close

తాజా వార్తలు

బ్యాటరీ స్కూటీకి లైసెన్స్‌ వద్దా?

మెకానిక్‌ గురూ

*ఆరునెలల కిందట తీసుకున్న స్కూటీని ఇప్పటికి మూడుసార్లు సర్వీసింగ్‌ చేయించాను. సర్వీసింగ్‌ చేయించిన ప్రతిసారీ ఇంజిన్‌ ఆయిల్‌ మార్చాలనీ, ఏదో పార్ట్‌ పోయిందని సర్వీసింగ్‌ సెంటర్‌ వాళ్లు ఐదువందల నుంచి వెయ్యిరూపాయల దాకా ఛార్జ్‌ చేస్తున్నారు. వాళ్లు చెప్పినట్టు మైలేజీ రావడం లేదు. కొంచెం స్పీడ్‌ పెంచగానే ఇంజిన్‌లో నుంచి ఏదో శబ్దం వస్తోంది. బ్రేక్‌ వేసినట్టు మధ్యమధ్యలో ఒక్కసారిగా స్లో అవుతోంది. రెండుసార్లు ఈ సమస్య గురించి చెప్పినా పట్టించుకోలేదు. డీలరు, కంపెనీపై వినియోగదారుల కోర్టులో కేసు వేయాలనుకుంటున్నాను. ఎలా ముందుకెళ్లాలి?

  - ఎం.ఆర్‌.కె., హైదరాబాద్‌
ప్రతి స్కూటీని రెండు నెలలకోసారి లేదా రెండున్నర వేల కిలోమీటర్లకు అటూఇటూ సర్వీసింగ్‌ చేయించాలి. లేకపోతే ఇంధన ట్యాంకు, ఇంజిన్‌, అక్కణ్నుంచి చక్రాలకు శక్తి అందే మధ్యలో ఎక్కడైనా  మలినాలు, వ్యర్థాలు అడ్డుపడి బండి పనితీరుని దెబ్బతీస్తాయి. మొదటి వేయి కిలోమీటర్ల వరకూ మనం ఎలా నడిపాం? యాక్సిలరేషన్‌ ఎలా ఉపయోగించాం? వీటిపై బండి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఐసీ ఇంజిన్‌లో కదిలే భాగాలు వందల్లో ఉంటాయి. వీటిలో ఒక్క అమరిక సరిగా లేకపోయినా మైలేజీపై ప్రభావం పడుతుంది. వీటితోపాటు టైర్లలో గాలి మోతాదు, సీవీటీ బెల్ట్‌, ఇంజిన్‌ ఇవన్నీ బాగుండాలి. ప్రతి ఆటోమొబైల్‌ కంపెనీకి ఒక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఉంటుంది. డీలర్‌ స్పందించకపోతే వారికి ఫిర్యాదు చేయొచ్చు.
*  ఏడాది కిందట ఎలక్ట్రిక్‌ స్కూటరు కొన్నాను. ఒక్కసారి ఛార్జింగ్‌తో 70 కిలోమీటర్లు వెళ్తోంది. డీలరు ఈ బండికి బీమా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదని చెప్పాడు. అయినా నేను ఒక బీమా కంపెనీని సంప్రదిస్తే ఐదేళ్ల బీమాకి రూ.13,229 ప్రీమియం అవుతుందని చెప్పారు. అది ఎక్కువ అనిపిస్తోంది. మీరేమంటారు?  
- ఎంవీ రమణారావు, సికింద్రాబాద్‌
భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) విద్యుత్తు బ్యాటరీ వాహనాలకు ఈ ఏడాది నుంచి థర్డ్‌ పార్టీ బీమాలో 15శాతం తగ్గుదల ప్రకటించింది. 3 కిలోవాట్ల పవర్‌ని మించని ద్విచక్రవాహనానికి ఏడాది థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.410గా నిర్ధారించారు. ఐదేళ్లకి రూ.888. యాకో, ఐసీఐసీఐ లాంబార్డ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఆర్గో.. వీటిలో దేన్నైనా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్‌బజార్‌, పాలసీబజార్‌లాంటి అగ్రిగేట్‌ సంస్థల నుంచీ తీసుకోవచ్చు. విద్యుత్తు వాహనం ఎవరు అమ్మినా ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ), నేషనల్‌ ఆటోమోటివ్‌ టెస్టింగ్‌ అండ్‌ ఆర్‌ అండ్‌ డీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఏటీఆర్‌ఐపీ) గుర్తింపు ఉండాలి. దానికనుగుణంగా 250వాట్లలోపు వాహనానికి లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరమా, కాదా అన్నది డీలరు నిర్ధారిస్తారు.
*  టీవీఎస్‌ జూపిటర్‌ జెడ్‌ఎక్స్‌ రెండునెలల కిందట కొన్నాను. 850 కిలోమీటర్లు ప్రయాణించాను. ఐదువందల కిలోమీటర్ల తర్వాత మొదటి సర్వీసింగ్‌ చేయించాను. మైలేజీ 35 కిలోమీటర్లు దాటడం లేదు. కంపెనీ చెప్పిందేమో 62కి.మీ.లు. నాకు 40-45 కిలోమీటర్లు మైలేజీ వచ్చినా సంతోషమే. దీనికేం చేయాలంటారు? 

 - అనిల్‌కుమార్‌, ఈమెయిల్‌
మీ వాహనం కొత్తది, వారంటీ పీరియడ్‌లో ఉంది కాబట్టి డీలర్‌ని ఒక్కసారి వెహికిల్‌ ఫ్యుయెల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ చేయమని చెప్పండి. అది వాళ్ల బాధ్యత. వీటితోపాటు టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోండి. హఠాత్తుగా యాక్సిలేటర్‌ పెంచడం, సడెన్‌ బ్రేక్‌లు వేయడం చేయొద్దు. నమ్మకమైన ఒక పెట్రోల్‌ బంక్‌లోనే ఎప్పుడూ పెట్రోల్‌ పోయించండి.
- హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ నిపుణుడు
(మీకూ ఇలాంటి సమస్యలు, సందేహాలు ఉంటే రాసి పంపండి)


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.