close

తాజా వార్తలు

చిరంజీవి, రజనీకాంత్‌.. మీ రూమ్మేట్లా?

‘రాజీవ్‌.. నేను పెళ్లి చేసుకుంటాం’ అని సుమే చెప్పింది

ఇంటర్నెట్‌డెస్క్: ఆయన నట వారసత్వానికి తండ్రి.. మాటల ప్రవాహానికి మావయ్య... నటన నేర్పడంలో మహాదిట్ట.. అలా సినీ ప్రయాణంలో తానెంతో నేర్చుకుని, ఎంతోమందికి నటన నేర్పించి సినీ ద్రోణాచార్యుడిగా నిలిచి, కళామ తల్లి వెనకాల... దేవదాస్‌ కనకాలగా గెలిచారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఎన్నో సరదా సంగతులు చెప్పారు.

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?
దేవదాస్‌ కనకాల: నేను 5వ ఫారం చదువుతున్నప్పుడు మా ఊరి హెడ్‌మాస్టర్‌ నాతో నాటకం వేయించారు. ఆ సమయంలో నాకు ఇంగ్లీష్‌ రాదు.. కానీ, ఆయన ఎంతో ఓపికగా అంతా నేర్పారు. అలా వేసిన నాటకానికి మంచి పేరు వచ్చింది. అందరూ అభినందించారు. దీంతో నాటకాలు వేయాలన్న నిర్ణయానికి వచ్చా!

మీ తొలి సినిమా ఏది?
దేవదాస్‌ కనకాల: బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ‘బుద్ధిమంతుడు’. అందులో అక్కినేని స్నేహితుల్లో నేనుంటాను. ఆ సినిమా అయిపోయిన తర్వాత పెద్దగా అవకాశాలు వస్తాయని కూడా నేను అనుకోలేదు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వాళ్లది సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌ ఉంది. దానికి దరఖాస్తు చేస్తే ఉద్యోగం వచ్చింది. ఇక్కడే లక్ష్మీదేవి పరిచయం అయింది.. పెళ్లి చేసుకున్నాం.

ఒకప్పుడు దేవదాస్‌ కనకాల కుమారుడు రాజీవ్‌ కనకాల అనేవారు.. ఇప్పుడు రాజీవ్‌ కనకాల తండ్రి దేవదాస్‌ కనకాల అంటున్నారు.. మీకెలా ఉంది?
దేవదాస్‌ కనకాల: చాలా గర్వంగా ఉంది. వాడి ముందు నేను నథింగ్‌. ప్రదర్శనకు వచ్చేసరికి రాజీవ్‌ చాలా బాగా చేస్తాడు.

రాజీవ్‌లో టాలెంట్‌ ఉందని ఎప్పుడు గుర్తించారు?
దేవదాస్‌ కనకాల: చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే.. వాడి వెనకాల పడి కొడుతున్నప్పుడు..(నవ్వులు). తరవాత రోజూ క్లాస్‌లకు వచ్చేవాడు. అన్నీ చేసేవాడు. అప్పుడే ఏదో ఒకరోజు మంచి నటుడు అవుతాడని అనిపించింది.

దేవదాస్‌ అనే పేరు పెట్టడానికి గల కారణం?
దేవదాస్‌ కనకాల: నేను పుట్టినప్పుడే నక్షత్రం ప్రకారం ఈ పేరు పెట్టారు. అంతేకాదు, మా అమ్మ అప్పటికే దేవదాసు నవల కూడా చదివి ఉండటంతో ఈ పేరును ఖాయం చేశారు. ఆ తర్వాత మా తమ్ముళ్లకు రామదాసు, శంభుదాసు, శ్రీనివాసు అని పెట్టారు. మాది యానాం. అంటే పాండచ్చేరి వాళ్లం. అప్పట్లో యానాంలో తెల్లదొరలు ఉండేవారు. వాళ్ల అమ్మాయిలు చాలా బాగుండేవారు. (మధ్యలో ఆలీ అందుకుని.. సుమా విన్నావా ఈ మాట.. నవ్వులు!) అయితే ఒక్క మాట! మనందరిలోనూ స్ఫూర్తినీ, మన జీవితాల్లో వెలుగుల్నీ నింపేది.. ఆడపిల్లే...(చప్పట్లు)

ఇటీవల మీ సతీమణి కాలం చేశారు..? మీ బంధం ఎన్నేళ్ల నుంచి కొనసాగింది?
దేవదాస్‌ కనకాల: 48 ఏళ్లు కలిసి ఉన్నాం. ఆవిడ ఉన్నంత కాలం చాలా బాగా గడిచింది. వయసులో ఆమె నాకంటే ఆరేళ్లు పెద్దది. వయసులో పెద్దవాళ్లు అని ప్రేమించడం మానేయద్దు (నవ్వులు).

మీకన్నా పెద్దావిడకు ఎందుకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పాల్సి వచ్చింది?
దేవదాస్‌ కనకాల: కొన్ని కాన్సెప్ట్‌లు ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రాలేదు. ఎమోషన్‌ మెమొరీ అనే మాట ఉంది. ఆవిడ పెర్‌ఫామ్‌ చేస్తుంటే చూశా, అందర్నీ కదిలించింది. ఆశ్చర్యపోయా. అప్పుడు మొదలైన పరిచయం పెళ్లి వరకూ చేరింది. ఆ తర్వాత ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. నా తరగతులకు చాలా ఉపయోగపడింది. నేను చదువుకుని వచ్చినా, ఆమె ప్రాక్టికల్‌ ఉమన్‌ కావడంతో చాలా విషయాలు బాగా చెప్పేది.

మీరు నాన్‌వెజ్‌ బాగా వండుతారట!
దేవదాస్‌ కనకాల: అవును, బాగా వండుతా!. యానాంలో ఫ్రెంచ్‌వాళ్లు ఉండేవారు. అక్కడ మానాన్నగారు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ పోర్ట్స్‌. ఆ సమయంలో పార్టీలు జరిగితే, సాంబ అనే వ్యక్తి వంటలు బాగా చేసేవాడు. ఆయన దగ్గర కూర్చొని చూసి నేర్చుకున్నా. అలా అలవాటైంది.

మీ కుటుంబంలో అందరూ ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు? కారణం ఏంటి?
దేవదాస్‌ కనకాల: నేను కులం, మతం వంటి వాటిని నమ్మలేదు. వాటికి అతీతంగా మనుషులు ఉండాలని కోరుకుంటా.

మీ దృష్టిలో నాటకాల్లో నటించడం కష్టమా? లేక సినిమాల్లోనా?
దేవదాస్‌ కనకాల: ఏ రంగంలో రాణించాలన్నా నటించేవాడికి ప్యాషన్‌ ఉండాలి. ఒకబ్బాయి అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడో.. అదే విధంగా నటించడం పట్ల పిచ్చి ఉండాలి. నాటకాలకు బాగా రిహార్సల్స్‌ చేసేవాళ్లం. దీంతో సునాయాసంగా జరిగేవి. అయితే, సినిమాలకొచ్చేసరికి ఒక రకమైన ఇబ్బంది ఉంది. రెండు, మూడు రిహార్సల్స్‌ తప్ప ఎక్కువ చేయలేం. అంతా ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆర్టిస్ట్‌ మనకూ మధ్య సయోధ్య కుదరాలి. సినిమా అలవాటైతే ఆ ఇబ్బంది ఉండదు. దాదాపు 50 నుంచి 100 సినిమాల్లో నటించానేమో!

మీ దగ్గర శిక్షణ పొందిన వారు చాలా మంది స్టార్స్‌ అయ్యారు! వాళ్లను చూస్తే మీకేమనిపిస్తుంది?
దేవదాస్‌ కనకాల: చాలా సంతోషంగా ఉంటుంది. మా దగ్గర ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ, ఆ తర్వాత దర్శకుల దగ్గర, ఇతర నటుల దగ్గర నేర్చుకుని, సాధన చేసి కష్టపడి జనానికి దగ్గరయ్యారంటే చాలా ఆనందంగా ఉంటుంది.

సుమలో ఏం నచ్చి మీరు కోడలిగా చేసుకున్నారు?
దేవదాస్‌ కనకాల: సుమ ‘మేఘమాల’ టీవీ సీరియల్‌ చేస్తున్నప్పుడు అందులో రాజీవ్‌ కూడా చిన్న వేషం వేశాడు. ఆ సీరియల్‌లో అమ్మాయితో వర్క్‌ చేస్తున్నప్పుడు ‘అరె! ఈ పిల్ల బాగా తెలివైందిలా ఉందే! మా ఇంటికి కోడలిగా వస్తే బాగుంటుంది’ అనుకున్నా. రాజీవ్‌ కంటే ముందుగా అనుకున్నది నేనే! కొన్నాళ్ల తర్వాత సుమ ఫోన్‌ చేసింది. ‘అంకుల్‌ నేను, రాజీవ్‌ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. మీరందరూ సపోర్ట్‌ చేస్తారా’ అని అడిగింది. మా ఇంట్లో ఒప్పుకొన్నాం కానీ, వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. సుమను కేరళ కూడా పంపించేశారు. ఆ తర్వాత ఎన్నో ఫోన్లు చేసి మాట్లాడితే, చివరకు ఒప్పుకొన్నారు. అయితే, సుమను కోడలిగా చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి ఒక్కటే చెప్పా.. ‘సుమా! ఒక్క విషయం ఆలోచించు. మీ అమ్మకు నువ్వు ఒక్కదానివే కూతురివి. నీ మీదే అన్ని ఆశలు పెట్టుకుంది. రేపు ఆమెకు ఏదైనా అయితే, భరించగలవా? తట్టుకోగలవా. అలా అయితేనే చెప్పు.. దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా’ అని చెప్పా. ఆ తర్వాత వాళ్ల పెద్దవాళ్లు కూడా ఒప్పుకొన్నారు.

మీకు సంతోషంగా అనిపించినా, లేదా బాధగా అనిపించినా, సుమతో చెప్పుకొంటారా? లేక రాజీవ్‌తో చెప్పుకొంటారా?
దేవదాస్‌ కనకాల: నేను ఎవరితోనూ చెప్పుకోను. వాళ్ల జీవితం వాళ్లది. నా భార్య ఉన్నప్పుడు అన్నీ తనతో చెప్పుకునేవాడిని. ఇప్పుడు చీకటితో చెప్పుకొంటున్నా. ఎందుకంటే తను చీకటిలోనే ఉంటుంది కాబట్టి. నా కష్టాలు ఎప్పుడూ వాళ్లతో పంచుకోను.

విడాకుల కాగితంపై సంతకం చేయమని మీ భార్యను అడిగేవారట!
దేవదాస్‌ కనకాల: ఇదొక అద్భుతమై ప్రహసనం. మీ జీవితాల్లోకి విడాకుల పత్రాలు రాకూడదు. నేను ఎందుకు అడిగేవాడినంటే.. ఎవరైనా మనల్ని ఫోర్స్‌గా పట్టుకుని వేలాడుతుంటే, భరించలేక మనం విడిపోదాం.. నువ్వు సంతకం పెట్టు.. నేను కూడా పెడతా.. అనే రీతిలో విడాకులు అడిగేవాడిని. అయితే నిజం ఏంటంటే.. ఆమె లేకపోతే నేను బతకలేను. ఆవిడ సంతకం పెట్టినా, ఆ తర్వాత చింపేసే వాడిని. ఆవిడంటే నాకు చాలా ఆరాధన. ఆవిడను వదిలి పెట్టి నేను ముందు వెళ్లిపోకూడదని అనుకునేవాడిని. ఎందుకంటే నేను ముందు పోతే, ఆమెను చూస్తారో లేదో.. అన్న భయం. అలాంటి వాళ్లను చూశా. అలాగే ఆవిడను పంపించేశా!(కన్నీళ్లు)

మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది?
దేవదాస్‌ కనకాల: ‘కాలం మారింది’లో నేను చేసిన దళితుడి పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే, విశ్వనాథ్‌గారి సినిమా చేసేటప్పుడు ఆయనతో తిట్లు తినకుండా బయటకు రావాలని అనుకున్నా. అదేవిధంగా ఏమాట పడకుండా సినిమా పూర్తయింది.

‘నాగమల్లి’కి దర్శకత్వం వహించడం మీకు ఎలాంటి అనుభవం ఇచ్చింది?
దేవదాస్‌ కనకాల: సినిమా బాగా ఆడింది. కథ చెప్పడం మాత్రం యావరేజ్‌. డిస్ట్రిబ్యూటర్స్‌ గందరగోళంలో ఆ సినిమాకు మంచి ఆదరణ దక్కలేదు. నా విద్యార్థులకు అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్న ఉద్దేశంతో సినిమాకు దర్శకత్వం వహించా.

చిరంజీవి, రజనీకాంత్‌ మీ రూమ్మేట్లా?
దేవదాస్‌ కనకాల: వాళ్లు నా స్టూడెంట్స్‌. రాజేంద్రప్రసాద్‌ కూడా నా విద్యార్థే. అప్పట్లో దర్శకత్వం చేయడానికి అవకాశాల కోసం చూస్తునప్పుడు.. ఒకసారి రజనీకాంత్‌ మా ఇంటికి వచ్చి, ‘మేడమ్‌.. ఒకసారి మాస్టర్‌ని రమ్మనండి.. నేను ప్రసాద్‌ స్టూడియోలో ఉంటాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. నేను అక్కడికి వెళ్తే, ‘మాస్టారూ! డేట్స్‌ ఇస్తాను. మీరు సినిమా చేసుకోండి’ అని అన్నాడు. ‘నాకు తమిళ్‌ రాదు. కాబట్టి సినిమా చేయలేను. ఒకవేళ నువ్వు కాల్‌షీట్‌ ఇస్తే, నేను వేరేవాళ్లకు అమ్ముకోవాలి. నాకు అవకాశం ఉన్నంత వరకూ పాకులాడతా. దయచేసి నన్ను పోరాడనివ్వండి’ అని చెప్పా.

మీ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు ఎవరిని చూసి భయపడేవారు?
దేవదాస్‌ కనకాల: మేడమ్‌ను చూసి భయపడేవారు.

జయశ్రీ అనే పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది?
దేవదాస్‌ కనకాల: నా చిననాటి హీరోయిన్‌. నేను ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌ చేస్తున్నప్పుడు జయశ్రీ అనే అమ్మాయి ఉండేది. చాలా అందంగా ఉండేది. మంచి డ్యాన్సర్‌ కూడా. ఆమెను రోజూ ఇంటి దగ్గర కూడా దింపేవాడిని.

ఇన్నేళ్ల జీవితంలో మీరు గెలిచిందేంటి? కోల్పోయిందేంటి?
దేవదాస్‌ కనకాల: వచ్చినప్పుడు ఉత్త చేతులతోనే వచ్చాను. పోయేటప్పుడు కూడా వట్టి చేతులతోనే పోతాను. ఈ మధ్యలో ఉన్నదంతా గెలిచిందే!

తెలుగు చిత్ర పరిశ్రమలో దేవదాస్‌ కనకాలకు రావాల్సిన గుర్తింపు రాలేదు.. అనే దానిపై మీ కామెంట్‌?
దేవదాస్‌ కనకాల: అది నిజం. ‘ఓ సీత కథ’ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేను వేషాలపై ఫోకస్‌ చేయకపోవడం. ఇనిస్టిట్యూట్‌ పెట్టడం, దర్శకత్వం చేయడం... అలా ముందుకెళ్లిపోయా.

మీ దగ్గరకు ఎవరైనా యాక్టింగ్‌ నేర్చుకోవడానికి వస్తే, ‘వెళ్లవయ్యా.. వెళ్లి వేరే పని చేసుకో’ అని చెప్పారా?
దేవదాస్‌ కనకాల: చాలామందికి చెప్పా. ఎందుకంటే యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరినంత మాత్రాన నటులు కాలేరు. వాళ్లకు చాలా పట్టుదల కావాలి. అలా పట్టుదల లేనివాళ్లను తప్పుదోవపట్టించడమెందుకుని వెళ్లిపొమ్మని చెప్పేవాడిని. ఒక వ్యక్తి నటన చూడకుండానే అతను మంచి నటుడా? కాదా? నాకు తెలిసిపోతుంది. అలా నేను అనుకున్న వాళ్లలో మోహన్‌బాబు కూడా ఒకరు.

ఒక్క సినిమా మాత్రమే దర్శకత్వం వహించారా?
దేవదాస్‌ కనకాల: మొత్తం ఆరు సినిమాలకు దర్శకత్వం వహించా. ‘చలిచీమలు’, ‘నాగమల్లి’, ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’, ‘ఓ ఇంటి బాగోతం’.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానం
నాటకం: నా ప్రాణం
సినిమా: దోబూచులాడిన చోటు
యాక్టింగ్‌ స్కూల్‌: బాగా ఇష్టంమైంది
భార్య: లక్ష్మీదేవి
జయశ్రీ: మంచి ఆర్టిస్ట్‌
జీవితం: మథనం
శ్రీలక్ష్మి: నా ప్రాణం
రాజీవ్‌ కనకాల: జగమెరిగిన బ్రాహ్మణుడు
సుమ: ఆమె గురించి చెప్పడానికి ఏముంది?


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.