close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/10/2019 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీం జగదేక జనయిత్రికి జయవందనం

మంగళవారం దసరా


బలమైన కోరిక... ఇచ్ఛ దాన్ని సాధించాలంటే కావాల్సింది... జ్ఞానం నెరవేర్చుకునేందుకు చేయాల్సింది... క్రియ ఈ మూడింటికీ అధిదేవత మహా శక్తి...ఇచ్ఛ, జ్ఞానం, క్రియల ఫలితమే సృష్టి అంటే సర్వలోకాలూ ఏర్పడడానికి ఆ శక్తే మూలకారణం ఏమి ఉంటే సర్వం ఉందో ఏమి లేకుంటే ఏదీ ఉండదో...అందరి కంటే, అన్నిటికంటే ముందు ఏముందో ఏది లేకున్నా, ఎవరు లేకున్నా ఉండేది ఏదో ఏది సత్యమో ఏది నిత్యమో, ఆ చైతన్యం, ఆ శక్తి... ఆమె
ఆమె...అమ్మ, జగదంబ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆమెను కొలిచే రోజు విజయదశమి


ప్రపంచమంతా శక్తి స్వరూపం. సృష్టిలోని ప్రతి ప్రాణిలో, వస్తువులో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. సూర్యుడికి వెలుగునిచ్చే శక్తి, అగ్నికి వేడినిచ్చే శక్తి, చంద్రుడికి వెన్నెలనిచ్చే శక్తి... వీటన్నిటికీ మూలమైన చైతన్యం మరొకటి ఉంది. అనంతం, అఖండమైన ఆ పరమ శక్తికి ప్రతిరూపమే శ్రీచక్రం. అది జగన్మాత లలితాదేవికి నివాసం.


ప్రతి దేవాలయంలో అక్కడి దేవతామూర్తి మన కంటికి కనిపించే ఆకృతి అయితే, ఆ మూర్తికి శక్తిని ఇచ్చే ప్రధాన వనరు ‘యంత్రం’. దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందుగా ఆ దేవతకు సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ఠించి, దానిపై విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. రామ యంత్రం, శివ యంత్రం, లక్ష్మీ యంత్రం... ఇలా ప్రతి దేవతకు సంబంధించిన మంత్రాలతో ఓ యంత్రం ఉంటుంది. శ్రీచక్రం కూడా ఇలాంటిదే. అయినా ఇతర యంత్రాల కంటే ఎంతో భిన్నమైంది. అనంత శక్తికి అదో కేంద్రం. దుర్గ, కాళి, సరస్వతి, లక్ష్మి.. ఇలా విభిన్నమైన పేర్లతో ఆరాధనలు అందుకునే దేవీశక్తులకు మూలమైన శక్తి లలిత. ఈమె అనంత శక్తి స్వరూపిణి. సృష్టిలో ఉండే చైతన్యమంతా ఈ తల్లి అధీనంలో ఉంటుంది. శ్రీచక్రం ఈమెకు నివాస స్థానం. ఇందులో అగ్రభాగంలో ఉండే ‘బిందువు’పై లలితాదేవి కొలువై ఉంటుందని దేవీ భాగవతం చెబుతోంది.

* అలా అవతరించింది...
శ్రీచక్ర ఆవిర్భావానికి సంబంధించి రెండు పురాణగాథలు ఉన్నాయి. రేణుకా పురాణం ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రేణు మహారాజు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు అమ్మ హోమాగ్ని నుంచి శ్రీచక్రం మధ్యలో ఉన్నట్లుగా సాక్షాత్కరిస్తుంది. రెండో కథ బ్రహ్మాండపురాణంలోని భండాసుర వృత్తాంతంలో ఉంది. భండాసురుని సంహరించాలన్న కోరికతో ఇంద్రుడు శ్రీదేవిని ఉద్దేశించి మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుంచి జ్యోతిరూపంగా అమ్మ శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమవుతుంది. లలితా సహస్రనామాల్లో ‘చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా’ - జగన్మాత చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిందని ఉంటుంది. పురాణగాథల్లో కూడా అమ్మవారు హోమగుండాల మధ్య నుంచి ఆవిర్భవించిందని ఉంది. మొత్తంగా జగన్మాత ‘యజ్ఞస్వరూపిణి’ అని స్పష్టమవుతోంది.


విశిష్ఠ నిర్మాణం
నిర్మాణపరంగా చూస్తే శ్రీచక్రం ఎన్నో విశేషాలతో కూడి ఉంటుంది. ఇతర యంత్రాలకు భిన్నంగా శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది దశలు కనిపిస్తాయి. వీటినే ఆధ్యాత్మికపరంగా నవావరణలు లేదా నవ చక్రాలు అంటారు. త్రిపురతాపినోపనిషత్తు శ్రీచక్ర నిర్మాణం గురించి చెబుతుంది.  
బిందుత్రికోణ వసుకోణ దశారయుగ్మం
మన్వస్రనాగదళ షోడశ సంయుతారం ।
వృత్తత్రయంచ ధరణీ సదన త్రయం చ
శ్రీచక్రరాజముదితం పరదేవతాయాః ।।
శ్రీ చక్రాన్ని పరిశీలిస్తే పైభాగంలో బిందువు కనిపిస్తుంది. ఆ తర్వాత వరుసగా మూడు కోణాలు, ఎనిమిది కోణాలు, పది కోణాల జత, 14 కోణాలు, 16 కోణాలు ఉండే ఆవరణలు, మూడు వృత్తాలు ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధామై ఉంటాయి. ప్రతి ఆవరణకు కచ్చితమైన కొలతలు ఉన్నాయి. ఈ వివరాలు వామకేశ్వర తంత్రంలో ఉన్నాయి.

* శ్రీచక్రంలో ఒకదానితో మరొకటి అనుసంధానించిన తొమ్మిది త్రిభుజాలు చక్రం పైభాగంలో ఉన్న బిందువు కేంద్రంగా ఉంటాయి. వీటిలో నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా, ఐదు త్రిభుజాలు నిమ్న ముఖంగా ఉంటాయి. ఊర్ధ్వముఖంగా ఉండే త్రిభుజాలు పురుషుడికి, నిమ్న త్రిభుజాలు స్త్రీశక్తికి ప్రతీకలు. మొత్తంగా స్త్రీ, పురుష శక్తుల సంయోగమే శ్రీచక్రమనే భావన ఇందులో అంతరార్థంగా కనిపిస్తుంది. అలాగే మొత్తం త్రిభుజాలు ఉన్న కారణంగా ఈ యంత్రానికి నవయోని చక్రం, నవచక్రం అనే పేర్లు కూడా వ్యాప్తిలో ఉన్నాయి.

 


ధర్మ సందేహం
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ప్రత్యేకత ఏమిటి?

శరన్నవరాత్రులలో షష్ఠినాడు గానీ, సప్తమినాడు గానీ మూలా నక్షత్రం ఉంటుంది. ఆ రోజున అమ్మవారిని సరస్వతీ స్వరూపంగా, వాగ్దేవతగా పూజించటం సంప్రదాయం. సమస్త విద్యలకూ మూలమైన తల్లి సరస్వతి. ఆమె మూలా నక్షత్రంనాడు అవతరించిందని విశ్వసిస్తారు. అదే రోజు యాజ్ఞవల్క్య మహర్షి సరస్వతీ దేవిని అర్చించి ఆమె సాక్షాత్కారం పొందాడనీ, ఆ సమయంలోనే మహర్షి నోట సరస్వతీ సహస్రనామ స్తోత్రం ఆవిర్భవించిందనీ దేవీభాగవతం చెబుతోంది. ‘సర్వ శుక్లా సరస్వతీ’ అన్నారు వ్యాస మహర్షి. అంటే తెల్లటి వస్తాల్రు, తెల్లటి పూలతో తెల్లని కాంతితో సరస్వతీదేవి ఉంటుందని అర్థం. తెల్లదనం సత్త్వగుణ సంపదకూ, స్వచ్ఛతకూ సంకేతం. సత్త్వగుణం కలిగి, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటే, విద్యలకు సార్థకత కలుగుతుందని అంతరార్థం. మూలా నక్షత్రంనాడు సరస్వతీదేవిని పూజించటం, విద్యావంతులైన పెద్దలను గౌరవించటం సంప్రదాయం.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి


* రెండు రూపాల్లో...
మనం సాధారణంగా చూసే దేవతా యంత్రాలన్నీ భూప్రస్తార రూపంలో (చతురస్రాకృతి) ఉంటాయి. శ్రీచక్రం మాత్రం భూప్రస్తారంతో పాటు... పొడవు, వెడల్పు, ఎత్తు... మూడు కొలతలతో మేరు ప్రస్తార రూపంలో కూడా ఉంటుంది. పటాల రూపంలో ఉండే శ్రీచక్రాన్ని భూప్రస్తారమని, ఆలయాల్లో అర్చించే రూపాన్ని మేరు ప్రస్తార శ్రీచక్రమనీ అంటారు. ఇటువంటి యంత్ర నిర్మాణం కేవలం మనదేశంలోనే ఉంది.  శ్రీచక్రాన్ని మేరుప్రస్తార రూపంలో చూస్తే మనకు అందులో ఉండే ఆవరణలేవీ విడివిడిగా కనిపించకుండా కేవలం బయటకు వచ్చిన కోణాల ఆకృతులు మాత్రమే కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా ఈ ఆకృతులు ఎన్నో గణిత వైజ్ఞానిక పరమైన అంశాలు అవగతమవుతాయి.

*...అదే శ్రీవిద్య
శ్రీచక్రం పూర్తిగా శక్తిమయం. జగన్మాతకు నివాస స్థానం. శ్రీచక్రానికి చేసే అర్చన విధానాలు, మంత్రాలు, తాంత్రిక విధానాలన్నిటినీ కలిపి శ్రీవిద్య అంటారు. వీటిని పాటించేవారిని శ్రీవిద్యోపాసకులు అంటారు. ఈ ఉపాసన చేసిన వారిలో విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యమహర్షి, కుమారస్వామి, మన్మథుడు, దేవేంద్రుడు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, దూర్వాసమహాముని ప్రముఖులు. అలా చేసినందునే  వీరికి మహోన్నతమైన శక్తి కలిగిందని పురాణాలు చెబుతున్నాయి.

* శ్రీచక్రాన్నే శ్రీయంత్రం అనికూడా అంటారు. ‘శ్రీ’ అంటే సమస్తమైన శుభాలు, సంపదలు అనే అర్థం ఉంది. దీని ప్రకారం సకల సౌభాగ్యాలు శ్రీచక్రార్చన ద్వారా లభిస్తాయని చెప్పుకోవచ్చు. మరో అర్థంలో ‘శ్రీ’ అంటే విష్ణువుతో కూడి ఉన్న లక్ష్మీదేవికి సంకేతం. ‘యం’ ఓంకారానికి ప్రతీక. ‘త్రం’ అనేది దేవతలందరి బీజాక్షర సమగ్ర స్వరూపం. ఈమూడు అక్షరాల సంయోగం ‘శ్రీయంత్రం’ అవుతుంది. కాబట్టి శ్రీచక్రారాధన దేవతలందరినీ ఆరాధించిన ఫలితాన్నిస్తుందనీ విశ్వసిస్తారు.
* అన్ని క్షేత్రాలకూ మూలశక్తి
శ్రీచక్రం అనంతమైన పరమేశ్వరీ శక్తికి ప్రతిరూపం. ఇతర ఆచార వ్యవహారాల్లో శైవ, వైష్ణవ తదితర భేదాలు కనిపించినా శ్రీచక్రం విషయంలో అన్ని సంప్రదాయాలు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నాయి. కలియుగ దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే స్వామికి మరింత ప్రాచుర్యం వచ్చిందని అంటారు.విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి తొలిరోజుల్లో ఉగ్రస్వరూపంతో ఉండేది. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మను శాంతపరిచిన తర్వాతనే కొండకు భక్తుల రాక ఎక్కువైందని చెబుతారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని  త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయం శ్రీచక్రాకృతిలో ఉంటుంది. ఆరాధించే దేవత ఎవరైనా సరే ఈ చక్రాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసే ఆలయాలు మనదేశంలో వేలాదిగా ఉన్నాయి.

* దేహమూ చక్రమే!
మానవదేహం పూర్తిగా శ్రీచక్రభావనతో నిండి ఉంటుందని, ఆధ్యాత్మికసాధనలో ఉన్నతస్థాయికి చేరిన తర్వాత దేహమే శ్రీచక్రమనే అనుభూతి కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ‘అష్టాచక్రా నవద్వారా’ అంటూ మానవశరీరం ఎనిమిది చక్రాలు, నవ (9) ద్వారాలు కలిగిన నిర్మాణమని యజుర్వేదం చెబుతోంది. యోగశాస్త్రపరంగా మానవశరీరôలో ఉండే షట్చక్రాలు, సహస్రారం, లంబికాగ్ర కమలం కలిపి ఎమినిది చక్రాలవుతాయి. శరీరంలో ఉండే నవరంధ్రాలే నవద్వారాలు. శ్రీచక్రంలోనూ అష్టచక్రాలు, నవావరణలు ఉన్నాయి. అంటే మానవదేహమే శ్రీచక్రమనే భావన స్పష్టమవుతోంది. ఈ చక్రం అనంతమైన శక్తికి ప్రతీక. కాబట్టి మానవశరీరమూ అనంతమైన శక్తికి నిలయమని తెలుస్తుంది. తనలో ఉండే అనంతమైన శక్తిని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా మనిషిని చైతన్యపరచడమే ఈ భావనలోని అôతరార్థం.
- కప్పగంతు రామకృష్ణ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.