
తాజా వార్తలు
వరుసగా రెండు త్రైమాసికాల్లో అత్యధిక మార్కెట్ వాటాతో అగ్రస్థానం
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాపిల్ నుంచి కొత్త ఉత్పత్తి మార్కెట్లోకి విడుదల అవుతుందంటే చాలు.. క్యూలైన్లు కట్టిమరీ దక్కించుకునే ప్రయత్నం చేస్తారు యాపిల్ ప్రియులు. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత్లో స్మార్ట్ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ (రూ.35,000 పైబడి)లో 51.3 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్లో అత్యధిక వాటాతో మెదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
‘స్మార్ట్ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో యాపిల్ 51.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ప్రమోషనల్ ఆఫర్లు, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 8, ఐఫోన్ 7(128 జీబీ), కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడళ్లపై ధరలు తగ్గించడం వల్లే ఇది సాధ్యపడింది’ అని ఐడీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో 41.2 శాతం వాటా ఉన్న యాపిల్ కేవలం మూడు నెలల్లోనే 10 శాతం వృద్ధి నమోదు చేసి మూడో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.