close

తాజా వార్తలు

Updated : 17/10/2019 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామా... వినుమా!

హరికి హరుడి గీతోపదేశం
అంతరాంతరాళాల్లో చైతన్యాన్ని ఉద్దీపింపజేసే మహా ప్రబోధం గీత. ఆత్మానాత్మ వివేకాన్ని తెలియజెప్పే ఈసకల వేదసారం అర్జ్జునుడికి కర్తవ్యాన్ని వివరిస్తే, శివుడు వివరించిన గీతాసారం శ్రీరాముణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసింది. అదే శివగీతగా మారింది. భగవద్గీతను నరుడికి నారాయణుడు ఉద్బోధిస్తే, శివగీతను నారాయణుడికి హరుడు ఉపదేశించాడు.
మహారణ్య మధ్య ప్రాంతం... నారాయణుడైనా నరావతారంలోనే ఉన్నాడుగా.. శ్రీరాముడు ఆవేదనతో కూలబడ్డాడు. సీతా వియోగాన్ని తట్టుకోలేనంటూ  ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.
‘కామ క్రోధాదయ స్సర్వే దహ్యంత్యేతే తనుం మమ
అహంకారోపి మే నిత్యం జీవనం హంతుముద్యతః’
అరిషడ్వర్గాలు నా దేహాన్ని దహించివేస్తున్నాయి. నా కర్తవ్య నిర్వహణకు అవసరమైన మార్గాన్ని ఉపదేశించండి అంటూ శివుడిని ప్రార్థించాడు. పరమేశ్వరుడు ఆవిర్భవించాడు... ఊరడించాడు. ఆత్మవివేకం కలిగించాడు.. ఇది శివగీత  
సీతమ్మ కోరిక తీర్చేందుకు మాయలేడిని తీసుకురావటానికి వెళ్లాడు రామయ్య. ఇదే అదనుగా చేసుకుని కపటవేషంతో సీతమ్మను అపహరించాడు రావణుడు. తిరిగి వచ్చిన రామయ్య ఆశ్రమంలో సీతమ్మ కనబడక పోయేసరికి ఎంతో ఆవేదన చెందాడు. సీతమ్మ తోడు లేకుండా జీవించడం వ్యర్థమని భావించి ఆత్మత్యాగంతో జీవితాన్ని ముగించాలని అనుకున్నాడు. ఇంతలో అక్కడకు అగస్త్య మహర్షి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకుని రాముడిని ఊరడించాడు. మోహాన్ని విడిచిపెట్టమని చెబుతూ పాశుపత దీక్ష ఉపదేశించాడు. దీన్ని విరజా దీక్ష అని కూడా అంటారు. రామచంద్రుడు తదేక దీక్షతో శివార్చన చేస్తూ తపస్సులో లీనమయ్యాడు. ఆ తీవ్ర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రమథ గణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. భీకరమైన ప్రమథ గణాల శబ్దాలకు కలవరపడిన రాముడు.. అదంతా రాక్షసమాయ అనుకుని తన చాపాన్ని ఎక్కుపెట్టాడు. శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు. విచిత్రంగా అవన్నీ ఓ మహాతేజస్సులో ఐక్యమయ్యాయి. చివరకు రాముడి చేతి నుంచి కోదండం కూడా జారిపోతుంది. అమ్ములపొది శరీరం నుంచి తనంతట తానుగా విడిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయాడు రామయ్య. ఆ మహా తేజస్సు ముందు మోకరిల్లాడు. పరమేశ్వరుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమై రాముడికి దివ్యమైన ఆయుధాలు ప్రసాదించాడు. శివప్రసాదంగా వీటన్నిటినీ స్వీకరిస్తూనే తన సందేహాలను నేరుగా శివుడినే అడిగాడు రామయ్య. మరింత దయతో వాటన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పాడు  శివుడు. ఇలా రామ, శివుల మధ్య జరిగిన సంభాషణే ‘శివగీత’గా ఆవిర్భవించింది. వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణం, ఉత్తర ఖండంలో ఇదంతా ఉంది.
దిగులు వద్దు... గుబులు వద్దు!
దేహం జడపదార్థం. పాంచభౌతికమైంది. జీవుడనే వాయువు దేహం నుంచి బయటకు రాగానే మిగిలేది కేవలం భస్మరాశి మాత్రమే. అది కూడా చివరకు గంగ పాలవుతుంది. నశించనిది ఆత్మ మాత్రమే. దానికి చావు పుట్టుకలు లేవు. బూడిదకుప్పగా మిగిలే భౌతిక శరీరం కోసం ఎందుకంత తీవ్రంగా ఆవేదన చెందుతావంటూ పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తికి చేసిన జ్ఞానబోధేే ‘శివగీత’. నిశితంగా పరిశీలిస్తే భగవద్గీత, శివగీత - రెండూ ఒకే దృక్కోణంలో సాగుతాయి. రచనా సంవిధానం కూడా దాదాపు ఒకేరీతిలో ఉంటుంది. కొన్ని శ్లోకాల్లో సారూప్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అనంతమైన బ్రహ్మజ్ఞానం, అద్వైత వేదాంతం శివగీతలో అంతర్లీనంగా ఉంటాయి. ఏదో ఉపదేశంగా కాకుండా ఆత్మ చైతన్యాన్ని ఉద్దీపింపజేసే ప్రబోధ గీతంగా ఇది సాగుతుంది.  భవబంధాల సంకెళ్లలో బందీగా మారిన మానవుడిని ఊరడించి, అతడిలో కర్తవ్యదీక్షను తట్టిలేపే చైతన్యగీతికగా శివగీత కనిపిస్తుంది. శివగీతలోని శ్లోకాలను పరిశీలించి, కాలప్రమాణాల ఆధారంగా విశ్లేషించి భగవద్గీత కన్నా ముందుగానే ఇది ఆవిర్భవించిందని నిర్ధరించారు.  
* శివభక్తితో శివగీత ప్రారంభమవుతుంది. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి అత్యుత్తమమైందని మహర్షులు చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఈ గీత.. శివ శరణాగతితో ప్రారంభమై శివ శరణాగతితోనే ముగుస్తుంది. భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు శరణాగతి కోరాల్సిందే. అంతకుమించి మార్గాంతరం లేదు. అనేక సందర్భాల్లో పురాణ, ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి కూడా. నారద భక్తిసూత్రాలు కూడా ‘అధాతౌ భక్తిం వ్యాఖ్యాస్యామః’ అంటూ భక్తికే పెద్దపీట వేశాయి. అల్లసాని పెద్దన కూడా ‘వాలిన భక్తి మ్రొక్కెద’నంటూ శరణాగతినే ప్రకటిస్తాడు. శివగీత కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. తనను శరణు కోరినవారి యోగక్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు. అంతటి దయాళువు పరమేశ్వరుడు.
మన సనాతన సాహిత్యంలో విష్ణుగీత, నారదగీత, దేవీగీత, అష్టావక్రగీత, వ్యాసగీత, శ్రీరామగీత, గురుగీత, సిద్ధగీత, రుద్రగీత, భగవద్గీత... ఇలా ఎన్నో ‘గీత’లు ఉన్నాయి. ఇవన్నీ ఆయా సందర్భాల్లో జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం ఆవిర్భవించినవే. అయినప్పటికీ వేటికవే ప్రత్యేకంగా తమ వైవిధ్యాన్ని ప్రకటిస్తాయి.
 

శివగీతలో మొత్తం 14 అధ్యాయాలు, 779 శ్లోకాలు ఉన్నాయి. ఇందులోని ప్రతి అధ్యాయం ఒక్కో విషయాన్ని విశదీకరిస్తుంది.
శివభక్తి నిరూపణ యోగం: భక్తుడి లక్షణాలు, శివభక్తి నిర్ణయం, శివభక్తి ద్వారా భక్తుడు పొందే ఉన్నతస్థానం, శివానుగ్రహం ద్వారా భక్తుడు పొందే ఫలితాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి.

విరజాదీక్ష నిరూపణ యోగం: పాశుపత దీక్షను ప్రారంభించడానికి అనువైన తిథులు, దీక్షా విధానం, భక్తుడు పాటించాల్సిన నియమాలు ఇందులో ప్రధానాంశాలు.

పంచకోశ వర్ణనయోగం: మనస్సును ఏకాగ్రంగా నిలుపుకోవటం, ఆత్మత్వబుద్ధి, పంచభూత తత్త్వాలు, వాటి చేరిక వల్ల వివిధ దశల్లో కలిగే మార్పులు ఈ అధ్యాయంలో ప్రధానాంశాలు. ఇంద్రియానుభవం, కర్మఫలితాలు, వాటి వివరణ ఉంటుంది.

వైర్యాగయోగం: మానవ శరీర ఆవిర్భావినికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. గర్భంలో ఉండే పిండానికి ఉండే  ఆలోచనా విధానం కూడా ఇక్కడ వివరించారు.

ఉపాసనాయోగం: ఉపాసనా విధానాన్ని శివుడు ఈ అధ్యాయంలో ఉపదేశించాడు. వీరశైవ ధర్మాలు, అందుకు అనుగుణంగా శివారాధన తదితర విశేషాలు ఉంటాయి.

విశ్వరూప సందర్శన యోగం: రామచంద్రమూర్తికి శివుడు విశ్వరూపాన్ని ప్రదర్శించడం, ఈ రూపాన్ని చూడటానికి రాముడికి శివుడు జ్ఞాననేత్రాలు ప్రసాదించటం ఇందులో ఉంటుంది.

జీవగతి నిరూపణ యోగం: స్థూల, సూక్ష్మ శరీరాలు, వాటి భేదాలు, లక్షణాల గురించి ఉంటుంది. కర్మభేదాల కారణంగా మనుషుడు పొందే జన్మభేదాల వివరణ ఇందులో ముఖ్యాంశం.

వైరాగ్యోపదేశయోగం: భార్యా వియోగం ద్వారా తాను అనుభవిస్తున్న మానసికవ్యథను శ్రీరామచంద్రమూర్తి అగస్త్య మహర్షికి నివేదిస్తాడు. మహర్షి కర్తవ్యాన్ని బోధిస్తాడు. మనిషి పడుతున్న బాధలు, అందుకు మార్గాలు, జీవధారణ విధానాలు ఇందులో ఉన్నాయి.

ఈశ్వర ప్రత్యక్ష యోగం: రాముడు గోదావరీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించటం, రాముడు విరజాదీక్షను పాటించటం ఇందులో కనిపిస్తాయి, రాముడు తపస్సు చేసిన విధానం, రాముడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షం కావటం, ప్రమథగణాలతో ఉన్న శివస్వరూప వర్ణన ఉన్నాయి.

విభూతి యోగం: పరమేశ్వరుడిని రాముడి అనేక ప్రశ్నలు అడగడం ఇందులో ముఖ్యాంశం. తన సర్వతోముఖత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని పరమేశ్వరుడు వివరిస్తాడు.

జీవ స్వరూప యోగం: అన్ని ప్రాణుల్లో అదృశ్యంగా ఉండే పరమాత్మ స్వరూప వర్ణన ఉంటుంది, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థల్లో జీవుడి వేదన, శైశవదశ నుంచి వృద్ధాప్యం వరకు మానవుడి జీవన పరిణామ క్రమ విశేషాలు ఈ అధ్యాయంలో వర్ణించారు.

రామాస్త్ర ప్రదాన యోగం: రాముడికి శివుడు ధనుస్సు, అమ్ములపొదిని ప్రసాదించటం, పరమేశ్వరుడి ఆజ్ఞతో దేవతలు రాముడికి తమ అస్తాల్రు ప్రసాదించటం, వీరశైవుల లక్షణాలు ఇందులో ప్రధానాంశాలు. రావణ సంహారానికి సంబంధించిన విషయాలను భవిష్యద్దర్శనంతో పరమేశ్వరుడు వివరించటం కూడా ఇందులో ఉంది.

కైవల్య ముక్తి నిరూపణ యోగం: ముక్తి లక్షణాలు, పుణ్యపాప కర్మలు, విశేషాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. జితేంద్రియత్వం గురించి వివరణ కూడా ఇందులో ఉంది.

శరీర నిరూపణ యోగం: దేహస్వరూప వర్ణన ఇందులో ఉంది. సత్వ,రజో, తమో గుణాల వివరణ, పంచభూతాలకు, త్రిగుణాలకు సంబంధం, పంచకోశ వివరణ ఇందులో ఉంటాయి. గర్భంలో ఉండే పిండంలో జరిగే మార్పులు, జీవుడు పడే వేదన, లౌకిక మాయలోకి జీవుడు ప్రవేశించే విధానం ఇందులో విస్తారంగా వివరించారు.


శివగీతా సారం

హృదయానికి మధ్యభాగంలో జ్యోతిస్వరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. యోగసాధకులు మాత్రమే ఈ హృదయాకాశంలో ఉన్న జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించగలుగుతారు.

దుమ్మూధూళి అంటుకున్న కారణంగా అద్దం ఏవిధంగా అయితే ప్రతిబింబాన్ని చూపించలేదో దుష్టభావనల కారణంగా మకిలిపట్టిన మనస్సు తనలోనే ఉన్న ఆత్మస్వరూపమైన దైవాన్ని దర్శించలేదు.

జీవుల్లో ఉండే ఆత్మశక్తిని పరమాత్మ అంశగా గుర్తించాలి. జీవుడు తాను చేసిన కర్మలను బట్టి స్థావర, జంగమ దేహాల్ని పొందుతాడు.

జాగ్రత్‌, స్వప్న అవస్థల్లో జీవుడు అరిషడ్వర్గాలతో బంధితుడై ఉంటాడు. సుషుప్తి అవస్థలో మాత్రం జీవుడే శివుడవుతాడు.

మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే నాలుగు అంశాలతో అంతఃకరణంలో ప్రతిబింబించే శివాంశే జీవి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.