close

తాజా వార్తలు

రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు

సినిమా పేరు: శైల‌జారెడ్డి అల్లుడు

న‌టీనటులు: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, పృథ్వీరాజ్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ

సంగీతం: గోపీసుంద‌ర్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)

నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం: మారుతి

సంస్థ‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల‌: 13 సెప్టెంబ‌రు 2018

త్త - అల్లుళ్ల నేప‌థ్యంలో సాగే క‌థ‌లు తెలుగు తెర‌కు బాగా అచ్చొచ్చాయి. ఈ మ‌ధ్య వాటి జోరు త‌గ్గింది కానీ... 90వ ద‌శ‌కంలో తర‌చుగా తెర‌కెక్కేవి. విజ‌య‌వంత‌మైన ఆ జోన‌ర్‌ని మ‌రోసారి గుర్తు చేస్తూ `శైల‌జారెడ్డి అల్లుడు` పేరుతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మారుతి. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`తో కుటుంబ క‌థ‌లపై మంచి ప‌ట్టుంద‌ని నిరూపించుకున్న మారుతికి... నాగచైత‌న్య - ర‌మ్య‌కృష్ణ కాంబినేషన్‌ తోడ‌వ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పండ‌క్కి వ‌స్తున్నాం... పండ‌గ చేసుకుందాం అంటూ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. మ‌రి అత్తా, అల్లుడూ క‌లిసి పంచిన వినోదం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి...

క‌థేంటంటే: సానుకూల దృక్పథం ఉన్న యువ‌కుడు చైత‌న్య (నాగ‌చైత‌న్య‌). ఆయ‌న తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌)కి మాత్రం అహం ఎక్కువ‌. తాను చెప్పిందే జ‌ర‌గాల‌నే త‌త్వం ఆయనది. అచ్చం అలాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న అమ్మాయి అను (అను ఇమ్మాన్యుయేల్‌) చైత‌న్య జీవితంలోకి వ‌స్తుంది. తండ్రి అహాన్ని భ‌రించ‌డ‌మే ఒకెత్తైతే, అను అహం మ‌రో ఎత్తు. కానీ ప్ర‌తి విష‌యంలోనూ సానుకూలంగా ఆలోచించే చైత‌న్య ఎలాగోలా అనుని త‌న దారిలోకి తెచ్చుకుంటాడు. ఇక పెళ్లితో వారిద్ద‌రి జీవితం ముడి ప‌డుతుంద‌నుకునేలోపే ఓ మ‌లుపు. కాబోయే అత్త శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌)కి మ‌రింత అహం ఎక్కువనే విష‌యం బోధ‌ప‌డుతుంది. ఇటు ప్రేమించిన అను, అటు అత్త‌... ఈ ఇద్ద‌రి మ‌ధ్య అల్లుడు ఎలా న‌లిగిపోయాడు? వీళ్లంద‌రి అహాన్ని ఎలా పోగొట్టాడు? అనే విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.

ఎలా ఉందంటే: అత్త, అల్లుడి నేపథ్యంలో సాగే క‌థ‌ అ‌న‌గానే ఆ రెండు పాత్ర‌లూ నువ్వా నేనా అన్న‌ట్టుగా... ఎత్తులు, పైఎత్తులు వేస్తూ వినోదాన్ని పండించే సినిమాల్నే ఊహిస్తాం. కానీ ఇది ఆ త‌ర‌హా సినిమా కాదు. ఒక ప్రేమ‌క‌థ‌కి అహంతో పాటు, అత్త, అల్లుడు బంధం... అనే రంగులు పులిమాడు ద‌ర్శ‌కుడు. అహంతో స‌త‌మ‌త‌మ‌య్యే ముగ్గురు వ్య‌క్తుల్ని క‌థానాయ‌కుడు సంతృప్తిప‌రుచుకుంటూ వెళ్లే విధానం చుట్టూనే ఈ క‌థ‌ని అల్లాడు. ఆ పాత్ర‌ల చుట్టూనే డ్రామా పండించే ప్ర‌య‌త్నం చేశాడు. మొత్తంగా చూస్తే క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ పాత్ర‌ల్ని తీర్చిదిద్దుకున్న విధానం మాత్రం కొత్త‌గా అనిపిస్తుంది. డ్రామాతో పాటు, మంచి హాస్యానికి కూడా ఆస్కారం ల‌భించింది. అయితే ఆశించిన స్థాయిలో హాస్యం పండ‌లేదు. ద్వితీయార్ధం వెన్నెల కిషోర్‌, పృథ్వీ ఎపిసోడ్ మిన‌హా కామెడీ కోసం ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించలేదు. తొలి స‌గ‌భాగం సినిమా దాదాపుగా చైత‌న్య‌, అనుల మ‌ధ్య ప్రేమ నేప‌థ్యంలోనే సాగుతాయి. అహ‌మున్న అనుని ప్రేమ‌లోకి దించ‌డానికి చైత‌న్య చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో అక్క‌డ‌క్క‌డ కొంచెం కామెడీ పండింది. ద్వితీయార్ధంలో అత్త హంగామా మొద‌ల‌వుతుంది. ర‌మ్య‌కృష్ణని శైల‌జారెడ్డి అనే ఓ శ‌క్తివంత‌మైన పాత్ర‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ పాత్ర కూడా ఈ క‌థ‌కి స‌రిగ్గా అత‌క‌లేదు. తల్లి, కూతురు మధ్య మితిమీరిన అహం ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతూ వెళ్తాయి త‌ప్ప అందులో కొత్త‌ద‌నం ఏమీ కన్పించదు.

ఎవ‌రెలా చేశారంటే: నాగ‌చైత‌న్య చ‌లాకీ కుర్రాడిగా క‌నిపిస్తాడు. ఆయ‌న పాత్ర‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అయితే భావోద్వేగాల్ని పండించే సంభాష‌ణ‌ల‌పై ఆయ‌న మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సింద‌నిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ అందంతో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో కనిపిస్తుందామె. శైల‌జారెడ్డి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశారు. వెన్నెల కిషోర్‌, పృథ్వీలు క‌లిసి చేసిన కామెడీ అల‌రిస్తుంది. ముర‌ళీశ‌ర్మ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నిజార్ ష‌ఫీ ఛాయాగ్ర‌హణానికి, గోపీసుంద‌ర్ సంగీతానికి మంచి మార్కులు ప‌డ‌తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. మారుతి కథ‌, ఆలోచ‌న బాగున్న‌ప్ప‌టికీ అందులో ఆస‌క్తిని రేకెత్తించేలా మ‌లుపులు లేక‌పోవ‌డంతో సినిమా సాదాసీదాగా అనిపిస్తుంది. కామెడీ, మాట‌ల విష‌యంలో మాత్రం త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించాడు మారుతి. కానీ వాటి మోతాదే స‌రిపోలేదు.

బ‌లాలు:

+ అహంతో కూడిన పాత్ర‌లు

+ నాయకానాయిక‌లు, ర‌మ్య‌కృష్ణ‌ల అభిన‌యం

+ ద్వితీయార్ధంలో కామెడీ

బ‌ల‌హీన‌త‌లు:

- ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ

-‌ హాస్యం త‌గ్గ‌డం

చివ‌రిగా: ఈ ‘అల్లుడు’ కాస్త న‌వ్విస్తాడంతే..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.