close

తాజా వార్తలు

జుట్టుకు స్పా చికిత్స... ఇంట్లోనే

పెళ్లి, పుట్టినరోజు, పార్టీ... సందర్భం ఏదైనా అందరిలోనూ మనం మెరిసిపోవాలనుకుంటాం. అందుకోసం ముందు నుంచే రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతాం. వాటిల్లో ముఖాన్ని మెరుగులు దిద్దుకునే ప్యాక్‌లు, ఫేషియల్స్‌ వంటివే ఎక్కువ ఉంటాయి  తప్ప జుట్టుపై చూపించే  శ్రద్ధ తక్కువే. కానీ ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోగలిగితే మీ లుక్కే మారిపోతుంది. అందుకేం చేయాలంటే...

వేడుక రోజున జుట్టు పట్టుకుచ్చులా కనిపించేందుకు వారం ముందునుంచీ డ్రయ్యర్లు, గాఢత ఎక్కువ ఉన్న షాంపూలు వాడకూడదు. అలానే స్ట్రెయిటనింగ్‌, కర్లింగ్‌ చేయించుకోవడం, జెల్‌, స్ప్రేలు వాడటం మానేయాలి. వీటివల్ల జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది. మాడు కూడా పొడిబారిపోతుంది. కాబట్టి కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. స్టైలింగ్‌ టూల్స్‌ వినియోగించే విధానం తెలుసుకోవాలి.

రాత్రిపూట నాలుగు చెంచాల చొప్పున కొబ్బరి నూనె, ఆముదం తీసుకోవాలి. వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక తలకు మర్దన చేయాలి. మర్నాడు గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. రెండురోజుల తేడాలో ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. తెగే సమస్య తగ్గుతుంది. పైగా ఫొటోల్లాంటివి తీస్తున్నప్పుడు మీ జుట్టు సహజంగా మెరుస్తుంది.

రంగు వేసుకోవాలంటే...
* ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు కొత్త ఉత్పత్తులు ప్రయోగించడం, రకరకాల డైలు ప్రయత్నించడం మంచిది కాదు. కొన్నిసార్లు అవి పడక జుట్టు రాలిపోవచ్చు. రంగు వేసుకోవాలనుకుంటే నాణ్యమైనది, అమ్మోనియా లేనిది ఎంచుకోవాలి. దీన్ని వేసుకోవడానికి ముందు ఇతర రసాయన ఉత్పత్తులేవీ తలకు రాయకపోవడమే మంచిది. అలానే రంగు వేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు క్రమం తప్పకుండా తలస్నానం చేసి కండిషనర్‌ రాసుకోవాలి. దీనివల్ల జుట్టుకి రంగు సరిగా అంటుతుంది.

స్టైలింగ్‌ పరికరాలు వాడుతుంటే...
రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ని ప్రయత్నించేందుకు  బ్లో డ్రయ్యర్‌, కర్లర్‌, స్ట్రెయిటనర్‌ వంటివి  వాడుతుంటాం.
* బ్లో డ్రయ్యర్‌ తడి తలను ఆరబెట్టడమే కాదు జుట్టుని మృదువుగాను మారుస్తుంది. నచ్చిన హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడానికి అనువుగా మారుతుంది. అయితే దీన్ని సరైన దిశలో వాడకపోతే జుట్టు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలామంది తడి తలమీద బ్లో డ్రయ్యర్‌ని వాడేయొచ్చు అనుకుంటారు. కానీ కొంత గాలికి ఆరనిచ్చాకే దీన్ని వాడాలి. దీనివల్ల జుట్టుపై వేడి ప్రభావం ఎక్కువగా ఉండదు.

స్ట్రెయిటనర్‌, కర్లర్‌: జుట్టుని పాయలుగా విడదీసుకుని ఈ స్టైలింగ్‌ టూల్స్‌ని ఉపయోగించడం మంచిది. వీటిని కూడా జుట్టుకి కండిషనర్‌, హెయిర్‌ ప్రొటెక్షన్‌ సీరమ్‌ని ఉపయోగించాక వాడాలి. వాటిల్లోని గ్లిజరిన్‌, ప్రొప్లీన్‌, గ్లైకాల్‌ వంటివి జుట్టుకి రక్షణ అందిస్తాయి.  కండిషనర్‌లోని సెట్రియమోనియం, క్లోరైడ్‌ జుట్టుని  పాడవకుండా కాపాడతాయి. అలానే వేడుక పూర్తయ్యాక తప్పనిసరిగా కొబ్బరి నూనె వేడిచేసి దానిలో కొద్దిగా ఆలివ్‌ నూనె కలిపి తలకు మర్దన చేయాలి.

సహజంగా స్పా

హెయిర్‌ స్పా వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. మీ కుదుళ్లు బలంగా మారతాయి. నిర్జీవంగా ఉన్న జుట్టు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. స్పాలో భాగంగా చేసే మర్దన వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి మెదడుకి విశ్రాంతి అందుతుంది.

జిడ్డుగారే జుట్టుకు కలబంద స్పా
కావలసినవి:
కలబంద గుజ్జు- అరకప్పు
నిమ్మరసం- ఒక టేబుల్‌ స్పూను
పెరుగు- పావుకప్పు
ఉసిరిపొడి- రెండు టేబుల్‌ స్పూన్లు
వేడి నీళ్లు- ఓ గిన్నెడు
శుభ్రమైన టర్కీ టవల్‌- ఒకటి

ఇలా చేసుకోవాలి: కలబంద, పెరుగు, నిమ్మరసం, ఉసిరిపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా టర్కీటవల్‌ని వేడినీళ్లలో ముంచి పిండి తలకు చుట్టుకోవాలి. లేదంటే ఆవిరి కూడా పట్టొచ్చు. పది నిమిషాలయ్యాక కలబంద మిశ్రమాన్ని తలకు పూతలా వేసుకుని షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత సల్ఫేట్‌ లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం ప్రతి పదిహేను రోజులకోసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలకు ఆవిరి పట్టడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి. జుట్టు రాలే సమస్య కూడా చాలామటుకూ తగ్గుతుంది. కలబంద జుట్టును మెరిపిస్తుంది. నిమ్మరసం అయితే చుండ్రుసమస్యను నివారిస్తుంది. ఉసిరి జుట్టుకు పోషణ అందిస్తుంది. నల్లగానూ మారుస్తుంది.

పొడిబారిన జుట్టుకి ఆలివ్‌నూనె - గుడ్డు చికిత్స

కావలసినవి:
గుడ్లు- రెండు
ఆలివ్‌నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
పెరుగు- పావుకప్పు
మెంతిపిండి- నానబెట్టినది (పావుకప్పు)
వేడివేడి నీళ్లు- ఓ గిన్నెడు
శుభ్రమైన టర్కీ టవల్‌- ఒకటి

తయారీ: పై పదార్థాలన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. టవల్‌ని వేడినీళ్లల్లో ముంచి, గట్టిగా పిండి తలకు చుట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షవర్‌ క్యాప్‌ పెట్టేయాలి. ఇరవై నిమిషాల తరువాత మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా, పట్టుకుచ్చులా కనిపిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.