close

తాజా వార్తలు

అప్పుడు కోడెలను సముదాయించా: చంద్రబాబు

నర్సరావుపేట: మాజీ స్పీకర్‌, దివంగత నేత కోడెల శివప్రసాదరావు జీవితాంతం క్రమశిక్షణతో మెలిగారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందరూ ఆయన్ను పల్నాటి పులిగా పిలిచేవారని.. భయమంటే ఏమిటో తెలియని వ్యక్తి కోడెల అని చెప్పారు. అలాంటి వ్యక్తి చనిపోయిన విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఎస్‌.ఎస్‌.ఎస్‌. కళాశాలలో నిర్వహించిన కోడెల సంస్మరణ సభలో చంద్రబాబు మాట్లాడారు. అంతకుముందు కోడెల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి నివాళులర్పించారు.

అభివృద్ధికి మారు పేరు కోడెల

కోడెలను ఫర్నిచర్‌ కేసుతో వైకాపా నేతలు వేధించారని.. రూ.లక్ష కోసం ఆయన కక్కర్తి పడ్డారంటూ దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రూ. 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న సీఎం జగన్‌ నీతులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టినపుడు ఆయన్ను సముదాయించానని గుర్తు చేసుకున్నారు. పల్నాడులో తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోరాటం చేశామన్నారు. చలో పల్నాడుకు కోడెల వస్తానని చెబితే.. తానే వద్దని వారించానని చంద్రబాబు చెప్పారు. ‘‘బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని కోడెల తీర్చిదిద్దారు. కోటప్పకొండను ఆధ్యాత్మికంగా ఆయన అభివృద్ధి చేశారు. అభివృద్ధికి మారుపేరు కోడెల. ఉన్మాద చర్యలు తప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేమూ అలా చేసుంటే వైకాపా నేతలు బయటకు వచ్చేవారా?ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండండి. మా జోలికి వస్తే సహించం. పులివెందుల రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. అక్రమ కేసులు పెడితే పోలీసులపై న్యాయస్థానాలకు వెళతాం. పల్నాడులో శాంతి నెలకొల్పేవరకు విశ్రమించం. ప్రజావేదికను కూల్చివేస్తే భయపడతామని అనుకున్నారు. 29 క్లైమోర్‌మెన్లు పేలిస్తేనే భయపడలేదు. పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. మా జోలికొస్తే సహించం. ప్రాణం పోయినా లెక్కపెట్టను. అరాచకాలు సహించను. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కరణం బలరాం, యరపతినేని, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. 
మళ్లీ చీకటి రాజ్యం వచ్చింది

‘‘వర్షాలు పడ్డాయి.. జలాశయాలు నిండాయి.. కానీ కరెంటు కోత తప్పడం లేదు. మళ్లీ చీకటి రాజ్యం వచ్చింది. ఈ పరిస్థితి వస్తుందని ఆనాడే ప్రజలను అప్రమత్తం చేశా. నాపై కక్ష సాధింపు తప్ప ప్రజలకు పనికొచ్చే ఏ పనీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. మీ ఊర్లో ఇసుకను మీరు తీసుకువెళ్లడానికి హక్కు లేకుండా చేశారు. 20 లక్షల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. కేంద్రం ఇచ్చిన ఉపాధిహామీ నిధులను సైతం ప్రభుత్వం ఆపేసింది. ఇది అసమర్థ ప్రభుత్వం. పడవ మునిగి ఇన్ని రోజులైనా బయటకు తీయలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశాం. ఇప్పుడేమో అన్నీ ఆపేశారు. ఇది రివర్స్ టెండరింగ్ కాదు.. రిజర్వ్ టెండరింగ్. ప్రభుత్వం చేస్తోంది రివర్స్ అభివృద్ధి. ప్రజలు అధికారం ఇచ్చింది కేసులు పెట్టడానికి కాదు. చేసిన పనులకు డబ్బులివ్వాలంటే పార్టీ మారాలని కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. న్యాయపరంగా పోరాటం చేద్దాం. ఎవరూ భయపడొద్దు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం. కోడెల కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. కోడెల స్ఫూర్తిని చాటేలా పల్నాడులో స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.