ఆ సొమ్ము నీకొద్దు!
close

తాజా వార్తలు

Published : 10/10/2019 00:36 IST

ఆ సొమ్ము నీకొద్దు!

ఇస్లాం సందేశం

ముహమ్మద్‌ ప్రవక్త (స) మహనీయ శిష్యుగణంలో అబూదుజానా సుప్రసిద్ధులు.

రోజూ తెల్లవారుఝామున జరిగే ఫజర్‌ నమాజులో ప్రవక్త (స) వెనక నిలబడి ప్రార్థన చేసేవారు. నమాజు పూర్తయిన మరుక్షణమే ఎవ్వరినీ కలవకుండా వెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇలా రోజూ వెళ్లడం ప్రవక్త(స)కు ఆశ్చర్యమేసింది. ఒకరోజు నమాజు అయిన వెంటనే వెళ్లబోతుండగా ప్రవక్త (స) ఆయనను అడ్డుకున్నారు. రోజూ ఇంత హడావుడిగా వెళ్లడానికి కారణమేంటని అడిగారు. ‘‘నమాజు తరువాత అల్లాహ్‌ను అర్థించకుండా వెళుతున్నావు; నీకు అల్లాహ్‌తో అవసరాలేమీ లేవా?’’ అని సున్నితంగా మందలిస్తున్నట్లుగా అడిగారు.
‘అల్లాహ్‌ అవసరం  లేకుండా ఒక్క ఘడియ కూడా ఉండలేను’ అని చెప్పారాయన.
‘మరి నమాజు తరువాత అల్లాహ్‌ను అర్థించేందుకు చేతులెత్తి దువా చేయకుండానే వెళ్లిపోతున్నావు?’ మళ్లీ రెట్టించి అడిగారు ప్రవక్త.
‘‘ప్రవక్తా ! నా పొరుగున ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ఆవరణలో ఉన్న ఖర్జూరపు చెట్టు కొమ్మలు ఖర్జూరపు గుత్తులతో మా ఇంటి వైపు వంగి ఉంటాయి. రాత్రి గాలికి కొమ్మల నుంచి ఖర్జూరపు పండ్లు మావైపు రాలిపడతాయి. ఇంట్లో పిల్లలు లేవకముందే ఆ ఖర్జూరాలను ఏరి అతనికి అప్పజెప్పాల్సి ఉంటుంది. పిల్లలు ఖాళీ కడుపుతో నిద్రలేవగానే వాటిని తింటారని భయమేసే ఇలా చేస్తాను. దొంగతనం చేసిన అపరాధంతో అల్లాహ్‌ ముందు సిగ్గుతో తలవంచాల్సి వస్తుందన్నదే నా భయమంతా.’’
మసీదులో ఒక మూలన నిల్చొని ఈ మాటలు వింటున్న ప్రవక్త (స) మరో సహచరుడు హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) ఎంతగానో చలించిపోయారు. వెంటనే అవతలి ఇంటికెళ్లి, ఆ ఇంటి యజమానికి ఖర్జూరపు చెట్టుకు సొమ్ము చెల్లించి దుజానాకు కానుకగా అందించారు. ఆ ఇంటి యజమానికి కూడా దజానా నిజాయతీ గురించి తెలిసి పోయాడు. వెంటనే ప్రవక్త (స) సమక్షంలో చేరి శిష్యుడిగా మారిపోయాడు.
దుజానా నిజాయతీ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. ఇప్పుడు ఎంతో మంది అవతలి వారి సొమ్మును అక్రమంగా కాజేసేందుకు కొత్త మార్గాలను వెతుకున్నారు. ఒకరి సొత్తును, హక్కులను కొల్లగొట్టడం వల్లనే సమాజంలో అశాంతి అలజడులు మితిమీరిపోతున్నాయి. ఎంత డబ్బున్నా మనశ్శాంతి కరవవుతోంది. పరుల సొమ్ము పామువంటిదని ఊరకే అనలేదు.                                        

- ఖైరున్నీసాబేగం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని