close

తాజా వార్తలు

చిక్కుల్లేని చక్కని అందానికి!

అందంపై శ్రద్ధ, అలంకరణపై మోజు... కారణాలేవైనా మనం కొన్ని వస్తువుల్ని ఏ సందేహం లేకుండా వాడేస్తుంటాం. సరైనరీతిలో వాటిని వాడకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుని ఆ చిక్కుల్లేకుండా చూసుకుందాం.

బిగుతైన దుస్తులు

అమ్మాయిలు ఫ్యాషన్‌ పేరుతో ఎక్కువ సమయం ఒంటికి అతుక్కుపోయే లెగ్గింగ్‌లు, జీన్స్‌లు వేసుకుంటున్నారు. దానివల్ల శరీర ఆకృతి, నడకలో తేడా వస్తుంది. ఒంటికి గాలి తగిలే మార్గం లేక ఈస్ట్‌ వృద్ధి చెంది ఇన్‌ఫెక్షన్‌లు దాడి చేస్తాయి.  ఇక, ఎక్కువ సమయం బిగుతుగా ఉండే బ్రాలు వేసుకోవడం వల్ల లింఫాటిక్‌ కణజాలానికి హాని కలగొచ్చు. నడుము, భుజాల నొప్పి, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్లు వంటివి చుట్టుముట్టొచ్చు. శరీరాకృతి కోసం తరచూ షేప్‌వేర్‌ వాడకపోవడమే మంచిది. తప్పనిసరిగా వాడాల్సి వస్తే లైక్రాతో చేసిన రకాన్ని ఎంచుకోవడం మంచిది. ఇక, బిగుతుగా ఉండే అండర్‌వేర్‌లు వాడటం వల్ల యాసిడ్లు ప్రభావితం అవుతాయి. మూత్ర సంబంధిత, సంతాన సాఫల్యత సమస్యలు ఎదురవుతాయి. నరాలపై ఒత్తిడి పడి మెరాల్జియా పెరస్తీషియా వచ్చే అవకాశం ఉంటుంది. స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు రావడం దీని లక్షణాలు. స్పైడర్‌ వెయిన్స్‌ కూడా రావొచ్చు. ఇందులో రక్తనాళాలు రకరకాల రంగుల్లో బయటికి కనిపిస్తాయి. కొన్నిసార్లు చర్మం కూడా రంగు మారొచ్చు. ఈ సమస్యలన్నీ మొదట్లో తాత్కాలికంగా కనిపిస్తాయి అయితే అవే పొరబాట్లని ఎక్కువ కాలం కొనసాగిస్తే మాత్రం శాశ్వతంగా మారతాయి.

స్కార్ఫ్‌

ఎండ, కాలుష్యం వంటివాటి నుంచి రక్షణగా స్కార్ఫ్‌ ఉపయోగిస్తాం. అయితే అపరిశుభ్రమైన స్కార్ఫ్‌లను వాడటం వల్ల మురికి, దుమ్ములతో  చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు, మచ్చలు వస్తాయి. అలానే జుట్టూ రాలిపోతుంది. తలస్నానం చేశాక అది పూర్తిగా ఆరితే కానీ స్కార్ఫ్‌ వాడొద్దు. దీనివల్ల చుండ్రు రావొచ్చు. అలానే గట్టిగా కట్టడం వల్ల జుట్టుకి గాలి తగలదు. దాంతో కుదుళ్లు బలహీనంగా మారి, వెంట్రుకలు రాలిపోతాయి. అలాకాకుండా శుభ్రమైన నూలు లేదా రేయాన్‌ వస్త్రాలతో చేసిన స్కార్ఫ్‌లను మాత్రమే వాడుకోవాలి. రెండు మూడు గంటలకు మించి వీటిని కట్టుకోవద్దు. తప్పనిసరిగా ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్కార్ఫ్‌కి బదులు గొడుగుని ఎంచుకోవచ్చు. 

అలంకరణ

ప్రకటనలు, అందంగా కనిపించాలన్న తపన వల్ల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల వాడకం బాగా పెరిగింది. అయితే మార్కెట్‌లో కనిపించే ప్రతిదీ ప్రయత్నించాలని అనుకోవద్దు. నాసిరకాల్లో మెర్క్యూరీ, స్టిరాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మకణాలకు హానిచేస్తాయి. దాంతో చర్మం పలుచబడుతుంది. మొటిమలు వస్తాయి. 

పెదాలు: లిప్‌స్టిక్‌ని రోజు రాసుకోకపోవడమే మంచిది. దానిలో పెట్రోకెమికల్స్‌, పారాబిన్స్‌, ఫార్మాల్డీహైడ్‌ వంటివి అధికంగా ఉంటాయి. వాటివల్ల పెదాలు ఎండిపోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

కళ్లు:  ఇప్పుడు వాడే కాటుక రసాయనాల సమ్మేళనం. ఒకప్పటిలా సహజంగా తయారైంది కాదు. అందుకే నాణ్యమైనది వాడకపోతే కార్నియా అల్సర్‌, రంగు మారడం, కళ్లకలక, అలర్జీలు వంటి ఇబ్బందులు తలెత్తొచ్చు. 

గోళ్ల రంగులు: వీటిలో ఉండే టాల్యూరిన్‌, ఫార్మాల్డీహైడ్‌ వంటివి అలర్జీకి, చర్మం పొడిబారడానికి, పెళుసుగా మారడానికి కారణం అవుతాయి. ఎల్లో నెయిల్‌ సిండ్రోమ్‌ కూడా రావొచ్చు. అందుకే వాటిల్లో ఆ రసాయనాలు లేనివాటిని ఎంచుకోవాలి. ఎసిటోన్‌ ఫ్రీ నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ని వాడాలి. ఇక, ఒకసారి గోళ్ల రంగు వేసుకున్నాక కనీసం మూడు వారాలు విరామం తప్పనిసరిగా ఇవ్వాలి. 


మేకప్‌ కోసం వాడే ఏ బ్రష్‌ని అయినా గోరువెచ్చని నీళ్లల్లో శుభ్రపరిచి ఆరాకే వాడాలి.  రోజూ మేకప్‌ వేసుకునే వారు ఇలా వారానికోసారి చేయాలి. లేదంటే వాటిలో సులువుగా బ్యాక్టీరియా, క్రిములు చేరి...మీ చర్మాన్ని పాడుచేస్తాయి. 

ఎత్తు చెప్పులు

ఎంత ఎత్తు వేసుకుంటే అంత స్టైల్‌గా కనిపిస్తాం అనుకునే అమ్మాయిలు ఎక్కువే. అయితే ఇలా ఎక్కువకాలం వీటిని వేసుకుని నడిస్తే ఆనెలు, పగుళ్లు వంటివి వస్తాయి. నడుము, కాలికండరాలు నొప్పి పుడతాయి. పాదం పక్కన ఉండే చర్మం గట్టిగా మారుతుంది. చిటికెన, బొటన వేళ్లమీద ఒత్తిడి పడి గోళ్లు లోపలి వైపు పెరుగుతాయి. అందుకే కాలిపాదం సమాన బరువుని తీసుకునేలా ఫ్లాట్‌ఫామ్‌ రకాల్ని ఎంచుకోండి. తరచూ ఎత్తు చెప్పులు వాడేవారు కుషన్‌ప్యాడ్స్‌ని వాడండి. ఇక పెడిక్యూర్‌, మెనిక్యూర్‌ పేరుతో గోరుచుట్టూ ఉన్న చర్మం కత్తిరించడం, అపరిశుభ్రమైన పద్ధతుల్లో చేయించుకోవడం వల్ల గోళ్లు వంకరగా పెరుగుతాయి. చీము, నొప్పి బాధించొచ్చు. 

జుట్టుకి హంగులు

చాలామంది జుట్టుని బిగుతుగా పైకి లాగి ముడివేస్తారు. మరికొందరేమో సన్నగా ఉండే రబ్బరు బ్యాండ్లు, మెటల్‌ క్లచ్‌లు వాడతారు. ఇంకొందరు హెయిర్‌ ఎక్స్‌టెన్షన్‌ని ఉపయోగిస్తారు. ఇవన్నీ స్టైల్‌నీ, సౌకర్యాన్నీ ఇవ్వొచ్చు కానీ జుట్టుకి మాత్రం హానికలిగిస్తాయి. ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా వెంట్రుకలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని వైద్యులు ఫ్రాక్షనల్‌ ఎలోపేసియాగా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే...జుట్టుని కాస్త వదులుగా అల్లుకోవడం, మెటల్‌ కాని, పదునైన కొనలు లేని క్లిప్పులను పెట్టుకోవడం మేలు. ఎప్పుడైనా ఒకసారి కొద్ది గంటల సమయం మాత్రమే కృత్రిమ జడల్ని వాడుకోవడం వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. 

రంగులు: ఈతరం అమ్మాయిలు స్పా, కెరటిన్‌ ట్రీట్‌మెంట్లు, కలర్‌ స్ట్రీకింగ్‌, బ్లాండ్‌ చేయించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిలో అమ్మోనియా, పీపీడీ, పెరాక్సైడ్‌ లేకుండా చూసుకోవాలి. లేదంటే తలనొప్పి, ఇరిటేషన్‌, కళ్ల దురదలు ఎదురుకావొచ్చు. అలానే హానికారక ఫార్మాల్డీహైడ్‌ విడుదల అవుతుంది. ఇవన్నీ జుట్టుకి హాని చేయడమే కాదు...ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు కారణం అవుతాయి.  స్పా ట్రీట్‌మెంట్లు చేయించుకోవడం వల్ల ఆ సమయానికి జుట్టు బాగా కనిపించినా...ఆ తరువాత పొడిబారి, రాలుతుంది. 

నగలు- యాక్సెసరీలు

పెద్ద చెవిపోగులు పెట్టుకోవడం ఫ్యాషన్‌. కానీ చెవి సామర్థ్యానికి మించి పెట్టుకోవడం అంత మంచిది కాదు. పొరబాటున బట్టలకి, హ్యాండ్‌బ్యాగుల తగిలితే...చెవి తమ్మె తెగే ప్రమాదం ఉంది. అలానే గిల్టు నగల్లో ఉండే క్రోమియం, నికెల్‌ వంటి లోహాలు చర్మంపై ప్రతిచర్య చెంది రాషెస్‌లా వస్తాయి. ఇవి వేసుకోవడానికి ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్‌, సన్‌ స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం మంచిది. ఇలాంటివాటిని వేసుకున్నప్పుడు ఎండ, వేడిమంటల దగ్గరకి వెళ్లకపోవడం మంచిది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.