close

తాజా వార్తలు

అలలా వచ్చి ఆవేదన మిగిల్చి..!

‘మీ కవితలు, భావాలు చాలా బాగుంటాయండీ’ అని ఎఫ్‌బీలో మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ చూడటం ఆలస్యం అవడంతో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ‘థాంక్స్‌!’ అని రిప్లై పంపా. ప్రతిరోజూ కవిత రాసి పెట్టడం నా అలవాటు. ఆ రోజు కూడా ఒకటి రాసి పోస్ట్‌ చేశా. కొద్ది నిమిషాల్లోనే ‘చక్కగా రాశారు’ అంటూ స్మైలీ ఎమోజీలు జోడించి కామెంట్‌. ఇంతముందు మెసేజ్‌ చేసిన అమ్మాయే తను. తర్వాత వరసగా నా పోస్టులన్నింటికీ లవ్‌ సింబల్స్‌ ఇస్తూ వెళ్లింది. మొత్తం 70 వరకూ ఉంటాయి. అన్నింటికీ లవ్‌ ఎమోజీ ఇచ్చింది. వెంటనే మెసేంజర్‌లో ఒక మెసేజ్‌. ‘మీ కవితలు అంటే నాకు పిచ్చి’ అని. తన నంబర్‌ పంపి ఫోన్‌ చేయమంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత మళ్లీ నా పోస్టులన్నింటికి మెచ్చుకోలు కామెంట్‌లు. తనతో మాట కలపక తప్పలేదు. అయితే, నేను ఫోన్‌ చేయలేదు. నా నంబర్‌ తనకి మెసేజ్‌ పెట్టా. వెంటనే ఫోన్‌ చేసింది.
మొదటిసారైనా ఎలాంటి తడబాటు లేదు. గలగలా మాటల ప్రవాహమే. నేనేమో మితభాషిని. పొడిపొడిగా మాట్లాడా. మాటల మధ్యే ‘మనం కలుద్దామా?’ అంది. ఏంటి ఈ అమ్మాయ్‌ ఇంత ఫాస్ట్‌గా ఉంది. అసలే ఫేస్‌బుక్‌ పరిచయాలు. నమ్మకూడదని నాకు నేను సర్దిచెప్పుకున్నా. కానీ, కలవక తప్పలేదు. మూడు సార్లు బయట కలిశాం. ఎఫ్‌బీ ఫ్రొఫైల్‌ పిక్‌లోలా దేవకన్యలా ఏం లేదు కానీ,  పద్ధతిగానే ఉంది. కలిసినప్పుడు ఎక్కడా హద్దు మీరలేదు. నా మాటలు, అభిప్రాయాల్ని గౌరవించేది. ఓ ఆదివారం ఇందిరా పార్క్‌లో బుక్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది రమ్మన్నాను. నా కంటే ముందే వచ్చేసింది. అక్కడున్న బుక్‌ స్టాళ్లు అన్ని తిరిగాం. అక్షరవనంలో తిరిగినట్టే అనిపించింది. అంతమంది పుస్తక ప్రియుల్ని చూసి ఆనందమేసింది. కొన్ని పుస్తకాలు కొన్నాం. అక్కడే రాత్రయ్యింది. బిజీబిజీగా వెళ్తున్న జనాల మధ్య ఏ మాత్రం తొందర లేకుండా నిదానంగా నడుచుకుంటూ వెళుతున్నాం. తను ఉన్నపళంగా ఆగి బ్యాగులో నుంచి రెండు పుస్తకాలు తీసిచ్చింది. ఆశ్చర్యపోయా. ఆనందంతో.. ‘ఎక్కడ దొరికాయ్‌. ఇవి చాలా చోట్ల వెతికా. ఎక్కడెక్కడో తిరిగా.. ఎలా దొరికాయ్‌’ అని పేజీలు తిరగేస్తున్నా. ‘మనసైన వారి కోసం.. మనసు పెట్టి వెతికితే దొరకనిదంటూ ఉంటుందా?’ అంటూ నా కళ్లలోకి చూసింది. అయోమయంలో ఉన్న నేను ‘థాంక్స్‌’ అన్నా. తను ఏ మాత్రం బెరుకు లేకుండా.. ‘నీ అక్షరాలని, భావాలని ఎంతగా ప్రేమిస్తానో అంతకు మించి నిన్ను ప్రేమిస్తున్నా’ అని సూటిగా చెప్పింది. నేనో క్షణం ఆగి ‘నా గురించి ఏం తెలుసని ప్రేమంటున్నావు. నేను ఇదివరకే ప్రేమలో ఓడిపోయి జీవితంలో చితికిపోయాను. నేనింకా సాధించింది ఏం లేదు. పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు అన్నాను. ‘నీ గురించి అన్నీ తెలుసు. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో అది సాధిస్తావు. నాకు నమ్మకం ఉంది. నువ్వు నాతో ఉంటే చాలు’ అంది. అంతేనా.. గట్టిగా హత్తుకుంది. ఆ క్షణం ఎప్పుడో ఓడిపోయిన.. నా ప్రేమ మళ్లీ గెలిచినట్లనిపించింది. తన మొహన్ని అరచేతుల్లోకి తీసుకున్నా. తన కళ్లలోకి చూస్తూ.. ‘నిజంగానే ప్రేమిస్తున్నావా ఈ పరాజితుడిని’ అని అన్నాను. ‘నన్ను గెలుచుకున్నావుగా ఇంకా పరాజితుడివి ఎందుకు అవుతావు’ అని కౌగిలించుకుంది. నన్ను నా జీవితమే కౌగిలించుకున్నట్టు అనిపించింది.
అది మొదలు.. తనని కలిసిన ప్రతిసారీ ప్రేమలో పడిపోవడం. వదల్లేక వెళ్లిపోవడం. రోజూ ఇదే తంతు. ఇలా రోజులూ.. నెలలు గడిచాయి. తర్వాత కొంచెం బిజీ అయిపోయాం. తనతో నా మాటలు తగ్గాయి. ఇద్దరం కలవడం కూడా తగ్గింది. నాలో ప్రేమ మాత్రం అలానే ఉంది. కానీ, తనలో నేను ఎన్నడూ ఊహించని మార్పు. అన్వేషించే ప్రయత్నం చేశా. కానీ, ఆ లోతు నాకు కానరాలేదు.  ఒక రోజు సడెన్‌గా ఫోన్‌ కలవడం ఆగిపోయింది. తను ఉండే హస్టల్‌కి వెళ్లి అడిగినా లాభం లేకపోయింది. ఫేస్‌బుక్‌ డియాక్టివేట్‌ చేసుకుంది ఎంత ప్రయత్నించినా తన జాడ దొరకలేదు ప్రతీ రోజు ఫోన్‌ కలిపినా కలవదని తెలిసినా రోజూ చేసేవాడిని మరిచిపోలేక రోజూ మేం కలుసుకున్న చోట్లకి వెళ్లి గంటలు గంటలు కూర్చునేవాడిని చాలా రోజుల తర్వాత ఒక రోజు తను బస్టాప్‌లో ఎదురైంది. కానీ అప్పటి అల్లరితనం తనలో కనిపించట్లేదు. ఏదో బాధ్యతను నెత్తికెత్తుకున్న దానిలా పెద్దరికం కనిపిస్తుంది మొహంలో. నీలిరంగు చీరలో ఉంది. ఎందుకు మోసం చేశావని అడగాలనిపించింది. తన కళ్లలో ఏదో పలచని కన్నీటి పొర. తాళి, మెట్టెలు చూసేసరికి ఇన్నాళ్లు దాచుకున్న వేదనంతా కన్నీళ్ల రూపంలో ఉబికి వస్తుంది. అక్కడ క్షణం కూడా నిలబడలేక వచ్చేశాను .దారంతా మసకబారుతుంది. కన్నీళ్లు అడ్డొచ్చాయేమో. అంతే నేను మళ్లీ జీవితంలో ప్రేమించే అవసరం రాలేదు. తను వదిలేసినందుకు కారణాలు తెలుసుకోవాలనిపించలేదు. అప్పుడు నన్ను అక్షరమే ఓదార్చింది. అక్షరం తిరిగి ప్రాణం పోసింది. తన కారణాలు తనకి ఉండవచ్చు కానీ ఆమె మిగిల్చిన గాయం నన్ను వేధిస్తున్నా.. తన ప్రేమ, తనూ ఎప్పటికీ ఒక జ్ఞాపకమే..

 

- సతీష్‌ కామాద్రి..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.