close

తాజా వార్తలు

‘సత్యం’ను కొనేంత గుండె ధైర్యం ఆయనది..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్యానికి ముందు ప్రారంభమై నేటికీ యావత్‌ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. ఒకానొక సమయంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని నష్టాల్లోకి కూరుకుపోతున్న తరుణంలో ఒక వ్యక్తి ప్రతిభాపాటవాలతో కంపెనీ విలువను అమాంతం పెరిగిపోయింది. అది ఎవరో కాదు.. ఆ సంస్థ ప్రస్తుత ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ మహీంద్రా..! ఆయన సినీ రంగంలోకి వెళదామనుకున్నా.. అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.. వారసత్వంగా వచ్చిన విలువల్ని ఏ మాత్రం చేజారనివ్వలేదు. సమకాలీన అంశాలపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు.. ఆలోచింపజేస్తారు. ఓ పిల్లాడి సమయస్ఫూర్తిని ప్రశంసించినా.. ఇడ్లీ బామ్మకు సాయం చేసినా.. చేతుల్లేని చిన్నారి కష్టాన్ని చూసి భావోద్వేగానికి గురయినా.. ‘ఆ కారు షాకిస్తుంది’ అంటూ అభిమానులకు పంచ్‌ ఇచ్చినా అది ఆయనకే చెల్లింది. తీరికలేని షెడ్యూల్‌లోనూ సామాజిక అంశాలకు సమయం వెచ్చించే ఆనంద్‌ మహీంద్రా జీవిత విశేషాలను ఓసారి చూద్దామా..

ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ..
మహీంద్రా కుటుంబంలో మూడో తరానికి చెందిన ఆనంద్‌ 1955, మేడే రోజు ముంబయిలో జన్మించారు. యాదృచ్ఛికమే అయినా తన జన్మదినాన్ని సార్థకం చేస్తూ కష్టాల్లో ఉన్న సత్యం కంపెనీని కొని కొన్నివేల మంది ఐటీ ఉద్యోగుల జీవితాలను కాపాడారు. 
నేడు ఆయన గ్రూపు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. తన ప్రాథమిక విద్యాభ్యాసం ముంబయిలోనే సాగింది. అనంతరం కుటుంబ అభిరుచులకు భిన్నంగా ఫిల్మ్‌ మేకింగ్‌లో ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశారు. దీనికి తల్లిదండ్రులు హరీశ్‌ , ఇందిరా మహీంద్రా సైతం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. కుటుంబంలో ఎవరూ వ్యాపార పగ్గాలు చేపట్టడానికి ఆసక్తి చూపకపోవడంతో ఇక ఆనంద్‌ మహీంద్రానే ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే తనని తాను ‘యాక్సిడెంటల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా ఆనంద్‌ చెప్పుకుంటారు.  

అసిస్టెంట్‌ ఉద్యోగంతో ప్రారంభం..

 అప్పటికే భారత్‌లో అగ్రగామి కంపెనీగా ఎదిగిన మహీంద్రాలో చిన్న ఉద్యోగిగానే ఆనంద్‌ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలుత మహీంద్రా యుగీన్‌ స్టీల్‌ కంపెనీలో ఫినాన్స్‌ డైరెక్టర్‌కి ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ హోదాలో చేరారు. అలా అనుభవం గడిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, 1997లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, 2001లో వైస్‌ ఛైర్మన్‌గా, 2012లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థలో ఉద్యోగులు, కార్మికుల కష్టనష్టాలు తెలుసుకోవడం క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడే సాధ్యమని ఆయన బలంగా నమ్ముతారు. అందుకే ఉద్యోగిగా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. 

కమ్యూనిస్టు పార్టీలో చేరేవారే కానీ..
స్కూల్‌ రోజుల్లో ఆనంద్‌లో అభ్యుదయ భావాలు ఉండేవి. ప్రతి విషయాన్ని ప్రశ్నించేవారు. ఈ క్రమంలో మానవ మనుగడ, తత్వశాస్త్రానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివేశారు. ఈ భావాలతో ఓ సందర్భంలో దాదాపు కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరదామనుకున్నారట. కానీ.. అదే సమయంలో హార్వర్డ్‌కి వెళ్లడంతో తన దృష్టంతా సినిమా మేకింగ్‌పై మళ్లిందని స్వయంగా ఆనంద్‌ మహీంద్రానే ఓ సందర్భంలో వెల్లడించారు. 

కుంభమేళాపై సినిమా..
ఆనంద్‌కి సినిమా రంగంపై చాలా ఆసక్తి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకునే కుంభమేళాపై సినిమా కూడా తీశారు. ఇప్పటికీ ఫొటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి. ఖాళీ సమయాల్లో ప్రకృతిని తన కెమెరాల్లో బంధిస్తూ ఉంటారట. ఆనంద్‌కి బ్లూస్‌ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన బ్లూస్‌ సంగీతకారులతో ‘మహీంద్రా బ్ల్యూస్‌ ఫెస్టివల్‌’ పేరిట ప్రతి ఏటా ముంబయిలో పెద్ద షో నిర్వహిస్తారు.

సెయిలింగ్‌ అంటే మహా సరదా...
ఆనంద్‌ మహీంద్రా స్పోర్ట్స్‌ ఆడటంలోనూ దిట్ట. టెన్నిస్‌, సెయిలింగ్‌ అంటే మహా సరదా. చిన్నప్పుడు ప్రశ్నించే తత్వంతో ప్రారంభించిన పుస్తక పఠనాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన సతీమణి అనురాధ మహీంద్రా ఓ జర్నలిస్ట్‌. లైఫ్‌స్టైల్‌ మ్యాగజిన్ అయిన ‘వర్వ్‌’కి ఆమె సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.

సాహసోపేత కొనుగోళ్లు..

 కార్పొరేట్‌ రంగంలో కంపెనీల కొనుగోళ్లు అంటే కత్తిమీద సామే. ఎందుకంటే.. కొనుగోలు చేసిన కంపెనీకి ఉండే లాభనష్టాలు రెండూ యాజమాన్య కంపెనీకి సంక్రమిస్తాయి. గ్రూపులోకి వచ్చిన కొత్త కంపెనీ వ్యాపారశైలి సరిగాలేకపోతే.. దానిని కొన్న కంపెనీపై ప్రతికూల ప్రభావం పడి అదికూడా నష్టాల బాటపడుతుంది. దీనికి కింగ్‌ఫిషర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి దిగ్గజ సంస్థలే ఉదాహరణ. కానీ, ఆనంద్‌ మహీంద్రా మాత్రం కంపెనీల కొనుగోళ్ల కింగ్‌గా భారత కార్పొరేట్‌ రంగంలో నిలిచారు.  1991లో లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థకు స్వస్తి పలికిన తర్వాత మహీంద్రా కంపెనీ స్వరూపమే మారిపోయింది. స్టీల్‌, జీప్‌ల తయారీకే పరిమితం కాకుండా అనేక రంగాల్లోకి ప్రవేశించింది. అయినా 21వ శతాబ్దం ఆరంభంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. షేర్ల విలువ అమాంతం పడిపోయింది. ఆ సమయంలో ఆనంద్‌ చూపిన తెగువ, ఆయన నమ్మకం మహీంద్రాను తిరుగులేని సామ్రాజ్యంగా మార్చింది. స్కార్పియో తన కంపెనీని నిలబెడుతుందని బలంగా నమ్మారు. అనుకున్నట్లే విజయం సాధించారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టీల్‌, జీప్‌ మేకింగ్‌ నుంచి ఏరోస్పేస్‌, వ్యవసాయ రంగ పరికరాల బిజినెస్‌, ఐటీ, ఇంధన, ఆర్థిక, హాస్పిటాలిటీ ఇలా అనేక రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈ క్రమంలో అనేక కంపెనీలను స్వాధీనం చేసుకున్నారు. భారీ కుంభకోణంలో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్‌ని కొనుగోలు చేయడం ఆనంద్‌ సాహసానికి నిదర్శనం. నిండా కేసుల్లో కూరుకుపోయిన కంపెనీని మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చారు. వేలకొద్దీ ఐటీ ఉద్యోగుల జీవితాలను నిలిపారు. ఇప్పుడు టెక్‌ మహీంద్రా పేరిట తిరుగులేని ఐటీ శక్తిగా మార్చారు. ఇలా ఏరోస్పేస్‌, అగ్రిబిజినెస్, ఆటో రంగంలోని అనేక కంపెనీలను సొంత చేసుకొని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ అక్విజిషన్‌ల పరంపర ఆనంద్‌ వచ్చిన తర్వాతే ఊపందుకోవడం ఆయన తెగువ, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.

సామాజిక బాధ్యతగా..

‘నన్హీ కలీ’ పేరిట ఆనంద్‌ ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. దీని ద్వారా ఆర్థికంగా వెనకబడిన బాలికలకు ఉచిత విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 70వేల మంది బాలికలు దీని ద్వారా లబ్ధిపొందుతున్నారు. ‘నాంది’ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా తాగునీరందించే కార్యక్రమంలోనూ ఆయన భాగస్వాములయ్యారు. 

నంద్‌ మహీంద్రాకు వారసత్వాలపై నమ్మకంలేదు. అందుకే ఆయన కూడా వారసుడిగా తొలుత వ్యాపారరంగంలోకి రావాలనుకోలేదు. ఇప్పుడు తన కుమార్తెల విషయంలోనూ అదే పాటిస్తున్నారు. ఆయనకు దివ్య, ఆలికా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వారికి తమ గమ్యాలను ఎంచుకునే స్వేచ్ఛను ఆయనిచ్చారు. వారు ఇప్పుడు తల్లితో కలిసి ఒక లైఫ్‌స్టైల్‌ పత్రిక నిర్వహణలో బిజీగా ఉన్నారు. మహీంద్రా సంస్థని ఎప్పుడూ ఓ కుటుంబానికి చెందిన కంపెనీగా తాను చూడలేదంటారాయన. అందుకే ప్రజలు తమపై నమ్మకాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటారు. ఇక చివరగా యువకులు హెచ్‌బీఎస్‌ సూత్రాన్ని పాటించాలని సూచిస్తుంటారు. హెచ్‌-హ్యుమిలిటీ (HUMILITY), బి-బ్రెవిటీ(BREVITY), ఎస్‌-సెల్ఫ్‌ అవేర్‌నెస్‌(SELF AWARENESS). ఈ మూడింటిని ఎవరూ బోధించరని.. ఓ వ్యక్తి తనకి తాను తెలుసుకోవాల్సిన అంశాలంటారాయన. ఇదీ మానవత్వం మూర్తీభవించిన ఓ ఆనందుడి సంక్షిప్త విజయగాథ.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.