close

తాజా వార్తలు

ఫిట్‌ ఇండియా ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

ఒకప్పుడు తెల్లవారిని తరిమేందుకు..క్విట్‌ ఇండియా.. క్విట్‌ ఇండియా అన్నాం! ఇప్పుడు మనలోని అలసత్వాన్ని తరిమేందుకు ఫిట్‌ ఇండియా... ఫిట్‌ ఇండియా.. అనే టైమ్‌ వచ్చింది. అదీ ఓ ఉద్యమంలా! జాగో యువతా అంటూ ప్రధాని మోదీనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మరి, ఎందుకు ఆలస్యం? ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’లో చురుకుగా ముందడుగు వేసేందుకు మీరు సిద్ధమా?


మామ.. ఏది ఏమైనా పొట్ట కరిగించి సిక్స్‌ ప్యాక్‌ చేయాల్రా!


దేవ్‌డా.. ఏది తిన్నా. అక్కడికే వచ్చి చేరుతోంది. మోడ్రన్‌ దుస్తులు ధరించడం కుదరడం లేదు. ఎలాగైనా సన్నబడాలి.


జిమ్‌కి వెళ్లి కండలు పెంచడం మన వల్ల కాదుగానీ.. యోగా చేసి శరీరం, మనసుని మన నియంత్రణలో ఉంచుకోవాలి.


.. ఇలా ఫిట్‌నెస్‌పై కొత్తసంవత్సరానికో, పుట్టిన రోజు నాడో అనేక రిజల్యూషన్స్‌ ఎప్పటికప్పుడు తీసుకుంటాం. వారం.. పది రోజులు శ్రద్ధగా చేస్తాం. తర్వాత మళ్లీ మామూలే. ఫిట్‌నెస్‌ కథ కంచికి.. మన జీవనశైలి రొటీన్‌కి వచ్చేస్తుంది. ఈ కోవలోకి వచ్చే యువత శాతం ఎంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అలసత్వం నుంచి బయట పడాలంటే ఫిట్‌నెస్‌ని ఓ ఉద్యమంలా స్వీకరించాల్సిందే. అందుకు మానసికంగా సిద్ధం కావాలి. మనం ఫిట్‌గా ఉన్నప్పుడే దేశం దృఢంగా ఉంటుందని పీఎం చెప్పిన సూచనని నిజం చేయాలి. అంతటి సంకల్పాన్ని స్వీకరించాలంటే ఎలా? చదువు, ఉద్యోగం.. దేంట్లో నిమగ్నమై ఉన్నా ఫిట్‌నెస్‌ని దాంట్లో భాగం అయ్యేలా చేసేందుకు ఏం చేయాలి? ఐఫోన్‌ని కాసేపు పక్కన పెట్టి మీలో ‘ఐ’పై ఫోకస్‌ చేయండి. రోజూ మిమ్మల్ని మీరే ఛార్జ్‌ చేసుకోండి. అప్పుడే.. ఆరోగ్యమనే అయాన్‌ దృఢంగా పని చేస్తుంది. పంచేంద్రియాల ఓఎస్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. 


‘ఛార్జ్‌’ చేయండి..
ఐఫోన్‌ అయినా.. ఆండ్రాయిడైనా.. లేవగానే ఫోన్‌ నోటిఫికేషన్స్‌ చెక్‌ చేయడం. వెంటనే ఛార్జింగ్‌ పెట్టేయడం. రోజూ క్రమం తప్పకుండా చేసే పని. ఎందుకంటే.. రోజంతా ఫోన్‌ పని చేయాలి మరి, మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరెలా ఛార్జ్‌ చేసుకుంటున్నారు? లేవగానే.. బ్యాటరీ అయాన్ల మాదిరిగానే మీలోని కణాలు రీఛార్జ్‌ అవ్వాలి. అప్పుడే శరీరం రీఛార్జ్‌ అవుతుంది. ఇలాగైతేనే రోజంతా చురుకుగా పని చేస్తారు. 


అంగుళాల తెర దాటాలి..
పని ఒత్తిడి అనిపిస్తే అంగుళాల తెరపై కాసేపు పబ్‌జీనో.. మరేదైనా గేమో ఆడితే ఏమొస్తుంది? ఫోన్‌లో ఛార్జింగ్‌ శాతం తగ్గినట్టుగానే.. మీలో ఎనర్జీ తగ్గి కళ్లు ఎండిపోయి ముఖంలో బ్రైట్‌నెస్‌ తగ్గుతుంది. అదే అంగుళాల తెరని దాటుకుని గ్రౌండ్‌కి వెళ్తే.. క్రికెట్‌ బ్యాటో.. టెన్నిస్‌ రాకెట్టో పడితే.. ఆటలో మజా మీలోని హార్డ్‌వేర్‌ పనితనాన్ని పెంచుతుంది. ఎనర్జీ బ్యాక్‌అప్‌ అవుతుంది. దీంతో చదువైనా.. ఉద్యోగమైనా.. చురుకుదనానికి మీరే చిరునామా అవుతారు.


ఇంద్రియాల ఓఎస్‌ అప్‌డేట్‌
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, కీప్యాడ్‌, అలెక్సా, సిరి, కెమెరా.. ఫోన్‌కి అవన్నీ ఇంద్రియాల్లా ఎలా పని చేస్తాయో.. మీకున్న పంచేంద్రియాలు అంతే. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌లా పని చేస్తూ.. హార్డ్‌వేర్‌తో అనుసంధానం అవుతాయి. మరి, మీలోని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ చురుగ్గా పని చేయాలంటే? మెదడనే ఓఎస్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాలి. అందుకు మెదడుకి కావాల్సిన ఇన్‌పుట్స్‌ ఎక్కడ దొరుకుతాయి? చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే. రోజులో నడుస్తూ ఓ 2,000 అడుగులైనా వేయండి. దీంతో మెదడు శరీరంలోని సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను వాడుకుని విలువైన అప్‌డేట్స్‌ని మీకు అందిస్తుంది. దీంతో మీరు నిత్య నూతనంగా కనిపిస్తారు.


వైరస్‌ల దాడులు..
సరైన అవగాహన లేకుండా, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఫోన్‌ని వాడితే ఏం జరుగుతుంది? ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వొచ్చు. హ్యాకర్ల దాడులు పెరగొచ్చు.. అందుకే ముందు జాగ్రత్తగా క్లీనింగ్‌ టూల్స్‌ వాడతాం.. యాంటీవైరస్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తాం. మరి, మీ బాడీ సిస్టం హ్యాంగ్‌ అవ్వకుండా.. వైరస్‌ల బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? వెంటనే.. యోగా, ధ్యానం లాంటి టూల్స్‌తో క్లీనింగ్‌ చేయండి. రోజూ ఏదో ఒక యాంటీవైరస్‌ క్రీడని ఆడుతూ శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నించే స్పైవేర్‌లను అడ్డుకోండి.


శరీరంపై బాధ్యత ఉండాలి

చదువు, ఉద్యోగం, పిల్లలు.. ఇలా అన్నింటిపై బాధ్యతగా వ్యవహరించే మనం.. మన శరీరంపై ఎందుకు బాధ్యత వహించం? ఇక్కడి నుంచే ఆలోచన మొదలవ్వాలి. ఇంటిల్లిపాదీ ఫిట్‌నెస్‌ని కూడా ఓ బాధ్యతగా తీసుకోవాలి. వ్యాయామం, ఇష్టమైన క్రీడ.. ఏదో ఒకటి దినచర్యలో భాగం అవ్వాలి. వయసు, జీవనశైలి ఆధారంగా వర్క్‌అవుట్స్‌ని మొదలుపెట్టాలి. నడకతో మొదలెట్టి నెమ్మదిగా జాగింగ్‌ చేయొచ్చు. మీకున్న సామర్థ్యాన్ని బట్టి అవుట్‌డోర్‌లో రన్నింగ్‌ చేయండి. మీరు డ్యాన్స్‌ లవర్‌ అయితే ఏరోబిక్స్‌, జుంబా, బొక్‌వా.. లాంటివి ఎంచుకుని చిందేస్తూ వ్యాయామాన్ని ఫన్‌గా మార్చేయొచ్చు. దేన్ని ఎంపిక చేసుకున్నా వారంలో కనీసం మూడు రోజులు సాధన చేయాలి. ఫంక్షనల్‌ ట్రైయినింగ్‌, క్రాస్‌ ఫిట్‌.. లాంటివి ఎంచుకుని ట్రైనర్స్‌ ఆధ్వర్యంలో సాధన చేయొచ్చు.


* తినే ఆహారంలోనూ కొన్ని నియమాలు పెట్టుకోవాలి. వాటిల్లో ప్రధానమైంది ‘టైమ్‌కి తినడం’. అల్పాహారం, భోజనం, స్నాక్స్‌.. ఏదైనా (3 మీల్స్‌, 3 స్నాక్స్‌) పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినాలి. తక్కువ కేలరీల్లో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు.
* కొవ్వుని తగ్గించుకోవడమే ఫిట్‌నెస్‌ని సాధించడం. అంతేగానీ.. కండల్ని కరిగించడం కాదు. కొవ్వు పేరుకోని కండలు శరీరానికి మేలే చేస్తాయి. దృఢమైన కండలు ఎముకలకి రక్షణ కల్పిస్తాయి. అందుకే.. కొవ్వుని కరిగిస్తూ కండల్ని దృఢ పరుచుకోవడమే ఫిట్‌నెస్‌. దీంతో జీవక్రియలు (మెటబాలిజమ్‌) మెరుగుపడతాయి.
* రోజుల్లో.. వారాల్లోనే సన్నబడిపోవాలి అని తొందరపాటుతో ఏవో ప్రయత్నాలు చేయడం.. నిరుత్సాహంతో ఆపేయడం.. ఇలాగైతే, ఎప్పటికీ మీరు ఫిట్‌ కాలేరు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వర్క్‌అవుట్స్‌ చేసే క్రమంలో ఓపిక చాలా అవసరం. రోజువారీ జీనవశైలిలో వ్యాయామాన్ని భాగం చేయాలి. ఆశించిన ఫలితాలు కనిపించట్లేదు అనుకుంటే శరీరతత్వాన్ని విశ్లేషించి భిన్నమైన వర్క్‌అవుట్స్‌ని చేయాలి.
* తగినంత ఆహారం, ఎక్కువ నీళ్లు, హాయి నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా శరీరం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ అవుతుంది.

- బాబీ, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.