close

తాజా వార్తలు

ఆయన గెలుపే కర్ణాటక సంక్షోభానికి కారణమా?

రెబల్‌ ఎమ్మెల్యేల ఆలోచన ఏంటీ?

సంకీర్ణ వైఫల్యమే.. అసమ్మతుల ఆయుధం

 ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
 

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా.. ఫలించని బుజ్జగింపులు.. మంత్రి పదవులు ఇస్తామన్నా చల్లారని అసమ్మతుల సెగ.. ఫలితంగా పతనం అంచున జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం. అసలే అరకొర మెజార్టీతో ఆపసోపాలు పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ కూటమికి అసమ్మతుల సెగ కొత్తేం కాదు. అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో అనేక సార్లు సంక్షోభం అంచువరకు వెళ్లి చివరకు గట్టెక్కింది. అయితే ఈ సారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వం కోలుకునే అవకాశాలు పూర్తిగా ఆవిరైపోయాయి. తాజా సంక్షోభానికి కారణాలేంటీ..? కూటమి వైఫల్యమేనా.. రెబల్‌ ఎమ్మెల్యేల మనసులో ఏముంది..?  

భాజపాను ఎదిరించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి

రాష్ట్రంలో 224 నియోజకవర్గాలున్నాయి. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భాజపాకు 104, కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా తొలుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పటిలాగానే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. బలపరీక్షలో భాజపా నెగ్గకపోవడంతో కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ కూటమికి షాక్‌ ఇస్తూ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనించింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంప్రదింపులు, బెదిరింపులతో ఉమేశ్ జాదవ్‌ మినహా రెబల్‌ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. దీంతో తాత్కాలికంగా అసమ్మతికి తెరపడింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికే ఉమేశ్‌ జాదవ్‌ భాజపాలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గుల్బర్గా నుంచి పోటీ చేసి ఏకంగా కాంగ్రెస్‌ లోక్‌సభాపక్షనేత మల్లికార్జున ఖర్గేపై భారీ విజయం సాధించారు. 

జాదవ్‌ గెలుపే.. రెబల్స్‌కు ఊతం..

జాదవ్‌ గెలుపే తాజా సంక్షోభానికి ఓ కారణమై ఉంటుందనే అభిప్రాయం రాజకీయ పక్షాల్లో ఉంది. ఈ ఏడాది జనవరిలో రాజీనామాలకు సిద్ధపడ్డ ఉమేశ్‌ జాదవ్‌, నాగేంద్ర, మహేశ్ కుమతహళ్లి, రమేశ్ జర్కిహళ్లిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కాంగ్రెస్‌.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి జాదవ్‌ మినహా మిగిలిన వారు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. జాదవ్‌ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందడుగు వేశారు. దీంతో రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఆ తర్వాత జాదవ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం.. ఖర్గేపై గెలవడం చకచకా జరిగిపోయాయి. ఈ విజయంతో కర్ణాటక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పడిపోయిందనే సంకేతాలు రెబల్స్‌కు వెళ్లాయి. మరోపక్క కేంద్రంలో భాజపా బలీయమైన శక్తిగా అవిర్భవించడంతో  వీరికి ధైర్యం వచ్చింది. అందుకే ఈ సారి వారు భాజపా పాలిత మహారాష్ట్రలో ఆశ్రయం పొందారు. అక్కడి ప్రభుత్వం కూడా వీరికి పూర్తిగా అండగా నిలబడింది. శివకుమార్ సంగతి తెలిసిన భాజపా అతన్ని మహారాష్ట్రలో కట్టడిచేసింది. దీంతో చేసేది లేక ఆయన ఖాళీ చేతులతో వెనక్కు వచ్చారు. మరోపక్క రెబల్స్‌ వ్యూహాత్మకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించి స్పీకర్‌ పై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ఇప్పటి వరకు చేతికి మట్టి అంటకుండా భాజపా కథ నడిపించగలిగింది. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టగానే ‘‘సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’’ అన్న వ్యాఖ్యల సారంశం ఇదే కాబోలు.  

సంకీర్ణం వైఫల్యాలు..

ఇదిలా ఉండగా.. జేడీఎస్‌-కాంగ్రెస్‌ స్వయం తప్పిదాలు కూడా అసమ్మతులకు కారణమయ్యాయి. స్థానిక నేతలను సంప్రదించకుండా హడావుడిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. దీనికి తోడు ఇటీవల కూటమి ఎమ్మెల్యేలను పక్కనబెట్టి  ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. మంత్రి పదవి వస్తుందని ఆశించిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రామలింగారెడ్డికి ఇది మింగుడుపడలేదు. దీంతో ఆయన వర్గమంతా సంకీర్ణంపై అసమ్మతి తెలుపుతూ రాజీనామా చేశారు.

మరోవైపు ‘‘రాష్ట్రంలో సంక్షోభం తప్పదు. మధ్యంతర ఎన్నికలు తథ్యం’ అంటూ సాక్షాత్తు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కూటమి నేతల్లో భయాన్ని పెంచాయి. ఆ తర్వాత తాను అసెంబ్లీ ఎన్నికల గురించి అనలేదని, స్థానిక ఎన్నికల గురించి ప్రస్తావించానని దేవెగౌడ సర్దిచెప్పుకున్నా.. సంకీర్ణంపై రెండు పార్టీల నేతల్లో విశ్వాసం సన్నగిల్లింది. అటు మిత్రపక్షమైన జేడీఎస్‌పై కాంగ్రెస్‌ కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.  పార్టీలో కీలక నేత అయిన మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం మిత్రపక్షంపై అధిష్ఠానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పథకాలను పక్కనపెట్టి జేడీఎస్‌ తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో ఇరు పార్టీలకు పొసగట్లేదనే గుసగుసలు వినిపించాయి. 

ఇలా చేతులారా చేసుకున్న అనేక తప్పిదాల వల్ల సంకీర్ణ ప్రభుత్వం నేడు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నెలకొంది. కారణమేదైనా కర్నాటకీయం రసవత్తరంగా ఇప్పుడు మారింది. మరి ఈ సంక్షోభానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి మరి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.