close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 13/10/2019 06:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నలభై కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేవాడ్ని

బాహుబలి తర్వాత... అలాంటి సినిమా చేయగల దర్శకులెవరబ్బా? అని ఆలోచిస్తే... ఎవరో తట్టేవారే కాదు.. ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబే సురేందర్‌రెడ్డి. చిరంజీవిని ‘సైరా’ అనిపించి... ప్రేక్షకులతో జైరా అనిపించుకున్న స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘హాయ్‌’తో మాట్లాడారు. చిన్నతనంలో సినిమా కోసం ఎంత దూరం వెళ్లింది? సహాయ దర్శకుడిగా అనుభవాలు, మొదటి సినిమా అవకాశం... కుటుంబం... ఇలా పలు విషయాలు పంచుకున్నారు.

పదో తరగతి వరకూ సరస్వతీ శిశుమందిరంలో చదువుకున్నా. వరంగల్‌లో ఇంటర్‌ పూర్తి చేశా. డిగ్రీ మధ్యలోనే మానేసి, సినిమాల్లోకి వచ్చేశా. నేనేం తెలివైన విద్యార్థిని కాను. మామూలు మార్కులతో పాసయ్యేవాడ్ని. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉండడం వల్ల చిన్నప్పటి నుంచీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన ఏర్పడింది. దేశభక్తుల కథలు తెగ చదివేవాడ్ని. చదువుతున్నప్పుడే వాళ్లెలా పోరాటం చేసి ఉంటారో అని ఊహించుకుంటూ ఉండేవాడ్ని. అలా నాలో సృజన పెరిగిందేమో..? స్కూలు రోజుల్లోనే వేదాలు చదివా. శ్లోకాలు కంఠతా పట్టేవాడ్ని. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలన్న పట్టుదల స్కూలు రోజుల్లోనే బలంగా నాటుకుపోయింది. ఆ లక్షణం ఇప్పటికీ ఉంది.

‘ధృవ’ సినిమా లేకపోతే ‘సైరా’ మీ చేతికి వచ్చేదా?

అసాధ్యం. ‘ధృవ’ వల్లే రామ్‌చరణ్‌ మనసుకు దగ్గరగా వెళ్లగలిగాను. ఆయన వల్లే చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కింది. ‘ధృవ’ తరవాతి సినిమా చిరంజీవితో అన్నప్పుడు నా స్టైల్‌లో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా చేద్దామనుకున్నా. అదే సమయంలో ‘బాహుబలి’ పెద్ద విజయం సాధించడంతో ‘థింక్‌ బిగ్‌’ అనే ఆలోచన వచ్చింది. ‘మనమూ పెద్ద స్కేల్‌లో ఓ సినిమా చేయాలి’ అని చిరంజీవి అనుకోవడం వల్ల ‘సైరా’ కుదిరింది. ఈ ప్రయాణంలో  రెండున్నరేళ్లు ఎలా గడిచాయో నాకు తెలీదు. సినిమా పూర్తయ్యాక విడుదలకు నాలుగు నెలల సమయం దొరికింది. అది మాత్రం కష్టంగా గడిచింది. ‘ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పుడు చూపిస్తానా’ అనిపించింది. ‘సైరా’తో చాలా నేర్చుకున్నా. ఎన్నో విషయాలు తెలిశాయి. దర్శకుడిగా నాకు పెద్ద మలుపు. మరో స్థాయికి వెళ్లడానికి సైరా ఉపయోగపడింది.

‘అతనొక్కడే’ స్క్రీన్‌ ప్లే పరంగా.. మ్యాజిక్‌ చేసిన సినిమా. ఆ కథని పట్టాలెక్కించడంలో మీరు పడిన శ్రమ ఎలాంటిది?
తొలి సినిమా అవకాశం దక్కడానికి నేను భరించలేనన్ని కష్టాలేం పడలేదు. అప్పటికే సహాయ దర్శకుడిగా ఏడెనిమిది సినిమాలు చేసుంటాను. ‘ఇప్పుడు నేను దర్శకుడ్ని అయిపోవాలి కదా’ అని ఎప్పుడూ అనిపించలేదు. చేతికొచ్చిన పని చేసుకుంటూ వెళ్లేవాడ్ని. ఓరోజు ‘నేనే ఓ కథ సిద్ధం చేసుకుంటే ఎలా ఉంటుంది’ అనిపించింది. అలా పుట్టిన కథ ‘అతనొక్కడే’. ముందు ఈ కథని సుధాకర్‌ రెడ్డి, దిల్‌రాజులకు వినిపించా. ఇద్దరికీ బాగా నచ్చేసింది. అదే కథని కల్యాణ్‌ రామ్‌కు చెప్పడం, ఆయన టక్కున ఓకే చెప్పేయడం జరిగిపోయాయి.

సహాయ దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా సాగింది? ఆటు పోట్లేమైనా ఎదుర్కొన్నారా?
నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చినవాడ్ని. సహాయ దర్శకుడిగా పెద్ద కష్టాలేం పడలేదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ‘నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి. ఇంట్లోవాళ్ల దగ్గర చేయి చాచకూడదు’ అనుకున్నా. అలానే అమ్మానాన్నల నుంచి పైసా తీసుకోలేదు. అప్పట్లో సహాయ దర్శకుల జీతాలు చాలా తక్కువ. వాటితోనే సర్దుకుపోవాల్సివచ్చేది. ఉషాకిరణ్‌ మూవీస్‌ సినిమా ‘పాడుతా తీయగా’కు అక్షరాలా లక్ష రూపాయల పారితోషికం అందుకున్నా. సహాయ దర్శకుడిగా నేను చూసిన పెద్ద మొత్తం అదే. నేను చేసిన మిగిలిన సినిమాలన్నీ కలిపి రూ.50 వేలు వస్తే.. ఆ ఒక్క సినిమానే లక్ష రూపాయలు తెచ్చిపెట్టింది.

నేను అంత తొందరగా ఎవరితోనూ కలవలేను. కొత్తవాళ్లతో కాస్త రిజర్వ్‌గా ఉంటాను. దాన్ని కొంతమంది యాటిట్యూడ్‌ అనుకుంటారు. కానీ.. అది నా స్వభావం. దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటాను. నిజానికి నేను చాలా ఎమోషనల్‌ వ్యక్తిని. అందరినీ సులభంగా నమ్మేస్తుంటాను.

‘సినిమాల్లో చేరతాను’ అంటే ఇంట్లోవాళ్ల రియాక్షనేంటి?
అమ్మానాన్న పెద్దగా అడ్డు చెప్పలేదు. చుట్టాలు ఓ రేంజ్‌లో చూసేవాళ్లు. ఏదైనా పెళ్లికి వెళ్తే.. ‘వీడు సినిమాల్లోకి వెళ్దామనుకుంటున్నాడట. ఇక ఎందుకూ పనికి రాకుండా పోతాడేమో’ అన్నట్టు మాట్లాడేవాళ్లు. అవి భరించలేక.. ఎక్కడకు వెళ్లినా ఓ మూలకు వెళ్లి కూర్చునేవాడ్ని. కానీ ఏదో ఓ రూపంలో ఆ మాటలన్నీ నా చెవిన పడుతుండేవి. అయితే సినిమాపై నాకున్న తపన ముందు అవన్నీ చిన్నవిగానే అనిపించేవి. మనకంటూ ఓ లక్ష్యం ఉన్నప్పుడు వెనక్కి లాగడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నా - పట్టు విడవకూడదు. నేనూ అదే చేశా.

చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లు?
చిరంజీవంటే చాలా ఇష్టం. అంతకు ముందు మోహన్‌ బాబు అభిమానిని. ఆయన హీరోగా చేసి కొన్నాళ్లు సహాయ పాత్రలు, విలన్‌ పాత్రల వైపు వచ్చేశారు. అప్పుడు పూర్తిగా చిరంజీవికి షిఫ్ట్‌ అయిపోయాను. ‘ఘరానా మొగుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’... ఈ సినిమాలు ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు.

మీ జీవితంలో థాంక్యూ, సారీ చెప్పాలనుకున్న వ్యక్తులు..?
నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ థాంక్స్‌ చెప్పాలనుకునే వ్యక్తి... కల్యాణ్‌రామ్‌. ఆయన వల్లే దర్శకుడిగా అవకాశం వచ్చింది. ‘అతనొక్కడే’ అనే సినిమా లేకపోతే నేను లేను. సారీ చెప్పాలన్నా ఆయనకే చెప్పాలి. ఎందుకంటే... నాకు తొలి విజయాన్ని అందించిన ఆయనకే ‘కిక్‌-2’ లాంటి డిజాస్టర్‌ ఇచ్చాను. నిజానికి ఓ మంచి ఉద్దేశంతో మొదలెట్టిన సినిమా అది. ఆ సినిమా విషయంలో నేను అనుకున్నదేదీ జరగలేదు. ఈ విషయంలో ఇప్పటికీ బాధ పడుతూనే ఉంటాను.

నాకు ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. చిన్నప్పుడు బాగా ఆడేవాడ్ని. నా వయసు వాళ్లంతా క్రికెట్‌ వెంట పరుగులు పెడితే, నేను ఫుట్‌బాల్‌తోనే ఉండిపోయాను. ఇప్పటికీ నాకు క్రికెట్‌ అర్థం కాదు.
నేనూ భోజన ప్రియుడినే. మాంసాహారాన్ని ఇష్టంగా తింటా. సినిమాల హడావిడిలో ఉన్నప్పుడు డైట్‌ గురించి అస్సలు పట్టించుకోను. దాంతో బరువు పెరుగుతూ.. తగ్గుతుంటాను.
ఇది వరకు డబ్బుల గురించి అస్సలు ఆలోచించేవాడ్ని కాదు. ఇప్పుడు నా కుటుంబం కోసమైనా డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది.
నా భార్యపేరు దీపారెడ్డి. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను బిజినెస్‌ చూసుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఆరిత్‌రెడ్డి, అయాన్ష్‌రెడ్డి. సమయం దొరికితే కుటుంబంతో గడుపుతా
దర్శకులు అవ్వాలనుకునే ఈతరం వాళ్లకి నేనిచ్చే సలహా ఒక్కటే. సినిమాని ప్రేమించండి. కొన్ని కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా మంచి ఫలితం వస్తుంది.

ఈమధ్య మిమ్మల్ని మాయలో పడేసిన సినిమా ఏది?
బాగా ఇష్టపడిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్‌ చూస్తే.. నెక్ట్స్‌ జనరేషన్‌ డైరెక్టర్‌ అనిపించింది. ఆ సినిమాతో నేను సందీప్‌కి అభిమాని అయిపోయాను. ఆ మేకింగ్‌లో ఓ స్టైల్‌ ఉంది..  రూల్స్‌ బ్రేక్‌ చేసి తీసిన సినిమా అది. ఇక ‘బాహుబలి’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి దర్శకుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించిన సినిమా అది. మరిన్ని పెద్ద కలలు కనడానికి ధైర్యం ఇచ్చింది.

మిమ్మల్ని ప్రభావితం చేసిన దర్శకులెవరు?
ఆ కాలంలో రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడ్ని. పక్కా కమర్షియల్‌ దర్శకులు వీళ్లు. అయితే నేను దర్శకుడు అవ్వడానికి కారణం రాంగోపాల్‌ వర్మ. ‘శివ’ తరవాతే నేను సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఓ దర్శకుడికి ఎంత విలువ ఇస్తారన్నది వర్మని చూశాకే అర్థమైంది. దర్శకుడి పేరు తెరపై పడగానే క్లాప్స్‌ కొడతారని తొలిసారి ఆయన నిరూపించారు. ఇవన్నీ చూశాకే దర్శకుడ్ని అవ్వాలని ఫిక్సయ్యాను. మణిరత్నం కూడా నన్ను బాగా కుదిపేశారు. ‘గీతాంజలి’, ‘ఘర్షణ’ నన్ను సినిమాలవైపు మరింతగా తోసేశాయి.

‘సైరా’ ఇంత కష్టపడి సినిమా తీస్తే.. బయటేమో ‘సురేందర్‌ రెడ్డిని తొలగించారు.. చిరంజీవినే దర్శకత్వం వహిస్తున్నారు’ అని మొదట్లో ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అలాంటప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడాలని, నిజాలేంటో చెప్పాలని మీకు అనిపించలేదా?
ఓ సినిమా తీస్తున్నప్పుడు సెట్లో నాలుగు, అయిదు వందల మంది ఉంటారు. వాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. బయట ఒకరిద్దరు మాట్లాడుకునే మాటల్ని నేను పట్టించుకోను. ఎవరో ఏదో మాట్లాడారని, దానికి సమాధానం ఇచ్చుకుంటూ వెళ్లలేం. అందుకే... బయట ఎన్ని రకాల ఊహాగానాలు వచ్చినా నేనెప్పుడూ మాట్లాడలేదు.

శ్రీదేవి సినిమా కోసం..
‘‘శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ అంటే చాలా ఇష్టం. కె.రాఘవేంద్రరావు - శ్రీదేవి కాంబినేషన్‌ అంటే పడి చచ్చిపోయేవాళ్లం. జమ్మికుంటలో ఉండేవాళ్లం. కొత్త సినిమా మా ఊరికి రావాలంటే నెల రోజులు పడుతుంది. వరంగల్‌లో కొత్త సినిమాలు వచ్చేవి. అందుకే మా ఊరి నుంచి వరంగల్‌కి సైకిల్‌ మీద వెళ్లిపోయేవాళ్లం. శ్రీదేవి సినిమా వచ్చిందంటే పొద్దుట ఆరింటికి బయల్దేరి సైకిల్‌ తొక్కుకుంటూ 40కిపైగా కిలోమీటర్ల ప్రయాణం చేసేవాళ్లం. వెళ్లేటప్పుడు శ్రీదేవిని చూడబోతున్నామనే ఆశ, వస్తున్నప్పుడు శ్రీదేవిని చూసేశాం అన్న తృప్తితో.. అలసట తెలిసేది కాదు.

 తొలి సినిమాతోనే అగ్ర కథానాయకులతో పనిచేయడం మొదలెట్టారు. స్టార్‌ హీరోలతో సినిమా చేసేటప్పుడు ఉండే సౌలభ్యాలు, ప్రతికూలతలేంటి?

సౌలభ్యాలు చాలా ఉంటాయండీ. ప్రతీ కథానాయకుడికీ అభిమాన గణం మెండుగా ఉంటుంది. సినిమా కాస్త నచ్చితే చాలు.. వాళ్లు భుజాన వేసుకుంటారు. ప్రతికూలతలూ లేకపోలేదు. కథలో ఎలాంటి సన్నివేశం చెప్పాలన్నా, స్టార్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దానికి అనుగుణంగానే కథని నడపాలి. ఓ రకంగా అదో అందమైన చట్రం. అదే కొత్తవాళ్లతో అనుకోండి. కథ ఏం చెబితే అది చేసేయొచ్చు. చేతిలో పెద్ద హీరో ఉన్నా.. స్క్రిప్టుని ఫాలో అవుతూ సినిమాలు తీసే సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
 ‘శివ’ సమయంలో వర్మని.. ఇప్పటి వర్మని పోల్చుకుని చూస్తుంటే ఏమనిపిస్తుంది?
నేను అలా ఉండకూడదనిపిస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే, సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తుంది. అయితే.. ‘శివ’ సమయంలో నేను చూసిన వర్మ నా కళ్లముందు మెదులుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కనిపించినా ఆనాటి వర్మనే కళ్లముందుకొస్తారు. నేను అప్పుడు ఏ కళ్లతో చూశానో, ఇప్పుడూ అదే కళ్లతో చూస్తున్నాను. ఇప్పటి రాంగోపాల్‌ వర్మ నాకసలు కనిపించడు.
 చిరుతో రీషూట్‌కి ఒప్పించిన దర్శకుడు మీరేనని చెప్పుకొంటున్నారు.. నిజమేనా?
ఆ సంగతి తెలీదుగానీ, సైరాలో ఓ సన్నివేశం విషయంలో నేను అసంతృప్తికి గురయ్యాను. నేను అనుకున్నట్టు ఆ సీన్‌ రాలేదు. వెంటనే చిరంజీవి దగ్గరకు వెళ్లి.. ‘సార్‌.. ఆ సీన్‌ నాకు కావల్సినట్టు రాలేదు. తప్పు నాదే. మరోసారి చేద్దాం. లేదంటే నాకు నిద్రపట్టదు’ అని ఆయన్ని బతిమాలుకున్నాను. ‘సరే.. సీన్‌ని ఓ సారి ఎడిట్‌ చేసి తీసుకురా.. అప్పుడూ నీకు అదే అనిపిస్తే తప్పకుండా చేద్దాం’ అన్నారు. అలా.. ఓ సన్నివేశాన్ని రీషూట్‌ చేశాం. చిరంజీవి దర్శకుడి నటుడు. ఆయన మెగాస్టార్‌ అయినా సరే, దర్శకుడికి ఏం కావాలో అదే ఇస్తారు.

నేనూ... నా హీరోలు

కల్యాణ్‌ రామ్‌ : ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. బంధాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. భావోద్వేగాలున్న మనిషి.
మహేష్‌ బాబు : అందగాడు. సినిమా అంటే ప్యాషన్‌. ‘ది బెస్ట్‌ ఇవ్వాలి’ అని అనుక్షణం ఆరాటపడుతుంటాడు.
ఎన్టీఆర్‌ : తనకి తెలియని విషయం లేదు. సంగీతం నుంచి స్టాక్‌ మార్కెట్‌ దాకా అన్నీ మాట్లాడేస్తాడు.
రవితేజ : చాలా ఓపెన్‌. మనసులో ఏదీ ఉంచుకోడు. మంచైనా చెడైనా. ఏదీ దాచుకోడు. బోల్డ్‌.
అల్లు అర్జున్‌ : చాలా ఫ్రెండ్లీ. అంకితభావం ఎక్కువ. ఓ పాత్రని ఇష్టపడితే, దానికోసం ఎంతైనా కష్టపడతాడు.
రామచరణ్‌ : రాయల్‌. ఈ మాట చరణ్‌కి తప్ప ఎవరికీ సూటవదు. ఆ మాటలోనే అన్నీ. ఒక్క మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు.
చిరంజీవి : సినిమా పట్ల భయం, భక్తి చాలా ఎక్కువ. ఆయనలోనూ ఓ అభిమాని ఉన్నాడు. ఆ అభిమానికి నచ్చే సినిమానే తీస్తారు.

- మహమ్మద్‌ అన్వర్‌
ఫొటో: మధు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.