close

తాజా వార్తలు

పబ్‌జీరోలు అవ్వొద్దు

బోర్డర్‌ దాటారేమో.. ‘లెట్స్‌ చెక్‌’

‘రోజులో కాసేపేగా ఆడేది.. అదీ రిలాక్స్‌ కోసమే!’ అనుకునే ఆన్‌లైన్‌ గేమ్‌ జోన్‌లోకి ఎంటర్‌ అవుతారు ఎవరైనా. తర్వాతే నిమిషాలు గంటలవుతాయి. ఎంబీల్లో డేటా జీబీల్లోకి చేరిపోతుంది. ధ్యాస మొత్తం ఆటపైనే. బోర్డర్‌ దాటేస్తారు. బానిసై పోతారు. ఒకసారి చెక్‌ చేసుకోండి. మీరేమైనా బోర్డర్‌ దాటారేమో..
* ప్రవర్తనలో మార్పులు వస్తాయి. సున్నితంగా మాట్లాడే వారు కాస్తా కర్కశంగా స్పందిస్తుంటారు. ఏ చిన్న పని చెప్పినా విసుక్కుంటారు.
* ఎంత ముఖ్యమైన పని చేస్తున్నా గేమే గుర్తుకొస్తుంది. పరీక్ష హాలులో కూర్చుని కూడా అదే ఆలోచిస్తారు. ‘గేమ్‌లో అటు వెళ్లకుండా ఉంటే లైఫ్‌ ఉండేది.. రాత్రికి ఏది ఏమైనా ఫ్రెండ్స్‌ నలుగురం ఆడాలి..’ అని ఒకటే ఆలోచిస్తుంటారు.
* అన్నింటిలోనూ చురుకుగా పాల్గొనే మీరు ఒక్కొక్క దాంట్లో వెనకబడిపోతారు. కాలేజీలో జరిగే ఈవెంట్‌లు మొదలు ఇంట్లో జరిగే శుభకార్యాలు ఏవీ మీకు కిక్‌ అనిపించవు. ఒక్క పబ్‌జీ తప్ప.
* నిద్ర లేమితో బాధపడతారు. ఎప్పుడంటే అప్పుడు నిద్ర.. తరగతి గదిలో కునికిపాట్లు. ఎప్పుడూ బద్ధకంగా అనిపిస్తుంది.
* కళ్లు ఎర్రగా మారి తలనొప్పి వస్తుంది. ముఖం నిస్సారంగా మారుతుంది.
* చదువుపై ఆసక్తి తగ్గి, జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. ఏది చదువుతున్నా పబ్‌జీ పేరు, దాంట్లోని గ్రాఫిక్స్‌ గుర్తుకొస్తుంటాయి.
* బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారు. పబ్‌జీలో ఉన్న గ్రూపుతో కాకుండా మరెవ్వరితోనూ మాట కలపలేరు.

బానిసవ్వొద్దు.. ‘లెట్స్‌ బ్రేక్‌’

బ్‌జీ కావచ్చు. ఇంకేదైనా గేమ్‌ అయ్యుండొచ్చు. ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఏ మేరకు వినోదాన్ని పొందుతున్నాం? అనేది ఎప్పటికప్పుడు ఆలోచించాలి. ఒకవేళ హద్దు దాటేస్తున్నాం అనిపిస్తే గేమింగ్‌ వ్యసనాన్ని బ్రేక్‌ చేయాల్సిందే.
* మీవైన ఆసక్తులపై ధ్యాస మరల్చండి. పెయింటింగ్‌ వేయొచ్చు. వంట గదిలోకి వెళ్లి అమ్మకి సాయం చేయొచ్చు. మిత్రులతో అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడొచ్చు.
* కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపండి. ఫ్రెండ్స్‌తో కబుర్లు గేమింగ్‌పై ధ్యాస పోనివ్వదు.
* దేనికెంత సమయం కేటాయిస్తున్నారో ట్రాక్‌ చేయండి. ముఖ్యమైన వాటికి ఎక్కువ టైమ్‌ ఇవ్వండి. అప్పుడు గేమింగ్‌కి ప్రాధాన్యం ఎక్కడో చివర్లో ఉంటుంది.
* గేమ్‌ గురించి ఎక్కడా మాట్లాడొద్దు. ఫ్రెండ్స్‌ మధ్య కూడా పబ్‌జీ ఊసే లేకుండా జాగ్రత్త పడాలి.
* విశ్రాంతి కోసమే ఆటలు. అంతేగానీ.. ఆటే జీవితం కాదు. సమయం పోతే తిరిగి రాదు.
* ఆటవిడుపు ఆహ్లాదకరంగా ఉండాలి. హింసాత్మక ఆలోచనలతో హద్దులు దాటేద్దాం అనుకుంటే పబ్‌జీతో ప్రమాదమే.
* చదువు, ఉద్యోగంలో కొత్త లక్ష్యాల్ని పెట్టుకుని వాటిపైనే దృష్టి పెట్టాలి.
* యూట్యూబ్‌, సోషల్‌ మీడియా.. నెట్టింట్లో ఏ వేదికపైనా పబ్‌జీకి సంబంధించిన వీడియోలు, అప్‌డేట్స్‌ కనిపించకుండా తగిన చర్యలు చేపట్టండి.
* పక్కింటి తలుపులు బాది ‘రక్తం కావాలి.. ప్లీజ్‌ నన్ను బతికించండి!’ అంటూ వెర్రిగా ప్రవర్తించడం..
* దుప్పటి ముసుగులో ‘వెసేయ్‌ వాణ్ణి.. చంపెయ్‌!’ అంటూ కసిగా అరవడం..
* ‘డేటా ప్యాక్‌ రీఛార్జ్‌ చెయ్యకపోతే.. నేను చస్తా’ అంటూ బెదిరించడం..
* వీధుల్లో, స్కూలు, కాలేజీల్లో పిచ్చిగా పరుగులు తీయడం..
* ఏంటిదని అడిగిన పోలీసుల ఎదుటే నియంత్రణ కోల్పోయి బిత్తర చూపులు చూడడం..
చివరికి.. తండ్రి ఫోన్‌ లాక్కున్నాడని తల్లిని గదిలో పెట్టి తాళం వేసి.. తండ్రిని ముక్కలుగా నరికి చంపేయడం.. ఇంజినీరింగ్‌ పట్టా అందుకోవాల్సిన చేతులకు బేడీలు పడి జైలుకి వెళ్లడం.. ఇదంతా కొన్ని రోజుల ముందు చోటు చేసుకున్న దుర్ఘటన. దీంట్లో నిందితుడు కర్ణాటకకి చెందిన రఘువీర్‌ అయితే.. నిందితున్ని చేసింది ఎవరో తెలుసా? పబ్‌జీ గేమ్‌!!
అందమైన భవిష్యత్తు వైపు దూసుకెళ్లాల్సిన యువత ఇలా అంగుళాల తెరపై వినాశనానికి చేరువవుతోంది. ఎందుకు? ఏం సాధించడానికి?మేలుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది.  లేదంటే.. మీరో రఘువీర్‌ అయితే.. మిమ్మల్ని నిందితుడిని చేసే విలన్‌లా పబ్‌జీ అయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. జరసోచో.. మిలీనియల్స్‌.

సున్నితమైన మనసులు.. ‘బీ సెన్సిబుల్‌’

డిజిటల్‌ ఇండియా.. డేటా ప్యాక్‌లు.. సోషల్‌ మీడియా.. ఆన్‌లైన్‌ గేమ్‌ల నుంచి యువతని దూరం చేయలేని నెట్టిల్లిది. వాస్తవానికి దూరం చేయాలనుకోవడం కూడా తప్పే. నిశిత పరిశీలనతో నిత్యం మానిటర్‌ చేస్తూ నెట్టింట్లో పాజిటివ్‌గా ఎదిగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు ఆధారంగా వారికి ఎలాంటి సర్వీసుల్ని దగ్గర చేస్తే బాగుంటుందో వాటినే అందుబాటులో ఉంచాలి. అదీ రోజులో నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. వారి వెబ్‌ హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఏయే సైట్‌లు, సర్వీసుల్ని చూస్తున్నారో గమనిస్తుండాలి. ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీ.. వాడేది ఏదైనా పేరెంటల్‌ కంట్రోల్స్‌తోనే టీన్స్‌కి యాక్సెస్‌ ఇవ్వాలి. ప్రవర్తనలో ఏవైనా అసహజమైన మార్పులు వస్తున్నాయేమో చెక్‌ చేయాలి. ముభావంగా ఉండడం.. ప్రోగ్రెస్‌ అసాధారణంగా పడిపోవడం.. ఇష్టమైన అలవాట్లను వదిలేయడం.. లాంటివి గమనిస్తే జాగ్రత్త పడాలి. మితిమీరి గేమ్స్‌ ఆడుతున్నట్లు అనిపిస్తే సున్నితంగా వారితో చర్చించాలి. స్నేహపూరితంగా వ్యవహరిస్తూ మానసిక స్థితిని అర్థం చేసుకుని సూచనలు ఇవ్వాలి. పిల్లల ముందు ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి. అంతేకాదు.. వారి ముందు గేమ్స్‌ ఆడకపోవడం మంచిది. హింసతో కూడుకున్న గేమ్స్‌ ఆడడం వల్ల మానసికంగా వచ్చే ఇబ్బందుల్ని వారితోనే చర్చించాలి. ఏయే గేమ్‌లు ప్రమాదకరమైనవో వారికి విడమర్చి చెప్పాలి. అప్పుడే వయసుకి వచ్చిన టీన్స్‌ బాధ్యతతో మసులుకుంటారు. 

వారంలో ఓ రోజు.. ‘డిజిటల్‌ డిటాక్స్‌ డే’

న్నింటికీ ఓ ప్రత్యేక దినాన్ని జరుపుకున్నట్టుగానే డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా వారంలో ఓ ‘డే’ని ప్లాన్‌ చేసుకోవాలి. దానికి అలవాటు పడేందుకు ముందుగా.. రోజులో ఉదయం, సాయంత్రం ఓ గంట పాటు ‘ఫ్రీజోన్స్‌’ని పెట్టుకోవాలి. ఆ గంట సమయం అన్నింటినీ మ్యూట్‌లో పెట్టేయాలి. నెట్టింట్లో బ్రౌజ్‌ చేయడం మానేసి నట్టింట్లో సరదాగా గడపాలి. వాట్సాప్‌ ముచ్చట్లు ఆపేసి వాకిట్లో నలుగురు పోగయ్యేలా చూడాలి. కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవచ్చు. మ్యూజిక్‌, డ్యాన్స్‌... మనసుకి హాయి కలిగించేది ఏదైనా సాధన చేయొచ్చు. చుట్టూ ఉన్న సమాజాన్ని గూగుల్‌ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాలి. డిటాక్స్‌ డేకి పుస్తక పఠనం మరో ఆప్షన్‌. పెంపుడు జంతువులు ఉంటే వాటితో గడపొచ్చు. మదిలో పాజిటివ్‌ ఆలోచనల్ని ప్రేరేపించేందుకు గ్రాటిట్యూడ్‌ జర్నల్‌ని రాయొచ్చు. రోజులో మీకెవరు కృతజ్ఞ్ఞులో, ఎందుకు కృతజ్ఞులో రాయండి. ‘థింక్‌ పాజిటివ్‌.. బీ పాజిటివ్‌.. యాక్ట్‌ పాజిటివ్‌’ ఫార్ములాని ఫాలో అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా వారంలో ఒక రోజుని డిజిటల్‌ డిటాక్స్‌ డేగా జరుపుకోవచ్చు.. ఈ ఛాలెంజ్‌కి మీరు సిద్దమా?

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.