close

తాజా వార్తలు

పారిశ్రామికవేత్తలను వైకాపా బెదిరిస్తోంది: పవన్‌

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోంది 

తిరుపతి : కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పారిశ్రామిక వేత్తలను వైకాపా ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో పవన్‌ సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. 

నా వ్యాఖ్యలను వక్రీకరించారు

‘కియా వంటి పరిశ్రమ సీఈవోను బెదిరిస్తే రాష్ట్రానికి ఎవరు వస్తారు? 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు.. అసలు పరిశ్రమలు వస్తున్నాయా? ఆంగ్ల మాధ్యమం విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఆంగ్లమాధ్యమాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించలేదు. పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి. ఆంగ్ల మాధ్యమం అవసరమే.. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులు మాధ్యమాన్ని ఎంచుకునే వీలుండాలి.  హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా నా వ్యాఖ్యలను వైకాపా వక్రీకరించింది. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఎవరి అండతో రాష్ట్రంలో సామూహిక మత మార్పిడిలు జరుగుతున్నాయి?. యురేనియం తవ్వకాల వల్ల పరిసర గ్రామాల్లో జలాలు కలుషితం అయ్యాయి. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడగకుండా.. యురేనియం శుద్ధి పరిశ్రమను కోరుతారా?’ అని పవన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కిలో ఉల్లి కోసం అవస్థలు!

శీతల గిడ్డంగులు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం రైతులను ఆదుకోలేక పోయింది. పసుపు రైతులకు అండగా నిలవలేక పోయింది. 151 ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఉల్లి అందించలేక పోతోంది. కిలో ఉల్లి కోసం నాలుగు గంటలు లైన్లలో ప్రజలు కష్టాలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం దృష్టి అంతా కూల్చివేతలపై పెట్టింది. రైతుల సమస్యలపై దృష్టి సారించకుండా విలువైన 6 నెలలు వృథా చేసింది. రాయలసీమ వెనకబడిపోయింది అంటున్నారు.. కావాలనే ప్రభుత్వం అలాంటి పరిస్థితులు కల్పిస్తోంది.  రాయలసీమ యువత గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

భాజపాకు ఏరోజూ దూరం కాలేదు

మరోవైపు తెదేపా, భాజపాతో పొత్తుపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా సహా కొన్ని అంశాలకోసమే విమర్శలు చేశాను తప్ప భాజపాకు ఏరోజూ దూరం కాలేదన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంటే తనకు ఇష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. వైకాపా నేతలకు అమిత్‌షా అంటే భయమన్నారు. తాము తెదేపాతో ఉంటే ఎన్నికల్లో వారితోనే కలిసి పోటీ చేసేవాళ్లమని.. విడిగా పోటీ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. దక్షిణాదిలో రెండో రాజధాని ఉండాలన్నది తన మాట కాదని.. అంబేడ్కర్‌ చెప్పిన మాటలను తాను ఉటంకించానని పవన్‌ స్పష్టం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.