close

తాజా వార్తలు

మంత్రిగా ఉన్నా ఆపరేషన్లు చేసి..

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘డాక్టర్‌ గారు’ కోటలో ఉన్నారంటే నరసరావుపేటలోని లక్ష్మీ నర్సింగ్‌ హోం (నరసరావు పేటలోని కోట సెంటర్‌లో ఒకప్పటి కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి పేరు) కిటకిటలాడేది. దీనికి కారణం ఉంది. ఆయన మంచి సర్జన్‌ . ఆయన రాజకీయాల్లోకి వచ్చినా వైద్యవృత్తిని వీడలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన  డాక్టర్‌గా మారిపోయి ప్రజలకు సేవ చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కోడెల ఎంతో కష్టపడి డాక్టర్‌ విద్యను అభ్యసించారు. ఆయన హస్తవాసి మంచిదని పల్నాడులో ఎంతో పేరు.   

తోబుట్టువుల మృతితో..

కోడెల చిన్నతనంలో ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి మశూచి కారణంగా వారం రోజుల వ్యవధిలో కన్ను మూశారు. కోడెల తాతగారి ఇంట్లో ఉండటంతో ఆ మహమ్మారి బారిన పడలేదు. తోబుట్టువుల మరణం కోడెలను కదిలించేసింది. అదే సమయంలో తల్లి లక్ష్మీ నరసమ్మ కూడా కన్నుమూసింది. దీంతో కోడెల చిన్నప్పుడే ఒంటరివాడైపోయాడు. తండ్రి సంజీవయ్య మరో వివాహం చేసుకోకుండా శివప్రసాద్‌నే సర్వస్వంగా చూసుకొన్నారు. ఒక దశలో డబ్బులేకపోవడంతో పొలం పనులకు రావాలని ఆయన కోడెలను కోరారు. ఈ విషయాన్ని ఆయన తన తాతకు చెప్పడంతో ఆయన సంజీవయ్యకు నచ్చజెప్పి శివప్రసాదరావు చదువును కొనసాగించారు. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివిని కోడెలకు తగిన మార్కులు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. దీంతో కోడెలలో పట్టుదల పెరిగింది. ఆయన మరో సారి పీయూసీ రాసి మంచి మార్కులతో కర్నూలు వైద్యశాలలో ఎంబీబీఎస్‌ సీటు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ప్రఖ్యాత బెనారస్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌ పట్టాను అందుకొన్నారు. తండ్రి అప్పు చేసి మరీ కోడెలను చదివించారు.  విద్యాభ్యాసం తర్వాత తండ్రి అప్పులను కోడెల  తీర్చేశారు. 

డాక్టర్‌గా మంచి పేరు..

కోడెల శివప్రసాదరావుకు పల్నాడులో మంచి డాక్టర్‌గా పేరు ఉంది. ఆయన బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్‌.పట్టా పుచ్చుకున్నాక నరసరావుపేటలోనే సొంత ఆసుపత్రిని  ప్రారంభించారు. చాలా త్వరగానే మంచి సర్జన్‌గా పేరు తెచ్చుకొన్నారు. అప్పట్లో తెల్లవారుజాము నుంచే ఆయన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయడం మొదలు పెట్టేవారు. రాజకీయాల్లో ప్రవేశించి మంత్రిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో కూడా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇటీవల వయసు మీదపడటం, రాజకీయాల్లో తీరిక లేకపోవడంతో వైద్యవృత్తికి  దూరంగా ఉంటున్నారు. ఆయనకు భార్యపేరు శశికళ. కోడెలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోడెల సంతానం మొత్తం వైద్యులే. 

ఎన్టీఆర్‌ పిలుపుతో..

1983లో ఎన్టీఆర్‌ పిలుపుతో కోడెల రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 వరసగా ఐదు దఫాలు ఎన్నికల్లో  విజయంసాధించారు. 1987లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆయనకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో కూడా భారీ నీటిపారుదల, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖలను నిర్వహించారు. అంతకు ముందు 1984, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాసు వెంకటకృష్ణారెడ్డిని ఆయన ఓడించారు.  2004, 2009 ఎన్నికల్లో కాసు వెంకట కృష్ణారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. అనంతరం 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ సారి నవ్యాంద్ర తొలి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఉండగా ఆయనపై పలుమార్లు దాడులు జరిగాయి. ఒక సారి కోటప్పకొండ నుంచి వస్తుండగా మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. ఆ తర్వాత మరోసారి యాసిడ్‌తో దాడి జరిగింది. వీటి నుంచి కోడెల త్రుటిలో తప్పించుకొన్నారు. 

కుమారుడి మరణంతో కుంగిపోయి..

తన చిన్న కుమారుడు సత్యనారాయణ మరణం కోడెలను బాగా కుంగదీసింది. ఆర్దోపెడిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన సత్యనారాయణ సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేస్తుండగా మరణించాడు. ఆయన విధుల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురై మరణించాడు. వాస్తవానికి మరికొన్ని గంటల తర్వాత అతను సింగపూర్‌ వెళ్లాల్సి ఉంది.  ఈ ఘటన కోడెలను బాగా కుంగదీసింది. ‘‘చిన్నప్పటి నుంచి నాకున్న ఒక కోరిక.. ఇల్లాంతా పిల్లా పాపలతో సందడి సందడిగా ఉండాలని. ఈ కోరిక తీరకుండానే నా ఆత్మీయుల చుట్టూ మృత్యువు తిరుగుతోంది. సందడి ఉండాల్సిన చోట స్మశాన నిశ్శబ్దం నెలకొంటోంది. నా జీవితంలో పదే పదే ఎదురువుతున్న ఫెయిల్యూర్‌ ఇదీ’’ అని  ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల వాపోయారు. ఇప్పుడు అదే మృత్యువు ఆయన జీవితాన్ని కూడా కబళించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.