close

తాజా వార్తలు

విశాఖలో ముఠాల కలకలం

పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు
మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాధితులు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలో ముఠాల కదలికలు.. బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక స్థలం విషయంలో తమతో రాజీకి రావాలంటూ కొన్ని ముఠాలు తనను బెదిరించాయని నరేశ్‌కుమార్‌ అనే పారిశ్రామికవేత్త చెప్పారు. ఇలాంటి ఘటనలు మరికొన్ని చోటుచేసుకున్నాయంటూ కొంతమంది ‘ఈనాడు’ దృష్టికి తీసుకొచ్చారు. బాధితులలో ఒకరైన సింబియోసిస్‌ సీఈవో నరేశ్‌కుమార్‌ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు విషయం చెప్పి.. ముఠాసభ్యులు తమ ఇంటికి వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజీని అందించారు. ఆ ముఠాలో ఉన్నవారి పేర్లు చెబితే పోలీసు ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లేందుకు భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారు.

దందాలు వెలుగు చూసిందిలా..
విశాఖకు చెందిన పారిశ్రామికవేత్త నరేశ్‌కుమార్‌ సొంత బావ లలితేశ్‌కు మాధవధారలో ఐదెకరాల భూమి ఉంది.  అందులో 200 చదరపు గజాల స్థలంపై గతంలో వివాదం నడిచింది. తర్వాత స్థలంలో ఉన్నవారు రాజీకి రావటంతో వివాదం సమసిపోయింది. ఇలా రాజీ కుదరడానికి ముందు భూమి యజమాని ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా జీవోలు విడుదలయ్యాయి. ఇలా జీవోలు వచ్చిన విషయం, రాజీ కుదిరిన విషయం తెలియని కొంతమంది ముఠా సభ్యులు భూ యజమానిని బెదిరించి ఎంతో కొంత దండుకోవడానికి ప్రయత్నించారు.  నరేశ్‌కుమార్‌ ఇంటికే వెళ్లి మాట్లాడేసరికి ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో వెనక్కి తగ్గి.. అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని తన సన్నిహితులతో పంచుకోగా తమకూ అలాంటి అనుభవాలే ఎదురయ్యాయని తెలపడంతో ఆయన నివ్వెరపోయారు.

మంత్రి, మాజీ ఎంపీలకు ఫిర్యాదు
ఇప్పటిదాకా నలుగురికి ముఠాల బెదరింపులు ఎదురుకాగా ఒక్కరే ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చారు. ప్రముఖుల పేర్లు చెప్పి దండుకునే ముఠాలకు అడ్డకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే తాను ఫిర్యాదు చేస్తున్నానని పారిశ్రామికవేత్త నరేశ్‌కుమార్‌ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు తెలిపారు. ఆ సమయంలో ఆయన పక్కనున్న మరో పారిశ్రామికవేత్త కూడా నరేశ్‌కుమార్‌ చెప్పింది నిజమేనని నిర్ధారించారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు ఎవరు చేసినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉపేక్షించడం లేదని, వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదని మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. మంత్రితోపాటు విశాఖ మాజీ ఎంపీ హరిబాబుకు కూడా నరేశ్‌కుమార్‌ సమాచారం ఇచ్చారు.

ఇంటికే వచ్చి బెదిరించారు

మా ఇంటికి వచ్చినప్పుడు ముఠాలోని వ్యక్తులు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యారు. వారితో నాకు పూర్వ పరిచయం లేదు. నా స్థలం గురించి మాట్లాడే హక్కు వారికి లేదు. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేయడానికే వచ్చినట్లు కనిపించారు. నా స్థల వివాదం పరిష్కారం కాలేదన్న తప్పుడు సమాచారంతో వచ్చినట్లు వారి మాటల్లో అర్థమైంది. రాజీ చేసుకోకపోతే స్థలమే దక్కదని  బెదిరించడం నన్ను బాధించింది. దీనిపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదుచేయాలని నిర్ణయించుకున్నా. నాలా బెదిరింపులకు గురైనవారు మరికొందరున్నారు గానీ, ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు.

- ఒ.నరేశ్‌కుమార్‌, సీఈవో, సింబియోసిస్‌

విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాను

నగరంలో కొంతమంది దందాలు, పంచాయతీలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లా. అలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన నాతో చెప్పారు. విశాఖ కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమీక్ష సమావేశాల సందర్భంగా ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తన పేరు, ఇతరుల పేర్లు చెప్పి నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయాలని ఎవరైనా కోరినా చేయొద్దని స్పష్టం చేశారు. నరేశ్‌కుమార్‌ అనే పారిశ్రామికవేత్తను బెదిరించిన ఉదంతంపై నాకు ఫిర్యాదు అందింది. నిందితుల వివరాలు తెలుసుకుని చెబుతానన్నారు. పేర్లు ఇవ్వగానే వారెవరన్నది విచారించి చర్యలు తీసుకుంటాం.

- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.