన ఆణిముత్యం. ఆవిడ‌కు జాతీయ అవార్డు రాక‌పోవ‌డం నిజంగా బాధాక‌రం. 
‘శివ‌’కు డ‌బ్బింగ్ చెప్ప‌మంటే రిజెక్ట్ చేశార‌ట‌?
రోహిణి:  ‘గీతాంజ‌లి’కి డ‌బ్బింగ్ చెప్పిన‌ప్పుడు ఒకే ఒక్క‌ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పాల‌ని అనుకున్నా. కానీ, అన్న‌పూర్ణా స్టూడియోస్ నుంచి ప‌దే ప‌దే ఫోన్లు వచ్చాయి. అయితే, నాకు సినిమా చూపించండి. న‌చ్చితే డ‌బ్బింగ్ చెబుతా అని చెప్పా. రెండు రీళ్లు వేసి చూపించారు. నా వెనుక రామూగారు కూర్చొన్నారు. మొద‌టి రీలు చూడగానే అనిపించింది. ఈ ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర ఏదో అద్భుతం ఉంది అని. వెంట‌నే డ‌బ్బింగ్ చెబుతాన‌ని చెప్పేశా. న‌న్ను డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మార్చిన క్రెడిట్ రాంగోపాల్‌వర్మ‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది. 
మీ అబ్బాయిని హీరో చేసే అవ‌కాశం ఉందా?
రోహిణి:  లేదు. డాక్ట‌ర్ కావాల‌ని తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే వాడు డిసైడ్ అయిపోయాడు. 
ఎన్టీఆర్‌తో కూడా న‌టించిన‌ట్లు ఉన్నారు?
రోహిణి: ‘అడ‌విరాముడు’లో న‌టించా. అందులో మూగ పాప‌గా చేశా. ఆ త‌ర్వాత ‘మా వారి మంచిత‌నం’, ‘నాదేశం’ సినిమాల్లో న‌టించా. ఇక ఎస్వీఆర్‌గారంటే కూడా నాకు బాగా ఇష్టం. చిన్న‌ప్పుడు ఆయ‌న్ను చూస్తే భ‌యం వేసేది. అయితే, ఆయ‌న న‌న్ను త‌న ఒడిలో కూర్చోబెట్టుకుని ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేవారు.


నిత్యామేన‌న్‌-రోహిణి బాగా క్లోజ్ అని విన్నాం?
రోహిణి: ‘అలా మొద‌లైంది’లో ఇద్ద‌రం క‌లిసి చేశాం. త‌న‌ని చూస్తే రుషిని చూసిన‌ట్లే ఉంటుంది. మ‌న‌సులో ఏదీ పెట్టుకోకుండా మాట్లాడేస్తుంది. అందుకే త‌నంటే నాకు చాలా ఇష్టం. 
ఏ వ‌య‌సులో అమ్మ చ‌నిపోయారు?
రోహిణి:  నా ఐదో ఏట ఆమె చ‌నిపోయారు. ఆమె ఉంటే ఇంకా బాగుండేది. 
పాలిటిక్స్ అంటే బాగా ఇష్ట‌మా?
రోహిణి:  పాలిటిక్స్ గురించి మాట్లాడ‌క‌పోవ‌డం కూడా ఒక పొలిటిక‌ల్ స్టాండ్ అనే చెప్పాలి. నిశ్శ‌బ్దంగా ఉండ‌టం అస్స‌లు మంచిది కాదు. నేను ఎవ‌రినీ స‌పోర్ట్ చేయ‌ను. కానీ, అంద‌రికీ నేను చెప్పేది ఏంటంటే.. మీరు మీ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని చెబుతా! మీకు ఎవ‌రూ న‌చ్చ‌క‌పోతే క‌నీసం నోటాకు అయినా ఓటు వేయండి.
‘రంగ‌స్థ‌లం’ షూటింగ్ స‌మ‌యంలో ‘ఎందుకు గ‌ట్టిగా అరుస్తారు మేడ‌మ్‌!’ అని ఆది పినిశెట్టి అంటే ఏదో చెప్పార‌ట‌!
రోహిణి: ఒక‌సారి పాత్ర‌లోకి వెళ్లిపోయిన త‌ర్వాత న‌టించ‌లేం. అదే మ‌న‌ల్ని చేయిప‌ట్టుకుని తీసుకెళ్తుంది. అలా తీసుకువెళ్ల‌నివ్వాలి కూడా. అప్పుడే మేజిక్ జ‌రుగుతుంది. యాక్టింగ్ అంటే ఏంటో మ‌ల‌యాళ సినిమాలు చేస్తుంటే తెలిసింది. ఆ ద‌ర్శ‌కులు, న‌టులు నాకు నేర్పారు. మెథ‌డ్ యాక్టింగ్‌లో ఉన్న రుచి అది.

మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఒక్క మాట‌లో స‌మాధానం
మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ:  టాలెంట్‌
తెలుగు ఇండ‌స్ట్రీ: గ‌్రాండియ‌ర్‌
య‌శోద కృష్ణ‌:  మై ఫ‌స్ట్ ల‌వ్‌
ర‌ఘువ‌ర‌న్:  మై ల‌వ్‌
రుషి:  మై లైఫ్ 
డ‌బ్బింగ్: ఎగ్జైటింగ్‌
ప్రేమ‌:  బ్యూటిఫుల్‌
డైరెక్ష‌న్‌:  ఛాలెంజ్‌
నిత్యామేన‌న్‌:  చైల్డ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.