
తాజా వార్తలు
చల్లని తల్లిని నియమంగా ఆరాధించే నవరాత్రులు వచ్చేశాయి. మరోవైపు ఇంటింటా కోలాహలం నింపే బతుకమ్మ సందడీ మొదలైంది. అన్నీ ప్రసాదించిన అమ్మ.. భక్తితో మనమేం సమర్పించినా స్వీకరిస్తుంది. ఆనందించి బిడ్డలను అనుగ్రహిస్తుంది. నవరాత్రి వేడుకలో ఈ పదార్థాలను అమ్మకు శుచితో నివేదించండి. ఆర్తితో ప్రసాదంగా స్వీకరించండి.
మధురసేవ తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండిని నీళ్లు కొద్దికొద్దిగా చిలకరించుకుంటూ, ఉప్పు వేసి ముద్దలా చేసుకోవాలి. మరోపక్క అడుగు మందంగా ఉండే ఒక పాత్రలో పావుకప్పు నీళ్లు వేసుకుని అందులో పంచదార పోసి పాకం పట్టుకోవాలి. పాకం అయ్యేలోపు.... వేరొక పాత్రలో నూనె పోసి వేడి చేసుకుని, జంతికల కుడకలో సెనగపిండి ముద్దను ఉంచి జంతికలు వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత చిన్నముక్కలుగా చేసుకుని వీటిపై నుంచి పంచదార పాకం పోసుకోవాలి. చల్లారితే మధురసేవ సిద్ధమవుతుంది. |
చిరోటీ తయారీ: ముందుగా ఒక పాత్రలో బొంబాయిరవ్వని తీసుకుని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి ఎక్కడా ఉండల్లేకుండా బాగా కలిపి... తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా తయారుచేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని మరొక పాత్రలో బటర్, బియ్యప్పిండిని పిండిని ఫోర్క్‌తో ఒకదానితో ఒకటి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా మనం చేసిపెట్టుకున్న పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని వాటిని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీ ఒకదాన్ని తీసుకుని దానిపై బటర్, బియ్యప్పిండి మిశ్రమాన్ని రాసుకోవాలి. దానిపై మరో చపాతీని ఉంచి మళ్లీ బటర్, బియ్యప్పిండి మిశ్రమాన్ని మొత్తమంతా విస్తరించేలా రాసుకోవాలి. ఇలా ఐదు చపాతీలతో చేసిన తర్వాత వాటిని రోల్ చేసుకోవాలి. ఈ రోల్‌ని చాకుతో ముక్కలు చేసుకుని ఒక్కో ముక్కని... చిన్న పూరీల్లా చేత్తో ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి. తెల్లగా ఉండగానే దింపుకొని చివర్లో కొద్దిగా పంచదార పొడిని చల్లుకుంటే రుచికరమైన చిరోటీలు సిద్ధమవుతాయి. |
మిరియాల గారెలు తయారీ: మినప్పప్పును రాత్రంతా నానబెట్టుకుని మర్నాడు మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా మినప్పప్పును కాస్త గట్టిగానే రుబ్బుకోవాలి. మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకున్న మినప్పప్పులో మిరియాల పొడి, పెసరపప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టుకుని నూనె పోయాలి. మందపాటి ప్లాస్టిక్ కవర్‌ను నీటితో తడిపి దాని మీద గారెలు చేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో గారెలను వేసి వేయించి తీయాలి. కరకరలాడే మిరియాల వడలను వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. |
గసగసాల పాయసం తయారీ: ముందుగా కడాయిలో గసగసాలు, బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి... నీళ్లు వెయ్యకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, యాలక్కాయ కూడా వేసి తగినన్ని నీళ్లు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో పావుకప్పు నీళ్లు పోసుకుని అందులో పంచదార వేసి మరిగించుకోవాలి. ఈ పాకంలో గసగసాల మిశ్రమం వేసి మళ్లీ మరిగించుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న కడాయిలో నెయ్యి వేసి అందులో జీడిపప్పులని దోరగా బంగారు రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. వీటిని మరుగుతున్న గసగసాల పాయసంపైన వేసుకుని స్టౌ కట్టేయ్యాలి. వేడివేడి గసగసాల పాయసం సిద్ధమవుతుంది. |
కారం గవ్వలు తయారీ: ఒక పాత్రలో బియ్యప్పిండి, మైదా, బొంబాయిరవ్వ అన్నీఒకదానితో ఒకటి బాగా కలుపుకోవాలి. అందులోనే కారం, నాలుగు చెంచాల వేడినూనె, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి చివరిగా వేడినీళ్లతో గట్టిగా చపాతీముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని ఇరవై నిమిషాలపాటు పక్కనపెట్టుకోవాలి. ఈ పిండిని గవ్వల చెక్క ఉంటే దాని మీద బొటనవేలితో ఒత్తాలి. పెద్ద ఫోర్క్ సాయంతో కూడా ఈ గవ్వలని చేసుకోవచ్చు. గవ్వలన్నీ చేయడం పూర్తయిన తర్వాత తక్కువ మంట మీద నూనెలో బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. |
Tags :