close

తాజా వార్తలు

‘వ్యూహాత్మకంగానే తెరపైకి రాజధాని అంశం’

రాజధాని అంటే ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ కాదు
తెదేపా ఎమ్మెల్యే అనగాని వ్యాఖ్యలు

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ అనుమానాలకు గత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషనే సమాధానమని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. 2014, డిసెంబర్‌ 30న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను మీడియాకు ఆయన విడుదల చేశారు. రాజధాని అంటే ఫోక్స్‌ వ్యాగన్‌ కాదని, గెజిట్‌ ఇవ్వకపోతే 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారని బొత్సను ఆయన ప్రశ్నించారు. వైకాపా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు సీఎం జగన్‌ ప్రతిసారీ వ్యూహాత్మకంగా మంత్రి బొత్స ద్వారా రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని అనగాని ఆరోపించారు.

సీఎం మాట్లాడాల్సిన అంశంపైనా బొత్సే మాట్లాడుతున్నారు

గతంలో వరద..ఇప్పుడు 100 రోజుల పాలన వైఫల్యాలు.. ఇలా తమ తప్పుల్ని కప్పిపుచ్చే ప్రతి సందర్భంలోనూ రాజధాని గురించే బొత్స మాట్లాడుతున్నారని అనగాని విమర్శించారు. రాజధాని అంటే బొత్స అవినీతికి భయపడి పారిపోయిన ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ కాదన్న విషయం ఆయన గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రాజధానిపై రకరకాల ప్రకటనలు చేస్తూ చివరకు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజధానిపై డిసెంబర్‌ 30, 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని.. అదే రోజు విడుదల చేసిన జీవో నెం.254లోనూ గెజిట్‌ గురించి అప్పటి ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించిందన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి స్ధాయిలో ఉన్న బొత్స ఈ విధంగా మాట్లాడటం తగదని అనగాని హితవు పలికారు. గత కొద్దిరోజులుగా మంత్రి బొత్స రాజధానిపై  వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం మాట్లాడాల్సిన అంశంపై మాటిమాటికీ బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నా సీఎం జగన్‌ కనీసం వివరణ ఇవ్వకపోవటం బాధాకరమని అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.