close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/09/2019 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాభిలోంచి సృష్టిఅనంత వరాల వృష్టి!

నేడు అనంత చతుర్దశి

యద్భావం తద్భవతి...

భగవంతుడు నిర్వికారుడు.

ఎలా భావిస్తే అలా కనిపిస్తాడు.

భగవంతుణ్ణి నిర్వచించాల్సి వస్తే సత్యం, జ్ఞానం, అనంతం అని వ్యాఖ్యానిస్తుంది సనాతన ధర్మం. ఒక లక్ష్యంతో దాల్చేది అవతారం. భక్తుల కోరిక, ఆరాధనల మేరకు ఇచ్చేది దర్శనం. అనంత పద్మనాభుడిది అవతారం కాదు దర్శనం. పద్నాలుగు లోకాలకు ఆదిమూలం, బ్రహ్మకు మూలధారం శ్రీమహావిష్ణువు అని విస్పష్టం చేసే విశిష్టమూర్తి పద్మనాభుడు. ఈ దివ్యమంగళ రూపాన్ని కాల స్వరూపంగానూ వర్ణిస్తారు. ఆద్యంతరహితమైన కాలానికి ఆయన దర్శనం ఓ చిహ్నంగా చెబుతారు. కాలగర్భంలోంచి వచ్చిన సర్వసృష్టికీ సంకేతమే నాభి కమలంలోని బ్రహ్మరూపమని వివరిస్తారు. ఆయన చేయి వద్ద ఉన్న శివలింగం హరిహరుల మధ్య అభేదాన్ని సూచిస్తుంది. ఆ స్వామి ఎంత అద్భుత మూర్తో, ఆయన కొలువైన తిరువనంతపురం అంతే ప్రత్యేకమైన దివ్యక్షేత్రం...

నంత పద్మనాభస్వామి కొలువుదీరిన పుణ్యస్థలి తిరువనంతపురం. శ్రీవైష్ణవులు ప్రవచించే 108 దివ్యదేశాల్లో ఒకటైన ఈ క్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ప్రస్తుతం మనకు దర్శనమిస్తున్న ఈ అనంత పద్మనాభస్వామి రూపం ఆది నుంచి ఇలా సాలగ్రామాలతో కూడింది కాదు. మొదట కలపతో రూపుదిద్దుకున్న పద్మనాభుడిని భక్తులు ఆరాధిస్తూ ఉండేవారు. 1686లో ఈ మందిరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ జ్వాలలకు ఆలయం దగ్ధమైంది. ఆశ్చర్యకరంగా మూలవిరాట్టుకు ఏ హానీ జరగలేదు. అప్పుడు మార్తాండవర్మ అనే రాజు ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడు. మూలవిరాట్టుకు రూపాన్నివ్వడానికి స్థపతులు, శిల్పశాస్త్ర నిపుణులు ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి పన్నెండు వందల సాలగ్రామాలను సేకరించారు. వాటన్నిటితో అనంతపద్మనాభుని మూలవిరాట్టును రూపొందించి ప్రతిష్ఠించారు. అన్ని శిలలను కలిపి తయారు చేసినట్లుగా కాకుండా ఏకశిలలా దర్శనమివ్వడం ఇక్కడి విగ్రహం ప్రత్యేకత.●

పూర్వం బిళ్వమంగళ స్వామి అనే సాధువు తిరువనంతపురం పరిసరాల్లో దివ్య లక్షణాలున్న శిలలను అర్చిస్తూ ఉండేవాడు. ఆయన ఆ సాలగ్రామాలన్నిటినీ ఓ దగ్గర కూర్చి, నిరంతరం పాలకడలిలో పవళించిన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయన అలా ధ్యానమగ్నుడు కాగానే, ఓ బాలుడు వచ్చి వాటిని చిందరవందర చేసి వెళుతుండేవాడు. బిళ్వమంగళుడు ఓ రోజు సహనం కోల్పోయి ఆ బాలుడిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడా బాలుడు ‘అనంతన్‌కాడు (అరణ్యానికి) రా’ అంటూ పరుగుపెట్టాడు. బిళ్వమంగళుడికి దొరక్కుండా పరుగుతీసిన ఆ పిల్లాడు ఇల్లుప అనే వృక్షం చాటుకు వెళ్లి మాయమయ్యాడు. ఆ చెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది. దాని మూలాల్లోంచి సాధువుకు పెరుమాళ్లు దర్శనమైంది. స్వామి చతుర్భుజాలతో, శంఖుచక్రధారిగా, శయనమూర్తిగా దర్శమిచ్చారు. అనంతరం ఆ వృక్షంతోనే అనంత పద్మనాభుని విగ్రహాన్ని మలిచారు. బిళ్వమంగళుడు ఆ అడవిలోనే దొరికే మామిడి పండ్ల ముక్కలకు ఉప్పు అద్ది, గంజితో కలిపి, కొబ్బరి చిప్పలో పెట్టి స్వామికి నైవేద్యంగా అర్పించేవాడు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.●

తిరువనంతపురాన్ని పాలించిన ట్రావెన్‌కోర్‌ మహారాజులు అనంత పద్మనాభస్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. 1750 జనవరిలో ఈ మహారాజులు తమ రాజ్యాన్ని, సంపదలను స్వామికి సమర్పించారు. తాము స్వామికి శరణాగతులమని, దాసులమని ప్రకటించుకున్నారు. ఆ దేవదేవునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే భోజనం చేయడం మహారాజుల ఆనవాయితీ. ●

నిధులు, నిక్షేపాలు ఉండి ఆరు నేల మాళిగలతో ఉన్న ఆలయమిది. దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి నేలమాళిగలు కనుక్కోలేదు. ఆలయంలోని మూడు ద్వారాలనుంచి చూస్తేనే పద్మనాభస్వామి మూలవిరాట్టును సంపూర్ణంగా దర్శనం చేసుకోవచ్ఛు ఒక ద్వారం నుంచి వెళితే ముఖం, మరో ద్వారం నుంచి నాభి, మూడో ద్వారం నుంచి పాదపద్మాలు తిలకించొచ్ఛు ●

అనంత పద్మనాభస్వామికి మీన మాసంలో (మార్చి, ఏప్రిల్‌) ఒకసారి, తులామాసం (సెప్టెంబరు, అక్టోబరు)లో రెండోసారి ఘనంగా పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. పదో రోజు ‘వేట వేడుక’ జరుగుతుంది. ఇందులో స్వామి స్వయంగా వచ్చి రాక్షసులను సంహరిస్తాడని నమ్మకం. అందుకే ఈ వేట ఉత్సవం జరిగేటప్పుడు అక్కడ పూర్తిగా నిశ్శబ్దం అలముకుంటుంది. రాక్షసులకు చిహ్నంగా మూడు కొబ్బరి కాయలను ఉంచి, ట్రావెన్‌కోర్‌ మహారాజు పద్మనాభుడి ప్రతినిధిగా బాణాలతో వాటిని పగలగొడతాడు.

అచ్చం అలాగే...

గోవిందరాజులు స్వామి: తిరుపతిలోని గోవిందరాజస్వామి కూడా శయనమూర్తిగానే పూజలందుకుంటారు. చోళరాజులు చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో విధ్వంసం సృష్టించినప్పుడు అర్చకులు ఈ విగ్రహాన్ని తిరుపతి చేర్చారని చెబుతారు. రామానుజాచార్యులు ఆలయాన్ని నిర్మించారు.●

శ్రీరంగనాథుడు: కావేరీ తీరాన కొలువుతీరిన కరుణాంతరంగుడు శ్రీరంగనాథుడు. ఈ మూర్తిని శ్రీరామచంద్రుడు విభీషణుడికిచ్చాడని చెబుతారు. స్వామి ప్రస్తావన బ్రహ్మాండపురాణం, వాల్మీకి రామాయణంలో ఉంది. ఉభయ కావేరులుగా పిలిచే కావేరి, కొల్లాడం నదుల మధ్య పగడాల దీవిలాంటి శ్రీరంగంలో స్వామి పూజలందుకుంటున్నారు.●

ఆదికేశవస్వామి, తిరువట్టారు: తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ క్షేత్రం ఉంది. తిరువనంతపురం కన్నా పురాతన ఆలయమిది. దీనికి పన్నెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆదికేశవస్వామి పశ్చిమ దిశగా ముఖం కలిగి భుజంగశయనుడై దర్శనమిస్తాడు. ఆదికేశవస్వామిని పద్మనాభుడికి సోదరుడని నమ్ముతారు.●

శ్రీస్థల శయన పెరుమాళ్‌: చెన్నై సమీపంలోని మహాబలిపురంలో స్థలశయన పెరుమాళ్‌ కొలువుదీరి ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు పుండరీక మహర్షి భక్తికి మెచ్చి శేష శయనుడై వెలిశాడని చెబుతారు.

విశేషాల వ్రతం●

పద్మనాభుడు ఎంత విశేష మూర్తో, అనంత చతుర్దశి వ్రతం కూడా అంత విశిష్టమైంది. దీనికి కామ్యవ్రతం అని కూడా పేరు. పద్నాలుగు సంవత్సరాల పాటు ఏటా అనంత చతుర్దశినాడు ఆ వ్రతం చేసిన కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని భక్తుల నమ్మకం. దీన్ని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. శ్రీ కృష్ణభగవానుడు ఈ వ్రత విశేషాలను వివరించారని చెబుతారు. పద్నాలుగు భువనాలకు అధిపతి అయినందునే ఆ దివ్యమూర్తి వ్రతాన్ని అన్నేళ్లు నిర్వహించాలంటారు. వ్రతానికి సూచికగా పసుపు, కుంకుమలతో కలిపిన దారాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. పద్నాలుగు దారపు పోగులతో కూడిన ఈ సూత్రాన్ని కంకణంగా కట్టుకుని అనంత పద్మనాభుని పూజిస్తారు. ఆ కంకణాలను ధరిస్తే దాంపత్యపరమైన కలహాలు సమసిపోతాయని విశ్వాసం.

- సైదులు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.