ప్రేమించుకోండి
close

తాజా వార్తలు

Published : 19/10/2019 00:34 IST

ప్రేమించుకోండి

- మిమ్మల్ని మీరే

పెళ్లయ్యాక ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమైంది స్మిత. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి ఆమెది. ఒకప్పుడు అమ్మని స్మార్ట్‌ వర్క్‌ చేసుకోవచ్చు కదా! ఏం పనులుంటాయ్‌ అన్న ఆమె... ఇప్పుడు బాధ్యతలతో సతమతమవుతూ తానేదో కోల్పోతున్నానే భావనలోకి వెళ్లిపోయింది. కుంగుబాటుకీి గురైంది.


నీల యాభయ్యో పడిలోకి అడుగుపెడుతోంది. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇన్నాళ్లు భర్త ఉద్యోగం, పిల్లల చదువులు అంటూ వారితో సమానంగా పరుగులుతీసింది. ఇప్పుడు ఓపిక నశిస్తున్నా విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనే ఆమె దరిచేరలేదు. అలసటతో కూడిన జీవనశైలి ఆమెను అనారోగ్యాల బారిన పడేలా చేసింది.


రిషిత ఉద్యోగం చేస్తోంది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఉన్నతస్థానంలోకి అడుగుపెట్టింది. అలాని ఇంటి బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి. భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా...ఇంట్లో పప్పు లేకున్నా...ఉప్పు లేకున్నా ఆమే చూసుకోవాలి. ఇంటిని చక్కబెట్టుకుని ఆఫీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అలసిపోతుంది. ఉన్న ఒక వారాంతపు సెలవు...వచ్చే వారానికి ఇంటికి ఏం చేయాలి? పిల్లలు, భర్త అవసరాలు ఏంటి? అనే ఆలోచనలే! ఈ ఒత్తిడితో ముప్పైలకు చేరకముందే అధిక రక్తపోటు బారిన పడింది.

చాలామంది మహిళలు తమని తాము ప్రేమించుకోవడానికి, కొంత సమయం వెచ్చించడానికి సమయం కేటాయించుకోవడం కష్టంగా భావిస్తుంటారు. దాంతో ఒత్తిడి, చిరాకు, కోపం, అలసటా లాంటివెన్నో సహజంగానే ఇబ్బందిపెడతాయి. అవే దీర్ఘకాలంలో అనారోగ్యాలకూ కారణం అవుతాయి. వాటిని అధిగమించి వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఆనందించాలంటే... వారంలో ఒకరోజు మీకోసం మీరు కేటాయించుకోండి. దాన్ని సెల్ఫ్‌కేర్‌, సెల్ఫ్‌ లవ్‌... ఇలా ఏ పేరుతో పిలిచినా సరే! ప్రతి మహిళకూ వారంలో ఒక సెలవు తప్పనిసరి. నిపుణులూ అదే చెబుతున్నారు.

ఎందుకు స్వీయ సంరక్షణ: ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ మహిళలెవరూ ఈ కోణంలో ఆలోచించరంతే. భర్త, పిల్లల బాధ్యతల్లోనే సంతోషం ఉందనుకుంటారు. నగలు, దుస్తులు, పూజలతోనే సమయం సరిపోతుందనుకుంటారు. వాటన్నింటి కంటే ఇది చాలా అవసరం అంటారు మానసిక నిపుణులు. చాలా మంది మహిళలకు సరిగ్గా నిద్ర ఉండదు. పోషకాహారం తీసుకోరు. తమను తాము పట్టించుకోరు. ఇవే సమస్యల్ని తెచ్చిపెడతాయి. వాటన్నింటి నుంచీ బయటపడి కొత్త ఉత్సాహం ఊపిరిపోసుకునేందుకు ఈ శ్రద్ధ అవసరం.

ఎలా సంరక్షించుకోవాలి... బబుల్‌ బాత్‌ లేదా స్పా చేయించుకోవడాన్ని నామోషీ అనుకోకండి. అది కేవలం శరీరంపై పేరుకొన్న మురికి వదలగొట్టుకోవడానికో, అందానికి మెరుగులద్దుకునేందుకో మాత్రమే కాదు. ఇది కండరాలకు తగిన విశ్రాంతి అందిస్తుంది. వయసు పైబడుతోంది... తోటివారిలా లేమే అని బాధపడకండి. ఒక ఫేస్‌మాస్క్‌ వేసుకుని చూడండి. మీలో నూతనోత్సాహం వస్తుంది. మరెన్నో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించొచ్ఛు

ఏమేం చేయొచ్చంటే...

విరామం అవసరం: బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని విరామం లేకుండా చేసేస్తుంటాం. అన్నీ తాము చేస్తేనే పరిపూర్ణత అని భావించడమే అలసటకు, ఒత్తిడికి కారణం. దీన్నుంచి బయటపడాలంటే వారానికోసారి ఏ పనీ చేయకుండా సొంత ఇంట్లోనే అతిథిలా ఉండేందుకు ప్రయత్నించాలి. బాధ్యతల్ని పంచాలి. అప్పుడే విశ్రాంతి. తిరిగి వారమంతా ఉత్సాహంగా పనిచేసే శక్తి శరీరానికి అందుతుంది. ఇది మాటల్లో చెప్పినంత సులువు కాదు కానీ... అనుకుంటే ఆచరణలో పెట్టొచ్ఛు.

ప్రయాణించండి: ఎక్కడికయినా సరే... పిల్లలు, భర్త లేకుండా వెళ్లడం కుదరదు అని చెబుతుంటారు కొందరు మహిళలు. కనీసం ఆర్నెల్లకోసారయినా స్నేహితులతో కలిసి ఎక్కడికయినా వెళ్లేందుకు ఓసారి ఎందుకు ప్రయత్నించకూడదు. అది ఉత్సాహాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది. స్నేహితులకు, మీకు బాగా సన్నిహితులతో కాసేపు ఫోను చేసి మాట్లాడండి. ఓ పదినిమిషాలు కబుర్లు చెప్పినా.. ఒత్తిడి తగ్గుతుంది.

రాయండి : మిమ్మల్ని చికాకుపెడుతున్న, ఒత్తిడి తెప్పిస్తున్న అంశాలను ఓ చోట రాయండి. ఇది మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. అదీ మీకు వీలున్నప్పుడే. మనసుకి తోచినప్పుడే రాయండి చాలు! ఎప్పుడైనా కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు అవన్నీ ఓ సారి చదువుకోండి. సమస్య తెలుస్తుంది. పరిష్కారం దొరుకుతుంది.

అభిరుచులకు సమయం: చిన్నప్పుడు మీకు కుట్లు అల్లికలంటే ఇష్టం ఉండి ఉండొచ్ఛు చక్కటి పెయింటింగ్‌ చేసి ఉండొచ్ఛు నృత్యం అంటే ఆసక్తి ఉన్నా నేర్చుకోలేని పరిస్థితులు అయి ఉండొచ్ఛు ఇవే కాదు...డ్రైవింగ్‌, పాటలు... ఇలా ఒకటేమిటి మీకు నచ్చిన దేన్నైనా ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఆసక్తికి వయసుతో పనిలేదు.

వ్యాయామం: మీపై మీకు ఆసక్తి లేనప్పుడు కొన్ని రోజులు జిమ్‌కి వెళ్లండి. స్నేహితులతో కలిసి యోగా నేర్చుకోండి. లేదా ఇంట్లోనే ఓ ట్రెడ్‌మిల్‌ ఏర్పాటు చేసి హాయిగా పాటలు వింటూ కసరత్తులు చేయండి. ఇవన్నీ ఒత్తిడిని, అలసటను దూరం చేస్తాయి.

అందం కోసం: అందానికి నిర్వచనం లేకపోయినా... కొన్నిసార్లు అది ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. అందుకే మీకు మీరే మేకోవర్‌చేసుకోండి. సౌందర్యచికిత్సలు చేయించు కునేందుకు పార్లర్‌కే కాదు, స్పాకీ వెళ్లండి. ఎన్ని పనులున్నా సరే.. కంటినిండా నిద్రపోవడం వల్ల శరీరానికే కాదు, మెదడుకీ విశ్రాంతి అందుతుంది. ఒత్తిడీ, కంగారు వంటివి చేత్తో తీసేసినట్లు పోతాయి.

సైన్స్‌ తెలుసుకోవడం ఇష్టం.

- జి. శ్రీలక్ష్మీసుస్మిత, హైదరాబాద్‌

నేను ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ పూర్తిచేసి మెడికల్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నా. నాకు ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా. ఉదయం ఐదు గంటలకే నా దినచర్య మొదలవుతుంది. అరగంట పాటు వాకింగ్‌కి వెళ్లొచ్చి, ఇతర పనులు మొదలుపెడతా. ఆదివారం నాడు సగం రోజైనా నాకోసమే కేటాయించుకుంటా. నాకు బయలాజికల్‌ రీసెర్చ్‌ సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఆసక్తి. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల జీవితాలు, వారు రాసే వ్యాసాలూ చదువుతా. బాబుతో గడుపుతా. ఆ రోజు సినిమాకో, పార్కుకో కచ్చితంగా వెళ్లి సేదతీరుతా. ఇవన్నీ నాకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. బాబు పుట్టినా నన్ను నేను ప్రెజెంట్‌ చేసుకునే విధానంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నా స్టైల్‌, ఫ్యాషన్‌ ఎప్పటిలానే కొనసాగిస్తున్నా. ఇవన్నీ నాపై నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.

ఆరోగ్యమే నా ఆత్మవిశ్వాసం...

-నిమ్మగడ్డ ఉమాదేవి, విజయవాడ

నేను గృహిణిని. నాకు ఇద్దరబ్బాయిలు. మావారు వ్యాపార వేత్త. ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నా నన్ను నేను ఎప్పుడూ అశ్రద్ధ చేసుకోలేదు. అందుకే నాకు ఒత్తిడి తక్కువ. మొదటి నుంచీ ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తా. యోగా తప్పనిసరిగా చేస్తా. అది కుదరనప్పుడు కనీసం అరగంటైనా నడుస్తా. తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉంటా. పండ్లు, నట్స్‌, కూరగయాలు...నా డైట్‌లో తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ నన్ను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. నా ఆసక్తిని గమనించిన మా పెద్దబ్బాయి తాను నిర్వహిస్తోన్న ఓ జిమ్‌ నిర్వహణ చూసుకోమనడంతో కొన్నాళ్ల నుంచి ఆ పనుల్లో నిమగ్నమయ్యా. ఇవన్నీ నన్ను చురుగ్గా ఉంచుతున్నాయి. ప్రతి మహిళా తనకున్న వనరులు, పరిస్థితుల మధ్య ఒత్తిడి లేకుండా గడిపేందుకు కొంత సమయం కేటాయించుకోవడం తప్పనిసరి. ఇంట్లో ఉన్నా... ఓ వారంతపు సెలవు ఉండేలా చూసుకుంటే మరీ మంచిది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని