close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 10/08/2019 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్రిలోక్‌ సాహో

ది గేమ్‌

తండ్రి కోట్ల రూపాయల వ్యాపారం వైపు చూడలేదు.. సంప్రదాయ చదువులు బట్టీ పట్టలేదు.. కంఫర్ట్‌ జోన్‌లో అస్సలు ఉండాలనుకోలేదు..తనకి కిక్‌ ఎక్కడ దొరుకుతుందా? అని ఆలోచించాడు.. చిన్నప్పటి నుంచి ఆడిన వీడియోగేమ్స్‌లోనే భవిష్యత్తు వెతుక్కున్నాడు.. అది మొదలు గేమింగ్‌ని చదివాడు.. పేరొందిన కంపెనీలో పని చేశాడు.. వచ్చిన అనుభవానికి స్నేహహస్తం తోడయ్యింది. గేమింగ్‌ కంపెనీ పెట్టాడు.. ఉద్యోగిగా పని చేసిన తన కంపెనీనే మొదటి క్లైంట్‌గా చేసుకున్నాడు.. రెండేళ్లలో పరిశ్రమలో తనదైన ముద్రవేయడం మొదలెట్టాడు.. ఇప్పుడు ప్రభాస్‌ నటించిన సినిమా పేరుతో గేమ్‌ని రూపొందించాడు.. త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు.. అదే ‘సాహో’!  అంకుర సంస్థగా చిగురిస్తున్నప్పుడే ఇవన్నీ ఎలా సాధ్యం అని ‘ఈతరం’ పలకరిస్తే... తన గేమింగ్‌ జర్నీని పంచుకున్నాడిలా..

నలుగురు కుర్రాళ్లు కలిశారంటే
రెబల్‌ స్టార్‌ సాహో ముచ్చట్లే..
సినిమాతో పాటు ఇప్పుడు మరోటి హాట్‌టాపిక్‌గా మారింది..
అదే సాహో వీడియో గేమ్‌..
సినిమా విడుదలకి ముందే గేమింగ్‌ లవర్స్‌ ముందుకొస్తోంది..
రూపొందించింది ఎవరో కాదు..
మన తెలుగోడే! పేరు త్రిలోక్‌ పొట్లూరి...
నాకు వీడియో గేమ్స్‌ని పరిచయం చేసింది మా నాన్న రమేష్‌ బాబుగారే. చేసేది ఫార్మా బిజినెస్‌ అవ్వడంతో ఎక్కువగా ట్రావెల్‌ చేసేవారు. దీంతో ఎక్కడ కొత్త వీడియో గేమ్స్‌ కనిపించినా తెచ్చేవారు. వాటిని ఆడుతూనే పెరిగా. టెక్నాలజీ, గేమింగ్‌పై మొదట్నుంచీ ఉన్న ఇష్టంతోనే దుబాయ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివా. ఇంజినీరింగ్‌లో అందరి కుర్రోళ్లలాగే. ఏం చేయాలనే స్పష్టత ఉండేది కాదు. చివరి ఏడాదిలో ఆలోచన మొదలైంది. ఏ రంగంలో స్థిరపడాలని? చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్‌ని ఎంటర్‌టైన్మెంట్‌గా చూసిన నాకు.. కెరీర్‌ గురించి ఆలోచనలో పడ్డాక వీడియో గేమ్స్‌లో వ్యాపార కోణం కనిపించింది. గేమింగ్‌ రంగమే నాకు సరైంది అనిపించింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదోనని గేమింగ్‌ రంగంపై రిసెర్చ్‌ చేశా. పూర్తిగా నమ్మకం కలిగింది.
* అనుభవంతో పుట్టిందే ‘పిక్స్‌లాట్‌ ల్యాబ్స్‌’
అమ్మా, నాన్నకి నా అభిరుచి ఏంటో చెప్పా. వాళ్లేం అడ్డు చెప్పలేదు. ఇక నా పయనం కెనడాలోని వాన్‌కోవర్‌ ఫిల్మ్‌ స్కూల్‌ వైపు సాగింది. ప్రపంచంలోని టాప్‌ ఫిల్మ్‌ స్కూల్స్‌లో అదొకటి. రెండేళ్ల గేమింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యా. గేమింగ్‌కి సంబంధించిన ఫ్రొఫెషనల్‌ సబ్జెక్టు అంతా వాన్‌కోవర్‌లోనే నేర్చుకున్నా. అక్కడే ఉంటే హాయిగా ఇష్టమైన రంగంలో సెటిల్‌ అయిపోవచ్చు. నా అడుగులు మళ్లీ ఇల్లు, ఇండియా వైపే నడిచాయి. ఇక్కడే గేమింగ్‌ పరిశ్రమలో రాణించాలనేది నా ఆలోచన. అనుభవం కోసం బెంగళూరులోని అమెరికాకి చెందిన జింగా గేమింగ్‌ కంపెనీలో జాయిన్‌ అయ్యా. గేమింగ్‌ డిజైనర్‌గా బాధ్యతలు. రెండేళ్లు ఇష్టపడి పని చేశా. చాలా ప్రాజెక్టుల్ని లీడ్‌ చేశా. రోజువారీ పని చాలా కంఫర్ట్‌గా అనిపించేది. వెంటనే ఆ జోన్‌ నుంచి బయటపడాలి అనుకున్నా. సొంతంగా కంపెనీ పెట్టేద్దామని నిర్ణయించుకున్నా. నా మొదటి అడుగుకి మనోజ్‌ తోడయ్యాడు. ఇద్దరిదీ ఒకే రంగం. ‘గేమ్‌ ఆర్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ వర్క్‌’తో పిక్స్‌లాట్‌ ల్యాబ్స్‌ పేరుతో స్టార్టప్‌ పెట్టేశాం. ఉద్యోగిగా పని చేసిన కంపెనీనే నా మొదటి క్లైంట్‌. నలుగురితో మొదలై ఇప్పుడు 70 మందితో కంపెనీ రన్‌ చేస్తున్నాం. రెండేళ్లలోనే అంతా. పది దేశాల్లో క్లైంట్స్‌ ఉన్నారు. ఆర్ట్‌ అవుట్‌సోర్సింగ్‌తో పాటు గేమ్‌ డెవలపర్స్‌గానూ మాదైన ముద్రవేయాలనుకున్నాం. రెండు గేమ్స్‌ తయారు చేశాం. కానీ, మార్కెట్‌ కోరుకుంటున్న ప్రమాణాల్ని అందుకోలేకపోయాం. మాకు ఎదురైన మొదటి ఓటమి. దాన్నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఈ సారి వేసే అడుగు పెద్దదై ఉండాలి అనుకున్నాం.
* ‘సాహో’తోనే నెరవేరుతోంది..
బాహుబలితో ప్రభాస్‌ క్రేజీ స్టార్‌ అయిపోయారు. రాబోతున్న సినిమా సాహో గురించే అందరి చర్చ. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించి సాహో సినిమాపైనే వీడియో గేమ్‌ ఎందుకు చేయకూడదని. ఫ్రెండ్స్‌, బృందం మొత్తం సై అంటే సై అన్నారు. సాహో సినిమా నిర్మాతలతో మాట్లాడి ప్రాజెక్టు ప్రారంభించాం. డైరెక్టర్‌ సుజీత్‌, హీరో ప్రభాస్‌ నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. అయితే, మాకు సమయం చాలా తక్కువ. సినిమా విడుదలకు రెండు వారాల ముందు గేమ్‌ని రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌. గేమింగ్‌ డెవలపర్స్‌గా ఇది మాకో సవాల్‌. అందరం కలిసి కష్టపడ్డాం. ఆర్టిస్టులు పగలు రాత్రి పని చేశారు. ప్రభాస్‌తో కూడిన గేమింగ్‌ పోస్టర్‌ విడుదల చేశాం. అదీ ప్రభాస్‌ ట్విట్టర్‌ ఎకౌంట్‌ నుంచి..  క్షణాల్లో ఊహకందని స్పందన. ఫ్యాన్స్‌ క్రేజీగా ఎదురుచూస్తున్నారు.
* ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌..
సినిమా ట్రైలర్‌లో చూసినట్టుగానే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌లా గేమ్‌ని తీర్చిదిద్దాం. ఆటలోకి వెళ్లాక మీరే ప్రభాస్‌. జెట్‌ప్యాక్‌ తగిలించుకుని ఆడే యాక్షన్‌ గేమ్‌. ఓ సిటీలో మీకు, శత్రువులకు మధ్య జరిగే యుద్ధం. రోడ్లపై ఛేజింగ్‌లు.. బిల్డింగ్స్‌లో జంపింగ్‌లు.. హెలికాప్టర్‌ ఫ్లైయింగ్‌లు.. గన్‌ ఫైరింగ్‌లు.. తప్పించుకుంటూ శత్రువుల్ని మట్టి కరిపిస్తూ ముందుకు సాగాలి. ఎంత దూరం వెళ్తే అన్ని పాయింట్‌లు. గేమ్‌లో చక్కని ప్రదర్శన కనబరచిన వారికి ఎక్స్‌టర్నల్‌ అవార్డు ఇవ్వాలనుకున్నాం. అంటే.. ఇంటికే సాహో టీషర్టులు, టోపీలు, బ్యాండ్‌లు... లాంటివి అవార్డులు పంపుతాం. సినిమా విడుదలకు ముందు రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ఆడాలంటే హైఎండ్‌ ఫోన్‌లే వాడక్కర్లేదు. రెండు, మూడేళ్లుగా వాడుతున్న ఫోన్‌ల్లోనూ ఇన్‌స్టాల్‌ చేసుకుని మీరే ప్రభాస్‌ అయిపోవచ్చు.

పరిధులతో ఆడండి..

గేమింగ్‌లో నేను ఉన్నప్పటికీ యువతకి స్పష్టంగా చెప్పేదేంటంటే.. అన్ని స్పోర్ట్సు అడినట్టుగానే వీడియో గేమ్స్‌ ఆడండి. రోజులో ఏదైనా కొంత నిర్ణీత సమయాన్ని పెట్టుకోండి. కాలేజీ, స్కూల్‌ నుంచి వచ్చాక ఓ గంట పాటు ఆడండి. మైండ్‌ రీఛార్జ్‌ అవుతుంది. గేమింగ్‌ ఎప్పుడూ వ్యసనం కావొద్దు. 

వృత్తిగా ఎంచుకుంటున్నారు.. కానీ..

ఈతరం గేమ్స్‌ని ఆడడమే కాదు. దాన్నో రంగంలా గుర్తించి కష్టపడుతున్నారు. కొందరు ఆన్‌లైన్‌ గేమింగ్‌ టోర్నమెంట్స్‌కి వెళ్తున్నారు. ఇంకొందరు గేమ్‌ డెవలపర్‌ కోర్సులు చేస్తూ కెరీర్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. కానీ, దేశంలో పేరొందిన కాలేజీల్లో సరైన కోర్సులు అందుబాటులో లేవు. విదేశాలకు వెళ్లడమే ఏకైక మార్గం. అన్ని వర్గాల వారికీ అది సాధ్యం అయ్యే పని కాదు. ఎప్పుడైతే పేరొందిన యూనివర్సిటీల్లో గేమింగ్‌ విద్య అందుతుందో అప్పుడు మనం కూడా ప్రపంచం మెచ్చే గేమ్‌లు తయారు చేయొచ్చు. 
నా అవుట్‌పుట్‌కి మొదటి రివ్యూయర్‌ నా భార్యే. తనో సాధారణ గేమర్‌లా ఆడేస్తుంది. ఇబ్బందులు ఏవైనా ఉంటే సూటిగా చెప్పేస్తుంది. తను వృత్తి రీత్యా లాయర్‌ అయినప్పటికీ నేను శ్రమిస్తున్న రంగం గురించి ఆలోచిస్తుంది. మామయ్య జస్టిస్‌ ఎన్వీ రమణ గారు కూడా బాగా ప్రోత్సహిస్తారు. సాహో గేమ్‌ని ఆయన కూడా ఆడతాననడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. 

కెనడాలో గేమింగ్‌ కోర్సు చేస్తున్నప్పుడు బాబాయ్‌ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. అప్పట్లో ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఒక గేమ్‌ని తయారు చేశా. దాని పేరు స్పేస్‌పిగ్‌. ఐట్యూన్స్‌లో పెట్టా. బాబాయ్‌ వాళ్ల అమ్మాయి చదువుకునే స్కూల్‌లో ఓ టీచర్‌ ఆ గేమ్‌ ఆడుతూ కనిపించిందట. అంతే.. మా చెల్లి ఆనందానికి అంతు లేదు. ఆ గేమ్‌ తయారు చేసింది మా అన్నే అని అందరికీ చెప్పిందట. అంతేకాదు.. ఇంటికి వచ్చిరాగానే నా దగ్గరికి వచ్చి ‘అన్నా.. నువ్వు తయారు చేసిన గేమ్‌. మా స్కూల్‌ టీచర్‌ ఆడుతోంది..’ అని చెబుతున్నప్పుడు తన కళ్లలో నేను కోరుకునే కిక్‌ కనిపించింది. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నా. గేమింగ్‌ రంగంలో తర్వాత తరాల మనసులో నాదైన ముద్ర వేయాలని. అంతేకాదు... కేవలం యాక్షన్‌ గేమ్స్‌ కాకుండా మానవ సంబంధాల్ని మెరుగు పరిచేలా కొన్ని సున్నితమైన గేమ్స్‌ని రూపొందించాలనే ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో వర్చువల్‌ రియాలిటీతో (వీఆర్‌) గేమింగ్‌లో వినూత్నమైన మార్పులు రానున్నాయ్‌. వీఆర్‌ టెక్నాలజీ అన్నింటిలోనూ హద్దుల్ని చెరిపేస్తుంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.