close

తాజా వార్తలు

అంబటి రాయుడా.. నీవెక్కడ?

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఇటీవల ప్రపంచకప్‌ సమయంలో అర్ధాంతరంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తనకు మళ్లీ క్రికెట్‌ ఆడాలనే ఆసక్తి ఉందని, తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నానని తాజాగా చెప్పడంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు. స్వతహాగా నిలకడ బ్యాటింగ్‌ నైపుణ్యం కలిగిన రాయుడు దూకుడు స్వభావంతో వచ్చిన అవకాశాలను సుదీర్ఘ కాలం కాపాడుకోలేకపోయాడు. ఆ దుందుడుకు స్వభావమే 2019 ప్రపంచకప్‌లో అతడు ఆడే అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ఉజ్వల భవిష్యత్‌ కలిగిన ఓ ఆటగాడు ఆకస్మిక నిర్ణయం తీసుకుని ఆటకు దూరమై.. నేడు 34వ జన్మదినం జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అంబటి తిరుపతి రాయుడిపై ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌లో మొదలైన ప్రస్థానం

అంబటి రాయుడు పుట్టింది గుంటూరులో అయినా అతడి క్రికెట్‌ ప్రస్థానం మొదలైంది హైదరాబాద్‌లో. రాయుడు ఏడేళ్లప్పుడే క్రికెట్‌పై ఆసక్తిని గమనించిన తండ్రి సాంబశివరావు అతడిని విజయ్‌పాల్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసే సాంబశివరావు తన కుమారుడిని స్కూటర్‌పై తిప్పుతూ ఎక్కడ మ్యాచ్‌ జరిగినా తీసుకెళ్లేవారు. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌ చేస్తున్న కుమారుడి ఆటను దూరం నుంచే సాంబశివరావు గమనించేవారని రాయుడి చిన్ననాటి కోచ్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే బలమైన పునాది వేసుకున్న అంబటి అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకి ఎంపికయ్యాడు.

మూడు జట్లకు రంజీ ఆటగాడు

కుర్రాడిగా హైదరాబాద్‌ జట్టు తరఫున 2002లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్రారంభించిన రాయుడు 2002-2003 సీజన్‌లో ఆంధ్రా జట్టుతో తలపడిన మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పిన్న వయసులోనే ద్విశతకం సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించి రాయుడు తన ప్రత్యేకతని చాటుకున్నాడు. 2005-2006 సీజన్‌లో హైదరాబాద్‌ జట్టుతో సరిపడక ఆంధ్రా జట్టుకు తరలివెళ్లిన అతడు, ఇక్కడి పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే 2007లో ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుని బీసీసీఐ ఆగ్రహానికి గురై నిషేధం ఎదుర్కొన్నాడు. ఐసీఎల్‌ ఆటగాళ్లకు బీసీసీఐ 2009లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడేందుకు అనుమతి ఇవ్వగా అంబటి తిరిగి హైదరాబాద్ జట్టుతో కొనసాగాడు. 2010-2011 సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ ఒడుదొడుకులు ఎదుర్కోగా బరోడా జట్టుకు వెళ్లి అక్కడ సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

అంతర్జాతీయ ఆటకు సుదీర్ఘ నిరీక్షణ

2012లో తొలిసారి టీమిండియాకి ఎంపికైనా ఏడాదికిపైగా రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2012 ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్, 2013లో భారత్‌ - ఇంగ్లాండ్‌ - వెస్టిండీస్‌ ట్రై సిరీస్‌లో జట్టులో సభ్యుడే అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాలేదు. తర్వాత జింబాబే పర్యటనలో బ్యాట్‌ ఝుళిపించే అవకాశం రావడంతో 2013 జులై 24న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌. తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌ కోహ్లీతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి అర్ధశతకంతో రాణించాడు. తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అంబటి 2015 ప్రపంచకప్‌ జట్టుకు 15 మంది సభ్యుల్లో ఒకడిగా ఎంపికయ్యాడు. దురదృష్టవశాత్తూ ఆ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం దక్కలేదు. అనంతరం రాయుడు ఆడిన ప్రతీ సిరీస్‌లో తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తూ మిడిల్‌ ఆర్డర్‌లో జట్టుకు వెన్నెముకలా నిలిచి మధ్యలో గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. పునరాగమనంలో నిలకడగా రాణించినా 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవ్వలేదు. అతడి స్థానంలో విజయ్‌శంకర్‌ను ఎంపిక చేశామని సెలక్షన్‌ కమిటి ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. దీంతో భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని రాయుడు 3డీ వివాదాస్పద ట్వీట్‌ చేసి తన అవకాశానికి గండి కొట్టుకున్నాడు. ప్రపంచకప్‌ సమయంలో శిఖర్‌ ధావన్‌, విజయ్‌శంకర్‌ గాయపడినా రాయుడికి బదులు రిషభ్‌పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌కి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాయుడు ఏమీ ఆలోచించకుండా వెంటనే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

 ఎదిగే క్రమంలో వివాదాలు

* 2005లో ఆంధ్రా జట్టు తరఫున ఆడిన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు అర్జున్‌ యాదవ్‌తో వాగ్వాదం. ఆ సందర్భంలో రాయుడిపై అర్జన్‌యాదవ్‌ వికెట్‌ స్టంప్‌తో దాడి.
* 2012 ఐపీఎల్‌ సందర్భంగా ఓ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడిని దూషించిన నేపథ్యంలో మ్యాచ్‌ ఫీజులో వంద శాతం ఫైన్.
* 2014లో ఇండియా ఎ జట్టు తరఫున ఆస్ట్రేలియా జట్టుపై బ్యాటింగ్‌ చేస్తుండగా అంపైర్‌ ఔటివ్వడంతో అనుచిత ప్రవర్తన.  
* 2016లో ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌తో వాగ్వాదం.
* 2017లో ఒక వృద్ధిడిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు. 
* 2019 ప్రపంచకప్‌ జట్టుకి తనని ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ వివాదాస్పద ట్వీట్‌.


అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో రాయుడు తన బ్యాటింగ్‌తో ఎంతో ప్రత్యేకత సాధించినా దూకుడు స్వభావమే అతడి ప్రస్తుత పరిస్థితికి కారణం. నిలకడతో కూడిన నైపుణ్యం గల బ్యాట్స్‌మన్‌ అర్ధాంతరంగా క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం బాధాకరం. ఈ నేపథ్యంలో తనకు మళ్లీ క్రికెట్‌ ఆడాలనే ఆసక్తి ఉందని రాయుడు ఇటీవల వెల్లడించడం విశేషం. అతడి కోరిక నెరవేరి తిరిగి భారత జట్టులో చేరాలని కాంక్షిస్తూ.. అంబటి తిరుపతి రాయుడికి.. జన్మదిన శుభాకాంక్షలు!!

                                                                                                                                                                 - ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం                 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.