
తాజా వార్తలు
ఈనెల 13 వాల్మీకి జయంతి
ఏనాటి రామకథ...ఇప్పటికీ ప్రాతఃస్మరణీయమే.ఏం వింటే ధర్మం కరతలామలకమవుతుందో, సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో, హృదయం ఆనందంతో నిండిపోతుందో... అలాంటి కథకు రూపకర్త వాల్మీకి. కావ్య రూప తపస్సు చూసి మానవ జాతికి మహోపకారం చేసిన మహర్షి ఆయన.
మనిషికి పుట్టుకతోనే పితృ రుణం, దేవరుణం, రుషి రుణం అనే మూడు రకాల రుణాలుంటాయి. రుషులకు ఎందుకు రుణ పడి ఉండాలనే దానికి సనాతన ధర్మం వివరణనిస్తోంది. ఆ రుషులు మానవాళికి మార్గదర్శక సూత్రాల్లాంటి శాస్త్రాలను అందిస్తారు. జాతి హితం కోసం విజ్ఞానాన్ని రూపొందిస్తారు. దీనికోసం అంతులేని తపస్సు చేస్తారు. కాబట్టి మనిషి రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలి. అలాంటి రుషుల్లో ఒకరు రామాయణకర్త వాల్మీకి మహర్షి. ఎందుకంటే రామాయణం ఒక కావ్యం మాత్రమే కాదు మానవ జీవితానికి ఓ దిక్సూచి.
ఎవరీయన?
తపస్సు అంటే తపించడం. తాననుకున్న లక్ష్యం కోసం కష్టతరమైన సాధన చేసి ఓ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేది అని కూడా అర్థం ఉంది. అహంకార మమకారాలను, దేహాభిమానాన్ని, హింస, కుటిలత్వం వంటివాటిని దహించడమే తపస్సు. రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు. బోయవాడైన ఈయన రుషిగా మారిన తరువాత ఓ వేటగాడి చేతిలో క్రౌంచ పక్షుల జంటలో ఒకటి మరణించడం చూసినప్పుడు కలిగిన ఆవేదన రామాయణ రచనకు కారణమైందని అంటారు. దీంతో పాటు మరికొన్ని కథలు కూడా వాల్మీకి గురించి ఉన్నాయి.
‘వేద వేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే!
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా’
ఈ శ్లోకంలో రామాయణం సాక్షాత్తు వేద సమానమని, ప్రాచేతసుడు దీన్ని రచించాడనే అర్థం కనిపిస్తుంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రాచేతస గణం అనే రుషి వంశాలున్నాయి. అందులోనివాడే రామాయణకర్త అయిన వాల్మీకి అని పండితాభిప్రాయం. వాల్మీకి గురించి సనత్కుమార మహర్షి వ్యాసుడికి వివరించినట్లు చెప్పే కథ స్కాంద పురాణం అవంతీ ఖండంలో కనిపిస్తుంది. ‘వాల్మీకిరభ వద్బ్రహ్మా వాగ భూత్తస్య రూపిణీ’ అని అందులో ఉంది. వాల్మీకి బ్రహ్మ అంశతో జన్మించాడని దీనికి అర్థం. అందులో అగ్నిశర్మ అనే పేరుతో కనిపిస్తాడీయన. కిరాత ముఠాతో కలిసి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్న సమయంలో సప్తరుషుల బోధన వల్ల మహర్షిగా మారాడని పురాణ గాథ. కొంచెం అటు, ఇటుగా ఇలాంటి కథే మరొకటి వినిపిస్తుంది. చెడు సావాసాలతో కిరాతుడిగా మారిన రత్నాకరుడికి నారదమహర్షి ‘రామ’ నామాన్ని ఉపదేశించాడు. ఆ నామం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేసిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయి. ఆ పుట్టల మధ్య నుంచి బయటపడ్డ రత్నాకరుడే వాల్మీకి అయ్యాడని ఉంది.
శోకం నుంచి శ్లోకం
అదొక ప్రశాంత సమయం. ఎటు చూసినా ఓ దివ్యమైన ఆనందానుభూతి. సంధ్యాసమయం కావటంతో శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నదీ తీరానికి చేరుకున్న వాల్మీకి ఆ ప్రకృతికాంత పులకింతల్ని చూసి తానూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో ఉన్నాడు. ఏదో తెలియని పరవశం అతడి హృదయంలో పరుగులెత్తుతోంది. అంతలో... లోకంలో తామిద్దరమే ఉన్నామన్నంత భావనతో స్వేచ్ఛగా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న క్రౌంచపక్షుల జంటను దూరంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ మీద చూశాడాయన. వాటి పరవశాన్ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నాడు. హఠాత్తుగా ఓ వేటగాడు విడిచిన బాణం తగిలి అక్కడిక్కడే కిందపడి ప్రాణాలు విడిచింది మగపక్షి. అది చూసి తట్టుకోలేక పోయింది ఆడ పక్షి. భర్త దేహం చుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ సన్నివేశం వాల్మీకిని కలిచివేసింది. అప్పటిదాకా అమితానందంతో ఉన్న వాల్మీకి హృదయం అత్యంత విషాదంతో నిండిపోయింది. ఇంతటి ఘోరానికి కారణమైన బోయవాడి వైపు కోపంగా చూస్తూ...
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః ।
యత్ క్రౌంచ మిథునాదేకమ్ అవధీః కామమోహితమ్ ।।
అనురాగభావంతో ఉన్న క్రౌంచపక్షిని చంపిన కిరాతుడా! నువ్వు శాశ్వతమైన అపకీర్తిని పొందుతావంటూ అప్రయత్నంగా పలికాడు వాల్మీకి. అమితమైన దుఃఖంలో వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన ఈ శ్లోకంతోనే రామాయణ మహాకావ్య రచన ప్రారంభమైంది. వియోగదుఃఖంలో ఉన్న క్రౌంచపక్షి రామాయణ రచనకు ప్రేరణగా నిలచింది.
రామాయణంలో ఏమున్నాయి?
వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మః అన్నా...జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని బోధించినా పదం, శబ్దం, భావం, గమనం, గమకం... అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి. ఈ కావ్య సంపుటిని గాయత్రీ మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడని పరిశోధకులు చెబుతారు. రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను నిక్షిప్తం చేశాడు. అందుకే రామాయణం కావ్యమే కాదు ఒక మహామంత్రమని అంటారు. ఇందులోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో ఉండి, గానం చేయడానికి వీలుగా ఉంటాయి. అందుకే రామాయణాన్ని కుశలవుల ద్వారా విన్న రుషులు
‘అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః చిరని ర్వృత్త మప్యేతత్ ప్రత్యక్ష మివ దర్శితమ్!’ అని ప్రశంసించారు.
* రామాయణం మొత్తాన్ని పరమ యోగానికి నిదర్శనంగా చెబుతారు. ఇందులోని ఆరు కాండలనూ షట్చక్రాలతో పోలుస్తారు. కైకేయి వరం యాచించినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వంలో సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాధిష్టానం, అత్రి, అనసూయ, అగస్త్యుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిపూరం, కబంద వధలో అనాహతం, పంపా సందర్శనలో విశుద్ధి, సుగ్రీవాజ్ఞలో ఆజ్ఞాచక్రాలతో నిరూపిస్తారు. సీతా సందర్శనం సహస్రార చక్రానికి చేరడంగా యోగాచార్యులు భావిస్తారు.
* ఈ మహాకావ్యంలో వైద్యశాస్త్రాన్ని, ఔషధాలను గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు వానర సేనలోని సుషేణుడు లక్ష్మణుడు మళ్లీ తెలివిలోకి రావడానికి ఉపాయం ఉందని చెప్పాడు. హిమాలయాల్లోని ఓషధీ పర్వతంపై దక్షిణ శిఖరంలో విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవని, సంధాన కరణి అనే పరమ ఔషధాలున్నాయని, వాటిని హనుమంతుడితో త్వరగా తెప్పించమని చెప్పాడు. వీటిలో విశల్యకరణి శరీరంలో నాటుకున్న బాణాలను తొలగించి గాయాలను మాన్పుతుంది. సువర్ణకరణి శరీరకాంతిని సహజ స్థితికి తెస్తుంది. సంజీవని స్పృహలోకి తెచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంది. సంధానకరణి విరిగిన ఎముకలను అతికిస్తుందని అందులో వివరిస్తారు.
* నీతి సహితంగా రామాయణాన్ని చూసినప్పుడు అందులోని పాత్రలన్నీ ఏదో ఒక నీతిని పరిచయం చేస్తూ కనిపిస్తాయి. విచిత్రమేంటంటే వాల్మీకి తనంతట తాను బోధించినట్లు ఎక్కడా కనిపించదు. కథలో అంతర్లీనంగా పాత్ర పోషణలో భాగంగా ధర్మం ధ్వనిస్తుంటుంది.
* దశరథుడి మరణానికి ముందు భరతుడికి వచ్చిన కల... లంకలో సీతమ్మకు కాపలాగా ఉన్న త్రిజటకు వచ్చిన కలలాంటిది రామాయణంలో స్వప్నశాస్త్ర ప్రస్తావనకు ఉదాహరణ.
వాల్మీకి స్పృశించని శాస్త్రం ఏదీలేదని రామాయణాన్ని చదివితే అర్థమవుతుంది.
- యల్లాప్రగడ మల్లికార్జునరావు
రామాయణం ఓ మంత్రశాస్త్ర నిధి కూడా. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లినప్పుడు బల, అతిబల విద్యలను, మహత్తర అస్త్రాలను ఉపదేశించిన సందర్భంలో మంత్ర వైభవం కళ్లకు కడుతుంది. ఆదిత్య హృదయంలాంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి ఉపదేశించాకే రావణ వధ జరిగింది.